వెంకటగిరి సంస్థానం గురించిన ఆసక్తికరమైన కథ

ఈ మధ్యన నేషనల్ డిజిటల్ లైబ్రరీలో చరిత్ర పుస్తకాల కోసం వెతుకుతుంటే నానారాజన్య చరిత్రము అనే ఒక పుస్తకం దొరికింది. ఈపుస్తక రచయిత శ్రీరామ్ వీరబ్రహ్మం. 1918లో ప్రచురించారు. ఈ పుస్తకంలో వెంకటగిరి సంస్థానం గురించే కాక మరో పద్నాలుగు సంస్థానాల గురించిన చరిత్ర ఉంది. వెంకటగిరి సంస్థానం గురించి చదువుతుండగా నాకు మా పెద్దవాళ్ళ ద్వారా విన్న ఓ ఆసక్తికరమైన కథకు ఆధారం దొరికింది. ఇది వెంకటగిరి సంస్థానం గురించి నేను చిన్నప్పటి నుంచి వింటున్న కథ.

************

నిజాం కాలంలో పద్మనాయక వంశానికి చెందిన చెవిరెడ్డి అనే రాజు ఉండేవాడు. అప్పటి నైజాం రాజ్యంలోని నల్లగొండ మండలం లోని ఆమనగల్లు రాజధానిలోనూ, పిల్లలమఱ్ఱి అనే రాజధానిలోనూ నివసిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఈయనకు పూర్వము పదవతరం వాడైన హేమాద్రి రెడ్డి అనే రాజు పరిపాలనలో బాగా ధనాన్ని సంపాదించి దాన్ని ఒకచోట నిక్షేపించాడు. దానిపైన ఒక వేదిక కట్టించి ఒక మర్రి చెట్టును నాటాడు. దానికింద ఒక భైరవ విగ్రహాన్ని ప్రతిష్టించి ఒక కోరిక కోరుకున్నాడు.

“స్వామీ! మీరీ సంపదను కాపాడి, నా సంతతిలో అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వాడు, సత్కర్మలు చేయగల వాడు, సద్గుణ సంపన్నుడు అయిన వానికి అందజేయవలెన” ని దాని సారాంశం.

ఇది తెలియపరచడానికి రహస్యముగా ఒక శిలాశాసనాన్ని కూడా స్థాపించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చెవిరెడ్డి ఒకసారి వేటకోసమని ఆ ప్రాంతానికి వచ్చాడు. అదే సమయంలో వారి దివాణంలో పనిచేసే రేచడు అనే హరిజనుడు వ్యవసాయం చేయడం కోసం పొలం దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డం పడింది. అది పూర్వం హేమాద్రి రెడ్డి చెక్కించిన రహస్య శిలా శాసనం. అదే సమయానికి తమ రాజు అటువైపు వెళుతుండగా రేచడు ఆయన దగ్గరకు వెళ్ళి ఆ శాసనం గురించి చెప్పాడు.

శాసనాన్ని చదివిన చెవిరెడ్డి తన పూర్వీకులు దాచిన నిధిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా, దాని ప్రక్కనే ఉన్న మర్రి చెట్టును ఆశ్రయించుకున్న భేతాళుడు ఈయన ధైర్యాన్ని పరీక్షించాలనుకున్నాడు. తన మాయలతో మేఘాలు, ఉరుములు, మెఱుపులు సృష్టించి ఆ మర్రి చెట్టు వారిపై పడేలా చేశాడు. రేచడు ఇది చూడగానే మూర్ఛపోయినాడు. కానీ చెవిరెడ్డి మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. భేతాళుడు ఇతని శక్తిని మరింతగా పరీక్షించదలచి భీకరరూపంతో చెవిరెడ్డి ముందుకు దూకాడు. అంత ఆ రాజు తన కత్తి దూసి నరకబోతుండగా భేతాళుడు నిజరూపంలో ప్రత్యక్షమై అతని ధైర్య సాహసాలకు మెచ్చాననీ ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అపుడా రాజు తమ వంశం వారంతా రాజ్యభోగాలతోనూ, శౌర్య ధైర్యాధి గుణములను కలిగి ఉండేలాగుననూ, తాము యుద్ధానికి వెళ్ళేటపుడు భేతాళుడు ముందు నడిచేలా వరాలను కోరుకున్నాడు. భేతాళుడు ఆ వరాలను అనుగ్రహించి అంతర్థానం అయ్యాడు.

తర్వాత ఆ రాజు ఆనందంతో ఆ సంపదను వెలికితీయడానికి ప్రయత్నించగా, పక్కనే భైరవమూర్తి నుంచి అశరీరవాణి ఒకటి వినిపించింది.

“ఓ రాజా, నీవు ఈ సంపదను తీసుకోవడానికి అర్హుడవే కానీ, ఈ సంపదను కొన్ని క్షుద్ర భూతములు ఆశించి ఉన్నాయి. వాటికి ఒక నరబలి ఇచ్చి ఈ సంపదను తీసుకుంటే నీకు మంచి జరుగుతుంది” అని పలికింది.

రాజు నరహత్యకు వెనుకాడుతూ ఆలోచిస్తుండగా మూర్ఛ నుంచి తేరుకున్న రేచడు జరిగిన విషయం తెలుసుకుని తనను బలి ఇచ్చి ఆ ధనాన్ని తీసుకోమన్నాడు. కానీ ఆ రాజుకి తన దివాణంలో నమ్మకస్తుడైన అతనిని బలి ఇవ్వడానికి మనసొప్పలేదు. అప్పుడు రేచడు “మీరు ఈ ధనాన్ని మంచి కోసమే వినియోగించగలరని నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను కోరిన కోరికలు తీర్చి నన్ను బలి ఇస్తే మీకు నరహత్య పాపం అంటదు.” అన్నాడు. దాంతో రాజు రేచడు కోరినట్లు తమ వంశం వారినందరినీ తరతరములకు రాజా వారి వంశీయులు పోషించుటకు, తమకు వివాహం జరిగేటపుడు రేచని వంశీయులకు వివాహం జరిగేలా అంగీకరించి వానిని బలియిచ్చి ధనాన్ని స్వీకరించాడు. భేతాళుని కారణముగా ఈయనకు భేతాళ నాయడనని కూడా పేరు.

వెంకటగిరి రాజుల పేర్ల వెనుక యాచేంద్ర అని చేర్చుకుంటారు. ఉదాహరణకు ఇటీవలి తరానికి చెందిన వారి పేర్లు గోపాలకృష్ణ యాచేంద్ర, సాయికృష్ణ యాచేంద్ర. ఈ రేచడి పేరే తర్వాతి తరంలో యాచమ నాయుడనీ, యాచేంద్ర అనీ రూపాంతరం చెంది ఉండవచ్చని నా ఊహ.