అన్నం పరబ్రహ్మ స్వరూపం

నేను ఏడో తరగతికొచ్చేదాకా మా అవ్వ (అమ్మమ్మ) అన్నం కలిపి చేతిలో పెట్టేది.
“నాకింకొద్దన్నం” అని మారాం చేసినప్పుడల్లా మా అవ్వ, “తప్పు నాయనా అలా అనకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాన్ని వృధా చేయకూడదు. మనం వడ్డించుకునేటప్పుడే కావాల్సినంత వడ్డించుకోవాలి గానీ మిగిల్చి పారేయకుడదు.” అని ఎలాగోలా సర్ది చెప్పేసి ఆ మాట, ఈ మాట చెబుతూ లోనికి పంపించేసేది.
ఇంక మా నాయనమ్మ ఇంట్లో ఎవరైనా ఎక్కువ వడ్డించుకుని పూర్తి చేయడానికి అవస్త పడుతుంటే
“నీకు కళ్ళు కావాలంటాయి. కడుపు వద్దంటుంది” అని నవ్వుతూ ఎగతాళి చేస్తుంటుంది.


అప్పట్లో అలా చెప్పడం వల్ల ఇప్పటికీ నాకు అన్నం వదిలేయాలంటే మనసొప్పదు. ఇంటిదగ్గర ఉన్నప్పుడు తప్పనిసరి వదిలేయాల్సి వస్తే మా కుక్కకి గానీ, మా బర్రెలు తాగే కుడితిలోగానే పోసేసేవాళ్ళం . కానీ ఇల్లు వదిలి వచ్చింతర్వాత అలా పారేయాల్సినప్పుడల్లా మనస్సు చివుక్కుమంటూ ఉంటుంది. అందుకే నాకు పెద్ద పెద్ద విందులకు వెళ్ళాలంటే ఇదే బాధగా ఉంటుంది. ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే ఈ మధ్య మా మిత్రుడొకరు పంపించిన ఈ మెయిల్ చదివి. దాని సారాంశాం క్లుప్తంగా ఇదీ!

* * *

జర్మనీ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశమని మనకు తెలిసిందే. పెద్ద పెద్ద కార్ బ్రాండ్ లైన బెంజ్, వోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ జర్మనీకి చెందినవే. అలాంటి దేశంలో ప్రజలు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతారని చాలామంది అభిప్రాయం. కానీ ఉద్యోగం కోసం మొదటి సారిగా జర్మనీలోని హాంబర్గ్ వెళ్ళిన ఒక యువకుడి మనోగతం ఇది.

మొదటి రోజు ఆఫీసుకు వెళ్ళినపుడు మా ఆఫీసులో పనిచేసే సహోద్యోగులంతా కలిసి ఒక రెస్టారెంట్ లో స్వాగతం విందు ఏర్పాటు చేశారు.


మేము రెస్టారెంట్ లో అడుగు పెట్టగానే అక్కడ చాలా టేబుళ్ళు ఖాళీగా కనిపించాయి. ఒక మూలగా ఉన్న టేబుల్ మీద ఒక యువ జంట కూర్చుని భోంచేస్తున్నారు. వాళ్ళ ముందు కేవలం రెండు వంటకాలు, రెండు క్యాన్ల బీరు ఉన్నాయి. గర్ల్‌ఫ్రెండ్ ను రెస్టారెంట్ కు తీసుకువచ్చి ఇంత పిసినారితనం చూపిస్తారా ఎవరైనా అనుకున్నాను.


ఇంకో టేబుల్ మీద కొంతమంది ముసలివాళ్ళు కూర్చుని భోంచేస్తున్నారు. ఒక వంటకం వడ్డించగానే దాన్ని కొద్దిగా కూడా మిగల్చకుండా పూర్తిగా తింటున్నారు.


తరువాత మాకు రాబోయే వంటకాల కోసం ఎదురుచూస్తూ మేము వాళ్ళ మీద పెద్దగా దృష్టి సారించలేదు.  మాకు బాగా ఆకలిగా ఉండటంతో మా సహోద్యోగి ఇంకా ఎక్కువగా ఆర్డర్ ఇచ్చాడు.


