విజయగణపతి దేవాలయం

విజయగణపతి దేవాలయం
మా ఊర్లో రూపుదిద్దుకుంటున్న విజయగణపతి దేవాలయం

మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ముచ్చివోలు లో నిర్మాణంలో ఉన్న విజయగణపతి దేవాలయం. పూర్తయితే అద్భుతమైన నిర్మాణంగా యాత్రీకులను ఆకర్షించే విధంగా కనిపిస్తున్నది కదూ…

ఎవరతను?

ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అప్పుడే ఆఫీసులో అడుగుపెడుతున్నాడు.

దారి పక్కనే ఓ బక్కప్రాణి కుర్చీలో జారగిలబడి కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఎండీ డైరెక్టుగా అతని దగ్గరకెళ్ళి

“నీ జీతమెంత?” అని అడిగాడు.

ఉన్నట్టుండి అలాంటి ప్రశ్న ఎదురయ్యేసరికి ఆ యువకుడుకొంచెం తడబడి

“నెలకు 2000 దాకా సంపాదిస్తాను. ఎందుకు సర్?”

ఎండీ మరే సమాధానమివ్వకుండా జేబు లోంచి పర్సు తీసి 6000 రూపాయలు బయటకు తీసి అతనికిచ్చి,

“ఇక్కడ మేం జీతాలిచ్చేది శ్రద్ధగా పనిచేయడానికి, కుర్చీలో కూర్చుని పగటి కలలు కనడానిక్కాదు. ఇది నీ మూడు నెలల జీతం. ఇది తీసుకుని వెళ్ళిపో. మళ్ళెప్పుడూ నాకు కనిపించకు” అన్నాడు.

చుట్టూ చేరి ఆశ్చర్యంగా తిలకిస్తున్న ఇతర ఉద్యోగులను ఉద్దేశించి,

“చూశారుగా. అలా ఉంటే రేపు మీ గతి కూడా అంతే” అన్నాడు బాస్.

దానికి ఉద్యోగుల నుంచి  దిమ్మతిరిగే సమాధానం వచ్చింది.

“అతను పిజ్జా డెలివరీ బాయ్ సర్”

*నాకొచ్చిన ఈ మెయిల్ ఆధారంగా…credits to లలిత

గర్భాలయం … హంపి నేపథ్యం లో నవల

హంపి
హంపి

హంపి యాత్ర నుంచి తిరిగొచ్చిన తర్వాత అంతర్జాలంలో హంపి గురించి ఏమైనా విశేషాలు ఉన్నాయేమోనని వెతుకుతుంటే గర్భాలయం అనే నవల రాసిన నండూరి శ్రీనివాస్ గారి బ్లాగు కనిపించింది. ఇది ఆయన మొదటి నవల. అయినా ఎక్కడా ఆ చాయలే కనిపించలేదు నాకు. ఇంతకు ముందు టపాలో హంపిలో విరూపాక్షాలయంలో తప్ప ఇంకెక్కడా పూజలు జరగడం లేదని ఊహించాను. ఈ నవల చదివాక రూఢి చేసుకున్నాను. అదే కాదు మిగతా దేవాలయాల్లో విగ్రహాలు లేవన్న విషయం కూడా స్పష్టం అయింది.

ఈ నవల స్వాతి మాసపత్రిక లో ప్రచురితమైంది. ఆయన Scribd లో అప్‌లోడ్ చేసి అక్కడికి లింకిచ్చారు. నవల చదవడం ప్రారంభించగానే  “ఈ నవల అసలు ఒక్కసారి చదివి హంపి యాత్రకు వెళ్ళుంటే బాగుండేదే” అనిపించింది. హంపి లోని ప్రదేశాలు అంత క్లియర్ గా వివరిస్తాడు అందులో.

ఇక కథ విషయానికొస్తే రాజు అనే యువకుడు అనాథగా పెరిగి చిల్లర మల్లర దొంగతనాలు చేస్తూ పట్టుబడి ఒక ప్రొఫెసర్ సాయంతో బయటపడతాడు. ఆయన సాయంతోనే గైడ్ చేయడం నేర్చుకుని జీవనం గడుపుతుంటాడు రాజు. ఒక రోజు ఓ కుటుంబానికి  హంపిలో విశేషాలు వివరిస్తుండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు. ఆ పిల్లవాడి తాలూకు ఎవరు  వెతికినా కనిపించకపోవడంతో తన ప్రియురాలైన మల్లి సాయంతో తనే చూసుకుంటూ ఉంటాడు రాజు.

