నైవేలి విశేషాలు

నైవేలి
నైవేలి విహంగ వీక్షణం

గత శనివారం ఓ వ్యక్తిగత పని మీద తమిళనాడులోని నైవేలి వెళ్ళాల్సి వచ్చింది. చెన్నై నుంచి దక్షిణంగా సుమారు 200 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ లిగ్నైట్ విస్తారంగా దొరుకుతుంది. లిగ్నైట్ అంటే పూర్తి స్థాయి బొగ్గుగా మారకుముందు రూపమన్న మాట. ఇందులో బొగ్గు కన్నా తేమ స్థాయి ఎక్కువగా ఉంటుంది. తమిళనాడులో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ లో సగభాగం (సుమారు 2500 మెగావాట్లు) ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుందట.

1935 లో జంబులింగ మొదలియార్ అనే ఆసామి తన పొలంలో బోర్ వేస్తుండగా నల్లటి రాళ్ళు బయట పడ్డాయి. దాన్ని పరీక్ష కోసం పంపించగా ఆ ప్రాంతం యొక్క భూగర్భంలో విస్తారమైన లిగ్నైట్ నిల్వలు ఉన్నట్లు తెలియవచ్చింది. 1956 లో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనే పేరుతో  భారత ప్రభుత్వం ఓ సంస్థను ఏర్పాటు చేసి అక్కడ పనులు ప్రారంభించింది. 1962  నుంచి అక్కడ మైనింగ్ ప్రారంభమైంది.

నటరాజ స్వామి
నటరాజ స్వామి

ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం ప్రభుత్వం సకల సౌకర్యాలతో చక్కటి టౌన్ షిప్ నిర్మించి ఇచ్చింది. సుమారు 55 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తారమైన వృక్షసంపదతో ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా తమిళనాడు మిగతా ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. బొగ్గును వెలికితేసే కార్యక్రమంలో భాగంగా కుప్పలుగా పోసిన ఫ్లై యాష్, మట్టి పెద్ద పర్వతాల్లాగా కనిపిస్తాయి. అవి పర్యావరణానికి అంతగా మంచిది కాదనడంతో ఇటీవలే వాటి మీద చెట్లను పెంచడం ప్రారంభిస్తున్నారు.

ఆవరణలో నాలుగు దేవాలయాలు, రెండు చర్చిలు, మసీదు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్దదైన, పన్నెండు అడుగుల ఎత్తైన పంచలోహ నటరాజ స్వామి విగ్రహం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంకా నేను చూడాలనుకున్న చిదంబరం, తంజావూరు కూడా ఇక్కడకు దగ్గరే. ఇంకెప్పుడైనా వెళ్ళినపుడు చూడాలి.

స్వామీ వివేకానంద ఛలోక్తులు

 స్వామీ వివేకానంద
స్వామీ వివేకానంద

స్వామి వివేకానంద ఎంత గొప్ప వక్త అయినా అప్పుడప్పుడూ ఆయన ఉపన్యాసం మధ్యలో ఆయన్ను ఎగతాళి చేసేవాళ్ళూ ఉండే వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఆయన సరైన రీతిలో జవాబిచ్చేవాడు. అలాంటి సంఘటనలు కొన్ని…

