గర్భాలయం … హంపి నేపథ్యం లో నవల

హంపి
హంపి

హంపి యాత్ర నుంచి తిరిగొచ్చిన తర్వాత అంతర్జాలంలో హంపి గురించి ఏమైనా విశేషాలు ఉన్నాయేమోనని వెతుకుతుంటే గర్భాలయం అనే నవల రాసిన నండూరి శ్రీనివాస్ గారి బ్లాగు కనిపించింది. ఇది ఆయన మొదటి నవల. అయినా ఎక్కడా ఆ చాయలే కనిపించలేదు నాకు. ఇంతకు ముందు టపాలో హంపిలో విరూపాక్షాలయంలో తప్ప ఇంకెక్కడా పూజలు జరగడం లేదని ఊహించాను. ఈ నవల చదివాక రూఢి చేసుకున్నాను. అదే కాదు మిగతా దేవాలయాల్లో విగ్రహాలు లేవన్న విషయం కూడా స్పష్టం అయింది.

ఈ నవల స్వాతి మాసపత్రిక లో ప్రచురితమైంది. ఆయన Scribd లో అప్‌లోడ్ చేసి అక్కడికి లింకిచ్చారు. నవల చదవడం ప్రారంభించగానే  “ఈ నవల అసలు ఒక్కసారి చదివి హంపి యాత్రకు వెళ్ళుంటే బాగుండేదే” అనిపించింది. హంపి లోని ప్రదేశాలు అంత క్లియర్ గా వివరిస్తాడు అందులో.

ఇక కథ విషయానికొస్తే రాజు అనే యువకుడు అనాథగా పెరిగి చిల్లర మల్లర దొంగతనాలు చేస్తూ పట్టుబడి ఒక ప్రొఫెసర్ సాయంతో బయటపడతాడు. ఆయన సాయంతోనే గైడ్ చేయడం నేర్చుకుని జీవనం గడుపుతుంటాడు రాజు. ఒక రోజు ఓ కుటుంబానికి  హంపిలో విశేషాలు వివరిస్తుండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు. ఆ పిల్లవాడి తాలూకు ఎవరు  వెతికినా కనిపించకపోవడంతో తన ప్రియురాలైన మల్లి సాయంతో తనే చూసుకుంటూ ఉంటాడు రాజు.

రాజు తాను గైడింగ్ కి వెళ్ళినప్పుడల్లా ఆ పిల్లవాణ్ణి వెంట తీసుకు వెళుతుంటాడు. వాడు ఏదైనా విశేషమైన ప్రదేశానికి తీసుకెళ్ళినప్పుడల్లా ఆశ్చర్యకరంగా ముద్దు ముద్దుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. రాజు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇలా ఉండగా ఆ పిల్లవాడి మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. రాజు ప్రాణాలకు తెగించి వాణ్ణి కాపాడుతాడు.

ఇక మిగిలిన కథ అసలు ఆ పిల్లవాడు అంత చిన్న వయసులోనే అంత పెద్ద మాటలు ఎలా మాట్లాడుతున్నాడు?  అతని తల్లిదండ్రులెవరు? అతన్ని చంపడానికి చూస్తున్నదెవరు? ఎందుకు చంపాలని చూస్తున్నారనే సస్పెన్స్ తో సాగిపోతుంది.

చారిత్రక ప్రదేశాల నేపథ్యం, సైకో అనాలిసిస్, సస్పెన్స్  అంటే ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన నవల ఇది. ఇక్కడ చదవండి.

11 thoughts on “గర్భాలయం … హంపి నేపథ్యం లో నవల

 1. ఇప్పుడే కొంచెం వేడిగా కృష్ణగారి బ్లాగ్లోంచి వచ్చానండీ. మీ కామెంట్ చూసా. హంపి ఫోటో చూడగానే వేడి చల్లారిపోయింది. నాకెందుకో ఆ హంపి జ్ఞాపకాలు తరుచూ మదిలో మెదులుతుంటాయి. నిద్రలో కూడా కనబడుతుంటాయి. ఎందుకో అర్థం కాదు. ఏదో అవినాభావ సంబంధం ఉందేమో.

