మీ చిరునవ్వును చెదరనీయకండి

ఒక పాప రోజూ స్కూల్ కి నడిచి వెళ్ళి వస్తుండేది. ఒక రోజు వాతావరణం మేఘావృతమైనప్పటికీ స్కూల్ కి బయలుదేరింది. తిరిగి ఇంటికి వస్తుండగా గాలులు బలంగా వీచసాగాయి. ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి.  ఆ పాప తల్లికి ఆందోళన మొదలైంది. పాప భయపడుతుందేమోనని ఆమె భయం. ఆమె వెంటనే కారు తీసుకుని కూతుర్ని వెతుక్కుంటూ బయలు దేరింది.

అలా వెళుతుండగా దారి వెంబడే పాప నెమ్మదిగా భయం లేకుండా నడుస్తూ ఉండటం కనిపించింది. మెరుపు మెరిసినప్పుడల్లా పాప ఆగి నెమ్మదిగా చిరునవ్వు నవ్వుతోంది. కారు నెమ్మదిగా కూతురి దగ్గర ఆపి పాపని ఇలా అడిగింది.

“ఎందుకమ్మా అలా మెరుపు మెరిసినప్పుడల్లా ఆగి నవ్వుతున్నావు?” అని అడిగింది.

“పై నుంచి దేవుడు నన్ను ఫోటో తీస్తున్నాడమ్మా. అందుకనే అలా నవ్వుతూ ఫోజిస్తున్నా” అందా పాప.

అందుకే ఎంతటి కష్టంలోనైనా మీ మోము నుండి చిరునవ్వును చెదరనీయకండి.

పడి లేచిన కెరటం కర్నూలు

కర్నూలులో నేను గడిపిన కొద్ది సమయంలో నేను గమనించిన, అక్కడి వాళ్ళ మాటల ద్వారా గ్రహించిన కొన్ని విషయాలు.

అందరి కృషి వల్లా చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్జీవోలు లేనిదే కర్నూలు ఇంత త్వరగా కోలుకోవడానికి సాధ్యం కాదని కొంతమంది చెప్పడం విన్నాను. పట్టణమంతటా అక్కడక్కడా నీళ్ళు ఎంత వరకు వచ్చాయో కొన్ని గుర్తులు పెట్టి ఉన్నారు. ఈ గుర్తుల ప్రకారం నిజమైన బాధితులకు నష్ట పరిహారం చెల్లించడానికి కాబోలు. మేము వెళ్ళిన జూనియర్ కళాశాల అధ్యాపకులు మధుసూధన్ ప్రత్యేక విధుల మీద సహాయ కార్యక్రమాల పర్యవేక్షకుడిగా ఉన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం కొన్ని  పేద కుటుంబాలు ఇరవై వేల రూపాయల ధనం, ఓ ముప్ఫై బియ్యం బస్తాలు వరకు సమకూర్చుకున్నారు. కొద్ది మందైతే  మరో సారి వరదలొచ్చినా బాగుణ్ణు అనుకుంటున్నారు. ఎందుకంటే వరదల్లో కొట్టుకుపోవడానికి వాళ్ళ దగ్గర పెద్ద విలువైన వస్తువులేమీ ఉండవు. రెండో సారి మళ్ళీ డబ్బులు వస్తాయని వారి ఆశ. ఎటొచ్చీ త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నది మధ్యతరగతి ప్రజలే. సహాయం కోసం అర్థించాలంటే అభిమానం అడ్డొస్తుంది మరి. ఒక దృశ్యం ప్రత్యక్షంగా నేను టీవీలో చూశాను కూడా.

ఒక దగ్గర అందరికీ అన్నం పొట్లాలు పంచిపెడుతున్నారు. ఆకలి గొన్నవారు వరుసలో నిల్చుకొని తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఒకాయన మాత్రం కళ్ళ నిండా నీళ్ళతో నెమ్మదిగా కదులు తున్నాడు. ఒక టీవీ వారు కెమెరా తో ఆయన్ను పలకరించారు. దాంతో ఆయన మాట్లాడిన మాటలు.

“మా ఇంట్లో కనీసం రోజుకి ఒకరైనా అతిథి వచ్చి భోంచేసి వెళుతుండే వారు. ఈ రోజు నేనే ఇక్కడ ఇలా…” దు:ఖంతో గొంతు పూడుకుపోయి ఆయనకిక నోట మాట రాలేదు. ఒక విధంగా ఆయన మధ్యతరగతి ప్రతినిథిలా కనిపించాడు నాకు.

కాకపోతే నాకు బాధ కలిగించిన అంశం ఒకటుంది. వరద బాధితుల కోసం సమకూర్చిన నిధులను అక్కడ వరదకు గురికాని ప్రదేశాలకు చెందిన వారు కూడా స్వీకరించడం. కనీసం పక్కన ఉన్న వారిపై కూడా ఆ మాత్రం జాలి లేకపోతే ఎలా? ఇలా సమస్యలు రాకూడదని వైయస్ జగన్ వర్గీయులు ముందుగా బాధితులకు కలర్ ఫోటోలతో కూడిన వెయ్యి కార్డులను పంపిణీ చేశారు. ఆ కార్డులను తీసుకెళితే వారికి డబ్బు అందజేయాలన్నది వారి ఆలోచన. కొద్ది సేపటి తర్వాత వారికి ఒక అనూహ్యమైన విషయం తెలిసింది. ఏంటంటే ఆ కార్డులను కలర్ జెరాక్స్ సాయంతో నకిలీలు తయారు చేస్తున్నారని. తమ అధికారాన్ని ఉపయోగించి పట్టణంలో ఉన్న కలర్ జిరాక్స్ అంగళ్ళను మూయించ గలిగారు. తీరా పంపిణీ దగ్గరికి వచ్చే సరికి మూడు వేల మంది తమ కార్డులతో ప్రత్యక్షమయ్యారు. డబ్బెవరికి చేదు? కాకపోతే తామలా చేయడం వల్ల నిజమైన లబ్దిదారులకు సాయం అందకుండా పోతుందని గమనిస్తే చాలు.