రూపాయి విలువ

చిన్నప్పటి నుంచి రూపాయి విలువ అంటే బాగా తెలిస్తూ పెరిగాను. రూపాయి చేతిలో కనిపిస్తే పండగే. వేసవి సెలవుల్లో  ఐసు లమ్మే తాత  సైకిల్ మీద వస్తే మా పిల్లలందరికీ సంతోషమే సంతోషం.  వేరుశనగ వేయడానికి కాయలు చేత్తోనే ఒలిచే వాళ్ళు ఎక్కువగా అప్పట్లో. ఇప్పుడు చాలా మంది యంత్రాల సహాయం తీసుకుంటున్నారనుకోండి. ఒక ముంత (ఒక  కొలత) శనక్కాయలు ఒలిస్తే పావలా, అర్థ రూపాయి, అలా ఇచ్చే వాళ్ళు. ఇంకా చెప్పాలంటే పిల్లలు లేకపోతే వేరుశనగ పంటలో ముఖ్యమైన ఆ కార్యక్రమం పూర్తయ్యేది కాదు. అలా సంపాదించిన డబ్బులు కూడబెట్టుకుని ఐసులు కొనుక్కునే వాళ్ళం. కాయలు ఒలిచి చేతి వేళ్ళు బొబ్బలెక్కేవి. అన్నం తినేటప్పుడు మంట పుట్టేది. నోటితో ఊదుకుంటుంటే ఇంట్లో వాళ్ళు చీవాట్లు కూడా పెట్టే వాళ్ళు ఎందుకలా ఐసుకోసం చెయ్యి పాడుచేసుకోవడం అని. కానీ కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చుపెడుతుంటే ఆ ఆనందమే వేరు.అది చాలు అన్నింటినీ మరిపింప చేయడానికి. వేరుశనగ సాగులో ఇంకో ముఖ్యమైన పని పప్పు వేత. ముందు నాగలి దున్నుతుంటే వెనకనే నడుస్తూ నాగటి చాలులో పప్పు వేస్తూ పోవడాన్ని ఎక్కువగా పిల్లలకే అప్పగించే వాళ్ళు. ఒక రోజు పప్పు వేయడానికి వెళితే పది రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలా వెళ్ళి సంపాదించిన డబ్బులతో విద్యా సంవత్సరం మద్యలో అవసరమయ్యే పుస్తకాలు, పెన్నులు, తెల్ల కాగితాలు మొదలైనవి కొనుక్కునే వాళ్ళం.

ఇలా ప్రతి దశలో రూపాయి విలువ తెలుస్తూ బతికిన నాకు పీజీ కోసం వరంగల్ కి వెళ్ళినపుడు మాత్రం ఒక చేదు అనుభవం ఎదురైంది. గేట్ ప్రవేశ పరీక్ష ద్వారా కళాశాలలో ప్రవేశిస్తే నెలకు ఐదు వేలు ఉపకారవేతనం ఇచ్చేవాళ్ళు. ఉన్నత విద్య అంటే ప్రాణం. పైగా  మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళిచ్చే డబ్బులు ఆసగారా ఉంటుంది అని అందులో చేరాను. వాళ్ళేమీ ఊరికే ఇవ్వరు. అందుకు తగ్గ పని మేము కాలేజీలో చేసే వాళ్ళం. పేపర్లు దిద్దడం, ఇన్విజిలేషన్, ల్యాబులు నిర్వహించడం లాంటి పనులన్నమాట.

చేరిన మొదట్లో అనుకుంటా ఒక ప్రొఫెసర్ మా క్లాసులో ఒక ప్రశ్న అడిగాడు. అందుకు ఎవరూ “ఆయన సంతృప్తి చెందే సమాధానం” ఇవ్వలేకపోయారు. ఆయనకు బీపీ హెచ్చింది. ఒక్కసారిగా తిట్ల పురాణం లంకించుకున్నాడు. అవమానాలు నాకేమీ కొత్త కాదు. కాకపోతే ప్రభుత్వం “మీ మీద దండగ ఖర్చు పెడుతోంది. మీకు డబ్బులివ్వడమే దండగ” (ఆయన మాటల్లో చెప్పాలంటే: The government is unnecessarily wasting poor man’s money on you. You are paid for nothing) అన్నపుడు మాత్రం కొంచెం బాధనిపించింది. మనం చేస్తేనే కదా డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ ఈ మాటలన్నీ ఎందుకు అనడం? అని ఆ రోజంతా నిద్ర పట్టలేదు. పదహారు సంవత్సరాలు ఎంతో మంది గురువుల దగ్గర విద్యాభ్యాసం చేశాను. ఎవరి దగ్గరా ఇలాంటి మాట పడలేదు. కానీ మరుపు అనేది దేవుడి మనిషికిచ్చిన గొప్ప వరం. తొందర్లోనే దాని గురించి మరిచిపోయాను.

ఇరవై అయిదు  సంవత్సరాల ప్రయాణం లో ఎన్నో అనుభవాలు. అందులో ఇదొకటి. నేను అవమానాలుగా భావించే వాటికి అనుభవం అనే అందమైన పేరు పెట్టుకోవడం నాకు మొదట్నుంచీ అలవాటు. అందుకనే నా జీవితంలో అవమానాలుండవు. అనుభవాలు మాత్రమే ఉంటాయి. అందమైనవి!, బాధాకరమైనవి!. నాకు ఏదీ సులువుగా దొరకలేదు. చదువు, ఉద్యోగం, డబ్బు. ఇలా అన్నీ.  కానీ చివరిగా రావాల్సింది మాత్రం సులభంగా వస్తే చాలు. అదేనండీ మృత్యువు!