స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం


అతను ఓ పేద కుటుంబం నుంచి వచ్చాడు. విధి అతని మీద పగబట్టింది. అయినా అతను క్రుంగిపోలేదు. పట్టుదలతో చదివి ఐఐటీలో సీటు సంపాదించాడు. తర్వాత ప్రతిష్టాత్మకమైన గూగుల్ లో ఉద్యోగం సంపాదించాడు. నిజ్జంగా అతను స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం.


ఎవరతను? ఏమా కథ? వివరాల్లోకి వెళితే…

నాగ నరేష్
నాగ నరేష్

నాగ నరేష్ అనే అబ్బాయి ఇటీవలే ఐఐటీ మద్రాస్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి గూగుల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో ఉద్యోగం సంపాదించాడు. ఈ రోజుల్లో వేలమంది ఐఐటీల్లో చదివి బయటికొచ్చి గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కదా!. అందులో గొప్పతనం ఏముంది? అనుకుంటున్నారా?

నరేష్ కో ప్రత్యేకత ఉంది. అతను పైన చెప్పిన వేలమందిలో ఒక్కడు కాడు. అతని తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. అతనికి రెండు కాళ్ళు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాల కుర్చీయే గతి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. గొప్ప ఆశావాది. ” భగవంతుడు నాకోసం అన్నీ ముందుగా ఏర్పాటు చేసేస్తుంటాడు. అందుకనే నేను చాలా అదృష్టవంతుణ్ణని భావిస్తాను. ” అంటుంటాడు. అసలు నరేష్ ఎలా అదృష్టవంతుడెలా అయ్యాడో అతని మాటల్లోనే…

***

బాల్యం ఓ కుగ్రామంలో

నా మొదటి ఏడేళ్ళు గోదావరి ఒడ్డున ఉన్న తీపర్రు అనే కుగ్రామంలో గడిచాయి. మా నాన్న పేరు ప్రసాద్. లారీ నడిపేవాడు. అమ్మ కుమారి గృహిణి. వాళ్ళిద్దరూ నిరక్షరాస్యులే అయినా నన్ను, మా అక్కను బాగా చదువుకోమని ఎంతగానో ప్రోత్సహించేవారు.

ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటంటే నేను ఒకటి రెండు తరగతులు చదివేటపుడు మా నాన్న నాకు సహాయం చేయడం. నాన్న పాఠ్య పుస్తకంలో ప్రశ్నలు అడుగుతుంటే నేను సమాధానాలు చెప్పేవాడిని. అప్పుడు మా నాన్నకు చదవడం, రాయడం తెలీదని నాకు తెలియదు, కానీ నన్ను సంతోష పెట్టడం కోసం అలా చేసేవాడు. నా జ్ఞాపకాల్లోంచి చెరిగిపోని మరో సంఘటన మా ఊళ్ళో వరదలు. అప్పుడు మా మామ నన్ను ఓ గేదె పై కూర్చోబెట్టి తీసుకెళ్ళడం, బాగా ముళ్ళున్న చెట్టు నుంచి ఏవో పండ్లు తీసుకొచ్చి నాకివ్వడం నా కింకా బాగా గుర్తు.

నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడ్ని. ఎప్పుడూ అటూ ఇటూ పరిగెడుతూ, సావాస గాళ్ళతో ఆడుకుంటూ భలే సరదాగా ఉండేవాడిని. అలా అరుస్తూ మధ్యాహ్నం పూట నిద్ర చెడగొట్టినందుకు పెద్దవాళ్ళ దగ్గర అప్పుడప్పుడూ తిట్లు కూడా తింటుండేవాణ్ణి. ఎప్పుడైతే వాళ్ళు నా మీద అరుస్తారో వెంటనే పొలాలవైపు పరిగెత్తేవాణ్ణి.

మాస్టారు తరగతిలో అప్పజెప్పిన పనిని అందరికన్నా నేనే ముందు పూర్తి చేసేసి ఉపాధ్యాయుల ఒళ్ళో నిద్రపోయేవాణ్ణి!

