చెవుడు

ఒక ఊళ్ళో ఓ భార్యా భర్త ఉన్నారు. ఒకసారి భర్తకి తన భార్యకి చెవుడు వచ్చిందేమో అని అనుమానం వచ్చింది. అది ఆమెతో నేరుగా మాట్లాడటం ఇష్టం లేక సలహా కోసం ఓ వైద్యుడి దగ్గరికెళ్ళాడు.

“దానికో చిన్న పరీక్ష ఉంది. దాన్ని ప్రయాగిస్తే మీ ఆవిడకు చెవుడు ఏ మాత్రం ఉందో తెలుస్తుంది” అన్నాడా డాక్టర్.

“నేను చెప్పినట్లు చేయండి. మొదట 40 అడుగుల దూరంలో నిల్చుని మీరు మామూలుగా మాట్లాడుతున్నట్లు మాట్లాడండి. వినిపిస్తుందేమో చూడండి. ఒకవేళ వినిపించకపోతే పది అడుగులు దగ్గరకు వెళ్ళి అదే విధంగా చేసి చూడండి. అలా ఆమెకు వినిపించేదాకా చేసి ఈ పరీక్ష ద్వారా మీరేం గమనించారో నాకొచ్చి చెబితే నేను దానికి తగ్గట్లు వైద్యం సిఫారసు చేస్తాను” అన్నాడు.

ఆ రోజు సాయంత్రం అతను ఇంటికెళ్ళేసరికి భార్య వంట చేస్తూ ఉంది. అతను వైద్యుడు చెప్పినట్లుగా ముందుగా 40 అడుగుల దూరంలో నిలబడి “ఏఁవోయ్ ఈ రోజు ఏం కూర చేశావ్?” అని అడిగాడు. ఏం సమాధానం వినిపించలేదు.

మళ్ళీ కొంచెం దగ్గరకొచ్చి అదే ప్రశ్న అడిగాడు. ఉఁహూ సమాధానం లేదు.

అలాగే వంటగదిలోకి వెళ్ళి “ఏఁవోయ్! ఇవాళ ఏం కూర చేశావ్?” అడిగాడు గట్టిగా మళ్ళీ. లాభం లేదు.

ఈ సారి సరాసరి ఆమె వెనకాలే వెళ్ళి నిల్చుని “ఏఁవోయ్ ఇవాళ ఏం కూర చేశావని అడిగితే సమాధానం చెప్పవేఁ!!” అన్నాడు విసుగ్గా…

ఆమె కోపంగా “మీకిది ఐదోసారి చెప్పడం, చికెన్ చేశాననీ!!!” అనింది.


🙂  కొత్త సంవత్సరంలో ఇలా నవ్వుతూనే ఉండండి… 🙂

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

రవిచంద్ర

అంధుడు

“ఒక అంధుడైన అబ్బాయి గుడి మెట్ల మీద కూర్చుని ఉన్నాడు. అతని ముందు ఓ గుడ్డ పరిచి ఉంది. అతని పక్కనే ఉన్న పలకపై ఈ విధంగా రాసి ఉంది.
 
“నేను గుడ్డివాణ్ణి. దయచేసి నాకు ధర్మం చేయండి”. ఆ గుడ్డ మీద కేవలం కొన్ని నాణేలు మాత్రమే ఉన్నాయి.
 
అటుగా వెళ్తున్న ఒకాయన ఇది గమనించాడు. తన జేబులోంచి రెండు రూపాయలు తీసి ఆ గుడ్డ మీద వేశాడు. అంతటితో ఆగకుండా నెమ్మదిగా ఆ బోర్డు దగ్గరికెళ్ళి దాన్ని తిప్పి ఏదో రాసి అందరూ చూసేటట్లుగా అలా వేళ్ళాడదీసి వెళ్ళిపోయాడు. 
 
తొందర్లోనే ఆ గుడ్డమీద చిల్లర రాలడం మొదలు పెట్టింది. అలా సాయంత్రమైంది. 


ఆ బోర్డు రాసిపోయిన వ్యక్తి మళ్ళీ అక్కడికి వచ్చాడు.

అతని అడుగుల సవ్వడిని బట్టి ఆ అబ్బాయి అతన్ని గుర్తు పట్టాడు. అతనికి నమస్కారం చేసి
 
“ఉదయాన్నే నా పలక మీద ఏదో రాసింది మీరే కదూ. ఏం రాశారు?”
 
“నేనేమీ కొత్తగా రాయలేదు, ఉన్నదే రాశాను. కానీ కొంచెం వైవిధ్యంగా రాశానంతే” అన్నాడు.
 
