రంగుల “మాయ”

ఈ రోజు రంగుల్లో సరికొత్తగా ముస్తాబై మనముందుకు వచ్చిన మాయాబజార్ చూడ్డానికెళ్ళాను. ఆఆ… ఇక్కడ నేనేదో సమీక్ష రాయడం లేదు. ఇప్పుడు కొత్తగా విడుదలయ్యే సినిమాలను చీల్చి చెండాడుతూ సమీక్షలు రాసే సిరాశ్రీ  ఈ సినిమాకు రివ్యూ రాసే సాహసం చేయనంటూ పక్కకు తప్పుకున్నారు. అవును మరి ఒక సినిమా బాగుందో లేదో తేల్చాల్సింది ప్రేక్షకులు. అలాంటిది విడుదలైన దగ్గర్నుంచీ ఇప్పటిదాకా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉన్న ఈ సినీ వినీలాకాశ ధృవతార గురించి ఏమని రాయగలం?.

ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు కాబట్టే మళ్ళీ చూడాలనిపించింది. థియేటర్‌లో ఊహించని దానికంటే జనం బాగానే వచ్చారు. రంగుల్లో పాత్రధారులంతా బాగ మెరిసిపోతూ కనిపించారు. కిరీటాలు, ఆభరణాలకు, భవనాలంకరణలు రంగుల్లో కొత్త శోభలు సంతరించుకున్నాయి. కాకపోతే అక్కడక్కడ తీయటి పాయసంలో మెంతి గింజల్లాగా రీమిక్స్ చేసిన సంగీతం అపశ్రుతులు పలికించింది. పాత ఫిల్ము బాగా పాడవటంతో “భళి భళి భళి భళి దేవా” అనే పాటతో పాటు అనేక చోట్ల కొన్ని సన్నివేశాల్ని తొలగించారు.  అయితే ఇవేవీ పెద్దగా అసంతృప్తిని కలిగించలేదు. యస్వీఆర్, ఎన్టీఆర్, ఏయన్నార్ కనిపించినపుడు హాల్లో ఈలలు, చప్పట్లు, రేలంగి కనిపించిన వెంటనే దద్దరిల్లిన నవ్వులు వారి అజరామరమైన నటనకు ప్రతీకలు.

“మాయాబజార్” తెలుగు సినిమాలకు  శాశ్వత చక్రవర్తి. దానికి తిరుగులేదు.

ఓ అలాగా….

ఓ గ్రామంలో నివసించే యువ జెన్ సన్యాసి చాలా నియమనిష్ఠలతో  కూడిన జీవితాన్ని గడుపుతున్నాడని ప్రజల్లో మంచి పేరుంది. ఆ సన్యాసి ఆశ్రమానికి దగ్గర్లోనే ఒక తినుబండారాలు అమ్మే ఒక కుటుంబం కూడా నివసించేది. ఆ కుటుంబంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. అకస్మాత్తుగా ఒకసారి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమె గర్భవతైందని గుర్తించారు. వాళ్ళకు బాగా కోపం వచ్చింది. ఆమెను ఎంత తిట్టినా, కొట్టినా అందుకు కారకులెవరో బయటపెట్టలేదు. చాలా రోజులు చెప్పమని వేధించిన తరువాత ఆమె సన్యాసి పేరు బయట పెట్టింది. వాళ్ళు అగ్గి మీద గుగ్గిలమైపోతూ ఆ సన్యాసి దగ్గరకు ప్రశ్నించడానికి వెళ్ళారు.

ఆ సన్యాసి అంతా విని ఇలా అన్నాడు.
“ఓ అలాగా…”

బిడ్డ పుట్టిన తరువాత అతని దగ్గరే తీసుకువచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటికే ఆ సన్యాసి పట్ల ప్రజల్లో ఉన్న గౌరవమంతా మంట గలిసిపోయింది. అయినా ఆ సన్యాసి చెక్కు చెదర్లేదు. ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచసాగాడు. ఆ బిడ్డకు కావాలసిన పాలు మొదలైనవి పక్కనున్న ఇళ్ళలో అడిగి ఎలాగోలా సంపాదించుకొచ్చేవాడు.

