సత్సంగం గొప్పతనం

ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి “సత్సంగం యొక్క గొప్పతనం ఏమిట”ని అడిగాడు.

శ్రీకృష్ణుడు వెంటనే ఒక పురుగు ను చూపించి దాన్ని అడగమన్నాడు. నారదుడు అలాగే వెళ్ళి ఆ పురుగుని “సత్సంగం వల్ల ఫలం ఏమిట”ని అడిగాడు. అలా అడగ్గానే ఆ పురుగు నారదుల వైపు ఒక్కసారి చూసి టక్కున చచ్చిపోయింది.

నారదుడు మళ్ళీ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి “స్వామీ, ఆ పురుగు సమాధానం చెప్పేలోపే చనిపోయింది. ” అన్నాడు.

శ్రీకృష్ణుడు అప్పుడే పుట్టిన ఓ చిలుకను చూపించి దాన్ని అడగమన్నాడు. నారదుడు ఆ చిట్టి చిలుకను అదే ప్రశ్న అడిగాడు. అది కూడా నారదుడి వైపు తేరిపార చూసి వెంటనే ప్రాణాలు విడిచింది.

నారదుడికి బాధ కలిగింది. మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళాడు. “స్వామీ! మీరే సమాధానం చెప్పండి.” అని అడిగాడు.

ఆయన ఈసారి “అయితే ఈ సారి ఇప్పుడే పుట్టిన ఆ లేగ దూడను అడుగు” అన్నాడు.

నారదుడు ఈ సారి భయం భయంగా ఆ దూడ దగ్గరకు వెళ్ళి అదే ప్రశ్నను అడిగాడు. అది కూడా వెంటనే మరణించింది.

మూడు జీవాల మరణం నారదుణ్ణి బాగా కలచి వేసింది.

మళ్ళా శ్రీకృష్ణుని దగ్గరకెళ్ళి “హే కృష్ణా! ఏమిటయ్యా నాకీ పరీక్ష!!” అన్నాడు .

ఆయన ఈ సారి నారదుణ్ణి ఒక రాజభవనం లోకి వెళ్ళి అప్పుడే పుట్టిన రాజకుమారుణ్ణి అడగ మన్నాడు. ఈసారి రాజ కుమారుడు మరణించడని కూడా అభయమిచ్చాడు.

నారదుడు అలాగే రాజభవనం లోకి వెళ్ళి అప్పుడే పుట్టిన పసికందు రాజకుమారుణ్ణి అదే ప్రశ్న వేశాడు.

“ఓ నారద మునీంద్రా! సత్సంగ మహిమ మీకింకా అర్థం కాలేదా? మీరు నన్ను మొదట ప్రశ్నించినపుడు నేను ఓ పురుగుని. మీ దర్శన భాగ్యం చేత రెండో సారి చిలుకనై పుట్టాను. మీరు వచ్చి మళ్ళీ నన్ను అడిగారు. అప్పుడు నేను లేగదూడ జన్మనెత్తాను. మీరు మూడో సారి వచ్చి కూడా నన్ను అడగడం వల్ల పరమోత్కృష్టమైన మానవ జన్మ లభించింది.కేవలం సాధు పుంగవులైన మీ దర్శన భాగ్యంచేతనే నాకింతటి అదృష్టం ప్రాప్తించింది” అన్నాడు నవ్వుతూ.

జై శ్రీకృష్ణ!!

నిజమైన ధనవంతుడు

ఒకసారి రవీంద్రనాథ్ టాగూర్ జపాన్ కు వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకం పై ఓ పది రోజుల పాటు రోజూ సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు. ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు. ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు. రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు. ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూలమాలతో సత్కరించేవాడు. ఆయన ప్రవర్తన చాలా సాదాసీదా గా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం.


రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవభావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు. ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలా మంది వినేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపనీ మహర్షి దగ్గరికీ, శ్రీరామచంద్రుడు తమ కుల గురువైన వశిష్ఠముని దగ్గరికీ వెళ్ళారు.

