మన ప్రభుత్వానికి ఆ దమ్ముందా?

ఇన్నాళ్ళు చంపుతాం, నరుకుతాం, తెగ్గోస్తాం, రక్తపుటేర్లు పారిస్తాం అని ప్రేలుతున్న కొంత మంది వేర్పాటు వాదుల గురించి  అందరూ మీడియాలోనూ, బయట మాట్లాడటం తప్పిస్తే ఎవరూ ఎక్కడా చట్టపరమైన చర్యలు చేపట్టమని కోరిన దాఖలాల్లేవు. స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఈ పని చేయడం ద్వారా ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసిందనిపిస్తుంది నాకు.

కేసీఆర్, మరికొందరు నాయకులు పలు సందర్భాల్లో వాడిన పరుష పదజాలాన్ని, వాటిని ప్రచురించిన వార్తల క్లిప్పింగులను ఆమె మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు జస్టిస్ సుభాషణ్ రెడ్డికి సమర్పించారు. తెలంగాణాలో ఆంధ్ర అనే పదం ఎక్కడా వినిపించ కూడదంట,కనిపించకూడదంట. ఇడ్లీ సాంబార్ అనే మాట కూడా  వినిపించకూడదంట!!!…ఇలా వాళ్ళ నోటికొచ్చినట్లు అడ్డదిడ్డంగా మాట్లాడటం ద్వారా తెలంగాణా లో నివసించే ఇతర ప్రాంతాల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారన్నది ఆమె ఫిర్యాదు సారాంశం. ఈ వాదన సమంజసంగా అనిపించిన సుభాషణ్ రెడ్డి ఇలాంటి వాటిని ఆపడానికి ఏమేం చర్యలు తీసుకుంటున్నారో డీజీపీని వివరణ అడిగారు. ఈ పని ఎప్పుడో చేసుండాల్సింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిపై చర్య తీసుకునే దమ్ము మన ప్రభుత్వానికుందా? అనేదే అసలు ప్రశ్న.

మా ఊరికి పట్టిన మద్యపాన భూతం

నేను ఎప్పుడైనా ఊరికెళితే చాలు “ఏం నాయనా రవే… బాగుండావా… నువ్వు బాగా సదూకుని మంచి ఉజ్జోగం లో చేరి మనూరి పేరు నిలబెట్టాల”  అని నోరారా పలకరించే వాడు, మనసారా దీవించే వాడు, మా ఊర్లో బూశాయన కొడుకు, పేరు మునిసుబ్బారెడ్డి*. ఈ మధ్యనే మద్యపాన మహమ్మారికి బలైపోయినాడు.

నేను చిన్నప్పుడు మా ఊర్లో సారా దుకాణాలు పెద్దగా ఉండేవి కావు. కానీ ఊరంతా స్వచ్ఛమైన తాటికల్లు మాత్రం బాగా దొరికేవి. ఎంత స్వచ్ఛమైనవంటే అలా చెట్టుమీద నుండి దించి ఆ చెట్టుకిందే అమ్మేసే వాళ్ళు. మద్యలో మేం పిలకాయలం ఎవరైనా లోటా ఎత్తుకుని పోతే గీత కార్మికులు మాకూ కొన్ని పోసేవాళ్ళు ఉచితంగా…

ఏంటి చిన్నపిల్లలు కూడా కల్లు తాగేవాళ్ళా అని ఆశ్చర్యపోకండి. మాకది అలవాటే. పెద్దవాళ్ళు కూడా అభ్యంతరపెట్టేవాళ్ళు కాదు కదా కొన్నిసార్లు కొద్దిగా పుచ్చుకోమని కూడా సలహా ఇచ్చేవాళ్ళు. అయితే దానికి ఓ పరిమితి ఉండేది. మామూలుగా అయితే ఓ లోటా, మహా అయితే ఒక చెంబుడు అంతే. ఎండా కాలంలో కల్లు మంచి చలవ చేస్తాయి కూడా. స్వచ్చమైన కల్లు ఆరోగ్యానికి పెద్దగా హానికరం కూడా కాదు.

