కలత చెందిన మనస్సుతో..

కలత చెందిన మనస్సుతో రాస్తున్న టపా ఇది.ఈ రోజు ఆఫీసుకు వస్తూ సైబర్ టవర్స్ దగ్గర ఆటో దిగాను. రోడ్డు పక్కనే తైల సంస్కారం లేని తలతో, మాసిన బట్టలతో ఒకతను రోడ్డు మీద పడి దొర్లాడుతున్నాడు. ఆ  ఇలాంటి దృశ్యాలు సాధారణమే కదా… ఫుల్లుగా తాగడం, రోడ్ల మీద పోడి దొల్లడం. అనుకుని చిరాకుగా ముందుకు సాగబోయాను.

ఆ గుంపులో ఒక మనిషి నన్ను ఆపి ఒక డబ్బా నా చేతికిచ్చి యే క్యా హే.. అన్నాడు. నాకు ఒక్క నిమిషం పాటు ఏమీ అర్థం కాలేదు. అతను ఆదుర్దా పడుతూ అదే ప్రశ్న రెట్టించే సరికి ఆ పెట్టె తెరిచి చూశాను. అందులో ఒక మూత తీసిన ఒక చిన్న సీసా ఉంది. నాకర్థం కాలేదు. మేరే కో పతా నై.. అన్నాను. అతను అదే ఆత్రుతతో మళ్ళీ అదే ప్రశ్న వేసేసరికి నా అనుమానం బలమైంది. ఆ డబ్బా పైన పాయిజన్ అని రాసుంది.

అంతే క్షణం ఆలస్యం చెయ్యకుండా 108 కి ఫోన్ చేశాను. గ్లోబల్ సెంటర్ వాళ్ళు వివరాలడిగి తెలుసుకుని మళ్లీ కాసేపటి తర్వాత హైదరాబాదు ఆఫీసు నుంచి ఫోన్ చేశారు. వాళ్ళకి కూడా వివరాలందించి ఆ వాహనం వచ్చేదాకా అక్కడే ఉందామనుకున్నాను. కానీ ఈ లోపు భాదితుడి తమ్ముడు అనుకుంటా అక్కడికి వచ్చేశాడు. నేనక్కడే ఉండటం చూసి సార్ వ్యానొస్తే మేం తీసుకెళతాము లెండి మీరు ఆఫీసు కెళ్ళండి అన్నాడు. సరే దగ్గర బంధువులు ఉన్నారు కదా అని ఆఫీసుకు వచ్చేశా. అప్పటి నుంచి ఒకటే ఆదుర్దా… అతన్ని తీసుకెళ్ళారో లేదో.. అని. అక్కడే ఉండుంటే బాగుండు కదా అని… కానీ అతను బతుకుతాడని నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నేను అక్కడ ఉన్నంత సేపు పూర్తి స్పృహలోనే ఉన్నాడు. సగం విషం తీసుకోగానే పక్కన ఉన్నవాళ్ళు వారించినట్లున్నారు. అతను బతికి బయట పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించినపుడు ఒక్క క్షణం ఆగి వాళ్ళు నిజంగా ఆపదలో ఉన్నారా అని ఆలోచించి ముందుకు కదలండి. ఎందుకంటే ఆ గుంపులోని వ్యక్తి నన్నాపకపోతే కచ్చితంగా నాకా విషయం తెలిసేది కాదు, అతనికి అంత తొందరగా సహాయం అందేది కాదు.

తాజా స్థితి గతులు:

  • ఇప్పుడే 108 కి ఫోన్ చేశా అతని స్టేటస్ కనుక్కుందామని. ఆంబులెన్స్ వచ్చి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. ఇంకో గంట తర్వాత ఫోన్ చేస్తే వివరాలు చెబుతామన్నారు. మళ్ళీ ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తా…
  • 5:40PM ఇప్పుడే 108 కి ఫోన్ చేస్తే అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారనీ వాళ్ళ బంధువుల ఫోన్ నంబర్ ఇచ్చారు. అతను మామూలుగా మాట్లాతున్నాడట కానీ డాక్టరు వచ్చి చెబితే  కచ్చితంగా తెలుస్తుందని చెప్పాడు.