అతనేం రాశాడంటే
  

“ఈ ప్రపంచం చాలా అందమైంది. కానీ నేను దాన్ని చూడలేను”.
 
నిజానికి రెండు వాక్యాలూ ఆ అబ్బాయి అంథుడనే తెలియజేస్తాయి. కానీ రెండో వాక్యం మాత్రం అదనంగా కొన్ని విషయాలు తెలియజేస్తుంది. అదేంటంటే చూపున్నందుకు మీరు అదృష్టవంతులు అని. అందుకే ఆ అబ్బాయికి ఎక్కువ డబ్బులు రాలాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా!

బండి సవారీ

అవి నేను మూడో తరగతి చదువుతున్న రోజులు. దసరా సెలవులిచ్చారు. అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలంటే బలే కుశాల నాకు.

సరిగ్గ అప్పుడే వానాకాలం. వానాకాలమొస్తే మా ఊరికి బస్సులుండవు. ఎందుకంటే మా ఊరికీ కాళహస్తికీ మధ్య ఓ చిన్న ఏరు అడ్డం. వానలకి అది రోడ్డు మీదకి పొంగి పొర్లుతుంది. బస్సులు సెలవు తీసుకుంటాయి. వానలు తగ్గినా దానిమీద కట్టుండే చిన్న వంతెన (సప్పెట అంటారు) కొట్టుకు పోతుంది. దాన్ని తిరిగి బాగు చేసేదాకా మాకు బస్సులుండవు.

మరి అమ్మమ్మోళ్ళ ఊరికి పోవాలంటే కాలినడకే గతి. చెట్లెంబట, పుట్లెంబట అడ్డం దొక్కోని పోవడమే. కొద్ది దూరం రోడ్డు మీద వెళితే బండి బాట మాత్రం ఉండేది.

అదృష్టవశాత్తూ అప్పుడే మా చిన్నాన్న, మా మామతో కలిసి  మా అమ్మమ్మ వాళ్ళకి తుమ్మ కట్టెలు (వంటకి వాడేందుకు) ఎడ్ల బండి మీద వేసుకుని వెళుతున్నాడు.

మా అమ్మేమో బండి మీద ప్రయాణం వద్దనింది. నేను మాత్రం వెళ్లాల్సిందేనంటూ మారాం చేశాను. అమ్మ ఒప్పుకోక తప్పింది కాదు.

ప్రయాణం మొదలైంది. బండి నిండా ఎత్తుగా కట్టెలు పేర్చారు. కట్టెల పైన  ఓ తుండుగుడ్డ పరిచి నన్నక్కడ కూర్చోబెట్టారు.

మా చిన్నాన్న బండి నొగ  మీద కూర్చుంటే మా మామ బండి వెనకాలే నడుస్తూ వస్తున్నాడు. ఉదయపు నీరెండలో నెమ్మదిగా సాగుతోంది మా ప్రయాణం. కట్టెల బరువుకు మెత్తటి బండి బాటలో నింపాదిగా అడుగులు వేస్తూ కదులుతున్నాయి ఎద్దులు.

కొద్ది దూరం వెళ్ళగానే బండి తారు రోడ్డు మీదకు ఎక్కింది. లాగడం సులభం కావడంతో ఎద్దులు నెమ్మదిగా వేగం పుంజుకున్నాయి.

మరి కొంచెం దూరం వెళ్ళగానే తారు రోడ్డు దిగి మళ్ళీ బండి బాటలోకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పటి దాకా సులభంగా లాక్కొచ్చేస్తున్న ఎద్దులు మళ్ళీ గతుకుల బండి బాటలోకి దిగాలనేసరికి మొరాయించడం మొదలు పెట్టాయి.

“ప ప్పా… డిర్ర్ ” గట్టిగా అదిలించాడు మా చిన్నాన్న. ఉహూ కదల్లేదు. ముల్లుగర్ర తో పొడిచాడు. కొంచెం చలనం వచ్చింది. ఎలపటి ఎద్దుని మా చిన్నాన్న, దాపటి ఎద్దుని మా మామ తోక పట్టి గట్టిగా మెలేశారు.

ఉన్నట్టుండి అకస్మాత్తుగా పక్కకు తిరిగాయి ఎద్దులు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే బండి నెమ్మదిగా వాలి తిరగబడింది! ఎద్దులు పక్కకు తప్పుకున్నాయి.

ముందు నేను, నా పైన కట్టెల మోపులు, దాని పైన బండి! మా చిన్నాన్న కి, మామ కి ఏం చేయాలో పాలుపోలేదు.

ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి నా తల భాగం, భుజాలు బయటికి కనిపిస్తూ ఉన్నాయి. చెరో చెయ్యి పట్టుకుని నెమ్మదిగా బయటికి లాగారు.

చిన్నతనంలో సహజంగా కనిపించే భయం నా మొహంలో ఏ మాత్రం  కనిపించలేదు. అంతకంటే విచిత్రమైన విషయం నా ఒంటిమీద ఎక్కడా ఒక్క గాయం కానీ, రక్తం కానీ కనిపించలేదు. శరీరం లో ఏ భాగంలో కూడా చిన్న నొప్పి కూడా తెలియలేదు.

“హమ్మయ్య ఏ దేవుడో మనందుణ్యాడు బో…” వాళ్ళిద్దరూ సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంక నన్ను పక్కన కూర్చోమని ఒక అర్ధ గంటలో వాళ్ళిద్దరూ కొన్ని మోపులు దీసి పక్కనేసి బండి పై కెత్తి మళ్ళీ నింపేసినారు.

ఆ సంఘటన వల్ల షాక్ తోననుకుంటా మిగతా ప్రయాణమంతా మేం పెద్దగా మాట్లాడుకోనేలేదు. పైకి కనిపించలేదు గానీ వాళ్ళిద్దరూ లోలోన చాలా భయపడిపోయారు. ఎందుకంటే మా అమ్మనాన్నలకి నేను లేక లేక కలిగిన కొడుకుని. ఏమన్నా అయ్యుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అని తెగ ఆలోచనలో పడిపోయామని నాకు తరువాత చెప్పారు. ఈ సంఘటన చాలా రోజుల వరకు మా ముగ్గురి మధ్యనే ఉండిపోయింది.

తర్వాత ఒక రోజు నేనే అందరికీ చెప్పేశాను. ఆశ్చర్యపోవడం వారి వంతైంది.

మా అమ్మ, అమ్మమ్మ మాత్రం “మనం నమ్ముకున్న దైవం మనల్ని సదా కాపాడుతూ ఉంటుంది నాయనా, కాబట్టి ఎప్పుడు నీకు కష్టకాలం వచ్చినా భగవంతుణ్ణి తలుచుకో. నీకు ప్రశాంతత చేకూరుతుంది” అనే జీవిత సత్యాన్ని తెలియజేశారు.

తెలుగు భాషా ప్రేమికులకు ఆహ్వానం

మీరు కంప్యూటర్లో తెలుగు చూడగలరా?

కంప్యూటర్ లో తెలుగు లో టైప్ చెయ్యగలరా?

మీ ఆన్‌లైన్ కార్యక్రమాలైన ఈ మెయిల్, చాటింగ్, సోషియల్ నెట్‌వర్క్స్, బ్లాగుల్లో తెలుగు వాడకం బాగా తెలుసా?

మొదటి సారి కంప్యూటర్లో తెలుగును చూసినప్పుడు మీరు ఎలాంటి ఆనందం అనుభవించారో అదే అనుభూతిని మరింత మందికి పంచండి!

ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా లో భారీ పుస్తక ప్రదర్శన జరగనుంది. గత రెండేళ్ళుగా ఈ-తెలుగు సంస్థ అక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసి అక్కడికి ఆసక్తితో వచ్చే సందర్శకులకు కరపత్రాలు, ప్రదర్శనల ద్వారా కంప్యూటర్లలో తెలుగు వాడకం గురించి, ఇంటర్నెట్ (అంతర్జాలం) లో లభ్యమౌతున్న తెలుగు వెబ్‌సైట్లు, తెలుగు భాషకు సంబంధించిన వివిధ ఉపకరణాల గురించి అవగాహన కలిగిస్తున్నది.

ఈ స్టాల్ లో సేవలు అందించేందుకు, సందర్శకులకు కంప్యూటర్లో తెలుగు గురించి పరిచయం చేయడానికి  స్వచ్చంద సేవకులకు ఆహ్వానం పలుకుతున్నాము. ఈ ప్రదర్శన జరిగే పది రోజుల్లో ఎప్పుడైనా, ఎంత సమయమైనా స్టాల్ దగ్గరికి వచ్చి మీ సేవలందించవచ్చు. మీరు చేయవలసిందల్లా అక్కడికి వచ్చిన వారికి ఒక కరపత్రాన్ని అందజేసి కంప్యూటర్లలో సులభంగా తెలుగు చూడవచ్చు, రాయవచ్చు అని తెలియజెప్పడం మాత్రమే!