వెంకటగిరి సంస్థానం గురించిన ఆసక్తికరమైన కథ

ఈ మధ్యన నేషనల్ డిజిటల్ లైబ్రరీలో చరిత్ర పుస్తకాల కోసం వెతుకుతుంటే నానారాజన్య చరిత్రము అనే ఒక పుస్తకం దొరికింది. ఈపుస్తక రచయిత శ్రీరామ్ వీరబ్రహ్మం. 1918లో ప్రచురించారు. ఈ పుస్తకంలో వెంకటగిరి సంస్థానం గురించే కాక మరో పద్నాలుగు సంస్థానాల గురించిన చరిత్ర ఉంది. వెంకటగిరి సంస్థానం గురించి చదువుతుండగా నాకు మా పెద్దవాళ్ళ ద్వారా విన్న ఓ ఆసక్తికరమైన కథకు ఆధారం దొరికింది. ఇది వెంకటగిరి సంస్థానం గురించి నేను చిన్నప్పటి నుంచి వింటున్న కథ.

************

నిజాం కాలంలో పద్మనాయక వంశానికి చెందిన చెవిరెడ్డి అనే రాజు ఉండేవాడు. అప్పటి నైజాం రాజ్యంలోని నల్లగొండ మండలం లోని ఆమనగల్లు రాజధానిలోనూ, పిల్లలమఱ్ఱి అనే రాజధానిలోనూ నివసిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఈయనకు పూర్వము పదవతరం వాడైన హేమాద్రి రెడ్డి అనే రాజు పరిపాలనలో బాగా ధనాన్ని సంపాదించి దాన్ని ఒకచోట నిక్షేపించాడు. దానిపైన ఒక వేదిక కట్టించి ఒక మర్రి చెట్టును నాటాడు. దానికింద ఒక భైరవ విగ్రహాన్ని ప్రతిష్టించి ఒక కోరిక కోరుకున్నాడు.

“స్వామీ! మీరీ సంపదను కాపాడి, నా సంతతిలో అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వాడు, సత్కర్మలు చేయగల వాడు, సద్గుణ సంపన్నుడు అయిన వానికి అందజేయవలెన” ని దాని సారాంశం.

ఇది తెలియపరచడానికి రహస్యముగా ఒక శిలాశాసనాన్ని కూడా స్థాపించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చెవిరెడ్డి ఒకసారి వేటకోసమని ఆ ప్రాంతానికి వచ్చాడు. అదే సమయంలో వారి దివాణంలో పనిచేసే రేచడు అనే హరిజనుడు వ్యవసాయం చేయడం కోసం పొలం దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డం పడింది. అది పూర్వం హేమాద్రి రెడ్డి చెక్కించిన రహస్య శిలా శాసనం. అదే సమయానికి తమ రాజు అటువైపు వెళుతుండగా రేచడు ఆయన దగ్గరకు వెళ్ళి ఆ శాసనం గురించి చెప్పాడు.

శాసనాన్ని చదివిన చెవిరెడ్డి తన పూర్వీకులు దాచిన నిధిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా, దాని ప్రక్కనే ఉన్న మర్రి చెట్టును ఆశ్రయించుకున్న భేతాళుడు ఈయన ధైర్యాన్ని పరీక్షించాలనుకున్నాడు. తన మాయలతో మేఘాలు, ఉరుములు, మెఱుపులు సృష్టించి ఆ మర్రి చెట్టు వారిపై పడేలా చేశాడు. రేచడు ఇది చూడగానే మూర్ఛపోయినాడు. కానీ చెవిరెడ్డి మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. భేతాళుడు ఇతని శక్తిని మరింతగా పరీక్షించదలచి భీకరరూపంతో చెవిరెడ్డి ముందుకు దూకాడు. అంత ఆ రాజు తన కత్తి దూసి నరకబోతుండగా భేతాళుడు నిజరూపంలో ప్రత్యక్షమై అతని ధైర్య సాహసాలకు మెచ్చాననీ ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అపుడా రాజు తమ వంశం వారంతా రాజ్యభోగాలతోనూ, శౌర్య ధైర్యాధి గుణములను కలిగి ఉండేలాగుననూ, తాము యుద్ధానికి వెళ్ళేటపుడు భేతాళుడు ముందు నడిచేలా వరాలను కోరుకున్నాడు. భేతాళుడు ఆ వరాలను అనుగ్రహించి అంతర్థానం అయ్యాడు.

తర్వాత ఆ రాజు ఆనందంతో ఆ సంపదను వెలికితీయడానికి ప్రయత్నించగా, పక్కనే భైరవమూర్తి నుంచి అశరీరవాణి ఒకటి వినిపించింది.