రాజు తాను గైడింగ్ కి వెళ్ళినప్పుడల్లా ఆ పిల్లవాణ్ణి వెంట తీసుకు వెళుతుంటాడు. వాడు ఏదైనా విశేషమైన ప్రదేశానికి తీసుకెళ్ళినప్పుడల్లా ఆశ్చర్యకరంగా ముద్దు ముద్దుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. రాజు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇలా ఉండగా ఆ పిల్లవాడి మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. రాజు ప్రాణాలకు తెగించి వాణ్ణి కాపాడుతాడు.

ఇక మిగిలిన కథ అసలు ఆ పిల్లవాడు అంత చిన్న వయసులోనే అంత పెద్ద మాటలు ఎలా మాట్లాడుతున్నాడు?  అతని తల్లిదండ్రులెవరు? అతన్ని చంపడానికి చూస్తున్నదెవరు? ఎందుకు చంపాలని చూస్తున్నారనే సస్పెన్స్ తో సాగిపోతుంది.

చారిత్రక ప్రదేశాల నేపథ్యం, సైకో అనాలిసిస్, సస్పెన్స్  అంటే ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన నవల ఇది. ఇక్కడ చదవండి.

హంపి యాత్ర

 ఏకశీలారథం
ఏకశిలారథం

గత శని, ఆదివారాల్లో మా సహోద్యోగులతో కలిసి పది మంది బృందం హంపి యాత్రకు వెళ్ళాము.హైదరాబాదు నుంచి ఒక వాహనం మాట్లాడుకున్నాం. మొత్తం ఏడు గంటల ప్రయాణం.

తుంగభద్ర నదికీ ఒక ఒడ్డున ఉన్న మోగ్లీ అతిథి గృహంలో మా బస. దర్శనీయ ప్రదేశాలన్నీ మరో ఒడ్డున. వీటిని చూడాలంటే పడవలో నది దాటి వెళ్ళాలి. తుంగభద్ర నదిలో నీరు ఎప్పుడూ ఉండటం వల్ల ఎక్కడ చూసినా వరి విస్తారంగా పండుతున్నది. మేమున్న అతిథి గృహానికి నదికి కేవలం కొన్ని పొలాలు మాత్రమే అడ్డు. ఉదయాన్నే లేచి చూస్తే మనోహర దృశ్యం కంటపడుతుంది.

తుంగభద్ర నది
తుంగభద్ర నది


ఎక్కడ చూసినా దేవాలయాలే, రాతి మంటపాలే.  మన పూర్వీకుల వైభవానికి చిహ్నంగా, మహమ్మదీయుల దాడులకు మౌన సాక్షిగా, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యానికి తార్కాణంగా లెక్కలేనన్ని రాతి నిర్మాణాలు. చాలా వరకు దేవాలయాల్లో దేవుళ్ళే లేరు. ఒక్క విరూపాక్ష దేవాలయం లో మాత్రం పూజలు జరుగుతున్నట్లు కనిపించాయి. హంపిలో ఉన్న మొత్తం దేవాలయాలను తనివితీరా చూడాలంటే కనీసం రెండు మూడురోజులు పడుతుంది.  మాకు అంత సమయం లేకపోవడం వల్ల, మా బృందం ఎండకు అలసిపోవడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు మాత్రం చూడగలిగాం. Royal enclosure, Lotus Mahal మాత్రం దూరం నుంచి చూడగలిగాను. ఏమైనా సరే మళ్ళీ ఒకసారి వెళ్ళి అన్ని ప్రదేశాలు చూస్తే గానీ  తృప్తి కలిగేలా లేవు.

