వేడాం కాళికా మాత లీల

2013-08-11 10.07.44ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన జరిగి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. శ్రీకాళహస్తికి దగ్గరలో వేడాం అనే ఊర్లో దక్షిణ కాళికా మాత ఆలయం ఉంది. ఊరికి వెళ్ళినప్పుడల్లా అప్పుడప్పుడూ ఈ ఆలయాన్ని సందర్శించి రావడం నా అలవాటు. శ్రీకాళహస్తి ఆలయానికి దక్షిణ దిశగా వెళితే ముందుగా నందనవనం (లోబావి, భరద్వాజ తీర్థం అని కూడా అంటారు), ఆ తరువాత శుకబ్రహ్మాశ్రమం, వేడాం, రామాపురం అనే ఊర్ల మీదుగా పాపానాయుడు పేట చేరుకోవచ్చు. ఈ దారి అంటే నాకు చాలా ఇష్టం. ప్రశాంతమైన వాతావరణం. రోడ్డుకు ఎడం వైపు కైలాసగిరి కొండలు, కుడి వైపున సువర్ణ ముఖి, రోడ్డుకిరువైపులా చెట్లు, పచ్చటి పొలాలు, పెద్దగా వాహన సంచారం లేని రోడ్డు. నాకు చాలా హాయినిచ్చే ప్రయాణం. వేడాం దాటుకుని వెళితే వచ్చేది వేయి లింగాల కోన. ఒక కొండ ఎక్కి దిగి, మళ్ళీ ఇంకో కొండ ఎక్కితే అక్కడ వేయిలింగేశ్వరుడు కొలువుంటాడు. దగ్గర్లోని ఓ చిన్న జలపాతం కూడా ఉంటుంది. ఇక్కడికి కూడా అప్పుడప్పుడూ వెళ్ళి రావడం మామూలే.

అలవాటు ప్రకారం ఓ సారి కాళికా దేవి దర్శనం కోసం వెళ్ళాం. దర్శనం చేసుకుని వస్తుంటే ఆలయ ప్రాంగణం లోపల ఓ బోర్డు కనిపించింది. వేడాం గ్రామస్తులంతా కలిసి ఆలయ నిర్వహణకు, అభివృద్ధి కోసం ఓ ట్రస్టుగా ఏర్పడ్డారని, విరాళాలు సమర్పించాలనుకునే భక్తుల కోసం బ్యాంకు అకౌంటు వివరాలు ఇవ్వబడ్డాయి. బెంగళూరుకు వచ్చాక మనకు తోచిన విరాళం ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేద్దామని నా ఫోనులో అకౌంటు నంబరు నోట్ చేసుకున్నా. ఇంటికి రాగానే దాని సంగతే మరిచిపోయాను. ఇంక బెంగళూరుకు రాగానే అస్సలు ఆ అకౌంటు నంబరు తీసుకున్నానన్న సంగతే మరిచిపోయాను.

నెలాఖరు వచ్చింది. నెలలో 25 వ తేదీకే జీతం ఇచ్చెయ్యడం అప్పటి మా కంపెనీ (McAfee) పాలసీ. ఇంటికి డబ్బులు పంపించాలి. నా HSBC బ్యాంకు ఖాతా నుంచి పేయీ యాడ్ చేసుకుని ట్రాన్స్ ఫర్ చేసే సౌకర్యం గురించి నాకంతగా తెలీదు. పంపించాల్సి వచ్చినప్పుడల్లా మొబైల్ నంబరులో మా నాన్న అకౌంటు నంబరు చూసుకుని ఎంటర్ చేయడం, పంపించేయడం. ఈ సారి కూడా డబ్బు పంపించి, అలవాటు ప్రకారం మరుసటి రోజు మా నాన్నకి ఫోన్ చేశాను డబ్బులు తీసుకున్నారా లేదా అని. డబ్బులు ఇంకా రాలేదే అన్నాడు మా నాన్న. నాకు చిన్నగా అనుమానం కలిగింది. మామూలుగా అయితే ఒక రోజుకు మించి సమయం తీసుకోదే అనుకుంటూ నా ఆన్ లైను అకౌంటులోకి లాగిన్ అయి చూశా. అనుమానం లేదు. ట్రాన్స్ ఫర్ అయింది. నా ఖాతాలోనుంచి అమౌంటు కూడా తగ్గింది. కాల్ సెంటర్ కు ఫోన్ చేశా. అవతలి ఖాతాను బదిలీ అయిపోయినట్లు చెప్పారు. అంటే నేను డబ్బులు ఎవరికి పంపించినట్లు?

మళ్ళీ ఆన్ లైను అకౌంటులో స్టేట్మెంట్ చూశా. గత నెలలో ట్రాన్స్ ఫర్ చేసిన అకౌంటు నంబరు, ఈ నెలలో ట్రాన్స్ ఫర్ చేసిన అకౌంటు నంబరుతో పోల్చి చూశా. అనుమానం నిజమైంది. ఇది ఖచ్చితంగా వేరే అకౌంటు నంబరే. మరి ఈ అకౌంటు నంబరు ఎవరిది? ఎంత ఆలోచించినా సమాధానం తట్టలేదు. ఆ నంబరు ఫోన్ లోనుంచే కదా కాపీ చేశాను. ఫోను లో చూశా. ఎప్పుడూ అమౌంట్ పంపించే మా నాన్న నంబరు పక్కనే స్టోర్ అయింది నంబరు. మిగతా వివరాలేమీ లేవు. మరి ఈ నంబరు నా ఫోన్ లోకి ఎలా వచ్చింది? చాలా సేపు బుర్ర పనిచేయలేదు. ఒకవేళ ప్రతిసంవత్సరం ఎల్ ఐ సీ పాలసీ ప్రీమియం పంపించే ఏజెంటుది కానీ కాదు కదా? అది కూడా కాదు. మరి ఈ అకౌంటు నంబరు ఎవరిది? అకౌంటు నంబరిస్తే పేరు చెప్పగల ఆన్ లైను సర్వీసులున్నాయేమోనని చూశా. కేవలం బ్రాంచి వివరాలు మాత్రం దొరికాయి. మా నాన్న ఖాతా ఉన్నది. ఈ ఖాతా ఉన్నది ఒకటే బ్రాంచి. అది శ్రీకాళహస్తి ఎస్బీఐ మెయిన్ బ్రాంచీలోనే. ఆ అకౌంటు నంబరు చెప్పి ఖాతాదారు ఎవరో తెలుసుకోమని మా నాన్నకు చెప్పా. మరుసటి రోజు మా నాన్న వివరాలు కనుక్కోవడానికి ముందే మనసు కాస్త ప్రశాంతం చేసుకుని నెమ్మదిగా ఆలోచించా అప్పుడు గుర్తుకు వచ్చింది అసలు సంగతి! మర్నాడు మా నాన్న వెళ్ళి కనుక్కుంటే అదే తేలింది.

అంటే నేను మరిచిపోయినా కాళికాదేవి నా దగ్గర విరాళం తీసుకుంది. కానీ ఇప్పుడు అంత మొత్తం ఇచ్చుకునే పరిస్థితిలో లేనమ్మా అనుకున్నా మనసులో. నీ దయవల్ల మేం చల్లగా ఉంటే ఎప్పుడైనా అంత సమర్పించుకుంటాంలే అంది మా శ్రీమతి. తరువాత మా పెద్దబావ, ట్రస్టు బోర్డు సభ్యులు తెలిసిన ఇంకో ఆయన వెళ్ళి వాళ్ళకి జరిగిన సంగతి వివరించారు. ట్రస్టు బోర్డు సభ్యులంతా చర్చించుకుని సహృదయంతో డబ్బు తిరిగి ఇచ్చారు. అందులో కొంత విరాళంగా ఇచ్చి మిగతా డబ్బులు ఇంటికి తీసుకువచ్చాడు మా బావ. మిగతా ఋణం కూడా తొందరగా తీర్చుకోవాలి. లేకపోతే లావైపోతాం 🙂

