నా చదువు సంగతులు – 3

నాకు రెండో తరగతి లో ఉండగానే మా స్కూలుకి ప్రసాద్ సారు కొత్తగా వచ్చాడు. ఈయన సొంతూరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరే (ముచ్చివోలు). మాకు దూరపు బంధువు కూడా. ఆయన స్కూల్లో చదివేటపుడు మా అమ్మకి జూనియర్. ఆ చనువుతో నన్ను బాగా చేరదీసేవాడు. ఖాళీగా ఉన్నపుడు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని మా అమ్మమ్మ ఊరు గురించి కబుర్లు చెబుతుండేవాడు. చేమూరు నుంచి ముచ్చివోలు రోడ్డు మార్గం దాదాపు ఇరవై కిలోమీటర్లపైనే ఉండేది. రోజూ ఆయన అడ్డదారిన ఆ ఊరి నుంచి ఈ ఊరికి సైకిల్ తొక్కుకుంటూ వచ్చేవాడు. ఎపుడైనా మా ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు.

మా ఇంటి పక్కనే తాటి చెట్లు దండిగా ఉండేవి. ఎండాకాలం వచ్చిందంటే అందులో తాటికల్లు దింపడానికి మా ఊళ్ళో గీత కార్మికులు ఉండేవాళ్ళు. ఎండాకాలం అప్పుడే దింపిన కల్లు తాగితే చలువ చేస్తుందని మా ఇంట్లో వాళ్ళు చెబితే రోజూ కల్లు దించే సమయానికి గ్లాసు తీసుకుని తయారయ్యే వాణ్ణి నేను. ఒకరోజు మా సార్లు మా ఇంటి నుంచి కల్లు తీసుకురమ్మన్నాడు. అలాగే అని రెండు చెంబులు తీసుకెళ్ళాం. ఆ డోసు ఎక్కువై మా సార్లు చేసిన అల్లరి నాకింకా గుర్తుంది. ప్రతి ఒకరూ సార్ ముందుకి వెళ్ళి నిలబడ్డం, వేళ్ళు చూపించి ఇవెన్ని అని అడగడం, వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు అడగటం, నవ్వుకోవడం.

రెండో తరగతి లో దసరా సెలవులిచ్చారు. సెలవులకి అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళటం అలవాటు. మా ప్రసాద్ సార్ నాతో పాటు సైకిల్ లో వస్తావా, సరదాగా ఉంటుంది అని అడిగాడు.  నేను ఎగిరి గంతేశాను. నేను ముచ్చట పడుతున్నానని అమ్మవాళ్ళు కూడా సరే అన్నారు. ఓ సంచీలో బట్టలు పెట్టి నన్ను సైకిల్ వెనుక సీట్లో కూర్చోబెట్టారు. మా ప్రసాద్ సార్ రోడ్డు బాగున్నంత సేపూ కబుర్లు చెబుతూ బాగానే తొక్కాడు. అడ్డదారిలో దిగేసరికి పాపం తొక్కడం బాగా కష్టమైంది. చిన్నపిల్లాడిని కదా ఏం నడిపిస్తాములే అని నన్ను సైకిల్ మీదనే ఉంచి సైకిల్ దిగేసి కొద్దిదూరం నెట్టుకుంటూ వచ్చాడు. కొద్ది దూరం వచ్చాక అది కూడా కష్టమైంది. ఇహ లాభం లేదనుకుని నన్ను కూడా దిగి నడుచుకుంటూ రమ్మన్నాడు. నేను దిగి నెమ్మదిగా నడక ప్రారంభించాను. కొద్ది దూరం వెళ్ళగానే నాకు కళ్ళు తిరిగి వాంతి అయింది. పాపం భయపడిపోయాడు. నేను ఎలాగోలా కొద్ది దూరం నడిచి మెయిన్ రోడ్డు చేరుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ సైకిలెక్కి తొక్కడం ప్రారంభించాడు. అవ్వ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేటప్పుడు మాత్రం, దారిలో జరిగిన సంగతి మాత్రం ఎవరికీ చెప్పకేం అన్నాడు. అన్నట్టుగానే నేను ఎవ్వరికీ చెప్పలేదు. అప్పటి నుంచీ ఆయన అలాంటి సాహసానికి ఎప్పుడూ పూనుకోలేదు.

నేను చేమూరు స్కూలు నుంచి మారిపోయిన తరువాత ప్రసాద్ సారు కుప్పం కి బదిలీ అయ్యాడు. ప్రస్తుతం అక్కడే నివాసం అనుకుంటా. అప్పుడప్పడూ ముచ్చివోలు వస్తుంటారు. చాలా సార్లు కలవాలని ప్రయత్నించాను కానీ కుదర్లేదు.

ప్రకటనలు