జనవరి 11, 1993, విధి వెక్కిరించిన రోజు

జనవరి 11, 1993 మాకు సంక్రాంతి సెలవులు. మా అమ్మ నన్ను, అక్కను పక్క ఊళ్ళో జరుగుతున్న ఓ కార్యం కోసం తీసుకుని వెళుతోంది. అక్కడి నుంచి మా అమ్మమ్మతో కలిసి ఊరికి వెళ్ళాలనేది మా ప్లాను. కానీ మా అమ్మమ్మ అక్కడికి రాలేదు. ఆ రోజు బస్సులు లేకపోవడంతో తిరుగు ప్రయాణంలో మేం మా నాన్న లారీ లో ఎక్కాం. అప్పటికే లారీలో చాలా మంది ఉండటంతో మా నాన్న నన్ను డ్రైవర్ సీటు పక్కనే తలుపు కి దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు.

అది నా తప్పే; నేను తలుపుని ఏదో కలిబెట్టాను. అది ఊడిపోయి అక్కడి నుంచి కిందపడ్డాను. కిందపడి దొల్లడం వల్ల లారీలో వేసుకువస్తున్న ఇనుప కమ్మీలు వెనుకల బాగం తగిలి నా కాళ్ళు బాగా చీరుకుపోయాయి.

ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఎదురుగా ఓ పెద్ద ప్రైవేటు ఆసుపత్రి కూడా ఉంది. కానీ యాక్సిడెంటు కేసు కావడంతో నన్ను అక్కడ చేర్చుకోలేదు. అటుగా వెళ్తున్న ఓ పోలీసు కాన్‌స్టేబుల్ మా పరిస్థితి చూసి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళాడు.

అక్కడ నా చిన్న ప్రేగు మెలితిరిగిందని తెలియడంతో మొదటగా ఓ శస్త్రచికిత్స చేశారు. నా కాళ్ళకు కూడా కట్లు కట్టారు. అక్కడే ఓ వారం రోజులు ఉన్నాను. కొన్నాళ్ళకి నా గాయాలు సెప్టిక్ అయి మోకాళ్ళ దాకా పాకినట్లు గుర్తించారు. నన్ను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళమని మా నాన్నకు తెలియజేశారు. అక్కడ వైద్యులు గాయాన్ని అంత కాలం నిర్లక్ష్యం చేసి సెప్టిక్ అయ్యేదాకా ఆలస్యం చేసినందుకు బాగా కోప్పడ్డారు. కానీ ఇలాంటి విషయాలు పెద్దగా తెలియని వాళ్ళేం చేస్తారు?

కొద్ది రోజులకు నా రెండు కాళ్ళు నడుం దాకా తొలగించారు. నా కింకా బాగా గుర్తుంది, స్పృహ లోకి వచ్చింతర్వాత మా అమ్మను అడిగాను ” నా కాళ్ళేవి?” అని. ఆమె కన్నీరు మున్నీరైంది. అలా నేను మూడునెలలు ఆసుపత్రిలోనే ఉన్నాను.

కాళ్ళులేని జీవితం

నాకు కాళ్ళు పోయింతర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయిందని నేననుకోను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు నన్ను ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. అందరూ నా మీద చూపే శృద్ధకు లోలోపలే ఆనందిస్తున్నానే గానీ నన్ను గురించి నేను బాధపడటం లేదు. నేను తినడానికి పళ్ళు, బిస్కట్లు బాగా దొరుకుతున్నాయని సంతోషంగా అనిపించేది.

ఆత్మన్యూనతా?… అంటే  ఏమిటి?

నేను మా ఊరు వెళ్ళగానే మా ఇంటికి చూడ్డానికి వచ్చేవాళ్ళు వెల్లువలా వచ్చిపడ్డారు. వాళ్ళలో చాలామంది కాళ్ళు లేకుండా నేనెలా ఉంటానో చూడ్డానికి వచ్చిన వాళ్ళే. కానీ నాకేం బాధ లేదు. చాలా మంది, ముఖ్యంగా నా స్నేహితులంతా నన్ను చూడ్డానికి వస్తున్నారని సంతోషంగా ఉండేది.

నా స్నేహితులంతా ఏ ఆట ఆడుకున్నా అందులో నేనుండేటట్టుగా చూసేవారు. ఎక్కడికైనా మోసుకుపోయేవారు.

