ప్చ్… ఈ సారి ఆ అదురుష్టం లేదు…

కాళాస్తిరి గుడి
కాళాస్తిరి గుడి

నిరుడు శివరాత్రి ఈ యాళకి మా ఇంటికాడ నిద్రబోతా ఉండే వోణ్ణి. ఎందుకంటే తెల్లార్తో మూడు గెంటలకు లేసి దర్శనానికి పొయ్యేసే వాళ్ళం కదా… పూర్తి జేసుకుని ఇంటికొచ్చేలోగా తూగొచ్చేసిది. అదలా బదలా నాలుగు ఇడ్లీలు మింగేసి మంచం మీదపడిపొయ్యేవాళ్ళం.


ఈ రోజు గాన నేను కాళాస్తిరిలో ఉండుంటే…. నేనూ, మా యమ్మ తెల్లార్తో లేసి తలకు బోసుకుని నాలుగ్గెంటలకల్లా గుడికాడుండే వాళ్ళం. లేటయితే మల్లా క్యూలైన్లోనే కైలాసం గనిపిస్తుండ్లా..
ఈ సారి మా యమ్మ ఒక్కటే బొయ్యుంటాదో ఏమో…మేవెంత తెల్లార్తో బొయ్‌నా మా కంటే ముందుగా నిదర్లేసి పోయినోళ్ళు అప్పుడికే దర్శనం పూర్తిజేసుకుని తిరిగొచ్చేస్తా ఉండే వోళ్ళు. కాళాస్తిర్లో శివరాత్రి సందడంటే చూసేదానికి రెండు కళ్ళూ సాలవనుకో…

రోజంతా గుళ్ళో జనాలు కిటకిట్లాడతా ఉంటారు. పక్క పక్కన ఊర్ల నుంచి వచ్చే వాళ్ళ కోసం టవున్లో అక్కడక్కడా సలివేంద్రాలు, పులుసన్నం పొట్లాలు ఇచ్చేవోళ్ళు చనా మంది కనిపిస్తారు. అట్ట జేస్తే పుణ్ణెం వస్తాదని పెద్దోళ్ళు చెపతా ఉంటారు. ఆ నంది వాహనం మీద దేవుడి ఊరేగింపుకయితే ఇసకేస్తే రాలనంత జనం ఉంటారు. జరిగేది అర్థరాత్రి అయినా గానీ..

ముఖ్యంగా ఆ గుడి పక్కన టేజీలో  దినామూ ఏదో ఒక పోగ్రాం జరగతా ఉండేది. ఆడక బొయ్ నిలబడుకుంటే.. కాళ్ళు అక్కడే పాతుకుపొయ్యేవి. ఇంటికి తిరిగి రాబుద్ది గాదు. ఆ పోగ్రాంల కాడ ముసిలి ముతకా..పిల్లా జెల్లా, ఒకరన్ల్యా.. అందురూ అదో తన్మయత్వంతో మునిగి తేలుతుండే వోళ్ళు. శివరాతిరి జాగారం చెయ్యడానికి అదే కరట్టైన స్తలం. ఒక పక్క గుళ్ళోంచి ఇనకొచ్చే శివనామ స్మరణ, ఒక పక్క పురాణ ప్రవచనాలు.. ఒప పక్క దేవుడు ఊరేగింపు… అబ్బా… జాగారం అంటే అలా జెయ్యాల. ప్చ్… ఈ సారి నాకా అదురుష్టం లేదు…

ఈ సారి హైదరాబాదులోనే ఉండాను గాబట్టి, ఒక్కసారి మనోవీధిలో కాళాస్తిరికి బొయ్యి ఈ టపా రాసేసినా… ఎట్టుండాదో మీరే జెప్పాల….