నేను గాల్లో ఎగురుతున్నాను

ఆకాశ వీధిలో
ఆకాశ వీధిలో


ఒక అబ్బాయి అనాథాశ్రమంలో పెరుగుతూ ఉండేవాడు.


ఆ అబ్బాయికి ఎప్పుడూ పక్షుల్లాగా గాల్లో ఎగరాలని ఆశ. అసలు తాను వాటిలాఎందుకు ఎగర లేకపోతున్నాడో అతనికి ఎంత ఆలోచించినా అంతుపట్టేది కాదు.

“నా కంటే పెద్దగా ఉన్న పక్షులు కూడా ఎగరడం చూశానే…అసలు నేను ఎందుకు ఎగరలేక పోతున్నాను? నాలో ఏదైనా లోపం ఉందా” అని అనుక్షణం మధనపడుతుండేవాడు.

అలాగే ఇంకో చోట పోలియో వ్యాధి బారిన పడ్డ మరో బాలుడుండేవాడు. అతనికెప్పుడూ తను అందరి లాగా నడవలేకుండా పరిగెత్త లేకుండా ఉన్నానని బాధ గా ఉండేది.

ఇలా ఉండగా ఒకరోజు అనాథ అబ్బాయి ఆశ్రమం నుంచి పారిపోయి వచ్చేశాడు. ఒక పార్క్ ఎదురుపడితే అందులో ప్రవేశించాడు. అక్కడ పైన చెప్పిన కాళ్ళు సరిగా లేని అబ్బాయి ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టి ఆడుకుంటూ తారసపడ్డాడు.

నెమ్మదిగా ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళి “నీకెప్పుడూ గాల్లో ఎగరాలనిపించలేదా?” అని ప్రశ్నించాడు.

“ప్చ్ లేదు… కానీ మీలాగా నడవాలని, పరిగెత్తాలని మాత్రం ఆశగా ఉంది” అన్నాడు.

దానికి అనాథ అబ్బాయి కించిత్తు బాధ పడుతూ “సరే మనిద్దరం స్నేహితులుగా ఉందామా?” అని అడిగాడు.

“ఓ తప్పకుండా” అన్నాడు ఆ అబ్బాయి.

వాళ్ళిద్దరూ కలిసి గంటల తరబడి తనివిదీరా ఆడుకున్నారు. ఇసుకతో కోటలు కట్టారు. గిలిగింతలు పెట్టుకున్నారు. మనసారా నవ్వుకున్నారు. కాసేపటి తర్వాత నడవలేని అబ్బాయి తండ్రి అతన్ని తీసుకెళ్ళడానికి చక్రాల కుర్చీ తీసుకుని వచ్చాడు.

అనాథ అబ్బాయి నెమ్మదిగా ఆయన దగ్గరికెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు.

“ఓ అలాగే” అన్నాడాయన.

అతను నెమ్మదిగా నడవలేని అబ్బాయి దగ్గరికెళ్ళి,

“నువ్వు నాకు ఒక్కగానొక్క స్నేహితుడివి. నీ అంతట నువ్వు అందరిలాగా నడవడానికి, పరిగెత్తించేలా చేయడానికి నేనేం చేయలేను. కానీ ఒక్కటి మాత్రం చెయ్యగలను.”

అని చెప్పి వెనక్కు తిరిగి ఆ అబ్బాయిని వీపు మీద ఎక్కమన్నాడు (ఉప్పుగుర్రం అనేవాళ్ళం చిన్నప్పుడు).

అతను అలా ఎక్కగానే నెమ్మదిగా పచ్చిక మీద పరిగెత్తడం ప్రారంభించాడు. శక్తి కొద్దీ పరిగెత్తుతూ వేగం నెమ్మదిగా పెంచుతున్నాడు. అలా వేగం పెరుగుతున్న కొద్దీ పిల్లగాలి వారి ముఖాలను చల్లగా పలకరిస్తోంది. ముంగురులు పైకెగురుతూ ఉన్నాయి. వారిద్దరి ముఖాల్లో సంతోషం తాండవిస్తోంది.

దూరంగా కూర్చుని వీరివైపే తదేకంగా చూస్తున్న నడవలేని అబ్బాయి తండ్రి తన కొడుకు వైపు చూస్తూ ఆనంద భాష్పాలు రాలుస్తూ ఉన్నాడు

ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే

ఆనందంగా చప్పట్లు కొడుతూ చేతులూ రెండూ రెక్కల్లా సాచి “నాన్నా… నేను గాలి లో ఎగురుతున్నాను చూడు..” అని అరుస్తున్నాడు.

అవే తప్పుకుంటాయి…

bumpy road 2ఓ నిరక్షరాస్యుడైన మంత్రి ఓసారి కార్లో తన గ్రామానికి వెళుతున్నాడు.

రోడ్డు బాగా లేకపోవడంతో కారు బాగా కుదుపులకు లోనవుతోంది.


ఆ మంత్రి డ్రైవర్ ను ఉద్దేశించి “ఏంటయ్యా కారు అలా ఊగిపోతుంది?” అన్నాడు


“రోడ్డంతా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి సర్” అన్నాడా డ్రైవర్ సగం ఇంగ్లీషులో, సగం తెలుగులో మాట్లాడుతూ


“ఆ ఉంటే ఏంటి? హారన్ మోగించు అవే పక్కకు తప్పుకుంటాయి” అన్నాడా మంత్రి.

కునికిపాట్లు…

లాలూ కునుకు
పార్లమెంటులో కమ్మగా కునుకు తీస్తున్న లాలూ

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.


వెనక సీట్లలో కూర్చుని ఒక శాసన సభ్యుడు కునికి పాట్లు పడుతున్నాడు.


ఏదో అంశం చర్చకు వచ్చింది. అందరూ సభ్యులూ లేచి తమ తమ అభిప్రాయాలు చెబుతున్నారు.


చివరగా కునికిపాట్లు పడుతున్న సభ్యుడు పక్కన ఉన్న సభ్యుడు లేచి
“ఐ కంకర్” అన్నాడు.


దాంతో ఈయన గూడా కళ్ళు నులుము కుంటూ పైకి లేచి


“నాది కూడా నాలుగు లోడ్ల కంకర” అని చెప్పేసి మళ్ళీ కునుకులోకి జారుకున్నాడు.

devegowda
ప్రసాదం కోసం ఎదురు చూస్తూ చల్లగా నిద్రలోకి జారుకున్న దేవేగౌడ

మా ఊరి పండగ

గతనెలలో మా స్వగ్రామంలో జరిగిన అగ్నిగుండ ప్రవేశం దృశ్యాలు చిత్రీకరించాను. కాకపోతే అవి పరిమాణం పెద్దవిగా ఉండటం వల్ల యూట్యూబ్ లోకి ఎక్కించలేకపోయాను. వాటి కోసం వీడియో కన్వర్టర్లు వెతికి పరిమాణం తగ్గించి ఎక్కించేసరికి ఇదిగో ఇప్పటికి వీలుపడింది. మరి కొన్ని వీడియోలకోసం ఈ లింకును సందర్శించండి.