
చిత్తూరు జిల్లా ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా జిల్లాకు సంబంధించిన కొన్ని చారిత్రక విశేషాలు…
చిత్తూరు జిల్లా ఏప్రిల్ 1, 1911 సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పటి ఉత్తర ఆర్కాట్ లో తెలుగు మాట్లాడే కొన్ని తాలూకాలు, కడప జిల్లా నుంచి మరి కొన్ని తాలూకాలు, నెల్లూరు జిల్లా నుంచి మరికొన్ని తాలూకాలు కలిపి దీన్ని ఏర్పాటు చేశారు. 2011 ఏప్రిల్ 1 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 19వ శతాబ్దపు ప్రారంభం నుంచి ఉత్తర ఆర్కాట్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఒక వైపు కర్ణాటక కు, మరో వైపు తమిళనాడుకు దగ్గరగా ఉండటంతో తెలుగుతో బాటు, తమిళం, కన్నడ భాషలు కూడా విస్తృతంగా వాడుతుంటారు.
ఎంతో మంది కవులు, పండితులు, కళాకారులు, అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి ఉద్భవించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేసిన పి. ఆనందాచార్యులు ఈ జిల్లాకు చెందిన వాడే. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లె లో జన్మించాడు. ప్రముఖ విద్యావేత్త, పండితుడు, కవి, సాహిత్య విమర్శకుడు, చక్కటి నిర్వహకుడు, వోల్టేర్ తో పోల్చదగిన సర్ సీఆర్ రెడ్డి చిత్తూరు వాసే. 18 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంగమాంబ చిత్తూరు జిల్లా వాసి. ”మా తెలుగు తల్లికి” గేయం రచించిన శంకరంబాడి సుందరాచారి ఈ జిల్లాకు చెందిన వాడే. మాజీ లోక్‌సభ స్పీకర్, బీహార్ మాజీ గవర్నర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్,స్వాతంత్ర్య సమరయోధులు పార్థసారథి అయ్యంగార్, పాపన్న గుప్తా, నూతి రాధాకృష్ణ మొదలైన వారు చిత్తూరు జిల్లాకు చెందిన ఆణిముత్యాలు.
చిత్తూరు జిల్లాకి చెందిన చంద్రగిరి కోట, గుర్రంకొండ, ఆవులకొండ, పుంగనూరు కోటలు చారిత్రక ప్రసిద్ధి గాంచినవి. ప్రసిద్ధి గాంచిన ఋషీ వ్యాలీ పాఠశాల, ఆసియాలోనే అతిపెద్ద చికిత్సా కేంద్రమైన మదనపల్లెకు సమీపంలో ఉన్న ఆరోగ్యవరం జిల్లాకు తలమానికం. దక్షిణాదికి చెందిన శాంతినికేతన్ గా పిలవబడే థియసోఫికల్ కళాశాల మదనపల్లె లో ఉంది. ఇది రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటి కళాశాల గా పేరు గాంచింది. 1919 లో ఈ కళాశాల సందర్శనకు వచ్చిన రవీంద్ర నాథ్ ఠాగూర్ జనగణమణ గీతాన్ని ఇక్కడే ఆంగ్లంలోకి అనువదించాడు. ప్రస్తుతం జనగణమణ పాడుతున్న రాగాన్ని ఇక్కడే కూర్చడం జరిగింది. అలా జాతీయగీతానికి తుదిరూపునిచ్చిన ప్రాంతంగా ఈ ప్రాంతం చరిత్ర ప్రసిద్ధి గాంచింది.
ఆంధ్రప్రదేశ్ లో వేసవి విడిది ఉన్న ఏకైక ప్రాంత్రం చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్. ఇది ఆంధ్ర రాష్ట్ర గవర్నరుకు అధికారిక వేసవి విడిది కేంద్రం కూడా.
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలైన వారు దీన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. విజయనగర సామ్రాజ్య కాలంలో చంద్రగిరి కేవలం ప్రధాన కేంద్రంగానే కాక కొన్నాళ్ళు రాజధానిగా కూడా విలసిల్లింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇది పాలెగాళ్ళ ఆధీనంలోకి వచ్చింది. చిత్తూరు, చంద్రగిరి ప్రాంతాల్లోనే పదిమంది పాళెగాళ్ళు అధికారం చెలాయించే వాళ్ళు. ఆర్కాటు నవాబు ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి చూసినపుడు మైసూరు నవాబులు, హైదరాలీ, టిప్పు సుల్తాన్ చిత్తూరును తమ వశం చేసుకోవడానికి ప్రయత్నించారు. హైదరాలీ గుర్రంకొండ నవాబు కుమార్తె అయిన ఫకీరున్నీసాను వివాహం చేసుకున్నాడు. వీరిరువురికీ జన్మించిన వాడే టిప్పు సుల్తాన్.
రెండవ మైసూరు యుద్ధం జరుగుతుండగా చిత్తూరు దగ్గర్లోని నరసింగరాయనిపేట దగ్గర హైదరాలో డిసెంబరు 6, 1782 లో క్యాన్సర్ సోకి మరణించాడు. ఆర్కాటు నవాబుల పరిపాలనలో చిత్తూరు ఖిల్లా గానూ, దానికి మొహమ్మద ఆలీ సోదరుడు అబ్దుల్ వహాబ్ ఖిల్లాదారు గానూ ఉండేవాడు. అతని దగ్గర సైనికుడుగా చేరిన హైదరాలీ తర్వాత అతన్నే ఓడించి మైసూరుకు బందీగా తీసుకుని వెళ్ళాడం కేవలం విధి.
వందసంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో ఉత్సవాలు జరుపుకున్నారు.
మూలం: ది హిందూ