అలా ఓ సంవత్సరం గడిచింది. ఆ బిడ్డ తల్లి ఇక తట్టుకోలేకపోయింది. ఆమె తల్లిదండ్రులను పిలిచి నిజం చెప్పేసింది. ఆ బిడ్డకు నిజమైన తండ్రి పక్కన చేపల మార్కెట్లో పని చేసే మరో యువకుడని.

వాళ్ళు తక్షణమే ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళి క్షమాపణలు కోరారు. జరిగిన సంగతి వివరించి తాము చేసిన పొరబాటుకు చాలా చింతిస్తున్నామనీ, తమ బిడ్డను తమకి తిరిగిచ్చేయమనీ కోరారు. ఆ సన్యాసి బిడ్డను తిరిగిచ్చేస్తూ ఇలా అన్నాడు.

“ఓ అలాగా….”

ఇక జన్మలో వాళ్ళ బస్సెక్కను

కేశినేని ట్రావెల్స్ వారు నాకు చేసిన ఘనమైన సేవకు కడుపు మండి ఈ టపా రాస్తున్నాను.
గత నెల 24న హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు టికెట్ బుక్ చేశాను. ఆ రోజు తెలంగాణా బంద్ కావడంతో సర్వీసులను నిలిపేశారు. ఆ సంగతి నాకు సరిగ్గా ప్రయాణం ఇక గంట ఉందనగా ఎస్సెమ్మెస్ ద్వారా తెలియజేశారు. సరే బంద్ లో వెళ్ళకపోవటమే మంచిదిలే అనుకుని సరిపెట్టుకున్నాను. తరువాత నాకు నరకమంటే ఏంటో చూపించారు . నా డబ్బులు ఎలా తిరిగి వస్తాయో తెలుసుకుందామని వెంటనే వారి కాల్ సెంటర్ కు ఫోన్ చేయడానికి ప్రయత్నించాను. ఫోను ఎత్తుతారు, ఎవరూ మాట్లాడరు. అలా నా సెల్లుకు పది రూపాయలు బొక్క పడ్డాక మళ్ళీ ప్రయత్నిద్దామని ఆపేశాను.
ఆ మూడు రోజులు e-తెలుగు కార్యక్రమాల్లో పాల్గొనడం మూలాన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. నేను ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేయడం వల్ల వాళ్ళే నా ఖాతాలో జమచేస్తామన్నారు. సరే అలా ఓ వారం రోజులు చూశాను. ఏమీ జరగలేదు. మళ్ళీ ఫోన్ చేశాను. వాళ్ళ గుమస్తా సెలవులో ఉండడం వల్ల ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. సరే నా సహనాన్ని మరింత పరీక్షిస్తున్నారనుకొని రెండు వారాలు ఎదురు చూశాను. లాభం లేదు. మళ్ళీ ఫోన్ చేశా. ఈ సారి వాళ్ళు చెప్పిన సమాధానానికి నాకు కాలింది. నా డబ్బులు కావాలంటే నేనే వాళ్ళ బ్రాంచ్ ఆఫీసుకెళ్ళి తీసుకోవాలట. నా కోపాన్ని పంటి కింద బిగబట్టుకుని అలాగే వాళ్ళ ఆఫీసుకు వెళ్ళాను. ఇక అక్కడ వాళ్ళు చెప్పిన సమాధానానికి నాకెంత కోపం వచ్చిందంటే “కేశినేని నా చేత చిక్కినేని నీ మక్కెలిరగదంతా” అన్నంత.