నేను భగవంతుణ్ణి నమ్ముతాను. అలాగే విధి అంటే కూడా నమ్మకమే. భగవంతుడు నాకోసం అన్నీ ముందుగానే ఏర్పాటు చేస్తాడనుకుంటా. ఆ యాక్సిడెంటు జరక్కుంటే మేం మా గ్రామాన్ని వదిలి తణుకు పట్టణానికి వెళ్ళుండే వాళ్ళమే కాదు. అక్కడ నేనో మిషనరీ స్కూల్లో చేరాను. మా నాన్న ఆ స్కూలు పక్కనే ఓ ఇల్లు కూడా కట్టాడు. నా పదో తరగతి దాకా అక్కడే చదివాను.

నేను తీపర్రు లో ఉండిపోయుంటే పదో తరగతికి మించి చదువుండే వాణ్ణి కాదేమో! అందరి లాగానే పదో తరగతి పూర్తి చేసి వ్యవసాయంలో స్థిరపడిపోయి ఉండేవాణ్నేమో! దైవం వేరొకటి తలచిందేమో నాకోసం.

మా అక్క

బడి మళ్ళీ తెరుస్తారనగా మా అమ్మ, నాన్న తీపర్రు నుంచి తణుకు కి వచ్చేశారు. మమ్మల్నిద్దర్నీ ఓ మిషనరీ స్కూల్లో చేర్పించారు. నా కన్నా మా అక్క రెండేళ్ళు పెద్దదైనా నాకు సహాయంగా ఉండి బాగా చూసుకుంటుందని నా క్లాసులోనే చేర్పించారు. మా అక్క ఏ మాత్రం సంకోచించలేదు, ఫిర్యాదు చేయలేదు.

ఆమె నా కోసం ఏం చేయడానికైనా వెనుకాడేది కాదు. మా స్నేహితులంతా అంటుండే వారు అలాంటి అక్క ఉండటం నా అదృష్టమని. తోబుట్టువుల్ని పట్టించుకోని చాలా మంది ఉన్న ఈ లోకం లో అది అక్షరాలా నిజం.

కొన్ని సంవత్సరాలు మా అక్కే నన్ను మోసుకొని స్కూలుకి తీసుకెళ్ళేది. తర్వాత నా స్నేహితులు ఆ బాధ్యత తీసుకున్నారు. నాకు మూడు చక్రాల బండి వచ్చాక మా అక్కే వెనకుండి తోసుకుంటూ తిరిగేది.

అందరూ నన్ను వాళ్ళతో సమానంగా చూడటం వల్లనేమో నేను కూడా అందరిలాంటి వాడినే అనుకునే వాణ్ణి. ఎప్పుడూ ఆత్మన్యూనతా భావంతో కుంగిపోలేదు. అందరిలానే సంతోషంగా ఉంటూ మొదటి స్థానం కోసం అందరితో పోటీ పడేవాణ్ణి. అలాగే అందరు కూడా నన్ను గట్టి పోటీగా స్వీకరించేవాళ్ళు.

స్పూర్తి

స్కూల్లో ఉండగా నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు ఇద్దరు. ఒకరు మా గణితం మాస్టారు ప్రమోద్ లాల్. ఆయన ప్రాంతీయంగా జరిగే ప్రతిభా పరీక్షల్లో (టాలెంట్ టెస్ట్) ల్లో నన్ను పాల్గొనమనేవాడు. ఇంకొకరు నాకు సీనియర్ అయిన చౌదరి. అతను గౌతమ్ జూనియర్ కళాశాలలో చేరి ఐఐటీ కి సన్నద్ధం అవుతున్నాడని తెలిసి నేను కూడా అలాగే చేరాలని కలలు కన్నాను. పదో తరగతి లో 600 కి 542 మార్కులు సంపాదించి మా పాఠశాలలో ప్రథముడిగా నిలిచాను.

బాగా మార్కులు సంపాదించినందువల్ల , గౌతమ్ జూనియర్ కళాశాల యాజమాన్యం నా కోసం ఫీజు మినహాయింపునిచ్చింది. ఇందుకు మా ప్రమోద్ సార్ కూడా సహాయం చేశారు. లేకపోతే సంవత్సరానికి యాభై వేల రూపాయలు మా తల్లిదండ్రులకి అసాధ్యమైన పని అయ్యేది.