 2. ఎప్పుడు వెళ్ళారు హంపికి? అన్ని ప్రదేశాలు తీరిగ్గా చూశారా? మేమైతే హడావిడిగా వచ్చేశాం.
  మళ్ళీ వెళ్ళినప్పుడు మాత్రం అన్ని ప్రదేశాలు తప్పకుండా చూడాలి.

  • 2004 లో వెళ్ళాను నిజానికి హంపి చూద్దామని కాదు జాకీచాన్ ని చూద్దామని. కాని అక్కడికి వెళ్ళాకా మనసుకి ఏదో తెలియని ఆనందం కలిగింది. ఏదో బంధం ఉందనిపించింది. నేను ఒకరోజున్నర తిరిగాను కాని ఒక్కడినే మూలంగా ఏదోలా అనిపించి మిగిలిన కొన్ని వదిలేసొచ్చాను. ఆనెగొంది చూడలేదు. అక్కతంగియారు గుట్ట, నవమి దిబ్బ, లోటస్ మహల్, హజార రామాలయం, విజయ్ విఠల్ గుడి, రత్నాలు అమ్మిన బజారు, ధర్మ త్రాసున్న చోటు, మరికొన్ని చిన్న గుడులు మాత్రం చూసాను. నాకు మళ్ళీ చూడాలని ఉంది. జాకీచాన్ కి కూడా రాజస్తాన్ కన్నా హంపి నచ్చి ఇక్కడ ది మిత్ సినిమా షూట్ చేసాడు.

 3. ఈ పుస్తకం నేను చదివాను. మీరు చెప్పినట్టు హంపి వివరాలన్నీ చాలా చక్కాగా ఇచ్చారు. మొదటిసారి వెళ్ళేవాళ్ళు ఈ పుస్తకాన్ని గైడ్ లా ఉపయొగించవచ్చౌ అనే రీతిలో. కధా, గమనమూ కూడా మొదట్లో చాలా బావున్నాయి కానీ చివరికి వచ్చేసరికి ఎందుకో మహా ఫార్ములా తెలుగు సినిమాలా తేలిపోయినట్టు అనిపించింది.

  • >>కానీ చివరికి వచ్చేసరికి ఎందుకో మహా ఫార్ములా తెలుగు సినిమాలా తేలిపోయినట్టు అనిపించింది.
   Agreed

 4. రెండేళ్ళ క్రితం నేను చూశాను హంపి! హంపి అప్పటివరకూ నా తీరని కల! దాదాపు నాలుగురోజులు అక్కడ ఉండి మళ్ళీ మళ్ళీ అన్నీ తిరిగి చూశాము ఒక టూ వీలర్ తీసుకుని! మేము వెళ్ళినపుడు హంపి విరూపాక్ష దేవాలయ రధోత్సవం జరుగుతోంది. పెద్ద సంత ! ఎంత బావుందో!

  ఆనెగొంది వెళ్ళి కృష్ణ దేవరాయల సమాధి కూడా చూశాము.అలాగే విఠల దేవాలయం పక్కనే కిష్కింధ కొండ మీద ఉన్న హనుమాన్ దేవాలయం చూశారా? విఠల దేవాలయం బయట ఎడమ వైపున్న వీధిలోనే రత్నాలు రాశులు పోసి అమ్మారని గైడ్ చెప్తుంటే ఒళ్లు గగుర్పొడిచినట్లనిపించింది.

  విఠల దేవాలయంలోని విఠలుడి విగ్రహాలు ఇప్పటికీ పండరి పురంలోని విఠల దేవాలయంలో ఉన్నాయట.అక్కడ ఒక గర్భ గుడిలో కానడ విఠల, కర్నాటక విఠల పేరుతో ఉంటాయట ఇవి.

  హంపి గురించి వంశీ రాసిన ట్రావెలాగ్ కథ చదివి తీరాలి రవి చంద్ర గారూ!ఆనాటి వాన చినుకులు కథా సంపుటిలో ఉంది.

  హంపీ యాత్ర ఒక అధ్బుతానుభవం..ఎవరికైనా!

  అదిసరే, ఇంతకీ అరటితోటలో అరెకరం మేర విస్తరించిన మామిడి చెట్టు కింద ఉండే కాంటినెటల్ రెస్టారెంట్ “మాంగో ట్రీ” కి వెళ్ళారా లేదా? పేరుకి కాంటినెంటలే అయినా అక్కడ పని చేసే వాళ్లంతా మనోళ్ళే! ఒంగోలు వాళ్ళు:-)

  • అయ్యో మేము శ్రీకృష్ణ దేవరాయలు సమాధి చూడలేదే. అంతా మా బృందం తో వచ్చిన సమస్య ఎక్కడి కి వెళ్ళాళన్నా తోసుకెళ్ళాల్సి వచ్చింది. అయినా పర్లేదు లెండి. కొన్ని ముఖ్యమైన ప్రదేశాలన్నా కవర్ చేశాం. రథ యాత్ర చూడలేదు కానీ రథం చూశాం. చాలా పెద్దది. దాన్ని ఫోటో కూడా తీసుకున్నాం.

   హనుమాన్ దేవాలయం కూడా చూశాం. విఠల దేవాలయం చూశాం.

   వంశీ గారి ట్రావెలాగ్ ఖచ్చితంగా చదువుతాను. ఎందుకంటే ఈ సారి వెళ్ళినప్పుడు ఇలా తెలుసుకున్న విషయాలన్ని ప్రత్యక్షంగా చూసి రావాలి.

   మ్యాంగో ట్రీ రెస్టారెంట్ మాత్రం అద్భుతమండోయ్ మధ్యాహ్నం చేయాల్సిన లంచ్ సాయంత్రం 5 గంటలకు అక్కడే చేశాం. ఒంగోలు వాళ్ళని తెలియదు కానీ తెలుగు మాత్రం స్పష్టంగా మాట్లాడుతున్నారు. ముందు టపాలో నేను చెప్పిన రెస్టారెంట్ రుచులు ఇక్కడ తిన్నవే.

 5. నమస్కారం,

  మీ హంపి యాత్ర అనుభవాలను చదివాను. చాల బాగుంది. అలాగే మీరు రాసిన హంపి నేపథ్యం లో నవల తపా ని చదివాను. అందులొ మీరు ఇచిన లింక్ ద్వారా “గర్భాలయం” నవలని చదివాను. అది ఎంత బాగుంది అంటే ఎప్పుడు మొదలయ్యి ఎప్పుదు ముగించానో తెలియలేదు. నవల చాల ఆసక్తి కరం గా ఉంది మరియు హంపి గురిచిన విశేషాలు బాగా రాసారు.ఈ నవల చదివిన తరువాత మాత్రం అనిపించింది హంపి కి వెళి రావలని.ఒక మంచి నవలని పరిచయం చెసినందుకు మీకు అభినందనలు.

  • హంపికి తప్పకుండా వెళ్ళిరండి. ముందుగా కొన్ని విశేషాలు చదివారు కాబట్టి ఇంకా ఆసక్తిగా ఉంటుంది.

 6. అభిప్రాయముని తెలుగు లొ పంపిచాలి అన్న ఉద్దేశ్యం తో త్వర త్వరగా Type చెయ్యడం జరిగింది.Spell mistakes ఏమైనా ఉంటే క్షమించండి.

 7. లింకు ఇచ్చినందుకు ధన్యవాదాలు
  ఈ నవల నేను కూడా చదివాను.
  చాలా బాగుంది. మంచి డిటెక్టివ్ నవలల్లో ఒకటి. ఎప్పుడో చిన్నప్పుడు కొమ్మూరి సాంబశివ రావ్ డిటెక్టివ్ పుస్తకాలు చదివేదాన్ని. మళ్ళీ ఆ అనుభూతి కలిగింది.

  నవల్లో చాలా భాగం ఎడిట్ అయిపోయినట్టుగా అనిపించింది.

వ్యాఖ్యలను మూసివేసారు.