రెస్టారెంట్ అంతా నిశ్శబ్ధంగా ఉంది. మేం ఆర్డరిచ్చిన వంటకాలు తొందరగానే వచ్చేశాయి. మాకు ఇంకా వేరే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఉండటం చేత తినడానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాం. మేం భోజనం దగ్గరనుంచి లేచేసరికి సుమారు మూడోవంతు వంటకాలు మిగిలిపోయాయి.


ఇంక మేం రెస్టారెంట్ వదిలి వెళతామనగా మమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్లనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ ముసలి వాళ్ళు మా గురించే రెస్టారెంట్ యజమానితో మాట్లాతున్నట్లనిపించింది. మేం వెళ్ళి వాళ్ళతో ఆంగ్లంలో మాట్లాడేసరికి మేం అలా ఆహార పదార్థాలు వదిలేయడం వారికి ఇష్టంలేదన్నట్లుగా చెప్పారు. మనం ఎంత తింటే వీళ్ళకెందుకు అని మనసులో అనుకున్నాం.


మా సహోద్యోగి ఒకరు మధ్యలో కలుగజేసుకుని “మేం తిన్న ఆహారానికి మేం ఖర్చు పెట్టుకున్నాం. మేం ఎంత వదిలేస్తే మీకెందుకు?” అని అడిగాడు వాళ్ళని.


మా మాటలతో వాళ్ళకి కోపం వచ్చినట్లుంది. వాళ్లలో ఒకరు మొబైల్ ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశారు. కొంత సేపటి తర్వాత సోషియల్ సెక్యూరిటీ సంస్థ నుంచి ఓ యూనిఫాం వేసుకున్న వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళని అడిగి జరిగిన సంగతి తెలుసుకుని 50 యూరోలు జరిమానా విధించాడు.


మేమంతా నిశ్శబ్ధంగా ఉండిపోయాం. మా జర్మన్ సహోద్యోగి తన జేబులోంచి 50 యూరోల నోటు తీసి అతనికి అందించి పలుమార్లు క్షమాపణ అడిగాడు.


అతను వెళుతూ వెళుతూ ధృడమైన కంఠ స్వరంతో  

మేరెంత తినగలరో అంతకే ఆర్డర్ ఇవ్వండి. డబ్బు మీదే కావచ్చు. కానీ వనరులు సమాజం మొత్తానివి. ప్రపంచంలో చాలా మంది వనరుల కొరతతో బాధ పడుతున్నారు. నిష్కారణంగా వనరులు వృధా చేయడం మంచిది కాదు

అని చెప్పి చక చకా వెళ్ళిపోయాడు.

మా ముఖాలు అవమానంతో ఎర్రబడ్డాయి. వాళ్ళ ఆలోచనను మనసులోనే అభినందించాం. దానికి తగ్గట్టే మమ్మల్ని మేం మార్చుకోవాలనుకున్నాం. గొప్పలకుపోయి పెద్ద పెద్ద మొత్తాల్లో ఆహారపదార్థాలను ఆర్డర్ చేయించుకుని చాలా వరకు తినకుండా వదిలేస్తూ ఉంటాం. ఈ పద్ధతి మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాం.

వంద సంవత్సరాల చిత్తూరు

చిత్తూరు జిల్లా ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా జిల్లాకు సంబంధించిన కొన్ని చారిత్రక విశేషాలు…
చిత్తూరు జిల్లా ఏప్రిల్ 1, 1911 సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పటి ఉత్తర ఆర్కాట్ లో తెలుగు మాట్లాడే కొన్ని తాలూకాలు, కడప జిల్లా నుంచి మరి కొన్ని తాలూకాలు, నెల్లూరు జిల్లా నుంచి మరికొన్ని తాలూకాలు కలిపి దీన్ని ఏర్పాటు చేశారు. 2011 ఏప్రిల్ 1 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 19వ శతాబ్దపు ప్రారంభం నుంచి ఉత్తర ఆర్కాట్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఒక వైపు కర్ణాటక కు, మరో వైపు తమిళనాడుకు దగ్గరగా ఉండటంతో తెలుగుతో బాటు, తమిళం, కన్నడ భాషలు కూడా విస్తృతంగా వాడుతుంటారు.

