దైవానుగ్రహమా? పురుష ప్రయత్నమా?

ఇది మహాభారతంలోని ధర్మ సంభాషణ. ఇలాంటి సందేహమే చాలామందికి కలిగి ఉండవచ్చు.

ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడు.

ధర్మరాజు: స్వామీ! దైవానుగ్రహమా? పురుష ప్రయత్నమా? ఈ రెండింటిలో ఏది ప్రభావ వంతమైన సాధనము?

భీష్ముడు: దైవానుగ్రహమనేది సాధనమనడానికి వీల్లేదు. సాధన చేయడమనేది మనుష్యునికి సంబంధించినది. ఈ అనుగ్రహం భగవంతుడు ఇవ్వవల్సిందే కానీ మనుష్యుడు స్వేచ్ఛగా తీసుకోలేడు. దైవభక్తినైతే సాధనమనవచ్చు.  దైవభక్తిని పురుష ప్రయత్నంలో భాగంగా అలవరుచుకోవడం వల్ల దైవానుగ్రహం పొందే వీలుంది. కనుక దైవభక్తిని పురుష ప్రయత్నంలో భాగంగా చేసి దేవునిపై భారం వేసి ప్రయత్నం చేయడమే ప్రభావయుతమైన సాధనం. దైవాన్ని పూర్తిగా వదిలివేసి ప్రయత్నం చేస్తే అప్పుడు దైవానుగ్రహం కోల్పోయినట్లే లెక్క. అప్పుడు అది పరిపూర్ణ ప్రయత్నమనిపించుకోదు. కాబట్టి దైవాన్ని ప్రార్థించడం ప్రయత్నంలో భాగంగా ఉండాలే కానీ, నా ప్రయత్నం గొప్పదా? దైవం గొప్పదా అని ప్రశ్నించుకోవడం సరి కాదు.

*డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో…