శిక్ష తప్పించుకోవడం ఎలా?

ఒక భారతీయుడు, ఒక అమెరికన్, ఒక పాకిస్థానీయుడు సౌదీ అరేబియాకు చెందిన విమానంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. వారు చేసిన నేరానికి శిక్షగా ఒక్కొక్కరికీ 20 కొరడా దెబ్బలు శిక్ష విధించారు అధికారులు. వారు ముగ్గురూ శిక్షకు సిద్ధపడుతుండగా శిక్షను అమలుపరిచే షేక్ వచ్చి ఇలా ప్రకటించాడు. “ఇవాళ నా ప్రియమైన మొదటి భార్య పుట్టిన రోజు. కాబట్టి మీకు శిక్ష విధించబేయే ముందుగా మిమ్మల్ని ఒక కోరిక కోరుకోమంది” అన్నాడు

మొదటగా అమెరికన్ వంతు వచ్చింది. అతను కొద్ది సేపు ఆలోచించి  తన వీపుకు ఒక దిండును కట్టమన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అది పది దెబ్బలకే చినిగిపోయింది. మిగతా పది దెబ్బలూ భరించే సరికి రక్తం కారే గాయాలైపోయాయి.

తరువాత పాకిస్థానీ వంతు వచ్చింది. తనకు రెండు దిండ్లు కట్టమన్నాడు. అతని దురదృష్టం కొద్దీ అది పదిహేను దెబ్బలకే తట్టుకోగలిగింది. తరువాత భారతీయుడి వంతు వచ్చింది. అతను ఏమీ అనకముందే షేక్ “నువ్వు మంచి సంస్కృతి గల దేశం నుంచి వచ్చావు. మీ దేశం అంటే నాకు ఎంతో ఇష్టం. కాబట్టి నువ్వు రెండు కోరికలు కోరుకోవచ్చు” అన్నాడు.

“మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. నా మొదటి కోరిక ఏంటంటే నాకు ఇరవై కాదు నూరు కొరడా దెబ్బలు కావాలి”

“చూస్తుంటే నువ్వు మంచి ధైర్యవంతుడిలాగా కనిపిస్తున్నావు. సరే నీ రెండో కోరిక ఏమిటి?”

“ఆ పాకిస్థాన్ వాణ్ణి నా వెనక కట్టేయండి.” 🙂

వోల్‌ఫ్రమ్ ఆల్ఫా

కొన్ని నెలల క్రిందట ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ వోల్‌ఫ్రమ్ మామాలు సర్చ్ ఇంజన్ ల కన్నా విభిన్నమైన సెర్చింజన్ తయారు చేశాడు. సందర్శకులు ఏదైనా సమాచారం కోసం దీనిలో వెతికినపుడు ఆ సమాచారాన్ని కలిగి ఉన్నట్లుగా భావిస్తున్న కొన్ని పేజీల జాబితాను ఇవ్వకుండా మీరు ఇచ్చిన ఇన్‌పుట్ ను విశ్లేషించి పట్టిక రూపంలో సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకోసం వెబ్‌సైట్ నిర్వాహకులు కూర్చుకున్న ప్రత్యేకమైన డేటాబేస్ ను వాడతారు. ఈ డేటాబేస్ లో ముందుగా ఫార్మాట్ చేసుకున్న సమాచారం ఉంటుంది. దీన్ని ఆయా సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులు తయారు చేస్తారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే గణిత, రసాయన, భైతికసమీకరణాలను సాధిస్తుంది. ఉదాహరణకు Integrate(x^2+x) అనే ఇన్‌పుట్ ఇచ్చామనుకుందాం. దాని అవుట్‌పుట్ ఇలా ఉంటుంది.

wolframalpha output
అవుట్‌పుట్

ఉదాహరణకు మీరు ఏదైనా నగరం గురించి వెతికారనుకుందాం. ఆ నగరం గురించి అతి ముఖ్యమైన సమాచారాన్ని మొత్తం ఒక పట్టిక రూపంలో చూపిస్తుంది. అయితే ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు చెబుతున్న దాని ప్రకారం ఈ వ్యవస్థ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటు లోకి రావడానికి కొన్నేళ్ళు పడుతుంది. అలా వచ్చిన తర్వాత మనం ఒక ప్రశ్న దానికి ఇన్‌పుట్ గా ఇచ్చినా అర్థం చేసుకుని దానికి సమాధానం ఇచ్చే స్థాయికి ఇది చేరుతుంది.

విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది . గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలతోపాటు వైద్య, సామాజిక, ఆర్థిక, సాంకేతిక, జీవ శాస్త్రం, ఒకటేమిటి చాలా శాస్త్రాల పరిజ్ఞానం ఇమిడి ఉంది.

ఆస్తికులు vs నాస్తికులు

కొన్ని రోజుల క్రితం పరుచూరి గోపాల క్రిష్ణ గారు నిర్వహిస్తున్న ప్రజావేదిక కార్యక్రమం చూస్తున్నాను. ఆరోజు అంశం “దేవుడు ఉన్నాడా? లేడా?” ఇలాంటి కార్యక్రమాల్లో చాలా సర్వ సాధారణమైన అంశం. చర్చ ప్రారంభించేందుకు ముందుగా గోపాలక్రిష్ణ గారు ఒక ఆసక్తికరమైన అంశం చెప్పారు.

