శ్రీకాళహస్తి గురించి సామవేదం షణ్ముఖశర్మ గారు చెప్పిన విశేషాలు

గత టపాలో నా శివరాత్రి అనుభవాల గురించి రాశాను. ఇందులో ప్రత్యేకించి సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రసంగ విశేషాలను గురించి ప్రస్తావించదలచాను.

శ్రీ శర్మ గారి ప్రసంగం శివరాత్రి ముందురోజున ఏర్పాటు చేశారు. నిజానికి శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు చాలా సంవత్సరాల నుంచీ ఆయన్ను శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రవచనం కోసమని ఆహ్వానిస్తూనే ఉన్నారట. ఆయనకు ముందుగానే వేరే ఆలయాల్లో పూజలకు ఒప్పుకొని ఉండటం వల్ల రాలేకపోయానని చెప్పారు. అయితే ఈసారి కొంచెం ముందస్తుగా ఏర్పాటు చేసుకొని రాగలిగినందుకు సంతోషాన్ని వెలిబుచ్చారు.

శ్రీకాళహస్తి పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేది శ్రీ – సాలె పురుగు, కాళ – సర్పము, హస్తి – ఏనుగు అనే మూగజీవాలకు ముక్తి నిచ్చిన క్షేత్రమని చాలా మంది వినే ఉంటారు. కాబట్టి దీన్ని గురించి ఎక్కువగా విడమరిచి చెప్పడం లేదు. ఇది జరగక మునుపే ఇక్కడ చాలా సంఘటనలు జరిగున్నాయట. అప్పుడు ఈ ప్రాంతాన్ని గజకాననం అనే వారట.

బ్రహ్మ ముందు ఇక్కడ పరమశివుడి గురించి తపస్సు చేసిన తర్వాతనే సృష్టికార్యం ప్రారంభించాడట. ఇక్కడ శివుడు జ్ఞానానికి ప్రతీకయైన దక్షిణామూర్తి స్వరూపంలో కూడా వెలసిఉన్నాడు.

వశిష్ట మహర్షికి విశ్వామిత్రునితో వైరము వలన తన నూర్గురు పుత్రులనూ పోగొట్టుకుంటాడు. ఆయన జ్ఞాన సంపున్నుడే అయినా పుత్రశోకంతో మాయ కప్పివేయడం మూలాన గజకాననానికి వచ్చి ఓ పర్వతం ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయాడట. అప్పుడు భూమత అతన్ని రక్షించింది. శివుని గురించి తపస్సు చేయమని కర్తవ్యబోధ చేసింది. అలా కొన్నేళ్ళపాటు తపస్సు గావించిన వశిష్టునికి మహాశివుడు, దక్షిణామూర్తి స్వరూపంలో మర్రిచెట్టు కింద దర్శనమిచ్చాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. మహాజ్ఞానియైన ఆయన ప్రాపంచిక విషయాల గురించి ఏం కోరుకుంటాడు?. అయినా లోక కల్యాణం కోసం శివుడిని జ్ఞానప్రదాత గా ఆ క్షేత్రంలో కొలువై ఉండమని కోరుకున్నాడట. అలా శ్రీకాళహస్తి జ్ఞానక్షేత్రమైంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ.

శ్రీకృష్ణదేవరాయలు కొలువులోని అష్టదిగ్గజాల్లో ధూర్జటి ఒకరు. అవి ప్రభంద సాహిత్యపు రోజులు. అందరు కవులూ రాజుల గురించి ఇతివృత్తాలను ఎన్నుకుంటుంటే ఆయన మాత్రం ఆయన ఇష్టదైవమైన శ్రీకాళహస్తీశ్వరుని ఇతివృత్తంగా ఎన్నుకొని శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం రాశాడు. అలాగే శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా రాశాడు. ఆయన శైలిని గురించి రాయలు స్వయంగా

స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ
యతులిత మాధురీ మహిమ ?

