ఋణం తీర్చుకుంటున్నానిలా…

ఆ శ్రీకాళహస్తీశ్వరుని దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాలలో (శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -స్కిట్)అతి తక్కువ ఖర్చుతో బీటెక్ పూర్తి చేశాను. ఏదో చెయ్యాలనిపించింది. అక్కడే పని చేస్తున్న నా మిత్రుడు ముని కుమార్ ని కలిసి కళాశాలలో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేయమన్నాను. దీని ద్వారా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసిన అనుభవం అక్కడ విద్యార్థులకు అందించాలని నా ఆలోచన. ఇది గ్రామీణ కళాశాల కాబట్టి ఇక్కడి విద్యార్థులకు మంచి ఉపయుక్తం కాగలదని భావిస్తున్నాను. ఇటీవలే ప్రారంభించిన ఈ విభాగానికి ఇటీవల దసరాకి వెళ్ళినపుడు మొట్టమొదటి సెమినార్ ఇచ్చాను. భవిష్యత్తులో కూడా ఇంకా ఇస్తాను. కళాశాలకు అవసరమయ్యే సాఫ్ట్‌వేర్, వెబ్‌సైటు మొదలైనవి అక్కడ పనిచేసే విద్యార్థుల ద్వారా చేయించడం ద్వారా వారు చదువుకున్న పరిజ్ఞానాన్ని నిజజీవితంలో ఉపయోగించడమే కాకుండా పరిశ్రమకు వెళ్ళే ముందు మంచి అనుభవం కూడా ఇచ్చినట్లవుతుంది.
ఇందుకోసం ఒక ప్రవేశ పరీక్ష పెట్టి ఆసక్తిగల విద్యార్థుల బృందాన్ని తయారు చేశాం. వీరు చివరి సంవత్సరం కాలేజీ వదిలి వెళ్ళేటపుడు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చి పంపిస్తామని కూడా చెప్పాడు మా మిత్రుడు. ఈ విషయం ఇక్కడ ఎందుకు రాస్తున్నానంటే నాలాగే ఆసక్తి ఉన్నవాళ్ళకు ఒక ఆలోచన ఇచ్చినవాణ్ణవుతాను గనుక.