చుక్కేసుకొచ్చేనమ్మా సూడు

2005 లో  నా ఇంజనీరింగ్ పూర్తవగానే గేట్ కోచింగ్ కోసమని హైదరాబాద్ వచ్చి ACE కోచింగ్ సెంటర్ లో నవంబర్ నుంచి ప్రారంభమయ్యే షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరాను.ఇది అబిడ్స్ లో ఉంది. దగ్గర్లో ఉన్న బోగుల్ కుంట లో ఒక బాలుర హాస్టల్ లో చేరా ఇన్‌స్టిట్యూట్ కి దగ్గరగా ఉంటుందని.


కోర్సు పూర్తయేది ఫిభ్రవరికైనా జనవరి దాకా వెలగబెట్టింది చాల్లే, ఇంక ఇంటికి వెళ్ళి సంక్రాంతి ఆనందంగా గడిపి సొంతంగా ప్రిపేరవుదాంలే అని జనవరి 10 వ తేదీన ఇంటికి వెళ్ళడానికి ముహూర్తం పెట్టుకున్నాను.అదీ కాకుండా ఆ హాస్టల్లో ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో తెలవడం కూడా ఇంకో కారణం. అక్కడ ఉండటం వల్ల ఇంటికి వెళ్ళింతర్వాత చికెన్ ఫాక్స్‌తో రెండు వారాలు మంచంలో పడ్డాను.

నేను హైదరాబాదు రావడం అదే ప్రథమం. ఒక పది రోజుల ముందు రైలు టికెట్ రిజర్వేషన్ చేయించుకుందామని వెళితే ఒక్కటంటే ఒక్క రైలుగా కూడా టికెట్లు దొరకలేదు. ఏంటీ… సంక్రాంతికి కూడా నీకు పదిరోజుల ముందు టికెట్లు దొరుకు తాయా అని కొంతమంది పరాచికాలాడారు.

సరే అని బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుందామని వెళితే అక్కడా అదే పరిస్థితి. సరే మనకి ఏ ట్రైనూ లేనపుడు క్రిష్ణా ఎక్స్‌ప్రెస్ అనబడే ఒక పాసెంజర్ కదా దానికెళదాంలే అనుకున్నాను. 10 తేదీ ఉదయం 4 గంటలకే లేచి 5 గంటలకు అంతా సర్దుకుని 5:30 కి వచ్చి నాంపల్లి రైల్వే స్టేషన్ లో టికెట్ కౌంటర్ లో నిలచున్నా. ఒక అర్థ గంట క్యూలో నిలుచున్న తరవాత నా వంతు వచ్చింది. “కృష్ణా ఎక్స్‌ప్రెస్ శ్రీకాళహస్తికి ఒక టికెట్” అనంగానే ట్రైన్ రద్దయిందని చావు కబురు చల్లగా చెప్పాడు.

నా లగేజీ నంతా ఈడ్చుకుంటూ అక్కడ నుంచి బయటపడ్డాను. ఇంక నాకు బస్సే గతి అని డిసైడైపోయి అక్కడ నుంచి బస్టాండు కెళదామని ఆటో కోసం చూస్తున్నా. ఇంతలో పొట్టిగా ఉన్న వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఎక్కడికెళ్ళాళి మీరు అన్నాడు. అపరిచితుడయ్యే సరికి నేను కొంచె ముభావంగానే “కాళహస్తి” అన్నాను పొడిగా.

“అలా చెప్పండి మరి… నేను నెల్లూరు వెళ్ళాలి. మీలాగే ఈ రైలును నమ్ముకుని వచ్చి చిక్కుల్లో పడ్డాను. టికెట్ కౌంటర్లో మీ వెనకాలే నిల్చున్నా. బయటకు వచ్చేస్తుంటే ఇదేదో నా బాపతే అనుకుని మీ వెనకాలే వస్తున్నా” అన్నాడు.

నాక్కొంచెం ధైర్యం వచ్చి “అయితే ఇద్దరం కలిసే వెళదామా?” అన్నా… నా లగేజీ మోసేందుకు ఒకడు ఫ్రీగా దొరికాడు కదా అని. సరే అన్నాడు. ఇద్దరం కలిసి ఓ ఆటో మాట్లాడుకొని మహాత్మా గాంధీ బస్టాండుకెళ్ళాం.

అక్కడికి వెళ్ళగానే తిరుపతి వైపు వెళ్ళే బస్సులు చాలానే ఉన్నాయి. తొందర తొందరగా ఓ బస్సు ఎక్కబోయాం. ఆ బస్సు కండక్టరు దారి దగ్గరే నిల్చుని “రిజర్వేషన్ ఉందా?” అని అడిగాడు.

మేమిద్దరం ఒకరిమొహాలు ఒకరు చూసుకుంటూ “లేదు” అన్నాం.