అని కీర్తించినట్లు చెబుతుంటారు. తర్వాత ఆస్థానంలో ఆయనపై కొంతమంది ఏవో నిందలు వేయడంతో రాయలవారు ధూర్జటికి రాజ్య బహిష్కార శిక్షను విధించారట. వెంటనే ధూర్జటి కట్టుబట్టలతో భార్యతో కలిసి ఒక అడవికి వచ్చేశాడట. అక్కడే ఇద్దరు ముని దంపతుల ఆశ్రమంలో ఉంటూ వాళ్ళకు సేవ చేస్తూ, వాళ్ళు పెట్టే భోజనం తింటూ దైవ ప్రార్థనలో ప్రశాంత జీవనం గడుపుతున్నారట.

ఒకరోజు ధూర్జటి దంపతులు నదీ స్నానం కోసం వెళ్ళగా అక్కడికి వచ్చిన రాయల వారి సైనికులు వీరిని గుర్తు పట్టి, ఆయన మీద వేసిన నిందలు అసత్యాలుగా నిరూపణలు అయ్యాయనీ,  రాజు వాళ్ళను తిరిగి రాజ్యానికి ఆహ్వానించారనీ చెప్పారు. వెళ్ళాలా? వద్దా అని ఆలోచిస్తూ ఆశ్రమం వైపు నడుస్తున్నారు. కానీ వారికి ఎంత సేపు వెతికినా ఆయాశ్రమమూ కనిపించలేదు, వృద్ధ దంపతులూ కనిపించలేదు. చివరికి అది శ్రీకాళహస్తీశ్వరుని మహత్తుగా భావించి తాము వారితో రావడం లేదని ఆ సైనికులను తిరిగి పంపించి వేసి తమ శేష జీవితాన్ని శ్రీకాళహస్తి క్షేత్రంలోనే గడిపాడని చెబుతారు. అయితే దీనికి చారిత్రక ఆధారలేమీ లేవని శ్రీ శర్మ గారే స్వయంగా చెప్పారు.

ఇక్కడ ప్రవహించే స్వర్ణముఖీ నది అసలు పేరు సువర్ణముఖరీ నది. అగస్త్య మహర్షి ప్రభావంతో ఈ నదీ ప్రవాహం ఏర్పడ్డదని స్థల పురాణం చెబుతోంది.

జన్మానికో శివరాత్రి!

స్వామి వారి తేరు
స్వామి వారి తేరు

మా ఊరు శ్రీకాళహస్తిలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నా గత రెండేళ్ళుగా నాకు దర్శన భాగ్యం కలుగలేదు. అయితే ఈ సారి ఎలాగైనా తప్పనిసరిగా చూడాలని రెండు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టేశా.ఈ ఏడు నాపై శివుని అనుగ్రహం మెండుగా ఉన్నట్లుంది. అనుకున్నట్టే మా అమ్మతో కలిసి వెళ్ళి ప్రాతఃకాలమే దర్శనం చేసుకున్నాను. అలాగే నాకు బాగా ఇష్టమైన ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మ గారిచే అనుగ్రహ భాషణం ప్రత్యక్షంగా వినే అదృష్టం కలిగింది. ఆయన శ్రీకాళహస్తీశ్వరుని గురించి, ఆలయాన్ని గురించి చెప్పిన విశేషాలు మరో టపాలో ప్రస్తావిస్తాను.