“ఓ రాజా, నీవు ఈ సంపదను తీసుకోవడానికి అర్హుడవే కానీ, ఈ సంపదను కొన్ని క్షుద్ర భూతములు ఆశించి ఉన్నాయి. వాటికి ఒక నరబలి ఇచ్చి ఈ సంపదను తీసుకుంటే నీకు మంచి జరుగుతుంది” అని పలికింది.

రాజు నరహత్యకు వెనుకాడుతూ ఆలోచిస్తుండగా మూర్ఛ నుంచి తేరుకున్న రేచడు జరిగిన విషయం తెలుసుకుని తనను బలి ఇచ్చి ఆ ధనాన్ని తీసుకోమన్నాడు. కానీ ఆ రాజుకి తన దివాణంలో నమ్మకస్తుడైన అతనిని బలి ఇవ్వడానికి మనసొప్పలేదు. అప్పుడు రేచడు “మీరు ఈ ధనాన్ని మంచి కోసమే వినియోగించగలరని నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను కోరిన కోరికలు తీర్చి నన్ను బలి ఇస్తే మీకు నరహత్య పాపం అంటదు.” అన్నాడు. దాంతో రాజు రేచడు కోరినట్లు తమ వంశం వారినందరినీ తరతరములకు రాజా వారి వంశీయులు పోషించుటకు, తమకు వివాహం జరిగేటపుడు రేచని వంశీయులకు వివాహం జరిగేలా అంగీకరించి వానిని బలియిచ్చి ధనాన్ని స్వీకరించాడు. భేతాళుని కారణముగా ఈయనకు భేతాళ నాయడనని కూడా పేరు.

వెంకటగిరి రాజుల పేర్ల వెనుక యాచేంద్ర అని చేర్చుకుంటారు. ఉదాహరణకు ఇటీవలి తరానికి చెందిన వారి పేర్లు గోపాలకృష్ణ యాచేంద్ర, సాయికృష్ణ యాచేంద్ర. ఈ రేచడి పేరే తర్వాతి తరంలో యాచమ నాయుడనీ, యాచేంద్ర అనీ రూపాంతరం చెంది ఉండవచ్చని నా ఊహ.

మ్యాక్ బుక్ లో తెలుగు టైపు చేయడం

వీవెన్ గారు ఐఫోనులో తెలుగు టైపుటెట్లు? అనే టపా రాసి దానికి పోటీగా నన్ను మ్యాకులో తెలుగులో టైపు చేయడం గురించి రాయమన్నారు. గత ఒకటిన్నరేళ్ళుగా ఆఫీసు వాళ్ళిచ్చిన మ్యాక్ బుక్ వాడుతున్నాను. అందులో ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు ఉంది. దాన్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో చూద్దాం.

  • ముందుగా తెర అడుగున ఉన్న System Preferences మీద నొక్కండి.

screenshot-2017-02-01-10-17-12

  • Keyboard ఐకాన్ నొక్కండి.

screenshot-2017-02-01-10-17-56

  • Input Sources అనే ట్యాబ్ కి వెళ్ళి, తెలుగు కీబోర్డు చేర్చడానికి ఎడమవైపు జాబితా కింద ఉన్న + బటన్ నొక్కండి. దాని పక్కనే ఉన్న Show Input menu in menu bar అనే చెక్ బాక్సును చెక్ చేసి ఉంచండి.

screenshot-2017-02-01-10-18-37

  • తెలుగు కోసం వెతికి Telugu – QWERTY ఎంచుకుని Add బటన్ నొక్కండి.

screenshot-2017-02-01-10-36-49

  • తెలుగులో టైపు చేయాలనుకుంటే మెను బార్ లో ఉన్న తెలుగు కీబోర్డును ఎంచుకుని తెలుగులో టైపు చేయడం ప్రారంభించండి. ఇంగ్లీషు కీబోర్డు కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు.

screenshot-2017-02-01-10-19-00

పైన నేను పేర్కొన్న విధానం ఇన్ స్క్రిప్టు లో టైపు చేయడానికి. మొదట్లో ట్రాన్స్‌లిటరేషన్ కు అలవాటు పడ్డ నాకు మొదట్లో ఇది కొత్తగా అనిపించింది. కానీ అలవాటు పడే కొద్దీ తక్కువ కీ స్ట్రోకులతో టైపు చెయ్యవచ్చని తెలిసింది. అంతే కాకుండా ఈ కీబోర్డుకు అలవాటు పడితే మీరు సిస్టమ్ మార్చినా కూడా ప్రత్యేకంగా ఏ సాఫ్టువేరు ఇన్‌స్టాల్ చేయనక్కర లేదు. ఉన్న కీబోర్డును ఎనేబుల్ చేసుకుంటే చాలు.