అంత వరకు బాగానే ఉండేది మా ఊరు. తరువాత ఎక్కడి నుంచి వచ్చిందో సారా భూతం, మా ఊరి మీద పడింది. ఈ సారా తయారీలో నానా చెత్త వాడేవారు. ఈ భూతానికి దాసోహమైన చాలా మందిలో మునిసుబ్బారెడ్డి ఒకడు. సారాతో పోటీ తట్టుకోవడానికి కల్లును కల్తీ చెయ్యడం మొదలైంది. అక్కడి నుంచి ప్రారంభమైనాయి తాగేవారి ఇళ్ళలో కుటుంబ కలహాలు. నెమ్మదిగా వారి ఆరోగ్యాలు కూడా దెబ్బతినటం ప్రారంభించాయి.

మునిసుబ్బారెడ్డికి కొంచెం కోపం ఎక్కువ. మరి తాగున్నాడంటే ఆయనతో మాట్లాడటానికి కూడా భయపడే వాళ్ళు. అలా ఒక రోజు తాగేసి ఇంటికి వచ్చి అలాగే మేడపైన గదిలో పడుకుండి పోయాడు. ఇంట్లో వాళ్ళు ఆయన కోపానికి భయపడి ఎవరూ దగ్గరికి వెళ్ళలేదు. అలాగే గొంతు ఎండిపోయి నిద్రలోనే ప్రాణాలు విడిచేశాడు. తెల్లవారి వెళ్ళి తలుపు తీసిన ఆయన భార్య శోకానికి అంతే లేదు. ఆమెకు పెళ్ళై మూడేళ్ళు కూడా కాలేదు. ఆమె మా క్లాస్‌మేట్ కి స్వయానా అక్క. అంత చిన్న తనంలోనే భర్తనుపోగొట్టుకున్న ఆమె, అక్క దురదృష్టాన్ని తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న మా స్నేహితుడు, వీళ్ళను చూసి ఆ ఊర్లో కంటతడి పెట్టని వారు పాపాత్ములు.

ఒక్క తాగుడు అలవాటు పక్కన పెడితే అతను మిగతా విషయాల్లో గ్రామస్తులకు ఇష్టమైన వాడే. అకారణంగా తాగుడికి బలైపోవడం ప్రజలను కలచి వేసింది. మరునాడే గ్రామ పెద్దలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక మీదట గ్రామంలో మద్యం అమ్మడానికి లేదంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మద్యం అమ్మకాన్ని సమర్థించే వాళ్ళు మరేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు.

కొన్ని రోజులు గడిచాయి. నెమ్మదిగా గుట్టుచప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అడిగే నాధుడేడీ? ఎవరైనా ధైర్యం చేసి అడిగిన వాళ్ళకి తాగుబోతులు బూతులతో సత్కారం చేసే వాళ్ళు. ఎవరి పనులు వాళ్ళవి.. ఎవరికి వారే యమునా తీరే…మళ్ళీ మరో ఇల్లాలి వైధవ్యానికో, ఓ కన్నతల్లి కడుపుకోతకో ఇదే నాంది…

ఇలా తాగుడుకు బానిసలైన వారి కుటుంబ సభ్యులు వారిచేత పూర్తిగా తాగుడు మానిపించడం సాధ్యం కాక “ఎప్పుడో ఏ యాళనో అయితే సరే… ఇట్ట రోజు నువ్వు సంపాదించింతా ఖర్చు పెట్టి తాగొచ్చి ఇంటి మీద పడి గొడవ చేస్తా ఎట్టా? మన సంసారం ఎట్ట జరగాల…మన బ్రతుకులెలా తెల్లారతాయి” అని వాపోతుంటారు. అయినా సరే వాళ్ళకివేం పట్టవు. ఈ చెవిలో విని ఆ చెవిలో అలా వదిలేస్తారు.

*పేరు మార్చాను