దేవుడి ముందు అంతా బిచ్చగాళ్ళే

రజనీకాంత్ ఎన్నో కష్టాలనెదుర్కొని పైకి వచ్చాడు. చిన్నప్పటి నుండి దైవభక్తి మెండు.
బోలెడంత పేరు ప్రఖ్యాతులు, ధనం వచ్చి పడినా ముందున్న స్వేచ్ఛ కోల్పోయాననే బాధ మాత్రం ఉండేది. తరచు ఆలయాలకు వెళ్ళడం ఆయనకు ఇష్టం.
కానీ జనాలు చూసి గుర్తు పడితే మాత్రం ఇబ్బందే. అందుకని అప్పుడప్పుడు మారు వేషంలో గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొస్తుండేవాడు.
అలా ఒకసారి ముతక పంచ, చొక్కా వేసుకుని ఒక దేవాలయానికి వెళ్ళాడు. కొంచెం దూరంలో కారు ఆపి ఒక కాలు కుంటుతూ నడుస్తూ గుడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాడు. కానీ తిరిగి కారు దగ్గరకు వస్తుంటే మాత్రం ఒక గుజరాతీ మహిళ ఆయన అవతారం చూసి బిచ్చగాడనుకొని ఒక పది రూపాయలు ఇవ్వజూపింది. రజనీ మారు మాట్లాడకుండా అది తీసుకుని నెమ్మదిగా కారు దగ్గరకు వెళ్ళి ఎక్కబోతుండగా ఆ మహిళ వచ్చి మళ్ళీ పరీక్షగా చూసి ఆయన కళ్ళలో కాంతిని గమనించి


“క్షమించండి. మిమ్మల్ని బిచ్చగాడనుకొని పదిరూపాయలిచ్చాను. దయచేసి ఏమీ అనుకోకుండా అదిలా ఇచ్చెయ్యండి” అన్నదట.


అందుకు రజనీకాంత్

“నేను ఎంత ఎదిగినా భగవంతుడి ముందు బిచ్చగాడినేనని గుర్తు చేస్తూ నాకీ పది రూపాయలు ఇచ్చాడు. నువ్వు కేవలం నిమిత్త మాత్రురాలివే. కాబట్టి ఇది నాదగ్గరే ఉంచుకుంటా”నని చెప్పి వెళ్ళిపోయాడట.

ఇది రజనీకాంత్ గురించి ఆయన స్నేహితుడు బహద్దూర్ ఆయన జీవితచరిత్రలో ఉటంకించిన సంఘటన!

పావ్‌హరి బాబా జీవితంలో ఒక సంఘటన

పావ్‌హరి బాబా జీవితంలో చాలా భాగం తన ఇంటి లోపలే ఒక భూగృహాన్ని నిర్మించుకుని అందులో నివాసముండేవాడు. ఒకసారి అక్కడికొచ్చిన సందర్శకుడు ఆయన్ను ఒక ప్రశ్న వేశాడు.

“స్వామీ మీరు బయటికి వచ్చి మీ శిష్యుల్ని తయారు చేసి అందరికీ సహాయపడవచ్చుగా?”

అందుకాయన తనదైన శైలిలో నవ్వుతూ ఈ కథ వినిపించాడు.

ఒకానొక ఊర్లో ఒక వ్యక్తి ఏదో నేరం చేశాడు. దానికి శిక్షగా ఆ గ్రామ పెద్దలు అతని ముక్కు కోసేయాలని శిక్ష విధించారు. ముక్కులేని తన అందవిహీనమైన ముఖాన్ని ఇతరులకు చూపించలేక ఆ వ్యక్తి దూరంగా అడవుల్లోకి పారిపోయి వచ్చాడు. ఆ విధంగా పారిపోయి వచ్చిన అతను పులి చర్మం భూమ్మీద పరుచుకుని ఎవరైనా అటుగా వస్తున్నట్లు గమనిస్తే తపస్సు చేస్తున్నట్లు నటించసాగాడు. ఈ విధంగా చేస్తుండటం వలన జనాలు అతనికి దూరంగా ఉండకుండా ఈ సాధువెవరో ప్రత్యేకంగా ఉన్నాడనుకొని ఆయన దగ్గరకు రావడం మొదలుపెట్టారు. ఇక ఈ అడవిలో జీవితం ప్రశాంతంగా సాగిపోతుందనుకున్నాడు. అలా కొన్నేళ్ళు గడిచాయి. చివరికి అతని చుట్టూ చేరిన జనాలు ఆ మౌనసాధువు నోటి నుండి ఏదో కొంత సందేశం వినాలనుకొన్నారు. వాళ్ళలో ఒక యువకుడు తనకు సన్యాసం ఇవ్వాల్సిందిగా పట్టుబట్టాడు. చివరికి ఇది ఎంతదాకా వెళ్ళిందంటే ఆ సాధువు అలా చేయకపోతే మొదటికే మోసం వచ్చేట్లుంది. ఒకరోజు సన్యాసి తన మౌనాన్ని వీడి సన్యాసం కావాలనుకుంటున్న యువకుడిని మర్నాడు ఒక పదునైన కత్తిని తనతో తెచ్చుకోమన్నాడు. ఆ యువకుడు తన కోరిక ఇంత సులభంగా నెరవేరుతున్నందుకు ఆనందపడుతూ  వెళ్ళి మరుసటి ఉదయం పదునైన కత్తితో వచ్చాడు. ఆ సన్యాసి యువకుణ్ణి ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి ఏం జరుగుతుందో తెలిసేలోపు అతని దగ్గరున్న కత్తి తీసుకుని ఒక్క వేటుతో ముక్కును కోసేశాడు.
“శిష్యా నేను ఈ విధంగానే సన్యాసంలోకి ప్రవేశించాను. అందుకనే నీకు కూడా అలాగే సన్యాసం ప్రసాదించాను. అవకాశం వస్తే సన్యాసం కోసం నీ దగ్గరకు వచ్చినవాళ్ళకు కూడా ఇదే విధంగా అనుగ్రహిస్తావు కదూ?” అన్నాడు.
ఆ యువకుడు తనకు ఒనగూడిన సన్యాసం వెనుక రహస్యాన్ని ఎవరితో చెప్పుకోలేక తన గురువు గారి ఆజ్ఞ మేరకు అవకాశం ఉన్నంతమందిని సన్యాసులుగా మార్చివేశాడు. ఆ విధంగా ముక్కుల్లేని సన్యాసి పరంపర ఒకటి ప్రారంభమైంది.”

