వితరణ పర్వం

పుస్తకాలు పంపిణీ చేస్తూ నేను
పుస్తకాలు పంపిణీ చేస్తూ నేను

సోమ వారం రోజు మా సంస్థ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా కర్నూలు జూనియర్ కళాశాల నందు, వరదల్లో తమ విద్యా సామాగ్రిని కోల్పోయిన విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశాం. 2007 లో మా సీనియర్ కె.వి.యస్. ఫణిరంజన్ గారు ప్రారంభించిన ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి దాకా చిన్న చిన్న సాయాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ సారి పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు కావడంతో, విక్రమ్ పబ్లిషర్స్ వారు పెద్దమనసుతో స్పందించి మాకు యాభై శాతం ధరకే పుస్తకాలు సరఫరా చేయడంతో, 500 మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయగలిగాం. ఈ బృహత్తర కార్యక్రమానికి చాలా మంది సహకారం అందించారు.పెద్ద మొత్తంలో సాయం అందించిన అజిత్ కుమార్ రెడ్డి, మహేష్, మధులత గార్లకు ప్రత్యేక అభినందనలు. ఇంకా ఫణిరంజన్ గారి సోదరులు మధుసూధన్ ఇదే కళాశాలలో అధ్యాపకులు. ఆయన చేసిన సహాయం ఎనలేనిది.

ముఖ్యంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులను గుర్తించడంలో, కార్యక్రమాన్ని  నిర్వహించడం అంతా చూసుకోవడంతో మా పని చాలా సులువైంది. మాతో బాటు శ్రీ ఎక్కిరాల భరధ్వాజ గారి శిష్యుల (కళాశాల ప్రిన్సిపల్ కూడా ఆయన శిష్యులే) ఆధ్వర్యంలో భరధ్వాజ సేవా సంస్థ, కళాశాల పూర్వ విద్యార్థి ఒకరు, సూళ్ళూరుపేటకు చెందిన మరో సంస్థ కలిసి పుస్తకాలు, బ్యాగులు, టిఫిన్ క్యారియర్లు, దుస్తులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. మేము ఒక గదిలో కూర్చుని ఉండగా మమ్మల్ని కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి చాలా మంది వచ్చారు. వారి ముఖాల్లో విరిసిన చిరునవ్వులు వెలకట్టలేనివి. వాళ్ళను చూడగానే ముందు రోజు నిద్రలేని ప్రయాణం చేసిన బడలిక నాకు ఒక్క క్షణంలో ఎగిరిపోయింది. మొత్తం మీద ఈ కార్యక్రమం నా జీవనయానంలో ఒక మరుపురాని మజిలీ.