మెకానిక్ తెలివి

ఒక గ్యారేజీలో పనిచేయడానికి  మెకానిక్ ల కోసం యజమాని మౌఖిక పరీక్ష నిర్వహించాలనుకున్నాడు.  దాదాపు వందమంది హాజరవగా వారిలోంచి ఇద్దరిని ఎంపిక చేశాడు. వారిద్దరూ అన్నింటిలోనూ సమ ఉజ్జీలుగా నిలవడంతో వారికి మరో పరీక్ష పెడదామని మరుసటి రోజు రమ్మన్నాడు.

వారిలో ఒక అభ్యర్థికి చిన్న దురుద్దేశం కలిగింది. ఆ యజమాని వ్యక్తిగత కార్యదర్శికి సొమ్ము ఎర వేసి ఆ పరీక్ష ఏమిటో తెలుసుకున్నాడు. అది ఏమిటంటే కారు ఇంజన్ లో ఏదో ఒక చోట చిన్న కనెక్షన్ ను తీసివేస్తారు. అది ఎక్కడ ఉందో వీళ్ళు కనిపెట్టాల్సి ఉంటుంది. మొదటి అభ్యర్థికి ఎక్కడ ఫాల్ట్ ఉందో ముందే తెలిసిపోయింది.

మరుసటి రోజు పరీక్షకు ఇద్దరు అభ్యర్థులూ హాజరయ్యారు. ముందుగా రెండవ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. అయితే అతను తనకున్న నైపుణ్యాన్నంతా ఉపయోగించినా ఇంజన్లో ఎక్కడ పొరపాటుందో తెలుసుకోలేకపోయాడు. అతనికి చిన్న అనుమానం కలిగింది. ఒకవేళ రెండవ అతనికి పొరపాటు ఎక్కడుందో తెలుసేమోనని. అంతే ఎవరికీ తెలియకుండా ఇంజన్లో మరో చోట ఇంకో కనెక్షన్ కట్ చేశాడు. తాను కనిపెట్టలేకపోయానని ఒప్పుకున్నాడు.

మొదటి అభ్యర్థికి అవకాశం వచ్చింది. పొరపాటు ఎక్కడుందో ముందే తెలిసి ఉండటంతో కొద్ది సేపు ఏదో రిపేర్ చేస్తున్నట్లు నటించి తనకు తెలిసిన చోట కనెక్షన్ సరిచేసి ఇంజన్ ను స్టార్ట్ చెయ్యమన్నాడు. కానీ అంతకు ముందే రెండవ అభ్యర్థి మరోచోట తీసేసిన కనెక్షన్ వల్ల ఇంజన్ స్టార్ట్ కాలేదు. అతను కూడా ఓటమిని ఒప్పుకోక తప్పలేదు.

వెంటనే రెండవ అభ్యర్థికి తనకు రెండో సారి అవకాశం ఇస్తే తనను తాను నిరూపించుకుంటానన్నాడు. అలాగే అవకాశం ఇచ్చారు. అంతే! తను ఇదివరకే తిసివేసిన కనెక్షన్ ను మళ్ళీ అమర్చి ఇంజన్ స్టార్ట్ చెయ్యమన్నాడు. ఇంజన్ స్టార్ట్ అయ్యింది. దాంతో అతనికే ఆ ఉద్యోగం అతనికే వచ్చింది.