హంపి చుట్టూ  రాతి గుట్టల మయమే. ఈ రాళ్ళనుంచే దేవాలయాలకు, మంటపాలకు వాడిన స్తంభాలను చెక్కి ఉండచ్చు కాబట్టి రాళ్ళను ఒకచోట నుంచి మరో చోటుకు మోసే శ్రమ కూడా తగ్గి ఉండచ్చు. అంతే కాకుండా ఆ కాలంలో ఒక వేళ శత్రువులు రావాలన్నా ఈ రాతి గుట్టలన్నింటినీ దాటి రాజ ప్రాకారం వరకు వచ్చేసరికి వాళ్ళ పనైపోయినట్లే. అందుకే దీన్ని రాజధాని నగరం ఎన్నుకున్నారేమో అనిపించింది.

విజయనగర సామ్రాజ్యం ఎంతటి సిరిసంపదలతో విలసిల్లిందో తెలుసుకోవాలంటే అన్ని దేవాలయాలు పెంచి పోషించాలంటే ఎంత ధనం అవసరమౌతుందో తలుచుకుంటేనే అర్థమౌతుంది.

నది ఒడ్డునే ఎన్నో సత్రాల లాంటి మంటపాలు బాటసారులకు సేదతీర్చేవిలా కనిపించాయి. కొన్ని దేవాలయాలు భూగృహంలో కూడా ఉన్నాయి. ఇవి బయటకు మామూలుగా కనిపిస్తాయి. దగ్గరగా వెళితే తప్ప అక్కడ ఓ ఆలయమున్నట్లు కనిపించదు.

ఎండాకాలం వల్లనో ఏమో ఎక్కడా ఎక్కువగా జనాలు లేరు. విరూపాక్ష దేవాలయం, ఏకశిలా రథం, రాణీ స్నాన మందిరం, కృష్ణ దేవాలయం లాంటి ప్రదేశాలన్నీ బాగా ప్రశాంతంగానే చూడగలిగాం. కానీ తాకితే సంగీతస్వరాలు పలికించే స్థంభాలు కలిగిన మంటపం లోకి మాత్రం యాత్రీకులకు ప్రవేశం నిషేధించారు.

ఎక్కడికెళ్ళినా తెలుగు మాట్లాడేవాళ్ళు ధారాళంగా కనిపించారు. పట్టణమంతా ఎక్కడ చూసినా విదేశీయులు కనిపించారు. వీళ్ళను బుట్టలో వేసుకోవడానికి ఆటో డ్రైవర్లు, వ్యాపారులు వాళ్ళ యాసను ను అనుకరిస్తూ మాట్లాడే ఇంగ్లీషు భలే సరదాగా అనిపించింది. డ్రగ్స్ వ్యాపారం కూడా జోరుగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

రెస్టారెంట్లలో భారతీయ వంటకాల కన్నా ఇటాలియన్, టిబెటన్, మెక్సికన్ లాంటి విదేశీ రుచులే ఎక్కువగా కనిపించాయి. ఆ వంటకాల పేర్లు ఎంత గుర్తు పెట్టుకున్నా ఇక్కడ రాద్దామంటే గుర్తుకు రావడం లేదు. :-). ఎలాగైతేనేం అలాగైనా వివిధ దేశాలకు చెందిన రుచులు చూశాం అన్న తృప్తి మాత్రం మిగిలింది.

సత్రం-జెన్ కథ

బాగా పేరొందిన ఒక ఆధ్యాత్మిక గురువు ఓ రాజు నివసించే భవనం దగ్గరకు వచ్చాడు. అందరూ ఆయన్ను ఎరిగి ఉండటం చేత ఎవరూ ఆయన్ను ఆపడానికి సాహసించలేదు.

రాజు సింహాసనం మీద కూర్చుని ఉంటే నేరుగా అక్కడికే వెళ్ళిపోయాడు. అందరూ అప్రతిభులై చూస్తూ ఉండిపోయారు.

రాజు ఆయన్ను ” ఏం కావాలి మీకు?” అని ప్రశ్నించాడు.

ఆ గురువు ఏ మాత్రం తొణక్కుండా “ఈ సత్రంలో నాకు కొద్ది సేపు నిద్రపోవాలని ఉంది” అన్నాడు.

“కానీ ఇది సత్రం కాదు. నా రాజభవనం” అన్నాడు రాజు.

“నీ కంటే ముందు ఈ భవంతి ఎవరిదో తెలుసా?” మళ్ళీ అడిగాడు

“మా నాన్న గారిది. కానీ ఆయన ఇదివరకే చనిపోయాడు”

“మరి అంతకంటే ముందు ఈ భవంతి ఎవరిది?”

