సత్రం-జెన్ కథ

బాగా పేరొందిన ఒక ఆధ్యాత్మిక గురువు ఓ రాజు నివసించే భవనం దగ్గరకు వచ్చాడు. అందరూ ఆయన్ను ఎరిగి ఉండటం చేత ఎవరూ ఆయన్ను ఆపడానికి సాహసించలేదు.

రాజు సింహాసనం మీద కూర్చుని ఉంటే నేరుగా అక్కడికే వెళ్ళిపోయాడు. అందరూ అప్రతిభులై చూస్తూ ఉండిపోయారు.

రాజు ఆయన్ను ” ఏం కావాలి మీకు?” అని ప్రశ్నించాడు.

ఆ గురువు ఏ మాత్రం తొణక్కుండా “ఈ సత్రంలో నాకు కొద్ది సేపు నిద్రపోవాలని ఉంది” అన్నాడు.

“కానీ ఇది సత్రం కాదు. నా రాజభవనం” అన్నాడు రాజు.

“నీ కంటే ముందు ఈ భవంతి ఎవరిదో తెలుసా?” మళ్ళీ అడిగాడు

“మా నాన్న గారిది. కానీ ఆయన ఇదివరకే చనిపోయాడు”

“మరి అంతకంటే ముందు ఈ భవంతి ఎవరిది?”

“మా తాత గారిది. ఆయన కూడా చనిపోయాడు.”

“కాబట్టి ఈ స్థలం అప్పుడప్పుడూ వచ్చే పోయే వారి కోసం కట్టించిందే. అందుకనే దీన్ని సత్రం అన్నాను.” అన్నాడా గురువు.

ప్రకటనలు