రెసిడెన్షియల్ స్కూల్లో

రెసిడెన్షియల్ స్కూల్లో కి మారడం నాకు కొంచెం కొత్తగానే అనిపించింది. ఎందుకంటే అప్పటి దాకా  స్కూలు, ఇల్లు తప్ప  ఎక్కడికి వెళ్ళింది లేదు. అక్కడ నాకు సహాయం చేయడానికి అక్క, అమ్మ, నాన్న ఉండేవాళ్ళు. బయటి సమాజంతో ఇంటరాక్ట్ అవడం అదే ప్రథమం. కొత్త జీవితానికి  అలవాటు పడటానికి ఓ సంవత్సరం పట్టింది.

అక్కడ నాకు స్పూర్తి కె.కె.యస్ భాస్కర్ (ఈ కె.కె.యస్ భాస్కర్ అనే అబ్బాయి గురించి కూడా నేను పేపర్లో చదివాను. దాదాపు మా వయసు వాడే. ఇతన్నే ర్యాంకుల భాస్కర్ అనేవాళ్ళు. ఎందుకంటే ఈ అబ్బాయి ఎంసెట్లో మొదటి ర్యాంకు. ఏఐట్రిపుల్ ఈ లో మొదటి ర్యాంకు. ఐఐటీ లో కూడా మొదటి పది లోపలే ర్యాంకు. వాళ్ళది కూడా పేద బెస్తవారి కుటుంబమే. అప్పట్లో నేను అతని ప్రతిభ చూసి అబ్బురపడ్డాను.) అనే వ్యక్తి. అతను మమ్మల్ని ఉత్తేజపరచడానికి మా కళాశాలకు వచ్చేవాడు. గౌతమ్ జూనియర్ కాలేజీ గురించి, ఐఐటీ గురించి మా తల్లిదండ్రులకు ఏమీ తెలియదు కానీ నేనేది చేసినా అందులో తప్పక ప్రోత్సాహం అందించేవారు. ఒకవేళ విజయం సాధిస్తే నన్ను ఆకాశానికెత్తేసేవారు. ఒక వేళ వైఫల్యం ఎదురైతే అందువల్ల కలిగే లాభాల గురించి చెప్పేవారు. ఏ విధంగా నైనా నేను సంతోషంగా ఉండాలనేదే వారి అభిమతం. అలాంటి అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు.

ఐఐటీ మద్రాస్ లో

ఐఐటీ ప్రవేశ పరీక్షలో నా ర్యాంకు పెద్దగా లేకపోయినా (992) వికలాంగుల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచాను. ఐఐటీ మద్రాసు లో కంప్యూటర్ సైన్సులో చేరాను.

ఇక్కడ నా రోల్ మోడల్ కార్తీక్ అనే మా స్కూల్ సీనియర్. ఐఐటీ మద్రాస్ లో ఉన్నప్పుడు అతనే నాకు స్పూర్తి. నేను అక్కడికి వెళ్ళక ముందే అతను నా కోసం అటాచ్డ్ బాత్‌రూమ్ కలిగిన గది కోసం అడిగిపెట్టాడు. అలా నేనక్కడికి వెళ్ళేసరికే ఆ గది నాకు కేటాయించబడింది. అతను నాకు దిశా నిర్దేశం చేయడమే కాక ఎంతో సహాయం చేశాడు.

ఆ నాలుగు సంవత్సరాల్లో నేను ఓ వ్యక్తిగా, విద్యార్థిగా చాలా ఎదిగాను. అక్కడ చదవడం ఓ మరిచిపోలేని అనుభవం. నేను కలిసి చదువుకున్న వాళ్ళు మంచి ప్రతిభావంతులు. వాళ్ళతో కలిసి చదవడం నేను గర్వంగా చెప్పుకుంటాను. అస్సలు మా ల్యాబ్ లో పనిచేసే వాళ్ళతో మాట్లాడటం ద్వారా నేనెంతో నేర్చుకున్నాను.

ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళకంటే మంచి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు

మా ప్రొఫెసర్ పాండురంగన్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఆయన నన్ను మరో నలుగురితో కలిసి ఇంటర్న్‌షిప్ కోసమై బోస్టన్ నగరానికి పంపించారు. అది చాలా గొప్ప అనుభవం నాకు.

గూగుల్ లో కొలువు

మా తల్లిదండ్రులకు ఇంక అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో నేను పీహెచ్‌డీ లో చేరదలుచుకోలేదు. మొదట్లో మోర్గాన్ స్టాన్లీ అనే కంపెనీ నన్ను సెలెక్ట్ చేసుకున్నా నేను కంప్యూటర్ సైన్స్, అల్గారిథమ్స్, గేమ్ థియరీ మీద ఆసక్తితో గూగుల్ లో చేరడానికే ప్రాధాన్యత నిచ్చాను.

నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేనెందుకు అలా అంటున్నానో మీకు తెలుసా?

నేను అడక్కుండానే ముక్కు మొహం తెలియని ఎంతో మంది నాకు సాయం చేశారు. ఓ సారి బీటెక్ రెండో సంవత్సరం అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్ కోసం రైల్లో ప్రయాణిస్తున్నాను. నాకు సుందర్ అనే ఆయన పరిచయయ్యాడు. అప్పటి నుంచీ నా హాస్టల్ ఫీజు ఆయనే భరిస్తూ వచ్చాడు.

ఇక్కడ నేను జైపూర్ కాలు గురించి కూడా చెప్పాలి. నేను మూడో తరగతిలో ఉండగా జైపూర్ కాలు అమర్చారు. కానీ రెండేళ్ళ తర్వాత వాటిని వాడటం ఆపేశాను. నాకు పూర్తిగా కాళ్ళు తీసేయడం వల్ల వాటిని నా శరీరానికి కట్టుకోవడం ఇబ్బందిగా ఉండేది. పైగా ఆ కాళ్ళతో నడవడం చాలా నెమ్మదిగా ఉండేది. కూర్చోవడం కూడా సమస్య గానే ఉండేది. మూడు చక్రాల బండిలో వేగంగా వెళ్ళగలిగేవాడిని. దాన్నే ఎంచుకున్నాను. ఎందుకంటే నాకేదైనా వేగంగా చేయడం ఇష్టం.

ఆ ఆసుపత్రి గురించి ఇంకో గొప్ప విషయం ఏమిటంటే వాళ్ళు జైపూర్ కాలు అమర్చగానే వాళ్ళ బాధ్యత తీరిపోయిందనుకోరు. వాళ్ళకి జీవనాధారం కల్పించడం కోసం కూడా కృషి చేస్తారు. ఇంకా నాకేం సాయం కావాలో అడిగారు. అప్పట్లో నేను ఐఐటీ లో చేరగలిగితే నాకు ఆర్థిక సహాయం చేయండని చెప్పాను.కాబట్టి నేను ఐఐటీ మద్రాసు లో చేరినప్పటి నుంచి నా ఫీజు సంగతి వాళ్ళే చూసుకునే వారు. మా తల్లిదండ్రులకు కూడా నా చదువు భారం కాలేదు. దాంతో మా అక్కను సులభంగా నర్సింగ్ చదివించగలిగారు.

ఐఐటీ లో నాకో సర్‌ప్రైజ్

నా మొదటి సంవత్సరం తర్వాత ఇంటికెళ్ళి తిరిగొచ్చే లోపు ఐఐటీ లో నాకు తెలియకుండా రెండు సంఘటనలు జరిగాయి.

మా విభాగంలో నా కోసం ఓ లిఫ్ట్, ఒక అంతస్థు నుంచి మరో అంతస్థు కు ఎక్కడానికి మెట్లు కాకుండా ఏటవాలుగా ఉందే ర్యాంప్స్ ఏర్పాటు చేశామని ఒక ఉత్తరం వచ్చింది. అంతే కాదు కొంచెం ముందుగా వచ్చి అవి నాకు సౌకర్యంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమని కూడా తెలియజేశారు.

ఇక రెండో సౌకర్యం ఏమిటంటే మా డీన్ ప్రొఫెసర్ ఇడిచాండీ, విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ ప్రసాద్ విద్యుచ్చక్తితో నడిచే చక్రాల కుర్చీలు అమ్మే చోటుని కనిపెట్టారు. దాని ఖరీదు యాభై ఐదు వేలు. వాళ్ళు దాన్ని కొనకుండా మొత్తం డబ్బు నా చేతికే ఇచ్చి కొనుక్కోమన్నారు. ఎందుకంటే అలా తీసుకుంటే అది సంస్థకు కాకుండా నాకే చెందుతుందని.