పావ్‌హరి బాబా ఆ కథ అక్కడితో ఆపి “నన్ను కూడా అలాంటిది ఒకటి ప్రారంభించమంటావా నాయనా?” అని అడిగాడు.
ఈ సమాధానం ఆయన సరదాగా చెప్పినా మరో విధంగా కూడా సమాధానమిచ్చాడు.
“భౌతికంగా చేసే సహాయమే సహాయమని నీవనుకుంటున్నావా? శరీరంతో సంబంధం లేకుండా ఒక మనస్సు మరో మనస్సుకి సహాయపడలేదునుకుంటున్నావా?” అని ఎదురు ప్రశ్న వేశాడు. ఆయనకు బాబా అంతరంగం అర్థమయ్యింది.

ఇంకా స్వామి వివేకానంద ఆయన గురించి చెప్పేదేమిటంటే

“ఇలాంటి వాళ్ళు తమ జీవితం ద్వారానే మనుకు బోలెడంత జ్ఞానాన్ని ఇస్తారు. మనిషిలోని అంతర్గత క్రమశిక్షణ ద్వారానే నిజాన్ని తెలుసుకోగలడని వారికి తమ మనసులో స్థిరంగా నాటుకుపోయి ఉంటుంది. అందుకే తమకు తెలిసిన విషయాలను ఇతరులకు బోధించాలనుకోరు. ఒక వేళ అలా బోధించినా అవి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికే అవి బోధపడతాయి.”

రూపాయీ రూపాయీ నువ్వేం చేస్తావు?

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి “ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?” అని అడిగారు.
అందుకాయన “అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది.”
వాళ్ళిద్దరూ భయంతో “అంటే అక్కడ పులి ఉందా?” అని అడిగారు.

“కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది.” అన్నాడాయన.
“ఇంతకీ ఏమిటది?” అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా.
“బంగారు నాణేల గుట్ట” అన్నాడు సన్యాసి.
వాళ్ళిద్దరూ సంతోషంగా ముక్తకంఠంతో “ఎక్కడ?” అని అడిగారు.
“అదిగో ఆ పొదల్లోనే” అని వేలు చూపించి చక్కా తన దారిన పోయాడా సన్యాసి.
వాళ్ళిద్దరూ ఆ వేపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి.
“ఈ సన్యాసులెంత మూర్ఖులు? నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?” అన్నాడొక మిత్రుడు.
“ఆయనంటే అన్నాడులే. ముందుగా ఇప్పుడేం చేద్దామో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం.” అన్నాడు మరో మిత్రుడు.
అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉండి రెండోవాణ్ణి ఊర్లోకి పంపించాడు.

ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు.
“ఛ. ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు.” అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.


ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడు ఇలా ఆలోచించాడు.
“వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు” అనుకున్నాడు.


అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు. అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు.
“పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను.” అనుకుని
ఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
“సన్యాసి మాటలు ఎంత నిజమో కదా” అనుకున్నాడు చివరి క్షణాల్లో.