పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు…

అపుడు నా వయస్సు పద్నాలుగు సంవత్సరాలు. మాది అంత కలిగిన కుటుంబమేమీ కాదు. చెప్పులు తెగిపోయాయని నాన్నని డబ్బులు అడిగాను. “బాగున్నాయి కద నాయనా! అప్పుడే పారేయడం ఎందుకు? ఐదు రూపాయలిస్తే కుట్టిస్తారు” అంటూ ఐదు రూపాయలు నా చేతిలో పెట్టాడు మా నాన్న.

సమయం మధ్యాహ్నం రెండు గంటలు. మే నెల్లో ఎండలు అదరగొడుతున్నాయి. చెప్పులు కుట్టించుకుందామని బయట వెళ్ళాను. దగ్గర్లో ఉన్న ఒక చెప్పులుకుట్టే ముసలాయన దగ్గర తెగిపోయిన చెప్పు ఇచ్చి కుట్టమన్నాను.

అంతా అయిపోయిన తర్వాత నా జేబులో ఉన్న ఐదు రూపాయలు తీసి అతని చేతిలో పెట్టాను. ఆయన నా వైపు విచిత్రంగా ఓ చూపు చూసి

“ఏం వేళాకోళంగా ఉందా? పదిహేను రూపాయలైంది. మిగతా పది రూపాయలు తీయ్” అన్నాడు.

నా దగ్గర ఆ ఐదు రూపాయలు తప్ప చిల్లి గవ్వ కూడా లేదు. ఎప్పుడూ ఏది అవసరమైనా నాన్నే తెచ్చిచ్చేవాడు పుస్తకాలు, పెన్నులు తప్ప.అందుకని ఇలాంటి విషయాల్లో నాకు బొత్తిగా అవగాహనే లేదు. ఎక్కడికెళ్ళినా వాళ్ళు ఎంత చెబితే అంత ఇచ్చేయడమే.

” నా దగ్గర ఇంకేమీ డబ్బుల్లేవు తాతా. ఇంటికెళ్ళి తెచ్చిస్తాలే.” నిజాయితీ గా అన్నాను.

నా నిజాయితీ ఆయనకేం తెలుసు? నా మాటలేవీ ఆయన చెవికెక్కలేదు.

“ప్రతి ఒక్కరికి ఇదో అలవాటైపోయింది. డబ్బులు లేవని చెప్పడం. ఇవ్వకుండా తప్పించుకోవడం. నా దగ్గర నీ ఆటలు సాగవు. మర్యాదగా డబ్బులు తీయ్ చెప్పులు తీసుకుపో” కొంచెం కఠువు గానే అన్నాడు.

“సరే చెప్పులు నీ దగ్గరే ఉంచు ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొస్తా” అంటూ లేవబోయాను.

“ఎక్కడికెళ్తావురా నా xxx. ఇలా అని తప్పించుకుందామని చూస్తున్నావా? మర్యాదగా డబ్బులిచ్చి కదులు” కోపం తారాస్థాయికి చేరింది ఆయనకి.

నాకేం చెయ్యాలో తోచలేదు. మెదడు మొద్దుబారి పోయింది. పారిపోదామంటే ఆయన పని చేసుకుంటూ కూడా నా వైపు ఓ కన్నేసి ఉన్నాడు. ఎక్కడ గొడవ చేసి ఉన్న పరువుకూడా పోగొడ్తాడేమోనని భయం. పైన ఎండ కాస్తున్న స్పృహ కూడా లేదు. వేసవి ప్రతాపానికి చెమట ధారాపాతంగా కారిపోతుంది. కొంచెం సేపు ఆలోచిస్తే ఒకే ఒక ఆలోచన వచ్చింది. “దార్లో కనిపించిన వాళ్ళని ఎవర్నైనా అడగటం”.

ఆయన చూస్తుండగానే దార్లో వస్తున్న వాళ్ళను డబ్బులు కోసం అడగడం మొదలు పెట్టాను.

“ఏం బాబూ చూస్తే చదువుకున్న వాడిలా కనిపిస్తున్నావు. ముందుగా ఎంతవుతుందో తెలియకుండానే కుట్టడానికిచ్చేసావా? ఎలాగోలా బ్రతిమాలు. ఇచ్చేస్తాడు”  పెద్దవాళ్ళందరూ ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తున్నారు కానీ ఎవరు ఆ ముసలాయనకి నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యడం లేదు.

చివరికి అద్దెకు ఎడ్లబండి తోలుకునే ఒక అబ్బాయి నా ఇబ్బందిని గమనించి ఒక ఐదు రూపాయలు చేతిలో పెట్టాడు. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ అబ్బాయికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కాలేదు. వయసులో చిన్నవాడని కూడా చూడకుండా గబుక్కున వంగి వాడి కాళ్ళకు దణ్ణం పెట్టేశా. ఆ అబ్బాయి మొహమాటపడుతూ దూరంగా జరిగాడు. అతనికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది.

ఆ అయిదు రూపాయలు తీసుకుని ఆ ముసలాయనకి ఎలాగోలా నచ్చజెప్పి అతని చేతిలో పెట్టాను. నోటికి వచ్చిన బూతులు తిడుతూనే ఆ డబ్బులు తీసుకుని ఆ చెప్పులు నా ముందుకు విసిరేశాడు ముసలాయన. బ్రతుకు జీవుడా అనుకుంటూ చెప్పులు తొడుక్కుని నాకు డబ్బులిచ్చిన అబ్బాయి వంక చూశాను. అతనింకా నా వైపు విచిత్రంగానే చూస్తున్నాడు.

” నాతో పాటు మా ఇంటికి రా. నీ  డబ్బులు నీకిప్పిస్తాను”  అన్నాను.

“పర్లేదులే అన్నా. ఎండకి ఇప్పటికే బాగా అలిసిపోయావు. తొందరగా ఇంటికెళ్ళిపో” అన్నాడు కొండంత హృదయంతో.

మరికొంత మంది నా వంక చూసి నవ్వుకోక ముందే వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాను.

నిజానికి ఈ సంఘటనలో ఎవర్నీ తప్పు పట్టడానికి లేదు. కానీ అప్పట్లో చిన్నతనం కాబట్టి గాయపడ్డ నా హృదయానికి,  ఆ ముసలాయన నా మీద జాలి చూపిస్తే బాగుండు అనిపించింది. తరువాత కొంచెం వయసు వచ్చాక నేనే కొంచెం నిర్మొహమాటం, ధైర్యం అలవర్చుకోవాలి అనుకున్నాను.