నా జీవితం పూర్తిగా మారిపోయింది. నేను, స్వేచ్చగా, స్వతంత్రంగా ఫీలయ్యాను. అందుకనే నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పాను. దేవుడు నా కోసం అన్నీ అమర్చి పెట్టాడు. ప్రతి అడుగులో నాకు సాయం చేస్తూనే ఉన్నాడు…

ఆంగ్ల మూలం: రెడిఫ్.కాం

కుంభమేళా కథ


కుంభమేళా ప్రపంచంలో అత్యధికులు హాజరయ్యే ఒక ఉత్సవం. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేకులు వీక్షిస్తూ ఉంటారు. దీనికోసం ఎటువంటి ప్రకటనలూ, ఆహ్వానాలూ ఉండవు. అయినా అక్కడ ఇసుకేస్తే రాలనంత జనాలు ఉంటారు. ఇలాంటి ప్రత్యేకమైన ఉత్సవం భారతదేశం యొక్క ఆధ్యాత్మిక, సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.

ఇక్కడ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, పురాణ ప్రవచనాలు, ప్రార్థనలు, మంత్రపఠనాలు, దివ్యోపదేశాలు నిరాటంకంగా సాగిపోతుంటాయి. అక్కడ నదుల్లో స్నానమాచరించడం పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ ఉత్సవం కనీసం క్రీ.శ ఏడవ శతాబ్దం నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అప్పటి నుంచీ క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది.

ఈ కుంభమేళా గురించి హిందూ పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

ఒకసారి దుర్వాస మహాముని ఇంద్రుడి రాజధానియైన అమరావతీ నగరాన్ని సందర్శించి ఇంద్రుడికి ఎప్పటికీ వాడిపోని పూలతో తయారు చేసిన మాల ఒకటి బహూకరించాడు. అయితే ఇంద్రుడు దాన్ని తేలిగ్గా తీసుకుని తన వాహనమైన ఐరావతానికి ఇచ్చివేశాడు. అదేమో ఆ పూలమాలను ఎంచక్కా కాలికింద వేసి తొక్కేసింది. ఇంద్రుడి అలసత్వాన్ని, పొగరు చూసి దుర్వాస ముని అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇంద్రుడు తన సంపద, సుఖాలను కోల్పోయేలాగా శపించాడు.సరిగ్గా అప్పుడే అసుర రాజైన బలి ఇంద్రుడి మీదకు దండెత్తి అమరావతిని వశపరుచుకున్నాడు.


పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు ఇంద్రుణ్ణి అమృతం సంపాదించాల్సిందిగా విష్ణువు సలహా ఇచ్చాడు. దీనికోసమే క్షీరసాగర మథనం జరిగింది. ఈ మథనంలో మొదట ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు తన కంఠంలో దాచుకున్నాడు. తర్వాత కామధేనువు, కల్పవృక్షం లాంటివి కూడా ఉద్భవించాయి. వీటన్నింటి తరువాత దేవ వైద్యుడైన ధన్వంతరి సాక్షాత్కరించి ఒక కుండ (కుంభం) లో అమృతాన్ని అనుగ్రహించాడు. దీని కోసం సురాసురల మధ్య భీకర పోరు జరిగింది.

ఈ పోరాటంలో ఆ కుంభం నుంచి నాలుగు అమృతం చుక్కలు ఒలికి అలహాబాద్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని ప్రాంతాల్లో పడ్డాయని దాని వల్ల అవి పవిత్రమైన స్థలాలుగా భావించడం జరుగుతోంది. మరొక కథనం ప్రకారం మోహిని అవతారంలోని విష్ణువు ఆ అమృతభాండాన్ని తన వాహనమైన గరుడునికిచ్చి భద్రమైన చోటికి తీసుకెళ్ళమన్నాడు. అలా తీసుకు వెళూతూ గరుత్మంతుడు ఈ నాలుగు చోట్ల ఆగాడని ప్రతీతి.

ప్రతి మూడేళ్ళకు ఒక్కో స్థలంలో కుంభమేళా జరుగుతుంది. ఈ నాలుగు చోట్లా ప్రతి పన్నెండేళ్ళకొకసారి మహాకుంభమేళా జరుగుతుంది. పన్నెండేళ్ళు అంటే రాశి చక్రంలో బృహస్పతి ఒక ఆవృతం పూర్తి చేసినట్లన్నమాట. ఈ మహా కుంభమేళాకు ఎక్కడో సభ్యసమాజానికి దూరంగా తపస్సు నాచరించే యోగులు కూడా వస్తారంటే దీనికున్న ప్రాశస్త్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.