ఎంతో మంది కవులు, పండితులు, కళాకారులు, అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి ఉద్భవించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేసిన పి. ఆనందాచార్యులు ఈ జిల్లాకు చెందిన వాడే. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లె లో జన్మించాడు. ప్రముఖ విద్యావేత్త, పండితుడు, కవి, సాహిత్య విమర్శకుడు, చక్కటి నిర్వహకుడు, వోల్టేర్ తో పోల్చదగిన సర్ సీఆర్ రెడ్డి చిత్తూరు వాసే. 18 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంగమాంబ చిత్తూరు జిల్లా వాసి. ”మా తెలుగు తల్లికి” గేయం రచించిన శంకరంబాడి సుందరాచారి ఈ జిల్లాకు చెందిన వాడే. మాజీ లోక్‌సభ స్పీకర్, బీహార్ మాజీ గవర్నర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్,స్వాతంత్ర్య సమరయోధులు పార్థసారథి అయ్యంగార్, పాపన్న గుప్తా, నూతి రాధాకృష్ణ మొదలైన వారు చిత్తూరు జిల్లాకు చెందిన ఆణిముత్యాలు.

చిత్తూరు జిల్లాకి చెందిన చంద్రగిరి కోట, గుర్రంకొండ, ఆవులకొండ, పుంగనూరు కోటలు చారిత్రక ప్రసిద్ధి గాంచినవి. ప్రసిద్ధి గాంచిన ఋషీ వ్యాలీ పాఠశాల, ఆసియాలోనే అతిపెద్ద చికిత్సా కేంద్రమైన మదనపల్లెకు సమీపంలో ఉన్న ఆరోగ్యవరం జిల్లాకు తలమానికం. దక్షిణాదికి చెందిన శాంతినికేతన్ గా పిలవబడే థియసోఫికల్ కళాశాల మదనపల్లె లో ఉంది. ఇది రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటి కళాశాల గా పేరు గాంచింది. 1919 లో ఈ కళాశాల సందర్శనకు వచ్చిన రవీంద్ర నాథ్ ఠాగూర్ జనగణమణ గీతాన్ని ఇక్కడే ఆంగ్లంలోకి అనువదించాడు. ప్రస్తుతం జనగణమణ పాడుతున్న రాగాన్ని ఇక్కడే కూర్చడం జరిగింది. అలా జాతీయగీతానికి తుదిరూపునిచ్చిన ప్రాంతంగా ఈ ప్రాంతం చరిత్ర ప్రసిద్ధి గాంచింది.


ఆంధ్రప్రదేశ్ లో వేసవి విడిది ఉన్న ఏకైక ప్రాంత్రం చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్. ఇది ఆంధ్ర రాష్ట్ర గవర్నరుకు అధికారిక వేసవి విడిది కేంద్రం కూడా.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలైన వారు దీన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. విజయనగర సామ్రాజ్య కాలంలో చంద్రగిరి కేవలం ప్రధాన కేంద్రంగానే కాక కొన్నాళ్ళు రాజధానిగా కూడా విలసిల్లింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇది పాలెగాళ్ళ ఆధీనంలోకి వచ్చింది. చిత్తూరు, చంద్రగిరి ప్రాంతాల్లోనే పదిమంది పాళెగాళ్ళు అధికారం చెలాయించే వాళ్ళు. ఆర్కాటు నవాబు ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి చూసినపుడు మైసూరు నవాబులు, హైదరాలీ, టిప్పు సుల్తాన్ చిత్తూరును తమ వశం చేసుకోవడానికి ప్రయత్నించారు. హైదరాలీ గుర్రంకొండ నవాబు కుమార్తె అయిన ఫకీరున్నీసాను వివాహం చేసుకున్నాడు. వీరిరువురికీ జన్మించిన వాడే టిప్పు సుల్తాన్.

