కూర్గ్ యాత్ర

మేము దిగిన అతిథి గృహంఈ వారాంతపు సెలవుల్లో సహోద్యోగులతో కలిసి వెళ్ళిన కూర్గ్ యాత్ర ఆద్యంతం ఉత్సాహ భరితంగా, ఉల్లాసంగా సాగిపోయింది. మధురమైన అనుభవాలను మిగిల్చింది. హైదరాబాదు నుంచి బెంగళూరుకు రైలులో వెళ్ళి అక్కడి నుంచి మేము ముందుగానే ఏర్పాటు చేసుకున్న వాహనంలో సుమారు ఆరుగంటల పాటు ప్రయాణించి కాఫీ తోటలకు నిలయమైన కూర్గ్ చేరుకున్నాం. దారి పొడవునా బృంద గానాలతో కాసేపు , మూగసైగల క్రీడా విలాసాలతో కాసేపు, నిద్రాదేవి గాఢ పరిష్వంగంలో కాసేపు, హాస్యపు చిరుజల్లులతో ఎంతో మనోహరంగా ముందుకు సాగిపోయింది మా యాత్ర.  గురువారం రాత్రి హైదరాబాదులో బయలుదేరిన మేము శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి గానీ అక్కడికి చేరుకోలేకపోయాం. ముందు సెలయేరు, దాని ఒడ్డునే మేముండే అతిథి గృహం, చుట్టూ పచ్చటి ప్రకృతి, నీలాకాశం, పక్షుల కిలకిలలు, పిల్ల గాలి తెమ్మెరలు, సెలయేటి గలగలలు తప్ప వేరే ఏ సవ్వడీ వినిపించని ఆ ప్రదేశం లో కాలుమోపగానే ఒక్కొక్కరి ఆనందానికీ అవధులు లేవు.

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అక్కడ దిగినా ప్రకృతి కాంత ఒడిలో మైమరిచిపోయిన మాకు అక్కడి వారు వచ్చి భోజనానికి పిలిచేదాకా ఆకలే వెయ్యలేదు. ప్రతి ఒక్కరి నోటా ఒకే మాట. “వారే వా”.భోజనానంతరం పక్కనే ఉన్న సెలయేటిలో అందరూ తనివితీరా ఆడారు.

అనంత దృశ్యంఆరోజు రాత్రి చలిమంట చుట్టూ చేరి ఆటలు, పాటలు సరదా సరదాగా గడిచిపోయింది. మరుసటి రోజు నేను మరో ఇద్దరితో కలిసి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తైన పర్వత శిఖరం మీద నుంచి ప్రకృతి దృశ్యాలను పరికించాలని బయలు దేరాం. దారి పొడవునా ఘాట్ రోడ్డు అందాలను ఆస్వాదిస్తూ కదిలిపోతుంటే అసలు సమయమే తెలియలేదు. శిఖరం మీదకు చేరగానే కనిపించాయి అనేకమైన అద్భుత దృశ్యాలు.

అదే రోజు మధ్యాహ్నం కావేరీ నది ఒడ్డున ఉన్న ఏనుగుల శిబిరాన్ని సందర్శించాం. మరుసటి రోజు మేము బసచేసిన కాటేజీకి దగ్గర్లోనే ఉన్న అబ్బే జలపాతాన్ని చూశాం. ఇక్కడికి వెళ్ళేటపుడు దారి పొడవునా చిరుజల్లులు, పర్వత శిఖరాలతో దోబూచులాడుతున్న మబ్బులు, ప్రకృతి పరదా వేసుకున్నదా అనిపించేలా పొగమంచు మరపురాని దృశ్యాలు. ఒక్క మాటలో చెప్పాలంటే నా కల నిజమైంది. ఎందుకంటే ఇలాంటి ప్రదేశం మొన్నటి దాకా నా ఊహల్లోనే ఉంది. ఇప్పుడు నా స్మృతుల్లోకి చేరింది.