  • ఓ సారి ఇంగ్లండ్ లో ఉపన్యసిస్తూ ఇలా చెబుతున్నాడు “కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుంచే అద్భుతమైన నాగరికతతో విలసిల్లిన భారతదేశం లా కాకుండా ఈ ప్రాంతం ఒకప్పుడు మొత్తం అడవులతో నిండి ఉండేది”. అసలే ఆంగ్లేయులకు తమకే అన్నీ తెలుసన్న అహంకారం ఎక్కువ. ఇక ఇలా చెబుతుండగా శ్రోతల్లో ఉన్న ఇంగర్ సోల్ అనే రచయితకు చిర్రెత్తుకొచ్చింది. అతను వెంటనే ఒక కాగితం పై “I will kill you” అని రాసి స్వామి మీదకు విసిరేశాడు. స్వామి దాన్ని తీసి బిగ్గరగా చదివి అందరికీ వినిపించి “చూశారా! ఇప్పుడే మీ అనాగకరికత్వానికి ఇంకో ఋజువు దొరికింది” అన్నాడు.
  • మరో సమావేశంలో ఎవరో భగవద్గీత పుస్తకంపై మరేవో మత గ్రంథాలు పేర్చి స్వామి దగ్గరకు వచ్చి ” చూశారా ఇదీ భగవద్గీత స్థాయి” అన్నారు. స్వామి భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారిగా పక్కకు లాగడంతో మిగతా పుస్తకాలన్నీ కిందపడిపోయాయి. అప్పుడు స్వామి “చూశారా అన్నింటికీ ఇదే ఆధారం” అన్నాడు.
  • ఇంకో సమావేశంలో వివేకానంద మాట్లాడుతుండగా ఎవరో ఒక కాగితం పై “FOOL” అని రాసి ఆయన చేతికిచ్చారు. స్వామీజీ దాన్ని చూసి నెమ్మదిగా నవ్వుకుని అందరితో “మామూలుగా మనం ఏదైనా లేఖ రాసి చివర్న సంతకం పెట్టడం మరిచిపోతుంటాం. కానీ ఇక్కడ చూడండి. సంతకం పెట్టి లేఖ రాయడం మరిచిపోయాడు పాపం” అన్నాడు.

గోల్కొండ కోట సౌండ్ అండ్ లైట్ షో

గోల్కొండ కోటను ఎవరైనా సందర్శించాలని ఉంటే అక్కడ తప్పక  చూడవలసింది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు నిర్వహించే సౌండ్ అండ్ లైట్ షో. అందులో గోల్కొండ చరిత్రను ఒక నాటక రూపకంలో వివరిస్తారు.  కథను అమితాబ్ బచ్చన్ తన ధీరగంభీరమైన స్వరంతో వినిపిస్తాడు. మధ్యలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు పాత్రలు, సంభాషణల రూపంలో ఉంటాయి.  ఒక్కో సన్నివేశానికి సంభందించిన  సంభాషణలు కోటలో ఎక్కడ జరుగుతాయో అక్కడ లైట్లు వెలుగుతాయి. సంభాషణలు అక్కడి నుంచే వినిపిస్తున్నట్లుండి ఆ సన్నివేశం మన కళ్ళెదురుగా జరుగుతున్నట్లుగా ఉంటుంది.

ముఖ్యంగా రామదాసు ఘట్టం వచ్చినపుడు ఆయన్ను దాచి ఉంచినట్లుగా భావిస్తున్న చెరసాల నుంచి భావగర్భిత మైన బాలమురళీకృష్ణ గాత్రంలో “ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైనా పలుకవే రామచంద్రా…”  అనే పాట వినగానే నిజంగానే అక్కడ రామదాసు ఉన్నట్లు, పాట పాడినట్లు అనిపించి ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించినట్లయింది నాకు. ఇంకా కులీ కుతుబ్ షా, భాగ్ మతీ దేవి ల మధ్య జరిగే ప్రేమ ఘట్టాలు, ఔరంగజేబు దండయాత్ర సమయంలో కోటను రక్షించడానికి రాజ కుటుంబం పడే తాపత్రయం చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఈ నాటకాన్ని వింటే ఎప్పుడో చిన్నప్పుడు విన్న రేడియో నాటకాలు గుర్తుకు వచ్చాయి. ఒక్కసారిగా నవాబుల కాలంలోకి వెళ్ళి తిరిగి వచ్చినట్లయింది.

పైన నేను చెప్పిన విశేషాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే  సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రదర్శనను మాత్రం తప్పక చూడండి.

నువ్వే తీసుకో…

స్వీడన్ జోకు:

కిక్ఓ పట్నం నుంచి ఒకతను వేటాడదామని అడవి చివర్లో ఉన్న గ్రామానికి వెళ్ళాడు. గ్రామం దగ్గరికి వెళ్ళగానే ఓ కుందేలు పారిపోతూ కనిపించింది. గురిపెట్టి కాల్చాడు అంతే… అది ఎగిరి పక్కనే ఉన్న పొలంలో పడింది.

పక్కనే ఉన్న ఆ పొలం యజమాని

“నా పొలంలో పడింది కాబట్టి అది నాదే” అన్నాడు.