 

రాత్రి జాగరణ చేసి లింగోద్భవ మూర్తిని దర్శించుకునే భాగ్యం కలిగింది. ఇన్నేళ్ళుగా శ్రీకాళహస్తిలో ఉన్నానన్న పేరే గానీ లింగోద్భవ దర్శనం చేసుకున్నది లేదు. ఎందుకంటే లింగోద్భవ దర్శనం టిక్కెట్టు సంపాదించాలంటే పైరవీలైనా చేయాలి, లేదా ఎవరైనా ఆలయ అధికారులు, ఉద్యోగస్తులతో స్నేహమైనా కలుపుకోవాలి. తీరా టిక్కెట్టు సంపాదించాక ఆ సమయంలో గుడిలో ఎక్కడలేని తొక్కిసలాట ఉంటుంది. ఇలాంటివి మనకు గిట్టవాయే. అంత రద్దీలో దేవుడిమీద భక్తి నిలపాలంటే కష్టమైన పనే. మన పరిస్థితి చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్లు కాకూడదు కదా!

ఈసారి వాటి అవసరమేమీ లేకుండా ప్రశాంతంగా లింగోద్భవ దర్శనం కలిగేలా చేశాడా పరమేశ్వరుడు. ఎలా అంటారా? జాగరణలో భాగంగా ఆలయం పరిసరాల్లో తిరుగాడుతూ శివనామ స్మరణలో ఓలలాడుతూ, ముందుగా అత్యంత వైభవంగా జరిగే నందివాహన సేవలో కాసేపు పాల్గొన్నాను.

శివుడు కళాప్రియుడు కాబట్టి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధూర్జటి కళాప్రాంగణము అనే పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేస్తారు. ఈ వేదికపైన రాష్ట్రం నలుమూలలనుండీ, ఇతర రాష్ట్రాల నుండీ వచ్చిన అనేక మంది కళాకారులచే భక్తిరంజని, నృత్య, గాన, నాటక కళా రూపాలు ప్రదర్శింపబడుతూ ఉంటాయి. ఈసారి ప్రధాన ఆకర్షణ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో భక్తివిభావరి. ఇప్పటి దాకా ఇలాంటి భక్తి కార్యక్రమం చేయడం తమన్ కు ఇదే ప్రథమమట. అయితే కాసేపు విన్న తర్వాత ఆయన సినిమాల్లోపాటల్లో లాగా వాయిద్యాల హోరు ఎక్కువై గాత్రం సరిగా వినపడకపోవడంతో అక్కడ నుంచి వచ్చేశాను. ఆ కార్యక్రమం పది గంటలకు అయిపోయింది.

మరో నాటకం ప్రారంభమైంది. ఆ వేదిక వద్దకు వచ్చి కాసేపు ఉన్నాను. అక్కడ కొంచెం రద్దీ ఎక్కువ కావడంతో అలా ముందుకు వెళ్ళి ప్రధాన ఆలయానికి ఉత్తర దిక్కుగా శిథిలావస్థలో ఉన్న మణికంఠేశ్వర ఆలయ ప్రాంగణం లోపలికి వెళ్ళి కూర్చున్నాను. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది అనుకుంటూ ఉండగా కాసేపటి తర్వాత కొంచెం దూరంలో చిన్నగా మంత్రాలు వినిపించాయి. అటు వైపు వెళ్ళి చూస్తే ఒక చిన్న భక్త బృందం, పంతులుగారితో కలిసి ఆ శిథిలాలయల్లో పూజలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి రోజు ప్రతి శివలింగంలోనూ శివుడు ప్రవేశిస్తాడని ప్రతీతి. అందుకని పూజ అయిపోయే దాకా అక్కడే కూచున్నాను. సాధారణంగా శివలింగం ఉన్న గర్భగుడికి వెనుక వైపుగా లింగోద్భవ మూర్తి ఉంటుంది. అలా వెనక్కి వెళ్ళి చూస్తే కొంచెం చీకటిగా ఉంది. అక్కడ ఎవరూ లేరు. సెల్‌ఫోన్ వెలుతురులో పరికించి చూస్తే అది సాక్షాత్తూ లింగోద్భవ మూర్తే! ఇన్నాళ్ళూ గుడికి వెళ్ళి వస్తున్నా నేను ఎప్పుడూ అది గమనించింది లేదు. అక్కడ అలా దర్శనం చేసుకుని సంతృప్తిగా ఇంటిదారి పట్టాను.

