లీడర్ విశేషాలు…

హ్యాపీడేస్ సినిమా తర్వాత లీడర్ సినిమా కోసం శేఖర్ కమ్ముల చాలా సమయం తీసుకున్నాడు. ఈ సమయమంతా ఈ సినిమా కోసమే వెచ్చించానని నిన్న జరిగిన లీడర్ ఆడియో ఫంక్షన్ లో తానే స్వయంగా వెల్లడించాడు. సినిమా రూపకల్పన సమయంలో జరిగిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనల వల్ల సినిమా నిర్మాణం ఆలస్యమైందంటూ చెప్పుకొచ్చాడు. బహుశ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని గూర్చి ప్రస్తావించి ఉండవచ్చు. ఎలక్షన్ల సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని నిజజీవితంలో జరిగిన సంఘటనలు కూడా ఈ సినిమాల్లో చోటు చేసుకోబోతున్నాయనని శేఖర్ మాటల ద్వారా గ్రహించవచ్చు. సినిమా టైటిల్ ని బట్టి కథ ఎవరైనా ఊహించదగ్గదే. ఒక లీడర్ ఎలా ఉంటే దేశం బాగుపడుతుందనే కొన్ని ఆలోచనల సమాహారమే ఈ చిత్ర కథ.

మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలు శేఖర్ అభిరుచికి తగ్గట్టుగానే ఉన్నాయి.  ముందు సినిమాలకు ఏ మాత్రం తీసివేయలేనివి. సినిమాలో పాటలన్నీ వేటూరి గారిచే రాయించారు. భావ గర్భితమైన వేటూరి సాహిత్యాన్ని అణచివేయకుండా అందంగా స్వరపరచిన మిక్కీ జె మేయర్ సంగీతం తెలుగు భాషాభిమానులకు శుభవార్త. అయితే ఈ సారి ఒక ఐటమ్ సాంగ్ అదనం. అయితే మామూలు ఐటమ్ సాంగ్ లా కాకుండా అందరూ వినదగేలా ఉంది. సినిమాలో ఈ పాటకు ప్రముఖ యాంకర్ ఉదయభాను నర్తించినట్లు సమాచారం.

హీరో రాణా కూడా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వేదిక మీదకు వచ్చి మాట్లాడాల్సిన నాలుగు మాటలను క్లుప్తంగా స్పష్టంగా మాట్లాడి  ముగించాడు. కార్యక్రమానికి హాజరైన అతిథులందరిలో(పెద్దలందరితో సహ) స్పష్టంగా మాట్లాడిన అతి కొద్ది మందిలో వారిలో రాణా ఒకడు. ఒక దశలో రామానాయుడు కూడా తడబడ్డాడు. వెంకటేష్ ఏ మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియలేదు. సురేష్ బాబు వచ్చి తనకు తెలుగే తెలియదన్నట్లుగా మొత్తం ఇంగ్లీషులోనే మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అతిథులు ఇంగ్లీషు మాట్లాడుతున్నంత సేపు ఫ్యాన్స్ “తెలుగు తెలుగు… ” అని అరుస్తుండటం క(వి)నిపించింది. సంతోషం. 🙂

వావ్… మాంచి కిక్కిచ్చే గేమ్ షో

ఈటీవీలో నిన్న ప్రారంభమైన ఈ గేమ్ షో కి వ్యాఖ్యాత, ప్రముఖ సినీనటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్. దాదాపు అన్ని ఎంటర్టైన్ మెంట్ చానళ్ళలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న రియాల్టీ షోల మధ్య ఈ షోను చూసిన తర్వాత మంచి సరదా కార్యక్రమం చూసిన అనుభూతి కలిగింది. వ్యాఖ్యాతల ఓవరాక్షన్లు, పాల్గొనేవారి ఏడుపులు పెడబొబ్బలు, లేకుండా ప్రశాంతంగా అనిపించింది. అయితే మొదటి ఎపిసోడ్ లో పాల్గొన్న వారు గాయని సునీత, యాంకర్లు ఝాన్సీ, అనితా చౌదరి, సుమ కాబట్టి కార్యక్రమాన్ని బాగా రక్తి కట్టించారు. సాధారణ పార్టిసిపెంట్లు వచ్చినపుడు ఎలా ఉంటుందో చూడాలి.

