ఆత్మార్పణం – మహాభారత కథ

మహాభారత యుద్ధం జరిగిన తర్వాత పాండవులు ఒక మహా యజ్ఞాన్ని జరిపి పేదలకు భారీ ఎత్తున దానధర్మాలు చేశారు. ప్రజలంతా దాన్ని కనీవినీ ఎరుగని యజ్ఞంగా వేనోళ్ళ కొనియాడారు. యాగం అంతా పరిసమాప్తి అయిన తర్వాత ఒక ముంగిస ఆ యజ్ఞవాటికలో ప్రవేశించింది. దాని శరీరం సగ భాగం బంగారు రంగులో, సగ భాగం గోదుమ రంగులో ఉంది. అది తన చుట్టూ ఉన్న వాళ్ళనుద్దేశించి

“మీరు ఒట్టి అబద్ధం చెబుతున్నారు. ఇది అసలు యాగమే కాదు” అన్నది.

“ఏమిటీ! ఇది యాగమే కాదా? ఇందులో భాగంగా లెక్కలేనంత ధనం, ఆభరణాలు దానం చేశారు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా మానవ జాతి చరిత్రలోనే ఒక మహా యజ్ఞం” అన్నారు చుట్టూ ఉన్నవారంతా.

దానికి సమాధానంగా ఆ ముంగిస ఈ కథ చెప్పింది.

ఒకానొక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు, తన భార్య, కొడుకు, కోడలితో కలిసి జీవిస్తుండే వాడు. ప్రవచనాల ద్వారా, భోదన ద్వారా వచ్చే కానుకలే వారికి జీవనాధారం. అలా ఉండగా ఆ ప్రాంతంలో మూడేళ్ళ పాటు ఒక భయంకరమైన కరువొచ్చింది. ఇక వారి కష్టాలకు అంతే లేకుండా పోయింది. కొన్ని రోజుల పాటు ఆహారం లేకుండా అలమటించిన తర్వాత అదృష్టవశాత్తూ కొంచెం పేలపిండి దొరికింది. దాన్ని ఆయన నాలుగు సమాన భాగాలుగా విభజించి తినడానికి సన్నద్ధమయ్యారు. ఇంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ఒక అతిథి నిలుచున్నాడు. భారతీయ సాంప్రదాయం ప్రకారం అతిథి దేవునితో సమానం. అతిథిని ఆదరించకుండా మనం భోంచేయ కూడదు కదా అని ఆయన్ను లోపలికి ఆహ్వానించారు. ముందుగా ఆ బ్రాహ్మణుడు తన భాగం ఆయనకు సమర్పించి తినమన్నాడు. ఆ అతిథి దాన్ని తొందరగా తినేసి తన ఆకలి ఇంకా తీరలేదన్నాడు. అప్పుడాయన భార్య ముందుకొచ్చి తన భాగం కూడా ఆయనకిచ్చేసింది. అయినా ఆ అతిథికి ఆకలి తీరలేదు. చివరగా ఆ బ్రాహ్మణుడి కొడుకు, కోడలు కూడా తమ భాగాల్ని ఆయనకిచ్చేశారు. ఆయన సంతృప్తిగా తిని వాళ్ళను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రికే వాళ్ళు ఆకలితో చనిపోయారు. అక్కడ కొంచెం పేలపిండి నేల మీద పడి ఉన్నది. దాని మీద పడి దొర్లగానే ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా సగభాగం బంగారమైపోయింది. అదిగో అప్పట్నుంచీ అలాంటి యజ్ఞాన్ని చూడాలని ప్రపంచమంతా తిరుగుతున్నాను. ఇప్పటిదాకా ఎక్కడా కనబడలేదు. నా ఒళ్ళు పూర్తిగా బంగారం కాలేదు. అందుకనే నేను దీన్ని యాగమే కాదన్నాను.