“కాదు నేను కాల్చాను కాబట్టి నాదే” అన్నాడు.

అలా కొద్ది సేపు ఇద్దరూ వాదులాడుకున్నాక పొలం యజమానికి ఓ ఆలోచన వచ్చి పట్నం అతనితో ఇలా అన్నాడు.

“ముందుగా నేను నిన్ను డొక్కలో ఒక్కసారి తంతాను. తర్వాత నువ్వు కూడా నన్ను అదేలాగా తన్ను. ఇద్దర్లో ఎవరు తక్కువగా అరుస్తారో ఆ కుందేలు వాళ్ళకి చెందుతున్నమాట.”

ఈ పందేనికి అతను ఒప్పుకున్నారు.

ముందుగా రైతు అతన్ని ఈడ్చి డొక్కలో ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక పట్నం అతను విల విల్లాడిపోతూ కాసేపు నేల మీద పడిపోయాడు. కొంచెం సమయం తర్వాత ఎలాగోలా తేరుకుని

“ఇప్పుడు నా వంతు అన్నాడు” బాధను బలవంతంగా ఆపుకుంటూ.

రైతు నెమ్మదిగా “ఒక్క చిన్న కుందేలు కోసం ఇంత గొడవ అవసరమా చెప్పు? ఆ కుందేలేదో నువ్వే తీసుకో” అన్నాడు.

కాంచితి అమరావతీ నగర అపురూప శిల్పాలు…

మిత్రుల సమాగమం
మిత్రుల సమాగమం

అమరావతి శిల్పం
అమరావతి శిల్పం

గత శుక్రవారం మా స్నేహితుడు కొండారెడ్డి పెళ్ళి. వినుకొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాస్కర్ నగర్ అనే చిన్న పల్లెటూర్లో వాళ్ళ స్వంత ఇంట్లోనే పెళ్ళి. మా ఎంటెక్ క్లాస్ మేట్స్ రవికుమార్, మురళి, వేణు, ప్రతాప్, ప్రభాకర్, జూనియర్ ప్రవీణ్ వచ్చారు. ఇక సందడే సందడి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత  కలుసుకున్నప్పుడు ఎన్నెన్నో కబుర్లు. భలే సరదాగా గడిచిపోయింది. ముహూర్తం రాత్రి 2 గంటలకు కావడంతో అప్పటి దాకా మేలుకుని ఊరంతా తిరుగుతూనే గడిపాం.

శనివారం రోజు మధ్యాహ్నం దాకా ఓ కునుకు తీసి అమరావతి చూడడానికి బయలు దేరాం. వినుకొండ నుండి అమరావతి చేరేసరికి సాయంత్రం నాలుగైంది. అమరావతి లో భోజనం అద్భుతంగా ఉంది. హైదరాబాద్ లో ఉప్పు చప్పని కూరలు తిని మొహం మొత్తేసిన చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నట్టనిపించింది. తర్వాత మ్యూజియం చూడ్డానికి వెళ్ళేసరికి సమయం నాలుగన్నరైంది. ఓ అర్ధగంటలో అన్నీ మ్యూజియం మూసేస్తామన్నారు. కానీ లోపల గంట సేపటి దాకా గడిపాం.

లోపల శిల్పాలు సుమారు 2000 ఏళ్ళ కాలం నాటివి. వాటిని చెక్కడానికి వాడిన రాయి ఇప్పటిదాకా నేనెక్కడా చూడలేదు. బౌద్ధ సాంప్రదాయంలోని అనేక చిహ్నాలైన త్రిపీఠకాలు, బుద్ధుడి జీవిత విశేషాలు మొదలైనవాటిని శిల్పాల్లాగా మలచి ఉన్నారు. చిన్నప్పుడు తరగతి పుస్తకాల్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూసి,చదివిన అపురూప శిల్పాలను కళ్ళారా చూసినప్పుడు కలిగిన ఆ అనుభూతే వేరు.