నా చదువు సంగతులు – 8

విద్యార్థి దశలో నన్ను బాగా ప్రభావితం చేసిన ఇంకొక మాస్టారు అశ్వత్థరావు సార్. బాకరాపేట నుంచి మా ఊరికి బదిలీ అయి వచ్చారు. బ్రాహ్మణ కుటుంబం. ఉన్నంతలో శుభ్రంగా ఉన్న ఇల్లు బాడుగకి తీసుకున్నారు. కొత్తగా వచ్చారు కాబట్టి అందరూ కొత్తయ్యోరు అని పిలిచేవాళ్ళు. ఆ పిలుపు ఆయన సుమారు పదేళ్ళు మా ఊళ్ళో పనిచేసి బదిలీపై వెళ్ళేదాకా అలాగే కొనసాగింది. మాది అప్పటికి ప్రాథమికోన్నత పాఠశాల. ఆయన ఆరు, ఏడు తరగతులకు పాఠాలు చెప్పేవారు. సాయంత్రం పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పేవారు. మంచి క్రమశిక్షణగా చదివించేవారు. చదివేటప్పుడు మాట్లాడితే అస్సలు ఊరుకునే వాడు కాదు. పిల్లలందరూ మిద్దె మీద కూర్చుని చదువుకునే వారు. వాళ్ళు కింద కాపురముండేవాళ్ళు. మేం పైన నడుస్తుంటే కింద శబ్దం రాకూడదని నెమ్మదిగా మునిగాళ్ళ మీద నడవమనే వాడు. బడికి వచ్చే దాదాపు అందరూ పిల్లలు ఆయన ట్యూషన్ కి కూడా వచ్చేవాళ్ళు. ఎందుకో ఆయన దగ్గరకి ట్యూషన్ కి పంపితే పిల్లలు బాగా చదువుకుంటారని అందరికీ గురి కుదిరింది.

మాకు ఇంగ్లీషు మీద శ్రద్ధ కలిగింది ఆ సార్ వచ్చిన తర్వాతే. ఒకసారి ఆయన రిజిష్టరులో ఏదో రాసుకుంటూ ఉంటే అందులో నాకు తెలీని పదాలు కూడి కూడి చదువుతుండేవాడిని. ఆయన ఆ ఆసక్తిని గమనించి మాకందరికీ ట్యూషన్లో రోజూ స్పెల్లింగ్ , ఉచ్ఛారణలతో సహా కొన్ని ఆంగ్ల పదాలు వాటికి తెలుగులో అర్థాలు మా పలకల్లో రాసిచ్చి బట్టీపట్టమనే వాడు. ఒక అరగంటో గంటో చదివిన తరువాత వాటిని డిక్టేషన్ రాయమనే వాడు. అలా చాలా పదాలు నేర్చుకున్నాను నేను.

దార్లో ఆయన వస్తున్నాడంటే ఆడుకునే పిల్లలంతా ఇళ్ళల్లోకి పరిగెత్తేసే వాళ్ళం. ఒకసారి అలాగే గోలీకాయలాడుతుంటే అందరూ చాకచక్యంగా తప్పించుకున్నా అడ్డంగా దొరికిపోయాన్నేను. అబ్బే నేనడ్డంలేదు సార్. వాళ్ళాడుతుంటే నేను ఊరికే చూస్తూ నిలుచున్నానని అమాయకంగా అబద్ధమాడేశా. అది ఆయన మా ఇంట్లో వాళ్ళతో సహా అందరికీ చెప్పీ పడీ పడీ నవ్వాడు నా అమాయకత్వానికి.

ఆయన భార్య పేరు మంజులా మేడం. సంగీతం నేర్చుకున్నదనుకుంటా. చక్కగా పాటలు పాడేది. సినీనటుడు పద్మనాభం ఆమెకు బంధువులంట. ఆమె చిన్నప్పుడు పద్మనాభం గారు తెచ్చిచ్చిన గౌను జాగ్రత్తగా ఉంచుకుని ఓ సారి మా అక్కవాళ్ళకు చూపించిదంట. ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమంలో క్వార్టర్ ఫైనల్ దాకా వెళ్ళివచ్చింది. కూడా. ఊర్లో ఎవరైనా ఇంట్లో నీటి అవసరాలకి బావినుంచో, బోరు నుంచో తెచ్చుకునే వారు. పాపం ఆమెకు కష్టంగా ఉండేదని పిల్లలం మేమే నీళ్ళ బిందెలు చెరోవైపు పట్టుకుని తెచ్చిచ్చేవాళ్ళం. బ్రాహ్మణులకు సేవ చేస్తే మంచిదని ఊర్లో వాళ్ళు కూడా ఎవరూ అడ్డు చెప్పేవాళ్ళు కాదేమో.