“ఇక్కడ మేము ఆన్ లైన్ టికెట్లకు డబ్బులివ్వం సార్. దానికి వేరే ప్రాసెస్ ఉంది ” అన్నాడు. నా కోపం నషాళానికంటింది.
“మరి నేను ఫోన్ చేస్తే అలాగే చెప్పారు మరి. కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోండి” అన్నాన్నేను కోపాన్ని అణుచుకుంటూ.
“ఏమో మాకు తెలియదు” అత్యంత నిర్లక్ష్యంగా వచ్చింది సమాధానం.
కోపాన్ని అణుచుకోవడం తెగ కష్టమైపోతుంది నాకు. నా డబ్బులు నాకు తిరిగివ్వడానికి ఇన్ని తిరకాసులా… ఏం చేద్దాం అనువుగాని చోట అధికుల మనరాదు మిన్నకుండి పోయాను. ఓ గ్లాసుడు నీళ్ళు గట గటా తాగేసి కొంచెం చల్లబడేదాకా కూర్చున్నాను ఏం చేయాలా అని ఆలోచిస్తూ…
కాసేపటి తర్వాత కాల్ సెంటర్ కి ఫోన్ చేసి “నాకు తక్షణమే డబ్బొచ్చే ఏర్పాటు చేస్తావా లేక వినియోగదారుల కేంద్రంలో కేసేయమంటావా ?” అని గట్టిగా అడిగాను. వాడు ఆఫీసు వాళ్ళతో ఏదో మాట్లాడి ఒప్పించాడు. వాళ్ళు మేనేజర్ రావడానికి ఓ అర్థ గంట పడుతుందని అక్కడ కూర్చోమని చెప్పారు. ఇవాళ నిద్ర లేచిన టైమ్ బాలేదనుకుని అక్కడే కూలబడ్డాను.
ఆ మేనేజర్ రాగానే నా టికెట్ చూపించి విషయం చెప్పాను. “ఇప్పుడు మేము బిజీగా ఉంటాం. ఇప్పుడొస్తే ఎలా” అంటూ విసుక్కున్నాడు.
“మరి మీరు చేసిన పని ఏమైనా బాగుందా. నన్ను నెల రోజుల నుంచీ ఆడిస్తున్నారు కదా” అన్నాను.
“ఇప్పుడు మేం బిజీ గా ఉన్నాం. ఏంచేసుకుంటావో చేసుకో ” అన్నాడు.
వాణ్ణి లాగి ఆ చెంపా ఈ చెంపా వాయించాలన్నంత కోపం వచ్చింది. అసలేవనుకుంటున్నారు వీళ్ళు. కస్టమరంటే అంత చులకనా వీళ్ళకి? నన్ను నేను ఎలా నియంత్రించుకున్నానో నాకే తెలియదు. అవసరం మనది కదా అని వాడికి ఎలాగోలా సర్దిచెప్పి డబ్బులు తీసుకుని బతుకు జీవుడా అంటూ అక్కణ్ణుంచి బయటపడ్డాను. ఇంత ఘోరమైన సర్వీసు నేనెక్కడా చూడలేదు. అందుకనే ఒట్టేసుకున్నా.. కస్టమర్ అంటే గౌరవం లేని వాడి బస్సుని ఇక జన్మలో ఎక్కనని….
నేనెక్కకపోతే వాడికి ఏదో నష్టం వచ్చేస్తుందని కాదు. నేను కాకపోతే సవాలక్ష మంది. కానీ నాలాగా అవమాన పడ్డ కస్టమర్లు కడుపు మండి నలుగురికీ చెబితే మాత్రం వాళ్ళకు తప్పకుండా చెడ్డపేరొస్తుంది.

నా వ్యాసం ఈనాడులో…

ప్రోగ్రామింగ్ పై నా వ్యాసం ఈ రోజు (25 జనవరి)ఈనాడు  లో ప్రచురితమైంది. మెయిన్ ఎడిషన్ 13 వ (చదువు) పేజీలో….

పీడీఎఫ్ రూపంలో…

http://eenadu.net/chaduvu/chaduvuinner.asp?qry=topstory4