ఎక్కడికెళ్ళింది?

ఒకాయన చాలా పొదుపుగా మాట్లాడతాడని పేరు. ఏ మాట మాట్లాడినా ఆచి తూచి మాట్లాడేవాడు. అవసరానికి మించి ఒక్క మాటా మాట్లాడే వాడు కాదు.
ఒక రోజు ఏదో బ్రాండ్ బ్రష్ లను అమ్మడానికి ఒక సేల్స్ గర్ల్ వచ్చి తలుపు తట్టింది.
“ఎక్స్‌క్యూజ్ మి సర్. మీ వైఫ్ తో కొద్దిగా మాట్లాడచ్చా?”
“మా ఆవిడ ఇంట్లో లేదు.”
“ఓకే నేను ఆవిడ వచ్చే దాకా వెయిట్ చెయ్యచ్చా?”
“అలాగే అప్పటి దాకా ఈ డ్రాయింగ్ రూంలో కూర్చోండి” గది చూపించాడు.
1…2….3 గంటలు గడిచాయి. ఆయన భార్య జాడలేదు. విసుగొచ్చింది సేల్స్ గర్ల్ కి.
ఆయన దగ్గరకెళ్ళి “మీ ఆవిడ ఎక్కడకెళ్ళిందో తెలుసుకోవచ్చా?” అని అడిగింది.
“సమాధుల దగ్గరకెళ్ళింది”
“ఎప్పుడు తిరిగి వస్తుంది?”
“ఏమో నండి నాకు తెలీదు. వెళ్ళి దాదాపు పదకొండు సంవత్సరాలవుతోంది”

గవర్న్‌మెంట్ స్కూలా? ప్రైవేట్ స్కూలా?

“అవ్వా! నేను తొమ్మిదో తరగతికి కాళహస్తికి వెళ్ళి చదువుకుంటానవ్వా” అన్నాడో అబ్బాయి వాళ్ళ అమ్మమ్మతో.
“సరే నాయనా! ఏ బడిలో చేరతావు?” అడిగింది అవ్వ.
వయసులో చిన్నవాడయినా ఆ అబ్బాయికి తన కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు.ప్రైవేటు స్కూలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారమని అతనికి తెలుసు.అవన్నీ వాళ్ళకి చెప్పకుండా
“గవర్న్‌మెంట్ బాయ్స్ హైస్కూల్ ఉంది కదా అందులో చేరతా” అన్నాడు.
“అక్కడ సరిగా చెప్పరంట కద నాయనా. ఏదైనా ప్రైవేటు స్కూల్లో చేరకూడదూ” అంది అవ్వ.
“ఏదో తెలియని వాళ్ళు చెప్పుంటార్లే అవ్వా.నేను అక్కడే చదువుతాను. అయినా గవర్న్‌మెంట్ స్కూల్లో అయితే మంచి టీచర్లుంటారు. ప్రైవేటు స్కూల్లో అయితే మంచి క్వాలిఫికేషన్ ఉండే టీచర్లు ఉండరు.ఇంక టీచింగ్ అంటావా.
రైతు భూమిలో విత్తనాలు చల్లుతూ పోతాడు. మంచి సారవంతమైన భూమిలో పడిన విత్తనాలు మంచి ఏపైన మొక్కలుగా ఎదుగుతాయి. అలాగే నిస్సారమైన భూమిలో పడిన విత్తనాలు సరిగా మొలకెత్తవు. మొలకెత్తినా సరిగా ఎదగవు. మనం చేయవలసిందల్లా మన బుద్ధిని చదువు మీద కేంద్రీకరించడమే.వాళ్ళు అందరికీ ఒకే పాఠాలు చెబుతారు. శ్రద్ధగా విన్నవాళ్ళు ఒంటబట్టించుకుంటారు.మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు.అంతే ”
అని ఒప్పించి మరీ ఆబడిలో చేరాడు. అక్కడ చేరినందుకు అతనెప్పుడూ బాధపడలేదు. పైగా వచ్చిన రెండు సంవత్సరాల్లోనే అక్కడి ఉపాధ్యాయుల అందరి అభిమానం చూరగొని పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి పాఠశాల లో రెండో స్థానంలో నిలిచాడు.

ఇప్పుడాబ్బాయి మంచి ఉద్యోగంలో సెటిలయ్యాడు. వాళ్ళ అమ్మమ్మ మాత్రం తన దగ్గరికి ఎవరొచ్చినా పై సంఘటన వివరించి మనవడి గురించి గొప్పగా చెబుతుంటుంది.

