మాటలకున్న శక్తి

మా అమ్మమ్మకు మా అమ్మ ఒకటే సంతానం. వృద్ధాప్యం సమీస్తుండటంతో ఊళ్ళో వ్యవసాయం చేయలేక నా చదువు కోసం మా అమ్మమ్మ వాళ్ళు ఊర్లో ఉన్న ఇల్లు, పొలం అన్నీ అమ్ముకుని పట్టణానికి మకాం మార్చేశారు.  నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో బాల్యమిత్రులు కొద్దిమంది కాళహస్తిలో ఒక గది అద్దెకు తీసుకుని అందులో ఉండే వాళ్ళు. ఖాళీ సమయాల్లో వాళ్ళ గదికి వెళ్ళి కాలక్షేపం చేస్తుండే వాణ్ణి. వాళ్ళ కోసం అప్పుడప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కావాల్సిన వస్తువులు తెచ్చిస్తూ ఉండేవారు.

ఒకసారి ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చూడ్డానికి వచ్చింది. సమయానికి నేను అక్కడే ఉన్నాను. ఏదో తినడానికి తెచ్చినట్లుంది. వీడేమో నాకొద్దంటే వద్దంటూ కసురుకుంటున్నాడు. అసలు విషయం ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్ళాను.

“నేనడిగిన డబ్బులు ఎందుకు తేలేదు? నాకు నువ్విచ్చేది ఏమీ వద్దు. తిరిగి తీసుకెళ్ళిపో” అంటూ కోప్పడుతున్నాడు.

“బాబ్బాబూ ఈ సారికి ఇవి తీసుకోరా. డబ్బులు సర్దుబాటు కాలేదు. ఈ సారి వచ్చేటప్పుడు తెస్తాలే” ప్రాధేయపడుతోంది. ఆమె మనసులోని బాధ ముఖంలో ప్రస్ఫుటంగా కనపడుతోంది.

వాణ్ణి నెమ్మదిగా పక్కకి పిలిచి “ఏరా! ఆమె ఊర్నుంచి నీ కోసం కష్టపడి చేసి తినడానికి తీసుకుని వస్తే ఇలాగేనా కసురుకునేది. ఆమె మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా. డబ్బు సర్దుబాటు అవలేదని చెబుతోంది కదా. మళ్ళీ వచ్చేటప్పుడు తెస్తుందిలే. వెళ్ళి ఇచ్చిన వాటిని తీసుకో” చాలా క్యాజువల్ గా అనేశాను వాడితో.

వాడెళ్ళి నెమ్మదిగా ఆమె ఇచ్చిన వస్తువులు తీసుకున్నాడు. అప్పుడు గమనించాను ఆమె కళ్ళలో ఆనందం. నిజంగా నేనన్న మాటలకు అంత ఫలితం కనిపిస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది నాకు. మాటలకున్న శక్తి అలాంటిది. అప్పట్నుంచీ వాడేదైనా మాట వినకపోతే నా దగ్గరికి వచ్చి నచ్చజెప్పమనేది. నేను అందుకు సంతోషంగా అంగీకరించే వాణ్ణి. ఎందుతో తెలుసా? చిన్నప్పుడు నేను చదివిన వేమన పద్యాన్ని కొద్దిగానైనా ఆచరణలో పెట్టినందుకు.

కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు

నష్టపెట్టబోకు నాన్న పనులు

తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా

విశ్వదాభిరామ వినుర వేమ