ఎడతెగని సాంప్రదాయం

చైనా దేశపు నీతి కథ:

ఒక గ్రామంలో ఒక రైతు నివసించేవాడు. భార్యా పిల్లలతో పాటు వృద్ధ్యాప్యంలో ఉన్న తన తండ్రిని పోషించడానికి రెక్కలు ముక్కలు చేసుకునే వాడు. రోజంతా కష్టపడ్డా కనీసం వాళ్ళకి తిండి గడవడం కూడా కష్టమయ్యేది.

అతను ఒకరోజంతా పనికి వెళ్ళకుండా తన దగ్గరున్న చెక్కలతో ఒక బండిని తయారు చేశాడు. తర్వాత రోజు తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు.

“నాన్నా నేను రోజంతాకష్టపడ్డా పూట గడవడమే కష్టంగా ఉంది. నువ్వుండటం వల్ల ఏ ప్రయోజనం లేదు” అని చెప్పి ఆయన్ని ఆ బండి మీద ఎక్కించుకుని దగ్గర్లో ఉన్న చిన్న కొండపైకి తీసుకువెళ్ళాడు.

కొండ పైభాగం చేరుకున్నాక, ఆగి బండిని క్రింది వైపుగా మళ్ళించాడు. బండిని దొర్లించడానికి ఉద్యుక్తుడవుతుండగా అతని తండ్రి ఆపి అతనితో ఇలా అన్నాడు.

“ఆగు నాయనా! నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, ఎందుకు చేస్తున్నావో కూడా తెలుసు. కానీ దయచేసి నాదొక విన్నపం. ఈ బండిని నువ్వు కష్టపడి తయారు చేశావు. దీన్ని దాచిపెట్టు. నీ కుమారుడికి అవసరమవుతుంది” అన్నాడు.

ఆ మాటలు విన్న కుమారుడు సిగ్గుపడి తండ్రిని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు.

ఆదాయం బాగుంది…..

ఒకాయన తన మిత్రుడితో పందెం కాశాడు. ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చార్మినార్ దగ్గర అడుక్కుంటే రెండు వేల రూపాయలిస్తానని.

పందేనికి ఒప్పుకున్న మిత్రుడు ఒప్పందం ప్రకారం భిక్షగాడిలా వేషం వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు అడుక్కున్నాడు.

పందెం ఓడిపోయిన మిత్రుడు అలాగే రెండు వేల రూపాయలిచ్చేశాడు.

మరుసటి రోజు చార్మినార్ పక్కనే వెళుతుండగా అతనికి తన మిత్రుడు మళ్ళీ భిక్షగాడి రూపంలో అడుక్కుంటూ ఉండటం కనిపించింది.

నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళి ” ఒరే! నీ కిదేం పొయ్యే కాలం. నిన్నైతే నాతో పందెం వేసుకున్నావ్. ఈ రోజు కూడా ఎందుకు అడుక్కుంటున్నావ్?” అని అడిగాడు.

“ష్…గట్టిగా అరవకు. ఇన్‌కమ్ బాగుంది గురూ.. అందుకనే కంటిన్యూ అయిపోతున్నా…”

మూడు వరాలు

ఒకామె అడవిలో వెళుతూ ఉంది. నడుస్తుండగా దారి పక్కగా ఒక కప్ప ముళ్ళ కంపల్లో చిక్కుకుని కనిపించింది. దానికి దగ్గరగా వెళ్ళేసరికి అది మాట్లాడటం ప్రారంభించింది. “నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తే  నీకు మూడు వరాలిస్తాను” అన్నది.  ఆమె అలాగే విడిపించింది.
తర్వాత  “విడిపించినందుకు థాంక్స్. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను. ఈ మూడు కోరికలకు ఒక షరతు ఉంది”  అన్నది కప్ప.
“ఏంటో చెప్పు” అన్నదామె.
“నువ్వు ఏది కోరుకుంటే దానికి పది రెట్లు నీ భర్తకు దక్కుతుంది” అన్నది కప్ప.
“ఓకే నో ప్రాబ్లం”
“నా మొదటి కోరిక: ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తెను కావాలి నేను”
“బాగా ఆలోచించుకో. నీ భర్త నీ కంటే పది రెట్లు అందగాడవుతాడు మరి”
“అయినా పర్లేదు ప్రపంచం లోకెల్లా నేనే అందగత్తెను కాబట్టి అతనికి నా మీద నుండి దృష్టి ఎక్కడికీ పోదు”. అంతే ఆమె అత్యంత సౌందర్యవతిగా మారిపోయింది.
“నా రెండో కోరిక: ప్రపంచంలో అత్యంత ధనవంతురాల్ని అవ్వాలి”
“మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నీ భర్త నీ కంటే పదిరెట్లు ధనవంతుడవుతాడు.”
“పర్లేదు నా దగ్గరుంటే ఆయ దగ్గర ఉన్నట్లు. ఆయన దగ్గరుంటే నా దగ్గర ఉన్నట్లే కదా”.
“తథాస్తు”
ఆమె అత్యంత ధనవంతురాలైంది.
” నా మూడో కోరిక: నాకు కొంచెం గుండె నొప్పి రావాలి” 🙂 🙂

ఖరీదైన వైద్యుడు

ఒకతనికి ఒంట్లో నలతగా ఉండటంతో స్నేహితుణ్ణి ఎవరైనా మంచి డాక్టర్ గురించి చెప్పమన్నాడు.

అతను ఒక డాక్టర్ పేరు చెప్పి, ” కానీ అతను చాలా ఖరీదైన వైద్యుడు. మొదటి సారి వెళ్ళే వారికి 500 రూపాయలు, తరువాత నుంచి ప్రతి సారీ 100 రూపాయలు తీసుకుంటాడు” అన్నాడు.

మనవాడు ఫీజు తగ్గుతుందని డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే ” నేను ఇది వరకే వచ్చానండీ కానీ నయం కాలేదు…”

డాక్టర్: “ముందు రాసిన మందులే ఇంకొద్ది రోజులపాటు కొనసాగించండి….అలాగే నా ఫీజు వంద రూపాయలు కౌంటర్ లో కట్టి వెళ్ళండి.” 🙂 🙂