అచ్చం మీలానే ఉన్నాడు

ఒకాయన అప్పుడే పుట్టిన కొడుకును చూడటానికి హాస్పిటల్ కు వెళ్ళాడు.
ఆయన్ను చూస్తూనే డాక్టర్ “రండి సార్. మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో” అన్నాడు.
“ఆ ఊరుకోండి డాక్టర్ గారూ! మీరు ఏ అబ్బాయి నైనా అంతే అంటారు కదా”
“లేదండీ మీ అబ్బాయి నిజంగానే అందంగా ఉన్నాడు”
“అలాగా మరి అబ్బాయి అందంగా లేకపోతే ఏమంటారు?”
“ఏముందీ! అబ్బాయి అచ్చు మీలాగే ఉన్నాడు సర్” అంటాం అన్నాడు డాక్టర్

వేలం వెర్రి అంటే ఇదేనేమో

మగధీర సినిమా చూడాలని ఆన్‌లైన్ లో టిక్కెట్ల కోసం చూస్తున్నాం.
విడుదలయ్యే రోజుతో మొదలు పెట్టాం.అయితే ఒక సారి పేజీ రిఫ్రెష్ అవ్వగానే టికెట్లన్నీ అమ్ముడుపోయి ఉన్నాయి.
సరే తరువాత రోజుకైనా దొరుకుతాయేనంటే మళ్ళీ అదే పరిస్థితి. మేము పేజీ రిఫ్రెష్ చేసే లోగా ఒక రోజు టికెట్లు బుక్ అయిపోతున్నాయి.
అలా ఆగస్టు 5 తేదీ దాకా చూశాం. లాభం లేదు.

విపరీతమైన ప్రచారం బాగా వర్క్‌అవుట్ అయినట్లుంది.
ఏం చేస్తాం ఒక గొర్రె ఒక దిక్కుకెళ్ళిందంటే మిగతా గొర్రెలన్నీ దాని ఫాలో అయిపోతాయి మరి.

జానపదం అంతరించిపోతుందా?

జానపదం అంతరించిపోవడం లేదు.తన పరిధిని విస్తరించుకుంటుంది.  నెమ్మదిగా కంప్యూటర్ ప్రపంచం లోకీ విస్తరిస్తోంది. కావాలంటే క్రింద జతపరచిన యూట్యూబ్ వీడియోను సందర్శించండి.దాని ఎంతమంది చూశారో గమనించండి.కంప్యూటర్ తో కుస్తీ పట్టినంత మాత్రాన తెలుగు వారు తమ జానపద సంగీతాన్ని మరిచిపోలేదనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ కళాకారులకు కావల్సిందల్లా పిసరంత ప్రోత్సాహం, వాళ్ళ టాలెంట్ ను నిరూపించుకునేందుకు సరైన వేదిక.

నేను పల్లెటూరి నేపథ్యం నుంచి వచ్చిన వాడినే కనుక జానపదాలను చాలా విన్నాను. అయితే ఇటీవలే మాటీవీలో రేలా రె రేలా కార్యక్రమం చూసిన తర్వాత వాటి మీద నాకున్న ఆసక్తి ,గౌరవం రెట్టింపయింది. వాటిలో అంత మాధుర్యం ఉందా? అనిపించింది. మంచి ఆర్కెస్ట్రా తో పల్లె పదాలను మాటీవీ గ్లామరైజ్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు.

చెప్పడం కాదు చేసి చూపించండి

ఒకసారి గాంధీజీ దక్షిణాఫ్రికా లో ఉండగా   ఒకావిడ తన కొడుకును వెంటబెట్టుకుని తీసుకువచ్చింది.
“వీడు స్వీట్స్ విపరీతంగా తింటున్నాడండీ.స్వీట్స్ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి  అంత మంచిది కాదని నేను ఎంత చెప్పినా వినడం లేదు. మీరు చెబితేనైనా వింటాడని మీ దగ్గరికి తీసుకువచ్చానండీ” అంది.
“ఒక నెల తర్వాత తీసుకురండి. అప్పుడు చెబుతాను” అన్నాడు.
ఆమె ఆశ్చర్యంతో గాంధీజీ ఎందుకు అలా చెప్పాడో  ఆలోచిస్తూ వెళ్ళిపోయింది.
నెల తర్వాత మళ్ళీ వచ్చింది.అప్పుడు గాంధీజీ ఆ పిల్లవాడికి స్వీట్స్ తినడం తగ్గించమని చెప్పి కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు.
ఈ మాత్రందానికి నెల రోజులు సమయం ఎందుకు. అనుకుంటున్నారా?
ఎందుకంటే గాంధీజీకి  కూడా స్వతహాగా స్వీట్స్ అంటే మక్కువ.తను కూడా ఎక్కువగానే తినేవారు.మొదటి సారి ఆమె కుర్రవాణ్ణి తీసుకు వచ్చినపుడు తను స్వీట్స్ బాగా తింటూ ఆ అబ్బాయికి సలహాలివ్వాలంటే ఆయనకు మనసొప్పలేదు. అందుకే ఆయన నెలరోజులపాటు స్వీట్స్ వాడకాన్ని తగ్గించి తరువాత ఆ అబ్బాయికి సలహా ఇచ్చాడన్న మాట.