చిన్నప్పటి సంగతులు

నేను చిన్నప్పటి నుంచి కొంచెం మెతకగా ఉండేవాణ్ణి. ఒకసారి మా కుటుంబమంతా కలిసి తిరుమల వెళ్ళాము. దర్శనానికి వెళ్ళేటపుడు జనం ఎక్కువగా ఉంటే కొన్ని గదుల్లో (కంపార్ట్ మెంట్లు) కూర్చోబెడతారు. అక్కడ అందరూ కూర్చున్నాం. జనాలకు బోరు కొట్టకుండా భక్తిరస ప్రధానమైని సినిమాలు వేస్తారు. అప్పట్లో వాటిలో మన ఇంట్లో వాడే టీవీల్లాంటివి పెద్దవి ఉండేవి. భక్త ప్రహ్లాద సినిమా వేశారు. మొదట్లో అంతా బాగానే చూసాను. ప్రహ్లాదుణ్ణి తండ్రి శిక్షించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఏడుపు ప్రారంభించానంట. మా ఇంట్లో వాళ్ళు అవన్నీ బొమ్మలు, ఉత్తుత్తినే అనే ఎంత చెప్పినా ఏడుపు ఆపలేదంట. చివరికి దర్శనం చేసుకోకుండానే క్యూ నుంచి బయట వచ్చేసి మరుసటి రోజు దర్శనానికి వెళ్లారంట. మరోసారి మా అవ్వ కాళహస్తిలో పెళ్ళికి వెళ్ళినపుడు వరపుత్రుడు అనే సినిమాకు నన్ను తీసుకెళ్ళింది. శింబు అందులో బాలనటుడు. అందులో ఆ అబ్బాయి తండ్రి మరో ఆడదాని మాయలో పడి వాళ్ళ అమ్మను అనేక విధాలుగా హింసలు పెడుతుంటాడు. ఇంక అప్పుడు కూడా ఏడుపు ప్రారంభించానంట. మా అవ్వతోటి సినిమాకు వచ్చిన వాళ్ళంతా నన్ను తిట్టడం మొదలెట్టారంట. అప్పట్నుంచీ నాకు బాగా వయసొచ్చేదాకా మా వాళ్ళు నన్ను సినిమాకు తీసుకెళ్ళే సాహసం చేయలేదు.

చిన్నప్పుడు ఎప్పుడూ ఒక పిల్ల సంఘాన్ని వెంటేసుకుని తిరుగుతుండే వాడ్ని. గోళీలు, దొంగ-పోలీసు, కోడి బిళ్ళ, కోతి కొమ్మచ్చి మేం ఎక్కువగా ఆడిన ఆటలు. టీవీల్లో, సినిమాలో సెంటిమెంటు సీన్లు భరించలేక నేను వాటిని పెద్దగా చూసేవాణ్ణి కాదు. పాటలంటే ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం చిత్రలహరి మాత్రం తప్పకుండా చూసేవాణ్ణి. మా అక్క వాళ్ళు మాత్రం ఏ ప్రోగ్రామైనా తెగ చూసేవారు. మరి నేను ఆడుకోవాలంటే ఎవరో ఒకరు కావాలిగా. అందుకే నేను టీవీ చూడకపోవడమే కాకుండా మా పిల్ల సంఘాన్ని మొత్తం టీవీ చూడకుండా డైవర్టు చేసేవాణ్ణి. కిట్టిగాడు అనే సీరియల్ మాత్రం పిల్లల సీరియల్ కాబట్టి కొంచెం చూసినట్టు గుర్తు. ఇప్పుడు ప్రముఖ సీరియల్ హీరో కౌశిక్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మధ్యనే వికీలో బెనర్జీ గురించి రాయడానికని యూట్యూబులో వెతుకుతుంటే కృష్ణకౌశిక్ ఇంటర్వ్యూ కనిపించింది. ఈ సీరియల్ ప్రముఖ రచయిత టామ్ సాయర్ రచన ఆధారంగా తీశారంట. ఇందులో టామ్ సాయర్ పాత్రని కౌశిక్ పోషించాడు. మురళీ మోహన్ ది కూడా మరో ప్రధాన పాత్ర. ఈ కిట్టిగాడు సీరియల్ కౌశిక్ స్వయంగా యూట్యూబులో పెట్టాడు. అవసరమైన వారి కోసం లంకె ఇక్కడ.