ఆ ముసలాయన ప్రతి రోజూ రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు. ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తరువాత చాలామంది బంగారు నాణేలు, ధనం, పండ్లు, పూలు ఆయనకు సమర్పించారు. ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాద పూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు.

రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు. ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది.

టాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు. “ఈ పెద్దాయన చూస్తే ఉద్విగ్న మనస్కుడిలాగా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. అలాగే వారి పిల్లలకు కూడా 200 యెన్ లు ఇవ్వండి.”

ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్పావు అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో టాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు. అంతకు మునుపు టాగూర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు. ఆయన రవీంద్రుని ఆ కార్లో ఎక్కించుకుని ఓ కొండ లాంటి ప్రదేశం పై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్ళాడు. వెళ్ళగానే వాచ్‌మాన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు. లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రల్లో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు. ఆయన కుటుంబమంతా టాగూర్ కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు.

రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధుడితో “మీరు నన్ను ఎక్కడికి తీసుకు వచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకు వెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు?” అన్నాడు.

అప్పుడాయన “ఓ ఋషి వర్యా! ఇదే నా ఇల్లు. ఈ కార్లు, ఈ బంగళా అన్నీ నావే. నీ ముందు మోకరిల్లిన వారు అంతా నా భార్యా, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రు. నాకు రెండు కార్మాగారాలున్నాయి.”

“ఓ అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటపుడు అతి సాధారణంగా వచ్చేవారు. ఎందుకో తెలుసుకోవచ్చా?” అనడిగాడు రవీంద్రుడు.

“స్వామీ! భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందే ఎవరికీ తెలియదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు.”

“అమూల్యమైన ఆత్మాజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొనితెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్నిస్తున్నది. నా జీవితమంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఇప్పటి దాకా సిరిసంపదలే ధ్యేయంగా బతికాను. అవేవీ నాకు సంతోషాన్నివ్వలేదు. మీరు చెప్పిన ప్రతి మాటా నా అజ్ఞాన పొరలను తొలగించాయి.నేను మామూలు దుస్తులు వేసుకుని మీ దగ్గరకు రావడానికి కారణం, జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించడానికే. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.”

ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది, సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరిసంపదలకు విలువ లేదు.

రవీంద్రుల వారు సంతోషంగా “ఓ మిత్రమా! నీకు సిరిసంపదల కన్నా ఆత్మసాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ. నీవు నిజంగా ధనవంతుడవే. నీ లాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత చేకూరింది.”

“నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతిక మైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు తెలివైన వారు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్లున్నాడు.” అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు.

బెంగుళూరు జీవితం కొన్ని అనుభవాలు

బెంగుళూరుకు వచ్చి దాదాపు మూడు నెలలవుతోంది. నాకు ఎదురైన అనుభవాలతో ఓ టపా వేద్దామంటే ఇప్పటికి కుదిరింది. భాష చాలా వరకు సమస్య కాలేదు. అచ్చ కన్నడిగుడైనా తెలుగులో సహాయం అడీగితే తెలిసీ తెలియని తెలుగులో అయినా సమాధానం చెప్తారు. హైదరాబాదులో ఆటో డ్రైవర్లు కొంతమంది తెలుగు తెలిసినా హిందీ లోనే మాట్లాడేవారు కొన్ని చోట్ల. కానీ ఆటో చార్జీలు బాగా ఎక్కువ. షేరింగ్ ఆటోలు ఎక్కడా కనిపించవు. బెంగుళూరు కన్నడ దేశమే అయినా అందులో ప్రాంతీయులు కేవలం 24% మాత్రమేనట. మిగిలిన వారిలో 20% తమిళులు, 16% తెలుగు వాళ్ళు, 12% మలయాళీలు, 12% మిగతా భారతీయులు, 9% యూరోపియన్లు ఉన్నారట.

