మా పసిమనసుల్లో కలకలం రేపిన రిజర్వేషన్లు

మేము ఓసీలం అంట.  ఇది నాకు మా పెద్దోళ్ళు చెప్తేనే తెలిసింది. మా తాతలు ఎప్పుడో నేతులు తాగారంట. మాకు మాత్రం వాటి వాసనలు కూడా తెలియపోయినా పేరుకు అగ్రకులం. బడిలో పేరు రాయించేటపుడు తోకలేమీ తగిలించనప్పటికీ కులం మాత్రం ఓసీగానే రాశారు. దాంతో ప్రతి సంవత్సరం తరగతి ప్రారంభించేటపుడు పుస్తకాలు అందరితోపాటు మాకూ ఇచ్చేవారు కాదు. ఎందుకో పసిపిల్లలుగా ఆ క్షణం మాకు చాలా బాధేసేది. మొహం మాడ్చుకుని ఇంటికెళ్ళి నాకెందుకు పుస్తకాలివ్వరని మా అమ్మనడిగేవాణ్ణి. మనకు డబ్బులు ఉన్నాయి కదా అని సమాధానం చెప్పేది. మరి మనకంటే ఎక్కువ పొలం, డబ్బులు ఉన్న ఫలానా వాళ్ళకి ఎందుకిస్తున్నారని అడిగితే అవన్నీ మనకెందుకు? మనం డబ్బులు పెట్టి కొనుక్కుందాం లే అని ఓదార్పు మాటలు చెప్పేది.

పసిమనసులు దైవంతో సమానమంటారు. లేత మనసులు కాబట్టి ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా కొన్ని రోజులు ముభావంగా ఉండిపోయే వాడ్ని మళ్ళీ పుస్తకాలు కొనిచ్చేదాకా. కొన్ని రోజుల తర్వాత కొంచెం విషయపరిజ్ఞానం వచ్చాక ఈ రిజర్వేషన్లు కనిపెట్టిన వాళ్ళమీద పిచ్చి కోపమొచ్చేది.  అసలు రిజర్వేషన్లు ఎందుకు పెట్టారో తెలిశాక, ఒకసారి రిజర్వేషన్ ను ఉపయోగించుకుని జీవితంలో పైకి వచ్చినా తర తరాలుగా సిగ్గులేకుండా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసేవారి మీద కోపమొచ్చేది.

ఈ రిజర్వేషన్లు అందవలసిన వారికి సహాయపడకుండా, “అభివృద్ధి చెందిన వెనుకబడ్డ కులాల” వారి అడుగులకు మడుగులొత్తుతున్నా ఈ చట్టం మార్చాలని మాట మాత్రమైనా అనుకోకపోవడం మన నాయకుల ఓటుబ్యాంకు రాజకీయాలకు నిదర్శనం. ఇప్పుడు గనుక అంబేద్కర్ ఉంటే ఈ చట్టం దుర్వినియోగమౌతున్న తీరు చూసి ఖచ్చితంగా సిగ్గుపడతాడేమో…