ఎదుటి వాళ్ళకు నీతులు చెప్పేటప్పుడు మనం కూడా దాన్ని ఆచరించి చూపిస్తే బాగుంటుందన్నది ఈ సంఘటన ద్వారా నేను నేర్చుకున్న పాఠం.

మీ మీద కూడా ఎవరైనా రాయి విసరాలా?

పిన్న వయసులోనే  కంపెనీ ఎక్జిక్యూటివ్ బాధ్యతలను స్వీకరించిన ఒక యువకుడు, తన సరికొత్త కారులో  వెళుతున్నాడు. కొత్త మోజులో మంచి హుషారు మీద వేగంగా నడుపుతూ వెళుతున్నాడు.  కొద్ది దూరం వెళ్ళగానే రోడ్డు మీద ఆడుకుంటున్న కొద్ది మంది పిల్లలు కనిపించే సరికి కారును కొద్దిగా స్లో చేశాడు.అందరు పిల్లలూ దూరంగా జరిగారు.
అకస్మాత్తుగా ఒక ఇటుక రాయి వచ్చి కారు సైడ్ డోరుకు తగిలింది. వెంటనే బ్రేకులు వేశాడు. ఎక్కణ్ణుంచి రాయి వచ్చి తగిలిందో అక్కడికి పోనిచ్చాడు. కోపంగా కారు దిగి అక్కడే నిలబడి ఉన్న ఒక అబ్బాయి కాలర్ పట్టుకుని వెనక్కి తోసి
“ఎవడ్రా నువ్వు? బుద్ధి లేదా నీకు? నువ్వేం చేశావో నీకు తెలుస్తోందా. కొత్త కారు కొని వారం రోజులు కూడా కాలేదు. నువ్వు రాయి విసిరిందానివల్ల నా కారుకు సొట్ట పడింది. దానికి నాకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? అసలెందుకు చేశావీ పని? ” ఆగ్రహంతో గద్దించాడు.
ఆ అబ్బాయి దీన స్వరంతో “క్షమించండి సర్. ఈ పరిస్థితిలో నాకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ రాయి విసిరితేనైనా ఎవరైనా ఆగి నాకు సహాయం చేస్తారేమోనని అలా చేయవలసి వచ్చింది.” ప్రాధేయపడ్డాడు.
ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకుంటూ దగ్గర్లో పార్క్ చేసి ఉన్న ఒక కారు వేపు చూపించాడు. అక్కడ ఒక వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడు.
“మా అన్న సార్. నడవలేడు. చక్రాల బండి మీద నుంచి క్రిందపడిపోయాడు. గాయాలు  బాగా తగిలాయి. రక్తం ఎక్కువగా కారిపోతోంది. చాలా సేపు ప్రయత్నించాను. ఒక్కణ్ణే ఎత్తలేకున్నాను. దయచేసి మా అన్నయ్యని వీల్ చైర్ లో కూర్చోబెట్టడానికి సహాయం చెయ్యండి సార్” బావురుమన్నాడా కుర్రవాడు.
ఆ ఎక్జిక్యూటివ్ కదిలిపోయాడు. వెంటనే క్రింద పడి ఉన్న అబ్బాయిని ఎత్తి కుర్చీలో కూర్చోబెట్టాడు. తగిలిన గాయాలను తన చేతిరుమాలుతో తుడిచి కట్లు కట్టాడు. అంతా ఓకే అయిందనుకున్న తర్వాత తిరిగి ఆ అబ్బాయి వైపు చూశాడు.
అతని మనస్సు కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. కళ్ళ నిండా నీళ్ళతో “సమయానికి ఆదుకున్నారు. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి సర్” అంటూ వీల్ చైర్ ను తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.
ఆ ఎక్జిక్యూటివ్ మనసంతా ఒక అలౌకికమైన మధుర భావనతో నిండిపోయింది. ఒకరికి సాయం చేశామనే సంతృప్తి అనుభవిస్తేగానీ తెలియదు. అది మాటలకందని అనుభూతి. ఆ అబ్బాయి వెళుతున్నంత సేపూ అటువైపే చూస్తున్నాడు. భారంగా అడుగులు వేసుకుంటూ తన కారు దగ్గరికి వచ్చాడు. కారుకు సొట్టపడిన ప్రాంతాన్ని ప్రేమగా తడిమి చూశాడు. మరెప్పుడూ దాన్ని బాగు చేయాలని కూడా అతనికి అనిపించలేదు.