ఈ శివరాత్రి నాకు మరపురాని అనుభూతిని మిగిల్చింది. నాకు తెలియకుండానే ఎవరో నడిపిస్తున్నట్లుగా ఆ గుడికి వెళ్ళడం, లింగోద్భవ సమయంలో సంతృప్తిగా స్వామి వారి అభిషేకాన్ని దగ్గరుండి దర్శించుకోవడం, జన్మానికో శివరాత్రి అంటే ఇదేనేమో అనిపించింది.

దండక మహారాజు కథ

దండక మహారాజు పిత్రా రాజ్యమను దక్షిణ దేశ రాజ్యానికి అధిపతి. ఆయన కులీనుడు (మంచి కులమున పుట్టిన వాడు). కానీ కాముకుడు. శుక్రాచార్యులను తన గురువుగా చేసుకొన్నాడు.

ఒక రోజున మహారాజు గుర్రమెక్కి అరణ్యానికి వెళ్ళాడు. అదే సమయంలో శుక్రాచార్యుని కుమార్తెయైన విరజ అడవిలోని ప్రకృతి శోభను తిలకించడానికి ఒంటరిగా వచ్చింది. ఆమెకింకా పెళ్ళి కాలేదు. మంచి అందగత్తె. బాల్యం నుండి అప్పుడే యవ్వనం లోకి అడుగిడుతున్న వయసు ఆమెది. అటూ ఇటూ తిరుగుతూ పూలు కోసుకొంటున్నది. రాజు దృష్టి ఆమె మీద పడింది. ఆమె అందానికి వశుడయ్యాడు. అతని మనస్సు అతని ఆధీనం లో లేదు. వెంటనే ఆమె దగ్గరకు వచ్చి, స్నేహపూరిత స్వరంతో

“భామినీ, ఎవరు నీవు? ఎవరి కుమార్తెవు? ఎవ్వని భార్యవు? ఈ నిర్జనారణ్యంలో ఇలా ఒంటరిగా తిరుగుతున్నావేం? కనీసం నీకు పాదరక్షలు కూడా లేవు. ”

అది విని ఆమె సిగ్గుతో “రాజా! నేను శుక్రాచార్యుని పుత్రికను. నాకు ఇంకా వివాహం కాలేదు.” అన్నది

“దేవీ! నేను ఈ దేశమునకు రాజును. నీ సౌందర్యం నన్ను వివశుణ్ణి చేయుచున్నది. నేను నీకు దాసుడిని. కావున నాయందు దయయుంచుము.”

“ఓ రాజా! మీరిలా మాట్లాడటం భావ్యంగా లేదు. మాట్లాడటం సరి కదా, మనస్సులో ఈ ఆలోచన పుట్టడం కూడా తప్పే. నీవు రాజువు కాబట్టి అందరికీ తండ్రి లాంటి వాడివి. ఆ విధంగా నేను నీ కూతురితో సమానం. మా తండ్రి నీకు గురువు. ఆ విధంగా నీకు నేను సోదరితో సమానం. పైగా నేను బ్రాహ్మణ కన్యను. నీవు క్షత్రియుడవు. కాబట్టి నీ కోరిక అంగీకరించడం సాధ్యం కాదు. పుత్రిక, సోదరి ఎడల చెడు ఆలోచనలు చేయకూడదు. కాబట్టి ఆ ఆలోచనలు నీ మనస్సు నుండి పారద్రోలి మా తండ్రి గారి ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆతిథ్యం స్వీకరించండి.”

“కానీ నా మనస్సు నా ఆధీనమునందు లేదే. ఈ సంబంధం అనుచితమైనదని నాకు తెలుసు. కానీ నా మనస్సు నీయందు చిక్కుబడిపోయింది. నీయందు అమితమైన అనురాగం ఏర్పడిపోయింది. ప్రేమ గుడ్డిది కదా.దానికి నియమమనేది ఉండదు.”

