అమ్మ దీవెన

ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ప్రకాశం జిల్లాలోని ఒకమారుమూల  గ్రామం రావూరు. అక్కడ  బండ్లమాంబ దేవిగా వెలసిన రాజ రాజేశ్వరి దేవి ఆలయంలో దేవీ ఉపాసకురాలైన రాజమాతాదేవి భక్తులనుద్దేశించి ప్రసంగిస్తోంది. ఒకాయన సుమారు సంవత్సరం వయసున్న కుమారుణ్ణి ఒడిలో కూర్చుండబెట్టుకుని ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఎంతో మంది డాక్టర్ల దగ్గరకు తిరిగి నయం కాకపోవడంతో, శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహా మేరకు ఆ ఆలయానికి వచ్చాడు.

ఎవరో బయట పిలవడంతో  పిల్లవాడిని అక్కడే నేలమీద వదిలి బయటకు వెళ్ళాడు. ఆ పిల్లవాడు నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళి ప్రసంగిస్తున్న రాజమాత దేవి పాదాల మీద పడ్డాడు. ఆమె తన అమృత హస్తాలతో ఆ బాలుని ఎత్తుకొని ప్రేమగా తల నిమిరి,

“ఎవరీ అబ్బాయి. మంచి విద్యావంతుడవుతాడు. మంచి భవిష్యత్తు ఉంది ఇతనికి” అంటూ పలికింది.

బయటి నుంచి తిరిగి వస్తున్న ఆ తండ్రికి ఆ వాక్కులు అమృత సదృశంగా తోచాయి. అతని వదనంలో ఆనందం వెల్లివిరిసింది. సంతోషంతో ఆమె దగ్గర్నుంచి కొడుకుని తీసుకుని ఆశ్చర్యంతో చూస్తున్న భక్తులను దాటుకుంటూ తమ బిడ్డకు కలిగిన అదృష్టాన్ని తెలియజేయడానికి భార్యవైపు సాగిపోయాడు.

ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె మాటలు నిజం చేస్తూ ఆ బాలుడే ఇప్పుడు మీకు స్వయంగా పై సంఘటన విన్నవించుకుంటున్నాడు.

అర్థం కాలేదా? పై సంఘటనలో బాలుణ్ణి నేనే!

ఈ శని వారం, ఆదివారం ఈ గుడికే వెళుతున్నాను.

అంతవరకు శలవు. మళ్ళీ కలుద్దాం.