నా గురు పరంపర

శ్రీగురు దక్షిణామూర్తి
శ్రీగురు దక్షిణామూర్తి

నాకు అక్షరాభ్యాసం జరిగింది ప్రకాశం జిల్లా చంద్రరావూరు లోని సద్ధర్మ సాధన నిలయంలోగల బండ్లమాంబాదేవి సన్నిధిలో అమ్మ శ్రీ రాజమాతా దేవి చేత. తరువాత నా జీవితంలో నేను అభిమానించిన, నన్ను అభిమానించిన గురువులు, వారి గురించి కొన్ని విశేషాలు మీ అందరి కోసం గురుపూజోత్సవం సందర్భంగా.

శ్రీ గురవయ్య గారు: నా మొట్ట మొదటి గురువు. నేను వెళ్ళిన మొట్ట మొదటి పాఠశాల అప్పటికి కనీసం పాక కూడా లేకుండా మా ఇంటి చింత చెట్టుకింద నడుపుతున్న ప్రాథమిక పాఠశాల. మూడేళ్ళ వయసులో ఒకసారి బాగా అల్లరి చేస్తుండటంతో మా అమ్మ నన్ను తీసుకెళ్ళి అక్కడ పిల్లలతో పాటు వదిలిపెట్టింది. నేనేమో ఎంచక్కా మా మాస్టారు కూర్చునే బల్లపై కెక్కి చక్రాల బండితో ఆడుకుంటున్నాను ఆయన వచ్చింది కూడా గమనించకుండా. ఆయన వచ్చి నన్ను నెమ్మదిగా క్రిందకు దించి సరదాగా ఐదు గుంజీలు తీయమన్నాడు. అలా నా విద్యా జీవితం పనిష్మెంట్ తో ఆరంభమైందన్నమాట. 🙂
శ్రీ ప్రసాద్ గారు: వీరు మా అమ్మకు క్లాస్ మేట్. మా అమ్మమ్మ గారి ఊరు ముచ్చివోలు. నేను మా అమ్మమ్మ ఊరికి వెళ్ళాలంటే ఎంచక్కా ఆయన సైకిల్ మీద తీసుకెళ్ళేవాడు. దారి పొడవునా ఎన్నెన్నో కబుర్లు. కథలు చెప్పేవాడు.
శ్రీ అశ్వత్థ రావు గారు: ఆయన స్వంత ఊరు భాకరాపేట. ఆయన కుటుంబ సమేతంగా వచ్చి మా ఊర్లోనే ఉండేవాళ్ళు. ఈయనంటే అందరికీ ఎంతో భయమో అంత భక్తి. అప్పటి దాకా స్కూలు వదిలేస్తే ఆటల మీద పడిపోయే మాకు సాయంత్రం ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది వీరే. నేను మా ఇద్దరు అక్కలు ఈయన దగ్గరే చదువుకున్నాం. ఆయన శిష్యులు మంచి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆయనకు ఏనుగునెక్కినంత సంబరం.
శ్రీ నారాయణ చెట్టి గారు: అందరికీ ఈయనంటే హడల్. కానీ నేనంటే ప్రత్యేకమైన అభిమానం చూపించేవాడు.
శ్రీ వెంకట్రామానాయుడు గారు: వరసకి మా చిన్నాన్న. ఒక బావిలో ఉన్న కప్పను బయట పడేసి బయట ప్రపంచమేంటో చూపించాడు. ఐదో తరగతి చదివేటపుడు మండల్ లెవెల్ జనరల్ నాలెడ్జ్ పోటీలకు నన్ను ప్రిపేర్ చేసి ఫస్ట్ ర్యాంకు సాధించేలా చేశాడు. తరువాత కడప లో జిల్లా స్థాయి పరీక్షకు వెళ్ళేటపుడు బస్ లో అంతా తన ఒళ్ళోనే కూర్చోబెట్టుకుని తీసుకుని పోయాడు. అప్పుడేమీ అనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం అది ఒక అపురూపమైన అనుభవం.
శ్రీ మునిక్రిష్ణా రెడ్డి గారు: ముచ్చివోలు లో మా తెలుగు మాస్టారు. నా పాటలంటే ఆయనికి ఎంతో ఇష్టం. ఆయనికి ఎప్పుడైనా పాఠం చెప్పాలనిపించకపోతే నాచేత పాటలు పాడించేవారు. ఇప్పటికీ ఎక్కడ కనిపించినా “బావున్నాయా నాయనా!” అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. అచ్చమైన , స్వచ్చమైన అభిమానం అంటే ఏంటో ఆ పలకరింపులోనే దొరుకుతుంది నాకు.
శ్రీ ఆనందయ్య గారు: మా గణితం మాస్టారు. వీరి గురించి నేను ఇదివరకే ఒక టపా రాసి ఉన్నాను. నా జీవితాన్ని మలుపు తిప్పిన వ్యక్తి. ఎంతో స్పూర్తినిచ్చారు. ఏ పని చేసినా పెర్‌ఫెక్షన్ తో చేయడానికి ప్రయత్నించాలని ఈయనే స్పూర్తినిచ్చారు.
శ్రీ సుబ్రమణ్యం గారు: శ్రీకాళహస్తి పాఠశాలలో మా తెలుగు మాస్టారు. ఆయన పాఠం చెప్పేటపుడు పద్యాలు నేను చదవవలసిందే. “నా శిష్యుల్లో కల్లా నాకు అత్యంత ప్రీతిపాత్రుడివి నువ్వేనోయ్” అనేవారు.
శ్రీ గుర్నాధం గారు: తొమ్మిదో తరగతి క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు ఒక డిక్షనరీ బహుమానంగా ఇచ్చాడు. అది ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. నాకు ప్రత్యక్షంగా క్లాసు చెప్పకపోయినా నేనంటే ప్రత్యేకమైన అభిమానం చూపించేవాడు.

శ్రీ శైలజ మరియు వారి భర్త సాల్మన్ రాజు గార్లు: ఏదైనా సైన్స్ సెమినార్లు, వ్యాసరచన పోటీలు ఉంటే అంతా వీరి ఇంటి దగ్గరే. మా దగ్గర కూర్చుని చేయించేవాళ్ళు.

శ్రీ సుబ్బలక్ష్మి గారు: కొన్ని బిట్ పేపర్లు లాంటివి దిద్దడానికి ఇంటికి పిలిచేది. కొంచెం లేటయితే భోజనం కూడా వాళ్ళింట్లోనే. ఇటీవల ఒకసారి దాదాపు 6 సంవత్సరాల తర్వాత గుళ్ళో కనిపించి “చల్లగా ఉండరా!” అంటూ తన చల్లని చూపులతో దీవించారు.

ఇంకా మరెందరో మహానుభావులు అందరికీ వందనాలు. వీరంతా మాకు కేవలం పాఠాలు చెబితే సరిపోతుందనుకోకుండా నా వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వారు. బోధనావృత్తిని తమ శ్వాసగా భావించే గురువులందరికీ భక్తితో ఈ టపా అంకితం.