గర్భాలయం … హంపి నేపథ్యం లో నవల

హంపి
హంపి

హంపి యాత్ర నుంచి తిరిగొచ్చిన తర్వాత అంతర్జాలంలో హంపి గురించి ఏమైనా విశేషాలు ఉన్నాయేమోనని వెతుకుతుంటే గర్భాలయం అనే నవల రాసిన నండూరి శ్రీనివాస్ గారి బ్లాగు కనిపించింది. ఇది ఆయన మొదటి నవల. అయినా ఎక్కడా ఆ చాయలే కనిపించలేదు నాకు. ఇంతకు ముందు టపాలో హంపిలో విరూపాక్షాలయంలో తప్ప ఇంకెక్కడా పూజలు జరగడం లేదని ఊహించాను. ఈ నవల చదివాక రూఢి చేసుకున్నాను. అదే కాదు మిగతా దేవాలయాల్లో విగ్రహాలు లేవన్న విషయం కూడా స్పష్టం అయింది.

ఈ నవల స్వాతి మాసపత్రిక లో ప్రచురితమైంది. ఆయన Scribd లో అప్‌లోడ్ చేసి అక్కడికి లింకిచ్చారు. నవల చదవడం ప్రారంభించగానే  “ఈ నవల అసలు ఒక్కసారి చదివి హంపి యాత్రకు వెళ్ళుంటే బాగుండేదే” అనిపించింది. హంపి లోని ప్రదేశాలు అంత క్లియర్ గా వివరిస్తాడు అందులో.

ఇక కథ విషయానికొస్తే రాజు అనే యువకుడు అనాథగా పెరిగి చిల్లర మల్లర దొంగతనాలు చేస్తూ పట్టుబడి ఒక ప్రొఫెసర్ సాయంతో బయటపడతాడు. ఆయన సాయంతోనే గైడ్ చేయడం నేర్చుకుని జీవనం గడుపుతుంటాడు రాజు. ఒక రోజు ఓ కుటుంబానికి  హంపిలో విశేషాలు వివరిస్తుండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు. ఆ పిల్లవాడి తాలూకు ఎవరు  వెతికినా కనిపించకపోవడంతో తన ప్రియురాలైన మల్లి సాయంతో తనే చూసుకుంటూ ఉంటాడు రాజు.

రాజు తాను గైడింగ్ కి వెళ్ళినప్పుడల్లా ఆ పిల్లవాణ్ణి వెంట తీసుకు వెళుతుంటాడు. వాడు ఏదైనా విశేషమైన ప్రదేశానికి తీసుకెళ్ళినప్పుడల్లా ఆశ్చర్యకరంగా ముద్దు ముద్దుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. రాజు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇలా ఉండగా ఆ పిల్లవాడి మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. రాజు ప్రాణాలకు తెగించి వాణ్ణి కాపాడుతాడు.

ఇక మిగిలిన కథ అసలు ఆ పిల్లవాడు అంత చిన్న వయసులోనే అంత పెద్ద మాటలు ఎలా మాట్లాడుతున్నాడు?  అతని తల్లిదండ్రులెవరు? అతన్ని చంపడానికి చూస్తున్నదెవరు? ఎందుకు చంపాలని చూస్తున్నారనే సస్పెన్స్ తో సాగిపోతుంది.

చారిత్రక ప్రదేశాల నేపథ్యం, సైకో అనాలిసిస్, సస్పెన్స్  అంటే ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన నవల ఇది. ఇక్కడ చదవండి.

ప్రకటనలు