ఎడతెగని సాంప్రదాయం

చైనా దేశపు నీతి కథ:

ఒక గ్రామంలో ఒక రైతు నివసించేవాడు. భార్యా పిల్లలతో పాటు వృద్ధ్యాప్యంలో ఉన్న తన తండ్రిని పోషించడానికి రెక్కలు ముక్కలు చేసుకునే వాడు. రోజంతా కష్టపడ్డా కనీసం వాళ్ళకి తిండి గడవడం కూడా కష్టమయ్యేది.

అతను ఒకరోజంతా పనికి వెళ్ళకుండా తన దగ్గరున్న చెక్కలతో ఒక బండిని తయారు చేశాడు. తర్వాత రోజు తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు.

“నాన్నా నేను రోజంతాకష్టపడ్డా పూట గడవడమే కష్టంగా ఉంది. నువ్వుండటం వల్ల ఏ ప్రయోజనం లేదు” అని చెప్పి ఆయన్ని ఆ బండి మీద ఎక్కించుకుని దగ్గర్లో ఉన్న చిన్న కొండపైకి తీసుకువెళ్ళాడు.

కొండ పైభాగం చేరుకున్నాక, ఆగి బండిని క్రింది వైపుగా మళ్ళించాడు. బండిని దొర్లించడానికి ఉద్యుక్తుడవుతుండగా అతని తండ్రి ఆపి అతనితో ఇలా అన్నాడు.

“ఆగు నాయనా! నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, ఎందుకు చేస్తున్నావో కూడా తెలుసు. కానీ దయచేసి నాదొక విన్నపం. ఈ బండిని నువ్వు కష్టపడి తయారు చేశావు. దీన్ని దాచిపెట్టు. నీ కుమారుడికి అవసరమవుతుంది” అన్నాడు.

ఆ మాటలు విన్న కుమారుడు సిగ్గుపడి తండ్రిని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు.