ఎవరు చంపగలరు?

అమెరికన్ సీక్రెట్ సర్వీస్ సంస్థ సీఐఏ కిరాయి హంతకుల అవసరం పడింది. అన్ని పరీక్షలు నిర్వహించి  ముగ్గుర్ని చివరి పరీక్ష కోసం ఎంపిక చేశారు. వారిలో ఇద్దరు మగవాళ్ళు. ఒక ఆడమనిషి. ఈ పరీక్ష కోసం ముగ్గుర్నీ పెద్ద ఇనుప తలుపు కలిగిన ఒక గది దగ్గరకు తీసుకెళ్ళారు.

ఆ ఆఫీసర్ ఇలా అన్నాడు. మేము మీకిచ్చే ఆజ్ఞలను ఎట్టి పరిస్థితుల్లోనూ తు.చ తప్పకుండా పాటిస్తున్నారా ?లేదా? అని తెలుసుకోవడానికే ఈ పరీక్ష.

ఆఫీసర్ మొదటి అభ్యర్థికి ఒక గన్ను చేతికిచ్చి “లోపల నీ భార్య ఉంది. ఆమెను నువ్వు ఈ గన్ తో కాల్చి చంపాలి.” అన్నాడు.

“జోకులొద్దు. ఎవరైనా వాళ్ళ భార్యను చేతులారా చంపుకుంటారా?” అడిగాడు.

“అయితే నువ్వు మాకు పనికి రావు వెళ్ళిపోవచ్చు” అన్నాడు.

రెండో అభ్యర్థికి కూడా అదే విధంగా గన్ను చేతికిచ్చి లోపల ఉన్న తన భార్యను చంపమన్నాడు. అతను లోపలికి వెళ్ళాడు. ఐదు నిమిషాలపాటు ఎటువంటి శబ్దమూ లేదు. ఆ తరువాత అతను బయటకు వచ్చి. “కళ్ళ నిండా నీళ్ళు తిరుగుతుండగా. చంపాలని శతవిధాలా ప్రయత్నించాను. నా వల్ల కాలేదు” అన్నాడు. అతన్ని కూడా బయటకి పంపించేశారు.

చివరిగా మహిళామణి వంతు వచ్చింది. ఆమె చేతికి గన్నిచ్చి లోపల ఉన్న భర్తను చంపమన్నారు. లోపలికి వెళ్ళింది. షాట్స్ వినపడ్డాయి. అరుపులు, కేకలు, “దభీ దభీ మనే చప్పుళ్ళు లోపల్నుంచి వినిపించాయి. కొద్దిసేపటికి అంతా సద్దుమణిగింది. ఆమె నెమ్మదిగా బయటకు వచ్చింది.

నెమ్మదిగా నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ “నాన్సెన్స్ గన్నులో తుటాల్లేకుండా చేశారు. గోడకేసి బాది, కుర్చీతో కొట్టి చంపాల్సి వచ్చింది” అంది.

Note: No offense to anybody. this is purely for fun 🙂

నువ్వు పైలట్ శిక్షకుడివి కాదా?

ఒక విలేఖరికి అడవిలో చెలరేగిన దావానలం ఫోటోలు తీయమని వర్తమానం అందింది. ఆ మంటలు దగ్గరికెళితే ఫోటోలు తీయడానికి వీలు లేనంతగా దట్టంగా పొగ కమ్ముకుని ఉంది. వెంటనే ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసి ఒక ప్రైవేటు విమానాన్ని అద్దెకు తీసుకోమన్నాడు.

“అలాగే! నువ్వెళ్ళే సరికి ఒక విమానం రెడీ గా ఉంటుంది” అభయమిచ్చాడా సంపాదకుడు.

ఆయనన్నట్లుగానే దగ్గర్లో ఉండే విమానాశ్రయానికి వెళ్ళగానే ఒక విమానం అప్పుడే ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. పరిగెత్తుకుంటూ తన సామాగ్రిని లోపల పడేసి “తొందరగా పోనీ” అన్నాడు. వెంటనే విమానం గాల్లోకి లేచింది.

“ఆ ఫైర్ కి పక్కనే ఉత్తరం వైపుగా పోనీ! రెండు మూడు సార్లు తక్కువ ఎత్తులో పోనియ్యి.” అన్నాడు

“ఎందుకు?” అడిగాడు పైలట్.