ఒక రాజు సమక్షంలో  శంకరాచార్యులుకూ,  మరో నాస్తికుడి మద్య ఈ అంశం మీదే వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. ఎంతసేపు వాదనలు జరిగినా విజయలక్ష్మి ఎవరినీ వరించడం లేదు. ఒకరికిమించి మరొకరు వాదిస్తున్నారు కానీ  ఎంతసేపటికీ విజేత ఎవరో తేలడం లేదు. చివరికి శంకరాచార్యులవారు రాజుతో అన్నాడు.

“నేను ఒక ఎత్తైన పర్వతశిఖరం మీద నుంచి దూకి దైవ కృప చేత ఎటువంటి ప్రమాదం లేకుండా తిరిగివస్తాను. అప్పుడైనా ఒప్పుకుంటారా దేవుడు ఉన్నాడని?” అన్నాడు.

సరేనన్నాడు రాజు. ఆయన చెప్పినట్లే భగవధ్యానం చేస్తూ కొండపై నుంచి కిందకు దూకినా శంకరాచార్యులకు ఏమీ కాలేదు. అప్పుడు నాస్తికుడు ముందుకు వచ్చి “మాహారాజా! ఇందులో దైవ కృప ఏమీ లేదు. కావాలంటే నేను దైవాన్ని తలుచుకోకుండా అదే కొండపై నుంచి క్రిందకు దూకుతాను. నాక్కూడా ఏమీ కాదు” అన్నాడు. రాజుకు అంగీకరించక తప్పింది కాదు.

విచిత్రంగా నాస్తికుడు కొండపై నుంచి దూకినా ఏమీ కాలేదు. రాజుకు ఏమీ చేయాలో పాలుపోలేదు.

చివరకు శంకరాచార్యుడు కలుగజేసుకుని “రాజా! నేను ఆస్తికుడినై ఉండి రోజులో కొద్ది సమయం దైవ ప్రార్థనలో గడిపి మిగతా సమయ మంతా దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమైపోతాను. కానీ ఈ నాస్తికులున్నారే. వీళ్ళు పొద్దస్తమానం నాలాంటి వాళ్ళను వాదనల్లోకి దించి వాళ్ళ సమయాన్ని వృధా చేయడమే కాక ఇతరుల సమయాల్ని కూడా వృధా చేస్తుంటారు.” అన్నాడు.

ఆ రాజుకు ఆ వాదన సమంజసంగా తోచింది. వెంటనే రాజ్యంలో నాస్తికులు ఎవరు కనిపించినా వాళ్ళ తలలు నరికివేయమని ఆజ్ఞాపించాడట.

ఈ సంఘటన యధాతథంగా గోపాలక్రిష్ణ గారు చెప్పిందే. నాకు వాదం అంటేనే నచ్చదు. ఇంక వాటి గురించి మాట్లాడే ఆసక్తి లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నాకు ఈ సంఘటనలో అంతర్లీనంగా అదే తోచింది.

రియాల్టీ షో లా? బూతు పురాణాలా?

ఈ మద్యనే జీటీవీలో ప్రసారమవుతున్న ఆట జూనియర్స్ కార్యక్రమం చూడవలసి వచ్చింది. ఇద్దరు మెంటర్ల మద్య చెలరేగిన వాగ్యుద్ధం చివరికీ అందరికీ పాకింది.

ఒక మెంటర్ (తెలుగులో మార్గదర్శకులు అందాం). ” హలో మీరు xxx, xxx  మూసుకుంటే బాగుంటుంది.” అంది . ఒక్క క్షణం దిమ్మ తిరిగిపోయింది నాకు.  దాన్నుంచి తేరుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. (xxx, xxx సెన్సార్ కట్ అన్నమాట. నేనే కాదు టీవీలో కూడా కత్తెరేశారు సదరు మాటల్ని)

మళ్ళీ మాటీవీలో ప్రసారమవుతున్న చాలెంజ్ కార్యక్రమంలో ఒక న్యాయ నిర్ణేత పై మాటలు అన్న  ఆమె మీద ఇలా అరుస్తున్నాడు.

” నీ లాంటి వేస్ట్ ఫెలో ని నా లైఫ్ లో నేనింత వరకు చూడలేదు”. ఇలా ఏవేవో అవాకులూ చెవాకులూ, చూసేవాళ్ళకు చిరాకులూ.

ఎవరో కొంత మంది అనామకుల్ని పట్టుకుని వాళ్ళతోనే అన్ని కార్యక్రమాలు చేయించి ప్రేక్షకుల్ని  శిక్షిస్తున్న  ఆ హింసరాజు ను ఏమనాలో నాకు తోచలేదు. వాళ్ళ మ్యానరిజమ్స్, ఏడుపులు, పెడబొబ్బలు టీవీ కార్యక్రమాలంటేనే ఏహ్య భావం కలిగించేలా అనిపించాయి నాకు. టీ.ఆర్.పి రేటింగ్ ల కోసం ఒకటి తర్వాత ఒకటి టీ వీ చానల్స్ కూడా అతని కార్యక్రమాలను ఎగబడి  కొనుక్కుంటూ ఉండటం మరీ దారుణం.

ఓ దేవుడా! ఈ ఘీంకార్ బారి నుంచి మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు?

ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. అన్ని చానళ్ళలో వస్తున్న రియాల్టీ షోలలో ఇది పరిస్థితి నెలకొని ఉన్నది.