ఆయనో నవ్వు నవ్వి “రిజర్వేషన్ లేకుండా వెళ్ళిపోదామనే… ఇది పండగ సీజన్ బాబూ…ఈ బస్సంతా రిజర్వేషనే… ఇదే కాదు ఇక్కడ నిలబెట్టిన బస్సులన్నీ రిజర్వేషనే… మీరు వెళ్ళాలంటే ఆ కౌంటర్ దగ్గరకెళ్ళి టికెట్లు తీసుకోండి” అన్నాడు.

కాళ్ళీడ్చుకుంటూ రిజర్వేషన్ కౌంటర్ దగ్గరకెళ్ళాం.

“తిరుపతి వైపు వెళ్ళే బస్సులేమైనా ఉన్నాయా”అనడిగాం.

“ఇంకేమీ లేవు బాబూ…మీరు కావాలంటే విజయవాడ వెళ్ళే బస్సులు ఎక్కండి. అక్కడ నుండి చాలా బస్సులుంటాయి.” అన్నాడు.

సరే అని విజయవాడకు వెళ్ళే బస్సుకు టికెట్లు తీసుకున్నాం. 8 గంటలకొచ్చి నిలబడిన ఆబస్సు ను చూస్తే నవ్వొచ్చింది. ఆబస్సు మామూలుగా దూర ప్రయాణాలు చేసే బస్సు కాదు. హైదరాబాదులో మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు. ఆరోజు దాన్ని స్పెషల్ బస్సుగా వేశారట. సరే ఈ రోజు ఇలా ప్రయాణం చేయాలని రాసిపెట్టుందని మనసు కుదుట పరుచుకునేసి ఆ బస్సు ఎక్కి కూర్చున్నాం.

8:30 కి బస్సు బయలు దేరింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. బస్సు సూర్యాపేట సమీపించగానే నాకు దాహం వేసింది. ఈ హడావిడిలో అసలు నీళ్ళ సంగతే మరిచిపోయాను. టిఫిన్ సంగతి అసలే మరిచిపోయాను. దానికి తోడు నాకు రెండు చేతుల నిండా లగేజీ…

నా పక్కనున్న అతన్ని నీళ్ళడిగాను. అడగంగానే చేతికందించాడు. గట గటా రెండు గుక్కలు తాగేశాను. కొంచెం చేదుగా అనిపించింది. అయినా అవేం పట్టించుకోకుండా మరికొన్ని తాగేశా…

కాసేపటి తర్వాత కడుపులో కొద్దిగా మంట మొదలైంది. కొద్దిగా అనుమానం వచ్చి అతన్ని అడిగా అవి మంచి నీళ్ళేనా… అని.

అతను కూల్ గా ” మంచి నీళ్ళే… కాస్తా ఓడ్కా కలిపా” అన్నాడు.

అప్పడు వెలిగింది నాకు బల్బు. మద్యాహ్నం సూర్యాపేటలో దిగి అన్నం తినే దాకా ఆ మంట తగ్గనే లేదు.

అప్పటి నుంచి ఇప్పటిదాకా మందు పుచ్చుకోవడం అదే first and last time….

మధ్యాహ్నం మూడు గంటలకి విజయవాడలో దిగి అక్కడ మరో బస్సు ఎక్కితే నేను మా ఊరు చేరేసరికి రాత్రి ఒంటి గంట అయింది. అంటే సుమారు 21 గంటలప ప్రయాణంలోనే గడిచిపోయిందన్న మాట.

అప్పట్నుంచి ఎప్పుడైనా సంక్రాంతికి హైదరాబాదు నుంచి మా ఊరు వెళ్ళాలంటే రెండునెలల ముందే టికెట్ బుక్ చేసుకుంటున్నాను.

ఈ టపాకు ప్రేరణ మలక్ గారి ఈ టపా….

17 thoughts on “చుక్కేసుకొచ్చేనమ్మా సూడు

    • నాలుగు సంవత్సరాల ముందేసిన మందే ఇంకా గొంతులో చేదుగా అలానే ఉంది. నెలకొక సారేస్తే ఎలా ఉంటుందో…ఊహించుకుంటూనే అదోలా ఉంది. 🙂

  1. అందుకే ఎప్పుడన్నా స్నేహితులతో పార్టీ(బాంక్వెట్ )కెళ్తే,అక్కడ అన్నీ డ్రింకుల వాసనలు చూస్తుంటా….ఎందుకంటే మా వాళ్ళు మహా ముదుర్లు…ఏదోదాంట్లో కలిపేసి నాతో తాగిచ్చెయ్యాలని తెగ ప్రయత్నిస్తుంటారు….నేను వాళ్ళకంటేగా…..

    • నాక్కూడా అసహనం ఉండుంటే ఆ రోజు బస్టాండులో పడుకుని నిద్రపోయుండే వాణ్ణి. ఎలా గైనా ఊరికెళ్ళిపోవాలని ఓపిక చేసుకుని 12 గంటల ప్రయాణాన్ని 21 గంటలు చేసుకున్నా… 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.