బావి

చాలా కాలం క్రితం రాజస్థాన్ లో గోవింద రాం అనే ఒకాయన ఉండేవాడు. ఆయనకు ఎడారి మధ్యలో ఒక బావి ఉండేది. చుట్టు పక్కల కొన్ని మైళ్ళ దూరానికంతా అదొక్కటే తాగునీటి వనరు. చాలామంది అక్కడికి వచ్చి తియ్యటి నీటిని తాగి దాహం తీర్చుకునేవారు. గోవింద రాం ఔదార్యమే లేకుంటే ఎడారి దాటేవాళ్ళు చాలా మంది దాహంతో చనిపోయే వాళ్ళు. అక్కడ నీళ్ళు ఉచితం. ప్రయాణికులు అక్కడ వారి దప్పిక తీరేదాకా తనివితీరా నీళ్ళు తాగి తమ ప్రయాణాన్ని కొనసాగించేవారు.

అలా దాహం తీర్చుకునే వారిలో గోపాల్ దాస్ ఒకడు. మంచి నిజాయితీగల వ్యాపారి. అతను ప్రతి సంవత్సరం తన స్వగ్రామాన్ని విడిచి కాలినడకన గంగానది ఒడ్డున ఉన్న కాశీ పట్టణానికి వెళ్ళేవాడు. అది దాదాపు వెయ్యి మైళ్ళ ప్రయాణం. మైళ్ళ తరబడి వేడి ఇసుక తప్ప మరేమీ కనిపించని ఆ ఎడారిలో తిండి, నీరు దొరకడం కష్టంగా ఉండేది. ప్రతి సంవత్సరం గోపాల్ దాస్ ఈ బావిని నమ్ముకునే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకునేవాడు.

ఒక ఏడాది గోపాల్ దాస్ మరియి కొంతమంది గ్రామస్థులు కలిసి కాశీ యాత్రకు సంకల్పించారు. బాగా ఎండగా ఉంది. తిండి, నీరు దొరకడం కష్టంగా ఉంది. కానీ గోపాల్ దాస్ తోటి ప్రయాణికులకు గోవింద రాం బావిని గురించి, అందులోని తియ్యటి నీటి గురించి చెప్పి ఉత్సాహ పరిచాడు.

వారు ఆ బావిని చేరుకునే సరికి బాగా అలిసిపోయి ఉన్నారు. గొంతు దాహంతో పిడచకట్టుకు పోతోంది. గోపాల్ దాస్ దూరం నుంచే చూసిన దాన్ని బట్టి ఆ ప్రదేశం మునుపటిలా లేదు. బావి చుట్టూ కంచె వేసి ఉంది. రక్షణగా ఓ భటుడు నిలబడి ఉన్నాడు.

“మాకు కొంచెం నీళ్ళు కావాలి. దయచేసి మమ్మల్ని లోపలికి పంపించండి లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాం” అడిగాడు గోపాల్ దాస్.

“అలాగే వెళ్ళండి. కానీ ఒక గ్లాసు నీళ్ళ ఖరీదు రెండణాలు” అన్నాడా భటుడు.

గోపాల్ దాస్ కు కొంచెం కోపం వచ్చింది.

“కానీ ఇక్కడ ఇంతకు ముందు ఉచితంగానే నీళ్ళు తాగనిచ్చేవారు కదా? ఇక్కడ డబ్బు కట్టి నీళ్ళు తాగాలంటే చాలా మంది దాహంతో చనిపోతారు” అన్నాడా భటుడితో.

ఆ భటుడు చాలా మర్యాదగా గోవిందరాం చనిపోయాడనీ, అతని కుమారుడు ఆ బావికి యజమాని అయ్యాడనీ, కావాలంటే అతని దగ్గరకు తీసుకెళతానని చెప్పాడు.

గోవింద రాం కుమారుడు చాలా తెలివైన వాడు. బావి చుట్టూ కంచె వేయడం వెనుక కారణాన్ని చాలా విపులంగా వివరించాడు.

“చూడండీ. ఈ బావిని తవ్వించడానికి వెయ్యి రూపాయలు ఖర్చయ్యింది. కానీ దాన్నుంచి మా కేమీ ఆదాయం లేదు. ఆ డబ్బంతా మేం తిరిగి రాబట్టుకోవాలనుకున్నాం. అందుకే గ్లాసుకు రెండణాలు చొప్పున వసూలు చేస్తున్నాం. ఇందులో అన్యాయమేమీ లేదు.”

గోపాల్ దాస్ చాలా బాధ పడ్డాడు. కానీ అతని మదిలో అప్పటికప్పుడే  ఓ పథకం రూపుదిద్దుకుంది.

“నేను ఆ బావిని మీ దగ్గర్నుంచి కొంటాను. మీరు రెండు వేల రూపాయలు తీసుకుని దాన్ని నాకు వదిలేయండి” అన్నాడు.

గోవిందరాం కొడుకు అందుకు సంతోషంగా సమ్మతించాడు. అతనికి చాలా లాభం దక్కింది కదా మరి. గోపాల్ దాస్ ఆ బావికి ఇప్పుడు యజమాని అయ్యాడు.

వెంటనే ఆ భటుడ్ని అక్కడి నుంచి పంపించి వేశాడు. కంచె పీకి వేయించాడు. ఈ నీళ్ళు ఇక అంతా ఉచితం అని ప్రకటించాడు. అక్కడ చేరుకున్న ప్రయాణికులంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. ఒక ప్రయాణికుడు ఆనందంతో గోపాల్ దాస్ దగ్గరకు వచ్చి “మీరు పిల్లా పాపలతో కలకాలం వర్ధిల్లాలి” అన్నాడు.

“అసలు నాకు కొడుకులే వద్దని ఆశీర్వదించండి” అన్నాడు గోపాల్ దాస్.

ప్రయాణికులంతా ఆశ్చర్యంగా చూస్తుంటే మళ్ళీ తనే 

“నా తదనంతరం నా కొడుకు కూడా గోవింద రాం కొడుకు లాగే ఆధునిక వ్యాపారిగా పెరగవచ్చు. అప్పుడు మళ్ళీ మీరు ఈ నీళ్ళకోసం డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. అందుకని అలా అన్నాను.” అన్నాడు.

ప్రయాణికులంతా సంతోషించి కాశీ ప్రయాణం కొనసాగించారు.