హైదరాబాదు నుంచి ఇక్కడికి రాగానే తేడా తెలిసింది అక్కడికన్నా కొంచెం ఇరుకైన రోడ్లు. కానీ ట్రాఫిక్ లో వాహన చోదకులకు కొంచెం క్రమశిక్షణ ఉందిక్కడ. కొద్దిసేపాగితే ఎంతో కొంత ముందుకు సాగుతుందని కొద్ది ఆశ ఉంటుంది. హైదరాబాదు లో అలా కాదు. ఒక్కోసారి ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే వాహనం దిగి నడిచి వెళ్ళిపోతే తొందరగా గమ్యస్థానం చేరుకోవచ్చు.

బస్సుల్లో రద్దీ అక్కడా ఇక్కడా దాదాపు ఒకటే కాకపోతే ఇక్కడ ఏసీ బస్సులు చాలా ఎక్కువ. బస్సుల ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువే. దగ్గర స్టాప్ లకైతే కండక్టర్లు చిల్లర తీసుకుని టిక్కెట్టివ్వకుండా నింపాదిగా వెళ్ళిపోతుంటారు. ఈ విషయంలో హైదరాబాదు కండక్టర్లు చాలా నిజాయితీపరులేమో. హైదరబాదులో నేనున్న మూడేళ్ళలో అలాంటి అనుభవం నాకెప్పుడూ ఎదురు కాలేదు.

ఇక పోతే ఈ మధ్యనే ఓ మెయిల్లో చదివాను. బెంగుళూరు లో మూడు విషయాలకు బాగా పేరు గాంచిందట. ఒకటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, రెండు అమ్మాయిలు, మూడు కుక్కలు. అలాంటిదే మా స్నేహితుడు కూడా మరో విషయం చెప్పాడు. ఇక్కడ ఓ రాయి పైకి విసిరితే అది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మీదన్నా పడుతుందంట లేదా ఒక కుక్క మీదన్నా పడుతుందంట!.

ఇంటి అద్దెలు హైదరాబాదు కన్నా కొంచెం ఎక్కువే. నాకు మా కొత్త ఆఫీసు సహోద్యోగుల సహాయంతో కాస్త తక్కువ అద్దెకే ఇల్లు దొరికింది. ఆఫీసుకు చాలా దగ్గర. ఎంత దగ్గరంటే రోజూ మధ్యాహ్నం ఇంటికెళ్ళి భోంచేసి వస్తుంటాను. బెంగుళూరు రాగానే ఎప్పుడూ మన దగ్గర ఉంచుకోవాల్సింది ఓ గొడుగు. వాన మనల్ని ఎప్పుడు పలకరిస్తుందో తెలియదు. వాన వస్తుందని బయటికి వెళ్ళడం వాయిదా వేసుకున్నారంటే అసలు బయటికి వెళ్ళలేం. మెట్రో పనుల వల్ల చాలా చోట్ల ట్రాఫిక్ మందకొడిగా సాగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల రోడ్లంతా బురదమయం.

ఇకపోతే ఈ ఆదివారం ఈనాడు పుస్తకంలో చదివాను. మన హైదరాబాదులో మెట్రో కేవలం నాలుగేళ్ళలోనే పూర్తి చేస్తామని ఎల్ అండ్ టీ వాళ్ళు అన్నారట. ఎంతవరకు సాధ్యమో నాకు తెలియదు. ఇక్కడ నాలుగేళ్ళ ముందే ప్రారంభించినా కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే సాధ్యమైందట. అదే జరిగితే బెంగుళూరుకన్నా హైదరాబాదు ప్రజా రవాణా వ్యవస్థ ఖచ్చితంగా మెరుగవుతుంది.

షాపింగ్ విషయానికొస్తే మన హైదరాబాదులోని కోఠీ, సుల్తాన్ బజార్, బేగంబజార్ ను పోలిన ప్రదేశం ఒకటుంది. అదే శివాజీ నగర్ కు దగ్గర్లో ఉన్న కమర్షియల్ స్ట్రీట్. గత శనివారం అక్కడికి వెళ్ళినప్పుడైతే అచ్చం హైదరాబాదులో తిరుగాడుతున్నట్లే అనిపించింది.