“ఎందుకేంటయ్యా! నేను ఫోటో గ్రాఫర్ని. ఫోటోలు తీయాలి కదా” అన్నాడు విసుగ్గా.

చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత పైలట్   “అంటే మీరు పైలట్ శిక్షకుడు కాదా?” అని అడిగాడు.

మళ్ళీ జరగదు…

ఒకాయనకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. జైల్లో కొద్ది రోజులు ఉండే సరికి ఆయనికి విసుగొచ్చింది.దగ్గర్లో ఉన్న ఒక చీమను పట్టుకుని దానికి కొన్ని ట్రిక్స్ నేర్పించాలనుకున్నాడు. ఎగరడం, దొర్లడం,పిల్లిమొగ్గలేయడం లాంటివి. అన్ని సంవత్సరాలపాటు శిక్షణ ఇచ్చి దాన్ని ఎలా చెబితే అలా చేసేలా తయారు చేశాడు.

జైలు శిక్ష పూర్తయిన తర్వాత దాన్ని ఒక అగ్గిపెట్టెలో పెట్టుకొని బయటకు వచ్చాడు. బార్ లోకి వెళ్ళాడు. ఒక దగ్గర కూర్చుని అగ్గిపెట్టె లోనుంచి చీమను బయటకు వదిలాడు. పక్కనున్న అతనితో “ఇప్పుడు ఈ చీమ నేను ఎలా చెబితే అలా చేస్తుంది. చూడు” అన్నాడు.

అతను ఆశ్చర్యపోతూ “ఏదీ చూపించండి?” అన్నాడు.

జైల్లో తను ఆ చీమకు నేర్పించిన ట్రిక్కులన్నీ చూపించాడు. అవతలి వ్యక్తి సంభ్రమంగా “దీంతో నువ్వు చాలా డబ్బు సంపాదించవచ్చు. నీ పంట పండినట్లే ” అన్నాడు.

దాంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయి మన హీరో పక్కనే ఉన్న బేరర్ ని పిలిచి ” ఏమోయ్ ఈ చీమను చూశావా?” అన్నాడు.

వాడు వెంటనే దగ్గరికి వచ్చి ఆ చీమను చేత్తో నలిపేసి. ” సారీ సర్ ఇంకెప్పుడూ అలా జరగదు.” అని చెప్పేసి వెళ్ళిపోయాడు.

గమనిక: జోకుల్లో తర్కం(లాజిక్)  కోసం వెతకద్దు. నచ్చితే మనసారా నవ్వుకోండి. ఇదేమీ నిజంగా జరిగింది కాదు. 🙂

వ్యాపారం వ్యాపారమే… :-)

గుజరాతీయులు వ్యాపారం చేయడంలో సిద్ధహస్తులు. వాళ్ళను గురించి ప్రాచుర్యంలో ఉన్న ఒక జోక్.

చాలా ఏళ్ళ క్రిందట సౌత్ లండన్ లో ఒక స్కూల్లో ఇంచుమించు ఐదు సంవత్సరాలు వయసుండే పిల్లలకు ఒక టీచర్ పాఠాలు చెబుతోంది.

మధ్యలో పిల్లలందర్నీ ఒక ప్రశ్న అడిగింది. ” ఈ భూమ్మీద ఇప్పటి దాకా నివసించిన వాళ్ళలో గొప్ప వాడెవరు? ఈ ప్రశ్నకు కనుక మీలో ఎవరైనా సమాధానం చెబితే మీకు ఇరవై పౌండ్లు ఒక చాక్లెట్ ఇస్తానని ప్రకటించింది.

ఒకబ్బాయి లేచి “సెయింట్ పాట్రిక్” అన్నాడు. “కాదు” అంది టీచర్.

ఇంకొకబ్బాయి లేచి “సెయింట్ ఆండ్రూ” అన్నాడు. దానికీ ఒప్పుకోలేదు టీచర్.

చివరికి ఒక గుజరాత్ అబ్బాయి లేచి “జీసస్ క్రైస్ట్” అన్నాడు.

“అబ్సల్యూట్ లీ రైట్! ఇంద తీసుకో ఇరవై పౌండ్లు, చాక్లెట్ ” అంటూ దగ్గరికి పిలిచి ఇలా అడిగింది.

“నువ్వు గుజరాతీ కదా. జీసస్ క్రైస్ట్ అని ఎందుకు చెప్పావు?”

