వారాంతపు సరాగాలు… ఉప్మా 1.0

ఈ వారాంతపు సెలవుల్లో మా బీటెక్ స్నేహితుడు మునికుమార్ యూనివర్శిటీ పనిమీద ఊర్నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. హైదరాబాద్ లో ఉన్న మరో స్నేహితుడు సురేంద్ర గదికి వెళ్ళాం. ఉదయాన టిఫిన్  గురించి చర్చ మొదలైంది. మునికుమార్ ముందుకొచ్చి

“నా కొక్క చాన్సిస్తే ఘుమ ఘుమలాడే ఉప్మా చేసిపెడతా” అన్నాడు.

“ఒరేయ్ ఉప్మా చెయ్యాలంటే నీ వల్ల కాదురా. అన్నీ పక్వంగా పడకపోతే దాని షేపులు మారిపోతాయి.”  హెచ్చరించాడు.

అయినా మా వాడు పట్టు విడవకుండా “ఒకే ఒక్క చాన్స్” అంటూ ఖడ్గం సినిమాలో సంగీత లెవెల్లో ఫోజు పెట్టాడు.

“సరే కానీ!” అయిష్టంగానే అన్నాడు మా వాడు.

దాదాపు ముప్పావు గంట కష్టపడి చెమట తుడుచుకుంటూ విజయ గర్వంతో బయటికి వచ్చాడు మా వాడు, ఎలా ఉందో టేస్ట్ చూడమంటూ.

పాపం అంతా బాగానే చేశాడు. ఉప్పు వెయ్యడం తప్ప.
“నేను ముందే అనుకున్నా నువ్విలాంటి దేదో చేస్తావని” దండకం మొదలెట్టాడు సూరిగాడు.

సాఫ్ట్‌వేర్ విడుదల చేసిన తర్వాత ప్యాచ్ విడుదల చేసినట్టుగా టమోటా చట్నీ తీసుకొచ్చి పక్కనబెట్టి  “దీంతో లాగించేసేయండి బాగుంటుంది” అన్నాడు. ఆకలి మీదున్నాం కాబట్టి ఎలాగోలా కానిచ్చేశాం. అంతా అయిపోయాక మునికుమార్ నెమ్మదిగా

అయినా ఇది ఉప్మా 1.0 మాత్రమే మళ్ళీ కలిసినపుడు ఉప్మా 2.0 రుచి చూపిస్తాగా! అన్నాడు.