రియాల్టీ షో లా? బూతు పురాణాలా?

ఈ మద్యనే జీటీవీలో ప్రసారమవుతున్న ఆట జూనియర్స్ కార్యక్రమం చూడవలసి వచ్చింది. ఇద్దరు మెంటర్ల మద్య చెలరేగిన వాగ్యుద్ధం చివరికీ అందరికీ పాకింది.

ఒక మెంటర్ (తెలుగులో మార్గదర్శకులు అందాం). ” హలో మీరు xxx, xxx  మూసుకుంటే బాగుంటుంది.” అంది . ఒక్క క్షణం దిమ్మ తిరిగిపోయింది నాకు.  దాన్నుంచి తేరుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. (xxx, xxx సెన్సార్ కట్ అన్నమాట. నేనే కాదు టీవీలో కూడా కత్తెరేశారు సదరు మాటల్ని)

మళ్ళీ మాటీవీలో ప్రసారమవుతున్న చాలెంజ్ కార్యక్రమంలో ఒక న్యాయ నిర్ణేత పై మాటలు అన్న  ఆమె మీద ఇలా అరుస్తున్నాడు.

” నీ లాంటి వేస్ట్ ఫెలో ని నా లైఫ్ లో నేనింత వరకు చూడలేదు”. ఇలా ఏవేవో అవాకులూ చెవాకులూ, చూసేవాళ్ళకు చిరాకులూ.

ఎవరో కొంత మంది అనామకుల్ని పట్టుకుని వాళ్ళతోనే అన్ని కార్యక్రమాలు చేయించి ప్రేక్షకుల్ని  శిక్షిస్తున్న  ఆ హింసరాజు ను ఏమనాలో నాకు తోచలేదు. వాళ్ళ మ్యానరిజమ్స్, ఏడుపులు, పెడబొబ్బలు టీవీ కార్యక్రమాలంటేనే ఏహ్య భావం కలిగించేలా అనిపించాయి నాకు. టీ.ఆర్.పి రేటింగ్ ల కోసం ఒకటి తర్వాత ఒకటి టీ వీ చానల్స్ కూడా అతని కార్యక్రమాలను ఎగబడి  కొనుక్కుంటూ ఉండటం మరీ దారుణం.

ఓ దేవుడా! ఈ ఘీంకార్ బారి నుంచి మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు?

ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. అన్ని చానళ్ళలో వస్తున్న రియాల్టీ షోలలో ఇది పరిస్థితి నెలకొని ఉన్నది.

ఎ.ఆర్. రెహ్మాన్ కు బాలు ప్రశంస

కొన్నేళ్ళ క్రిందట జీ తెలుగు టివిలో ఎందరో మహానుభావులు అనే కార్యక్రమం వచ్చేది. తెలుగు సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా స్వరపరచబడిన ఆణిముత్యాల లాంటి పాటలను ఎన్నుకుని వాటి వెనుక నేపథ్యాన్ని వివరిస్తూ ఔత్సాహిక గాయకుల చేత వాటిని పాడించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం. ఎస్పీ బాలసుబ్రహ్మణం దీనికి వ్యాఖ్యాత.
ఒక సారి రజనీకాంత్ హీరోగా వచ్చిన ముత్తు సినిమాలో “థిల్లానా థిల్లానా…” అనే పాట వచ్చింది. దానికి సంగీతం ఎ.ఆర్.రెహ్మాన్.
ఆ పాట గురించి ఎస్పీ బాలు మాట్లాడుతూ “ఈ పాటలు విడుదలైన మొదట్లో విమర్శకులు ఈ పాటను గురించి ప్రత్యేకంగా విమర్శిస్తూ అసలు ఇదీ పాటేనా? గులక రాళ్ళు డబ్బాలో పోసి గిల కొట్టినట్లుంది అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్ళందరికీ నాది ఒకటే సమాధానం. నిజమే! ఆ పాట గులక రాళ్ళు డబ్బాలో పోసి కులికినట్లే ఉంది. కానీ గులకరాళ్ళు డబ్బాలో పోసి కూడా అందమైన పాట కూర్చడం ఒక్క ఎ.ఆర్.రెహ్మాన్ కే సాధ్యం” అన్నారు.