హంపి యాత్ర

 ఏకశీలారథం
ఏకశిలారథం

గత శని, ఆదివారాల్లో మా సహోద్యోగులతో కలిసి పది మంది బృందం హంపి యాత్రకు వెళ్ళాము.హైదరాబాదు నుంచి ఒక వాహనం మాట్లాడుకున్నాం. మొత్తం ఏడు గంటల ప్రయాణం.

తుంగభద్ర నదికీ ఒక ఒడ్డున ఉన్న మోగ్లీ అతిథి గృహంలో మా బస. దర్శనీయ ప్రదేశాలన్నీ మరో ఒడ్డున. వీటిని చూడాలంటే పడవలో నది దాటి వెళ్ళాలి. తుంగభద్ర నదిలో నీరు ఎప్పుడూ ఉండటం వల్ల ఎక్కడ చూసినా వరి విస్తారంగా పండుతున్నది. మేమున్న అతిథి గృహానికి నదికి కేవలం కొన్ని పొలాలు మాత్రమే అడ్డు. ఉదయాన్నే లేచి చూస్తే మనోహర దృశ్యం కంటపడుతుంది.

తుంగభద్ర నది
తుంగభద్ర నది


ఎక్కడ చూసినా దేవాలయాలే, రాతి మంటపాలే.  మన పూర్వీకుల వైభవానికి చిహ్నంగా, మహమ్మదీయుల దాడులకు మౌన సాక్షిగా, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యానికి తార్కాణంగా లెక్కలేనన్ని రాతి నిర్మాణాలు. చాలా వరకు దేవాలయాల్లో దేవుళ్ళే లేరు. ఒక్క విరూపాక్ష దేవాలయం లో మాత్రం పూజలు జరుగుతున్నట్లు కనిపించాయి. హంపిలో ఉన్న మొత్తం దేవాలయాలను తనివితీరా చూడాలంటే కనీసం రెండు మూడురోజులు పడుతుంది.  మాకు అంత సమయం లేకపోవడం వల్ల, మా బృందం ఎండకు అలసిపోవడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు మాత్రం చూడగలిగాం. Royal enclosure, Lotus Mahal మాత్రం దూరం నుంచి చూడగలిగాను. ఏమైనా సరే మళ్ళీ ఒకసారి వెళ్ళి అన్ని ప్రదేశాలు చూస్తే గానీ  తృప్తి కలిగేలా లేవు.

హంపి చుట్టూ  రాతి గుట్టల మయమే. ఈ రాళ్ళనుంచే దేవాలయాలకు, మంటపాలకు వాడిన స్తంభాలను చెక్కి ఉండచ్చు కాబట్టి రాళ్ళను ఒకచోట నుంచి మరో చోటుకు మోసే శ్రమ కూడా తగ్గి ఉండచ్చు. అంతే కాకుండా ఆ కాలంలో ఒక వేళ శత్రువులు రావాలన్నా ఈ రాతి గుట్టలన్నింటినీ దాటి రాజ ప్రాకారం వరకు వచ్చేసరికి వాళ్ళ పనైపోయినట్లే. అందుకే దీన్ని రాజధాని నగరం ఎన్నుకున్నారేమో అనిపించింది.

విజయనగర సామ్రాజ్యం ఎంతటి సిరిసంపదలతో విలసిల్లిందో తెలుసుకోవాలంటే అన్ని దేవాలయాలు పెంచి పోషించాలంటే ఎంత ధనం అవసరమౌతుందో తలుచుకుంటేనే అర్థమౌతుంది.

నది ఒడ్డునే ఎన్నో సత్రాల లాంటి మంటపాలు బాటసారులకు సేదతీర్చేవిలా కనిపించాయి. కొన్ని దేవాలయాలు భూగృహంలో కూడా ఉన్నాయి. ఇవి బయటకు మామూలుగా కనిపిస్తాయి. దగ్గరగా వెళితే తప్ప అక్కడ ఓ ఆలయమున్నట్లు కనిపించదు.

ఎండాకాలం వల్లనో ఏమో ఎక్కడా ఎక్కువగా జనాలు లేరు. విరూపాక్ష దేవాలయం, ఏకశిలా రథం, రాణీ స్నాన మందిరం, కృష్ణ దేవాలయం లాంటి ప్రదేశాలన్నీ బాగా ప్రశాంతంగానే చూడగలిగాం. కానీ తాకితే సంగీతస్వరాలు పలికించే స్థంభాలు కలిగిన మంటపం లోకి మాత్రం యాత్రీకులకు ప్రవేశం నిషేధించారు.

ఎక్కడికెళ్ళినా తెలుగు మాట్లాడేవాళ్ళు ధారాళంగా కనిపించారు. పట్టణమంతా ఎక్కడ చూసినా విదేశీయులు కనిపించారు. వీళ్ళను బుట్టలో వేసుకోవడానికి ఆటో డ్రైవర్లు, వ్యాపారులు వాళ్ళ యాసను ను అనుకరిస్తూ మాట్లాడే ఇంగ్లీషు భలే సరదాగా అనిపించింది. డ్రగ్స్ వ్యాపారం కూడా జోరుగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

రెస్టారెంట్లలో భారతీయ వంటకాల కన్నా ఇటాలియన్, టిబెటన్, మెక్సికన్ లాంటి విదేశీ రుచులే ఎక్కువగా కనిపించాయి. ఆ వంటకాల పేర్లు ఎంత గుర్తు పెట్టుకున్నా ఇక్కడ రాద్దామంటే గుర్తుకు రావడం లేదు. :-). ఎలాగైతేనేం అలాగైనా వివిధ దేశాలకు చెందిన రుచులు చూశాం అన్న తృప్తి మాత్రం మిగిలింది.

ప్రకటనలు