“రాజా ప్రేమ అనే శబ్దానికి కళంకము తేవద్దు. నీ పని అధర్మము, అనుచితము. తెలిసి తెలిసి విషం కోరుకుంటున్నావు. ఈ విషయం గురించి మా తండ్రి గారికి తెలిస్తే మిమ్మల్ని సర్వ నాశనం చేయగలడు. నీ చావును నీవే కొనితెచ్చుకుంటున్నావు. నేను ఇంకనూ రజస్వల కాలేదు. ఏ విధంగా చూసినా ఇది సాధ్యం కాని పని. నీ మంచికోరే చెబుతున్నాను. దయచేసి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళండి.”

కానీ ఆ రాజు కళ్ళను కామపు పొరలు కమ్మివేసినవి. “నేను చనిపోయినా పరవాలేదు. కానీ నీతో ఒక్కసారి సుఖిస్తే చాలు. ఈ రాజ్యము, ధనం నీతో పోలిస్తే నాకు తృణప్రాయము.”

ఆమెకు కోపం వచ్చి. “ఓరీ నీచుడా! పో అవతలికి!! ఇట్లా దారుణంగా ప్రవర్తిస్తావా?” అని చెప్పి వడివడిగా అవతలికి పోసాగింది.

ఆ రాజుకు వివేకం పూర్తిగా నశించింది. ఆమె జుట్టు పట్టుకుని బరబరా ఈడ్చుకుని వచ్చి, ఆమె ఏడుస్తున్నా బలవంతంగా అనుభవించాడు.

అనంతరం భయపడి గుర్రమెక్కి పారిపోయాడు.ఆమె తలవంచుకుని ఏడుస్తూ, కేకలు వేస్తూ తండ్రి ఆశ్రమాన్ని చేరుకుంది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకొన్నాడు. ఆ రాజు మీద మిక్కిలి కోపం వచ్చింది.

ఆ క్రోధావేశమున కన్నుల నిప్పులు రాలుచుండగా,

“ఏ క్రూరకర్ముడు, నీచుడు, నికృష్టుడూ, కాముకుడూ అయిన రాజు ఇట్టి దుష్కార్యమొనర్చినాడో వాని రాజ్యము నశించు గాక!  వాని రాజ్యమందు పశు పక్ష్యాదులు సైతం నివసించుకుండు గాక! ఏడు దినములు ఏకధాటిగా వర్షము కురియు గాక! అచ్చట వృక్షములు కూడా మొలచకుండుగాక.” అని శపించాడు.

తరువాత కూతురి వంక తిరిగి “నీవు ఇచటనే తపమాచరించి విశుద్ధవు గమ్ము!” అని చెప్పి ఇతర మునులతో సహా వేరొక ప్రాంతమునకు వెళ్ళిపోయాడు.

ఆయన శాపమునకు తగినట్లే దండకుని రాజ్యములో ఏడు దినములు, ఏడు రాత్రులు కుండపోత వర్షం కురిసింది. అతని రాజ్యం, మంత్రులూ, సైన్యం, కోశం, సర్వం నశించింది. ఆ రాజ్యం ఎడారి వనమైపోయింది. చాలా కాలందాకా అక్కడ పక్షులు కూడా నివసించలేదు. అదే  దండకారణ్యము.

చాలా కాలం తర్వాత శ్రీరాముని దర్శనా లాలసతో కొంతమంది మునులు వచ్చి అక్కడ కుటీరాలు నిర్మించుకున్నారు. చెట్లు కూడా  మొలిచాయి. శ్రీరామచంద్రుడు అవతారము ధరించి సీతా సమేతంగా అక్కడికి వచ్చినపుడు ఆ ప్రదేశానికి శాప విముక్తి కలిగింది.

ఇదీ కామానికి లోబడి సర్వనాశమైన దండకుని కథ!!