“నాకు తెలుసు శ్రీకృష్ణుడని! కానీ వ్యాపారం వ్యాపారమే!” 🙂

తెలివైన ఆలోచన

ముగ్గురు ఇంజనీర్లు, ముగ్గురు అకౌంటెంట్లు రైల్లో ఒకే బోగీలో ప్రయాణిస్తున్నారు. మాటల మధ్యలో ఇంజనీర్లు “మేం ముగ్గురూ ఒకే టికెట్ మీద ప్రయాణిస్తున్నాం తెలుసా?” అన్నారు.

“అదెలా సాధ్యం?” అన్నారు ముగ్గురు అకౌంటెంట్లూ ఆశ్చర్యంగా.

“మీరే చూడండి” అన్నారు ఇంజనీర్లు.

కొద్ది దూరంలో టికెట్ కలెక్టర్ వస్తున్నాడనగా ముగ్గురు ఇంజనీర్లు కలిసి టాయ్‌లెట్ లో దూరారు. టీసీ వచ్చి తలుపు తట్టగానే ఒకరు చెయ్యి బయటి పెట్టి టికెట్ అందించాడు. ఆయన ఆ టికెట్ తీసుకుని వెళ్ళిపోయాడు.

ముగ్గురు ఇంజనీర్లు బయటికి రాగానే అకౌంటెంట్లు “ఈ ఐడియా రాక మేమిన్నాళ్ళు ఎన్ని టికెట్లు కొన్నావండీ!” అంటూ ఆనందపడిపోయారు.

తిరుగు ప్రయాణంలో ముగ్గురు అకౌంటెంట్లు కలిసి ఒకే టికెట్ కొన్నారు. కానీ వారి ఆశ్చర్యం కొద్దీ ఇంజనీర్లు ఈ సారి అసలు టికెట్టే కొనకుండా వచ్చారు. మళ్ళీ అడిగారు అకౌంటెంట్లు. ” ఈ సారి మాత్రం మీరు ఖచ్చితంగా పట్టుబడిపోతారండీ!” అన్నారు.

“ఎలా మేనేజ్ చేస్తామో మీరే చూస్తారుగా” అన్నారు ఇంజనీర్లు.

టీసీ అల్లంత దూరంలో ఉండగా అకౌంటెంట్లు ముందుగా టాయ్‌లెట్ లోకి పరిగెత్తారు మొదటి సారి కాబట్టి.  ఇంజనీర్లు వాళ్ళు వెళ్ళిన తర్వాత నెమ్మదిగా వాళ్ళ దాక్కున్న టాయ్‌లెట్  దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి “టికెట్ ప్లీజ్” అన్నారు.

ఒకరు చెయ్యి బయటకు పెట్టి టికెట్ అందించారు. దాన్ని తీసుకుని ఇంకో టాయ్‌లెట్ లోకి దూరారు.

టీసీ వచ్చిన తర్వాత ఏం జరిగుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.

Disclaimer: ఇది కేవలం నవ్వుకోవడానికి ఉద్దేశించినది మాత్రమే. ఎవరినీ కించపర్చాలని కాదు. హాస్య స్పూర్తితో స్వీకరించాల్సిందిగా మనవి . 🙂

స్నేహమేరా జీవితం

నేను చిన్నప్పుడు
“చెంగాళా!” రోడ్డు మీద నుంచి అని ఆయన పిలుపు వినిపించిందంటే చాలు, తింటున్న చెయ్యి కూడా కడుక్కోకుండా బయటకు వచ్చేయాల్సిందే మా తాత. మా తాత పేరు చెంగాళ్ నాయుడు.
ఆయన పేరు సిద్ధారెడ్డి. గ్రామ పెద్దల్లో ఒకరు. మా తాతకన్నా అయిదేళ్ళు పెద్ద అనుకుంటా. అయినా వారిరువురూ ప్రాణ మిత్రులు. అరమరికల్లేని మైత్రీ బంధం వారిది. ఇప్పటి దాకా ఒకే ఊళ్ళో ఉన్నారు. రోజూ సాయంత్రం మా తాత వాళ్ళింటికెళ్ళి కబుర్లు చెప్పకపోతే ఆయనకు పూట గడవదు. ఆయనకు వయసైపోయింది. ఆయన భార్య కూడా వృద్ధాప్యం మీదపడటంతో ఏపనీ చేయలేకుండా ఉంది. వాళ్ళ కుమార్తె విజయవాడ లో ఉండటంతో అక్కడికి వెళ్ళిపోయారు.