రెండవ మైసూరు యుద్ధం జరుగుతుండగా చిత్తూరు దగ్గర్లోని నరసింగరాయనిపేట దగ్గర హైదరాలో డిసెంబరు 6, 1782 లో క్యాన్సర్ సోకి మరణించాడు. ఆర్కాటు నవాబుల పరిపాలనలో చిత్తూరు ఖిల్లా గానూ, దానికి మొహమ్మద ఆలీ సోదరుడు అబ్దుల్ వహాబ్ ఖిల్లాదారు గానూ ఉండేవాడు. అతని దగ్గర సైనికుడుగా చేరిన హైదరాలీ తర్వాత అతన్నే ఓడించి మైసూరుకు బందీగా తీసుకుని వెళ్ళాడం కేవలం విధి.

వందసంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో ఉత్సవాలు జరుపుకున్నారు.

మూలం: ది హిందూ

వికీలీక్స్ కథా కమామీషు

వికీలీక్స్… ఇటీవల కాలంలో వార్తలు చదువుతున్న వారికీ, వింటున్న వారికీ బాగా పరిచయమైన పేరు. ఎవరిదగ్గరైనా ఏ ప్రభుత్వానికిగానీ, సంస్థకు గానీ  సంబంధించిన రహస్య పత్రాలు, దస్తావేజులు, చిత్రాలు, వీడియోలు, గుప్త సమాచారాన్ని అజ్ఞాతంగా పంచుకునేందుకు ఒక వేదికగా ఏర్పడ్డ ఒక స్వచ్చంద సంస్థ. వీకీలీక్స్ సంస్థ స్థాపించబడిన ఏడాది లోపునే 12 లక్షల దస్తావేజులు, పత్రాలు మొదలైనవి సంపాదించి, డేటాబ్యాంక్ లో భద్ర పరచింది.

అమెరికా, తైవాన్, యూరోప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మరియు చైనా దేశాల నుండి  పాత్రికేయులు, మేధావులు, విజ్ఞానవేత్తలు,  కంప్యూటర్ మేధావులు, శాస్త్రజ్ఞులు, చైనా విప్లవకారులు మొదలైన వారందరు కలసి ఏర్పాటు చేసిన సంస్థ. దీని సృష్టికర్తలెవరో స్పష్టంగా తేలనప్పటికీ జులియన్ అసాంజే అనే విలేఖరి 2007 లో మొట్టమొదటి సారిగా దీని తరపున ప్రతినిథిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. కానీ ది ఆస్ట్రేలియన్ అనే వార్తాపత్రిక మాత్రం ఆసాంజే నే దీని వ్యవస్థాపకుడు అని పేర్కొంది. దీని డొమైన్ అక్టోబర్ 4, 2006 లో నమోదు చేసుకున్నప్పటికీ డిసెంబర్ 2006 లో దీన్నుంచి ప్రథమంగా కొన్ని రహస్య పత్రాలు వెలువడ్డాయి.

స్థాపించిన అనతి కాలంలోనే వికీలీక్స్ ఎన్నో ప్రశంసలను,బహుమతులను అందుకొనింది. ఎకానమిస్ట్ పత్రిక వారి, న్యూమీడియా బహుమతి, 2008లో  ప్రచురింపబడ్డ కెన్యా: ద క్రై ఆఫ్ బ్లడ్ కి గాను జూన్ 2009లో  వీకీలీక్స్ మరియు జూలియన్ అసాంజేకు ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ వారి బహుమతి లభించింది.  మే 2010లో, న్యూయార్క్ డైలీ న్యూస్ వీకీలీక్స్ ని ప్రపంచ చరిత్రలో వార్తా ప్రచురణ విప్లవం సృష్టించిందని పేర్కొంది.

