జపాన్ లో బల్లి వింత

జపాన్ దేశంలో మిగతా దేశాలతో పోలిస్తే భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకని వాళ్ళు చాలామంది తేలికగా ఉంటుందని చెక్కతో ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారు. వీటిని నిర్మించడం తేలిక కాబట్టి అప్పుడప్పుడూ తమ ఇళ్ళను విప్పేసి మళ్ళీ పునర్నిర్మించుకుంటూ ఉంటారు.

అలా ఒకసారి ఒకాయన తమ ఇంటి చెక్కలను విడదీస్తూ ఉన్నాడు. అలా తీస్తూ ఉంటే ఆయనకు రెండు చెక్కల మధ్య ఇరుక్కుపోయిన ఒక బల్లి కనిపించింది. చనిపోయిందేమోననుకుని మామూలుగా ఒక క్షణం బాధపడి దానిని తీసి పక్కన పడేద్దామని సమీపంగా వెళ్ళాడు. ఆ బల్లి నెమ్మదిగా కదులుతోంది. మరి ఎక్కడికీ వెళ్ళకుండా అక్కడే ఉందేమిటీ అని మరింత దగ్గరగా వెళ్ళి పరిశీలించాడు. దాని కాల్లోంచి ఒక మేకు చెక్క గోడలోకి చొచ్చుకొని పోయి ఉంది. అందు వల్లే అది కదల్లేకుండా ఉంది.

దాని పరిస్థితి చూసి చాలా బాధేసింది ఆ యజమానికి.  దాంతో పాటు ఆయనకు ఆశ్చర్యం కూడా కలిగింది. నేను ఈ ఇల్లు నిర్మించి దాదాపు రెండు సంవత్సరాలవుతుంది. ఇంత కాలం అది ఎక్కడకీ కదల్లేదు. అంటే దానికి ఆహారం ఎలా? ఇన్ని రోజులు ఎలా బతికి ఉందీ? పలు ప్రశ్నలు అతని మెదడును తొలిచి వేస్తున్నాయి. అతనికి ఇంకేపనీ చేయబుద్ధీ కాలేదు. దాన్నే చూస్తూ కూర్చున్నాడు.

కొద్ది సేపటి తర్వాత మరో బల్లి అక్కడికి సమీపిస్తుండటం చూశాడు. ఏం జరగబోతుందా అని అతనిలో ఉత్సుకత ఎక్కువైంది . అది నెమ్మదిగా వచ్చి తన నోట్లోని ఆహారాన్ని చిక్కుకుని ఉన్న బల్లి నోట్లో జారవిడిచింది. తిరిగి మళ్ళీ ఎటో వెళ్ళి పోయింది. అంటే ఇన్ని రోజులు దానికి క్రమం తప్పకుండా ఆహారం అందిస్తున్నది అదే నన్న మాట.

అతని హృదయం ద్రవించింది. ఎంతటి అద్భుతమైన దృశ్యం. సొంత తల్లిదండ్రులనే వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న ఈ రోజుల్లో బల్లుల్లో ఇటువంటి అనుబంధం కనిపించడం ఆశ్చర్యమే కదూ!

ఇది జపాన్ లో నిజంగా జరిగిన కథ అని చెప్పబడితూ చాలా కాలం క్రిందట వార్త ఆదివారం అనుభంధం శీర్షికలో ప్రచురించారు.