నా చదువు సంగతులు – 7

ఒకసారి ప్రతిభ అనే సంస్థ రాష్ట్రవ్యాప్తంగా జనరల్ నాలెడ్జి పోటీలు నిర్వహిస్తుందని మా వెంకట్రామయ్య సార్ కి తెలిసింది. మండల స్థాయి పోటీల్లో పాల్గొనడం అందులో మొదటి మెట్టు. అందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారిని జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తారు. మా సార్ మళ్ళీ శ్రద్ధ తీసుకుని మా నలుగుర్నీ ఈ పోటీకి తయారు చేశారు. పరీక్ష శ్రీకాళహస్తిలో బాలుర ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ పరీక్షలో నాకు మొదటి స్థానం లభించింది. మరో గ్రామమైన కాపుగున్నేరి విద్యార్థులకి రెండు, మూడు  స్థానాలు లభించాయి. పరీక్ష రాసి నేను నేరుగా ఇంటికి వచ్చేసినా మా సార్ మాత్రం ఫలితాలు వెలువడే దాకా అక్కడే ఉన్నారు. అంతే కాదు, అక్కడ కూడా రాజకీయాలు జరిగి నా మార్కుల్లో ఏదో అవకతవకలు జరిగితే పట్టుబట్టి నా పేపరు రీ ఎవాల్యుయేషన్ చేయించి నా ప్రతిభను నలుగురికి తెలిసేలా చేశారు. నా మీద ఎంత నమ్మకముంటే అలా చేశారో మరి. అక్కడ నాకు కొంత నగదు, ఒక డిక్షనరీ బహుమానంగా ఇస్తే దాన్ని సైలెంటుగా మా ఇంటికి తెచ్చి ఇవ్వకుండా మరుసటి రోజు బడిలో గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో ఉండే పెద్దల్నంతా పిలిచి సర్పంచి సిద్ధారెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పించాడు. అందరూ పెద్దలు పిల్లలందరినీ ఉద్దేశించి అందరూ ఈ అబ్బాయి లాగా చదివి ఊరి పేరు నిలబెట్టాలి అంటుంటే ఆ రోజు మొదటిసారిగా మా ఇంట్లో వాళ్ళ కళ్ళలో ఆనందబాష్పాలు చూశాను. ఫలానా ఆయన మనవడు అని మా తాత పేరు నిలబెట్టినందుకు నాకు మొదటి సారిగా గర్వంగా అనిపించింది.

జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాలంటే అందుకు కావలసిన పుస్తకాలు అన్నీ లిస్టు రాసిచ్చాడు. మా నాన్నకు చెబితే అర్థం చేసుకోడని మాతాతకు చెప్పి ఆ పుస్తకాలన్నీ తెప్పించి పరీక్షకు సిద్ధం చేశాడు. ఈ పరీక్ష కడపలో జరిగింది. అప్పటి దాకా నేనుగానీ, మా ఇంట్లో వాళ్ళు గానీ ఎక్కడా పెద్దగా బయటకు వెళ్ళలేదు. అందుకని ఆయనే  స్వయంగా నన్ను కడపకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాడు. కడపలో ఉదయం పది గంటలకు పరీక్ష. శ్రీకాళహస్తి నుంచి నేరుగా వెళితే కలుసుకోలేమని, ముందు రోజు రాత్రి తిరుపతిలో సార్ కి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండి మరుసటి రోజు ఉదయమే కడపకు ప్రయాణమయ్యాం. తెల్లవారు జామునే అయినా బస్సులో విపరీతమైన రద్దీ. అందరూ కూర్చోవడానికి ఖాళీ లేదు. మూడు గంటల సేపు ప్రయాణంలో సార్ ఒళ్ళోనే కూర్చుని ప్రయాణించాను. సొంత బిడ్డలా చూసుకున్నాడు. ఆ పరీక్షలో నేను సెలెక్టు కాలేదు కానీ నా మీద ఆయన చూపించిన అభిమానం మాత్రం జన్మలో మరిచిపోలేను.

ప్రకటనలు

2 thoughts on “నా చదువు సంగతులు – 7

  1. మాలికలోంచి అనుకోకుండా మీ blog లోకి వచ్చా. మీ చదువు సంగతులు 7 భాగం చూసా. అంతే మిగిలిన భాగాలన్నీ చదివేసా. మీ శైలి బావుంది. మీ బాల్యం, మీ గురువులు నా చిన్నతనాన్ని గుర్తుకుతెచ్చాయి. మీరిలాగే మీ కృషిని కొనసాగించండి. శుభం భూయాత్.

వ్యాఖ్యలను మూసివేసారు.