ఏప్రిల్ 2010లో , వీకీలీక్స్ ఒక వీడియోను వెబ్‌సైట్లో ప్రదర్శించింది. ఇందులో సామూహిక హత్య అన్న శీర్షికతో, 2007 లో బాగ్ధాద్ లో ఇరాక్ దేశస్తులను అమెరికా సైనికులు హతమార్చిన వైనం చిత్రీకరించబడింది. అదే సంవత్సరం జూలైలో, ఆఫ్గన్ వార్ డైరీ, అన్న పేరుతో 76,900 పై చిలుకు పత్రాలను వార్ ఇన్ ఆప్ఘనిస్తాన్ అన్న పేరుతో విడుదల చేసింది. అక్టోబర్ లో దాదాపు 400,000 పత్రాల ఇరాక్ వార్ లాగ్స్ అన్న అంశంతో విడుదల చేసి సంచలనం సృష్టించింది. దీంతో అగ్రరాజ్యాధినేతల్లో ప్రకంపనలు సృష్టించింది.


గ్రామీణ భారతావనికి ఇలాంటి కంపెనీలే కావాలి.

నిన్న సౌమ్య గారు గూగుల్ బజ్ లో పంపించిన ఆశాజనమైన నూతన సంస్థల జాబితాను చదువుతున్నాను. సాధారణంగా ఇవి ఏ ఐఐటీ/ఐఐఎం గ్రాడ్యుయేట్ల ద్వారానో స్థాపించబడి ఉంటాయి. వీళ్ళకు ఎప్పుడూ నగర జీవులు లేదా పట్టణాల మీదనే గురి, గ్రామీణ ప్రాంతాల గురించి  పట్టించుకోరనే అభిప్రాయం ఉండేది నాకు. కానీ ఈ జాబితాలో ఉన్న ROPE (రూరల్ ఆపర్చ్యునిటీస్ ప్రొడక్షన్ ఎంటర్‌ప్రైజ్) అనే సంస్థ గురించి చదివినపుడు మాత్రం చాలా ఆనందమేసింది.

తమిళనాడులో ప్రారంభమైన ఈ సంస్థ గ్రామీణ ముడిసరుకుల నుంచి,గ్రామీణ ప్రజల చేతివృత్తుల నైపుణ్యాలను ఉపయోగించి ఉత్పత్తులను తయారు చేస్తారు. అంటే హస్తకళా నైపుణ్యంతో తయారు చేసే గృహాలంకరణ వస్తువులు, తివాసీలు, సంచీలు, చేనేత వస్త్రాలు మొదలైన వస్తువులు ఉత్పత్తి చేస్తారట. ఇలా తయారైన ఉత్పత్తులు వాల్‌మార్ట్ లాంటి అంతర్జాతీయ స్టోర్ లకు కూడా సరఫరా చేస్తున్నారట.

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రియులంతా సహజమైన ఉత్పత్తులు కోరుతుండటంతో ఈ వస్తువులకు డిమాండ్ బాగానే ఉంటుందట. 2007 లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటి వరకు 500 మంది గ్రామీణ కళాకారులకి ఉపాధి కల్పించిందట. ఇంకా రాబోయే ఐదేళ్లలో 2000 మందికి ఉపాధి కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది.

ఇంకా అమెరికా నుంచి తిరిగొచ్చి బీహార్ లోని ఓ మారుమూల ప్రాంతంలో వరి పొట్టు నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే ఓ కంపెనీ స్థాపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలుగు నింపిన గ్యానేష్ పాండే, రిక్షా వాళ్ళ జీవితాలను బాగు పరచడానికి వారి రిక్షాల మీద ప్రకటనల ద్వారా ఆదాయాన్ని చేకూర్చిపెట్టే ఇంకో బిజినెస్ గ్రాడ్యుయేట్ ఇలాంటి వారిని చూస్తే చాలా సంతోషంగా ఉంది.

భారతదేశం సర్వతోముఖాభివృద్ధికి ఇలాంటి కంపెనీలు కావాలి.