క్యాన్సర్ హాస్పిటల్ లో దాదాపు 12 గంటల పాటు జరిగిన బైపాస్ శస్త్రచికిత్సను నా అనే బంధువులెవరూ దగ్గర లేకున్నా భరించిన గుండె.
కాంగ్రెస్ పార్టీ కి తప్ప వేరే పార్టీకి ఓటెయ్యనన్నప్పుడు మా కులం నుంచి వెలేసేస్తాం అని కుల పెద్దలు అన్నప్పుడు నేను నా స్నేహితుని వెంటే అంటూ అణుమాత్రమైనా  చలించని గుండె
స్నేహితుడు ఊరు వదిలి వెళ్ళిపోతున్నానంటే మాత్రం బావురుమంది. చిన్నప్పుడు మమ్మల్ని ఓదార్చిన చేతుల్ని మేమెలా ఓదార్చాలో అర్థం కాలేదు. వృద్ధాప్యం వచ్చే కొద్దీ ధైర్యం సన్నగిల్లుతుందేమో!

మెకానిక్ తెలివి

ఒక గ్యారేజీలో పనిచేయడానికి  మెకానిక్ ల కోసం యజమాని మౌఖిక పరీక్ష నిర్వహించాలనుకున్నాడు.  దాదాపు వందమంది హాజరవగా వారిలోంచి ఇద్దరిని ఎంపిక చేశాడు. వారిద్దరూ అన్నింటిలోనూ సమ ఉజ్జీలుగా నిలవడంతో వారికి మరో పరీక్ష పెడదామని మరుసటి రోజు రమ్మన్నాడు.

వారిలో ఒక అభ్యర్థికి చిన్న దురుద్దేశం కలిగింది. ఆ యజమాని వ్యక్తిగత కార్యదర్శికి సొమ్ము ఎర వేసి ఆ పరీక్ష ఏమిటో తెలుసుకున్నాడు. అది ఏమిటంటే కారు ఇంజన్ లో ఏదో ఒక చోట చిన్న కనెక్షన్ ను తీసివేస్తారు. అది ఎక్కడ ఉందో వీళ్ళు కనిపెట్టాల్సి ఉంటుంది. మొదటి అభ్యర్థికి ఎక్కడ ఫాల్ట్ ఉందో ముందే తెలిసిపోయింది.

మరుసటి రోజు పరీక్షకు ఇద్దరు అభ్యర్థులూ హాజరయ్యారు. ముందుగా రెండవ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. అయితే అతను తనకున్న నైపుణ్యాన్నంతా ఉపయోగించినా ఇంజన్లో ఎక్కడ పొరపాటుందో తెలుసుకోలేకపోయాడు. అతనికి చిన్న అనుమానం కలిగింది. ఒకవేళ రెండవ అతనికి పొరపాటు ఎక్కడుందో తెలుసేమోనని. అంతే ఎవరికీ తెలియకుండా ఇంజన్లో మరో చోట ఇంకో కనెక్షన్ కట్ చేశాడు. తాను కనిపెట్టలేకపోయానని ఒప్పుకున్నాడు.

మొదటి అభ్యర్థికి అవకాశం వచ్చింది. పొరపాటు ఎక్కడుందో ముందే తెలిసి ఉండటంతో కొద్ది సేపు ఏదో రిపేర్ చేస్తున్నట్లు నటించి తనకు తెలిసిన చోట కనెక్షన్ సరిచేసి ఇంజన్ ను స్టార్ట్ చెయ్యమన్నాడు. కానీ అంతకు ముందే రెండవ అభ్యర్థి మరోచోట తీసేసిన కనెక్షన్ వల్ల ఇంజన్ స్టార్ట్ కాలేదు. అతను కూడా ఓటమిని ఒప్పుకోక తప్పలేదు.

వెంటనే రెండవ అభ్యర్థికి తనకు రెండో సారి అవకాశం ఇస్తే తనను తాను నిరూపించుకుంటానన్నాడు. అలాగే అవకాశం ఇచ్చారు. అంతే! తను ఇదివరకే తిసివేసిన కనెక్షన్ ను మళ్ళీ అమర్చి ఇంజన్ స్టార్ట్ చెయ్యమన్నాడు. ఇంజన్ స్టార్ట్ అయ్యింది. దాంతో అతనికే ఆ ఉద్యోగం అతనికే వచ్చింది.