“మా తాత గారిది. ఆయన కూడా చనిపోయాడు.”

“కాబట్టి ఈ స్థలం అప్పుడప్పుడూ వచ్చే పోయే వారి కోసం కట్టించిందే. అందుకనే దీన్ని సత్రం అన్నాను.” అన్నాడా గురువు.

ఇది ఆరని కాష్టమేనా

ఉదయం అమరులైన 74 మంది జవాన్లు గురించి ఎన్డీ టీవీలో ప్రత్యేక బులెటిన్ ప్రసారం చేస్తుంటే చూస్తున్నా.

ఒక్కో జవాను కుటుంబానిదీ ఒక్కో గాథ. హృదయ విదారకంగా ఉంది.

భర్త మరణ వార్త వినగానే స్పృహతప్పి పడిపోయి ఇప్పటికీ లేవని నిండు చూలాలు,

జనన మరణాల గురించి ఏమీ తెలియక అమాయక చూపులు చూస్తున్న కుమారుడిని హృదయానికి హత్తుకుని గుండెలవిసేలా రోదిస్తున్న మరో ఇల్లాలు.

ఇలా ఎంత మందో..

ఏళ్ళు గడుస్తున్నా నక్సల్ సమస్యకు సరైన పరిష్కారం కనుగొనలేని నిర్లక్ష్యపు పాలకులు,

ప్రజల కోసం, సమాజం కోసం పోరాడుతున్నామని భుజాలు చరుచుకుంటూ, సమాజానికి కీడు తలపెడుతున్న అవినీతి నాయకులను, అధికారులనూ, రౌడీలనూ, బంధిపోట్లనూ  వదిలేసి దేశరక్షణకు నియమింపబడ్డ జవానులను బలిగొంటున్న నక్సలైట్లు.

మధ్యలో ఈ అమాయకులే సమిధలు.

ఆధునికత పేరుతో పాటను ఖూనీ చేసే విధంబెట్టిదనిన…

ఈ మధ్య కాలంలో ఫాస్ట్ బీట్ పేరుతో పాటల్లో సాహిత్యాన్ని ఖూనీ చేస్తుంటే నాకు ఎలా ఉంటుందో చెప్పడమే ఈ టపా ఉద్దేశ్యం.

పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లా అనే విజయవంతమైన పాటను ఇలా రీమిక్స్ చేశారు…

పచ్చగడ్డి.. పచ్చా పచ్చా పచ్చా…. పచ్చగడ్డి… పచ్చా పచ్చా…. ఇలా అన్నమాట.

పదాలను  ఇష్టమొచ్చినట్లు విరిచేసి ఖండా ఖండాలుగా  నరికేసి  మోడర్న్ కాకులకూ, గద్దలకూ వేసేయడమేనా ఆధునికత అంటే…

ఇలా పాడుతున్నపుడు నా స్వేద రంధ్రాల్లో సూదులు గుచ్చినంత సంబరంగానూ, నర నరాల్లో నిప్పెంటినంత ఆనందంగానూ ఉంటుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను అధ్యక్షా…

సూపర్ హిట్ అని ఆకాశానికెత్తేయబడుతున్న బిల్లా సినిమా  పాటలో

యాడుందే తాలీ (బాబూ! నార్త్ ఇండియన్ తాలీ నా? సౌత్ ఇండియన్ తాలీ నా?)

ఐ వొణ వొణ (ఏందబ్బా ఈ రణ గొణ?)మేక్ యూ ఆలీ

గిమ్మీ మై తాలీ (మళ్ళీ అదే) మై లైఫీస్ కాలి కాలీ (కాలి కాలి బూడిదైపోయిందా తల్లే….)

ఈ టపా ఇక్కడి దాకా రాసేసి నిద్రకుపక్రమించాను.

రాత్రి కల్లో నేను బెత్తం తీసుకుని ఈ పాట పాడిన హేమచంద్రను, మాళవికనూ చెడా మడా వాయిస్తున్నాను తాళి, ఖాళీ అనే పదాలు సరిగ్గా పలికేదాకా… 🙂