తర్వాత పక్కనే ఉన్న మహా స్థూపాన్ని చూడ్డానికి వెళ్ళాం. దీన్ని కట్టడానికి వాడిన ఇటుకలు చాలా పెద్దవి, బలమైనవి కూడా. చాలా వరకు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. చుట్టూ పేర్చి ఉన్న శిలలపై అక్కడకక్కడా శాసనాలు చెక్కించి ఉన్నారు. ముందుగా కొంచెం అమరావతి గురించి రీసెర్చి చేసుకుని వెళ్ళాను కాబట్టి నేనే అక్కడక్కడా మా వాళ్ళకి గైడునయ్యాను :). తర్వాత కృష్ణానదీ ఒడ్డునే ఉన్న అమరేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి.ఇక్కడ  శివలింగం మామూలు విగ్రహాలకన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. కొండవీడు కోట కూడా చూద్దామనుకున్నాం కానీ సమయం చాల్లేదు. మళ్ళీ ఎపుడైనా వెళ్ళినప్పుడు చూడాలి.

సామాజిక ‘వేదం’

నేను ఇటీవల చూసిన మంచి సినిమా, నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా వేదం. నిజానికి  నేను పదిరోజుల క్రితమే చూసినా రాయడానికి ఇన్ని రోజులకు కుదిరింది. ఈ సినిమా గురించి నాకు తోచిన నాలుగు మాటలు…

Spoiler Alert: ఒక వేళ మీరు ముందుగా కథ తెలుసుకోకుండా సినిమా చూడదలుచుకుంటే కింది భాగం చదవద్దు.

ఈ సినిమా నిజానికి ఒక కథ మీద ఆధారపడి తీసింది కాదు. ఐదు కథలు సమాంతరంగా నడుస్తూ ఒక చోట కలుస్తాయి. నాడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను  తనదైన శైలిలో తెరకెక్కించాడు క్రిష్.  సినిమాలో నాకు అక్కడక్కడా కొన్ని  సన్నివేశాలున్నాయి అద్భుతంగా అనిపించాయి. ఉదాహరణకు కిడ్నీ అమ్మేసి  సంపాదించుకున్న డబ్బుల్ని రాములు దగ్గర్నుంచి అల్లు అర్జున్ లాక్కునే సీన్, వెంటనే వచ్చే సీన్ లో హీరోయిన్ ‘న్యూ ఇయర్ పార్టీకి పాసెస్ తీసుకున్నావా?’ అని అడిగితే చేతులో డబ్బులుంచుకుని ‘నా దగ్గర డబ్బుల్లేవనడం’ అనే సన్నివేశం నాకు చాలా బాగా నచ్చిన సన్నివేశాలు.

వేశ్య పాత్రలో నటించిన అనుష్క నటన కూడా నాకు  బాగా నచ్చింది. ఇప్పటి దాకా వచ్చిన సినిమాల్లో వేశ్య పాత్రలను ఆటవస్తువులుగా చూపిస్తే ఇందులో క్రిష్ వాళ్ళను ఓ సమాజంలో భాగంగా చూపిస్తూ వాళ్ళ మానసిక స్థితిని, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను జెన్యూన్ గా చెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయం.

కానీ సినిమా సుఖాంతం కాకపోతే తెలుగు ప్రేక్షకులు సరిగా ఆదరించరని చాలా సినిమాలు నిరూపించాయి. అయితే ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రేక్షకుల ధోరణిని మార్చే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.నాకు ముగింపు ఏ మాత్రం అసంతృప్తిని కలిగించలేదు. నాకే కాదు థియేటర్లోని మిగతా ప్రేక్షకులు కూడా అలాగే ఫీలయినట్లు అనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ చివర్లో చనిపోతూ సినిమాలో తన ఊతపదమైన ‘దీనమ్మ జీవితం’ అనగానే ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున నవ్వులు విరబూశాయి. దీంతో దర్శకుడి కృషి ఫలించినట్లే అని చెప్పవచ్చు.

ఒకేసారి అన్ని కథలు కలగాపులగంగా నడుస్తుంటే సగటు ప్రేక్షకుడికి కొంచెం కన్ఫ్యూషన్ కలిగించక మానదు. కానీ ఈ రకం సినిమాలు ప్రయోగాత్మకంగా భావించాలి. మొత్తం మీద చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. మిమ్మల్నీ నిరాశపరచదని భావిస్తున్నాను.