వేడాం కాళికా మాత లీల

2013-08-11 10.07.44ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన జరిగి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. శ్రీకాళహస్తికి దగ్గరలో వేడాం అనే ఊర్లో దక్షిణ కాళికా మాత ఆలయం ఉంది. ఊరికి వెళ్ళినప్పుడల్లా అప్పుడప్పుడూ ఈ ఆలయాన్ని సందర్శించి రావడం నా అలవాటు. శ్రీకాళహస్తి ఆలయానికి దక్షిణ దిశగా వెళితే ముందుగా నందనవనం (లోబావి, భరద్వాజ తీర్థం అని కూడా అంటారు), ఆ తరువాత శుకబ్రహ్మాశ్రమం, వేడాం, రామాపురం అనే ఊర్ల మీదుగా పాపానాయుడు పేట చేరుకోవచ్చు. ఈ దారి అంటే నాకు చాలా ఇష్టం. ప్రశాంతమైన వాతావరణం. రోడ్డుకు ఎడం వైపు కైలాసగిరి కొండలు, కుడి వైపున సువర్ణ ముఖి, రోడ్డుకిరువైపులా చెట్లు, పచ్చటి పొలాలు, పెద్దగా వాహన సంచారం లేని రోడ్డు. నాకు చాలా హాయినిచ్చే ప్రయాణం. వేడాం దాటుకుని వెళితే వచ్చేది వేయి లింగాల కోన. ఒక కొండ ఎక్కి దిగి, మళ్ళీ ఇంకో కొండ ఎక్కితే అక్కడ వేయిలింగేశ్వరుడు కొలువుంటాడు. దగ్గర్లోని ఓ చిన్న జలపాతం కూడా ఉంటుంది. ఇక్కడికి కూడా అప్పుడప్పుడూ వెళ్ళి రావడం మామూలే.

అలవాటు ప్రకారం ఓ సారి కాళికా దేవి దర్శనం కోసం వెళ్ళాం. దర్శనం చేసుకుని వస్తుంటే ఆలయ ప్రాంగణం లోపల ఓ బోర్డు కనిపించింది. వేడాం గ్రామస్తులంతా కలిసి ఆలయ నిర్వహణకు, అభివృద్ధి కోసం ఓ ట్రస్టుగా ఏర్పడ్డారని, విరాళాలు సమర్పించాలనుకునే భక్తుల కోసం బ్యాంకు అకౌంటు వివరాలు ఇవ్వబడ్డాయి. బెంగళూరుకు వచ్చాక మనకు తోచిన విరాళం ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేద్దామని నా ఫోనులో అకౌంటు నంబరు నోట్ చేసుకున్నా. ఇంటికి రాగానే దాని సంగతే మరిచిపోయాను. ఇంక బెంగళూరుకు రాగానే అస్సలు ఆ అకౌంటు నంబరు తీసుకున్నానన్న సంగతే మరిచిపోయాను.

నెలాఖరు వచ్చింది. నెలలో 25 వ తేదీకే జీతం ఇచ్చెయ్యడం అప్పటి మా కంపెనీ (McAfee) పాలసీ. ఇంటికి డబ్బులు పంపించాలి. నా HSBC బ్యాంకు ఖాతా నుంచి పేయీ యాడ్ చేసుకుని ట్రాన్స్ ఫర్ చేసే సౌకర్యం గురించి నాకంతగా తెలీదు. పంపించాల్సి వచ్చినప్పుడల్లా మొబైల్ నంబరులో మా నాన్న అకౌంటు నంబరు చూసుకుని ఎంటర్ చేయడం, పంపించేయడం. ఈ సారి కూడా డబ్బు పంపించి, అలవాటు ప్రకారం మరుసటి రోజు మా నాన్నకి ఫోన్ చేశాను డబ్బులు తీసుకున్నారా లేదా అని. డబ్బులు ఇంకా రాలేదే అన్నాడు మా నాన్న. నాకు చిన్నగా అనుమానం కలిగింది. మామూలుగా అయితే ఒక రోజుకు మించి సమయం తీసుకోదే అనుకుంటూ నా ఆన్ లైను అకౌంటులోకి లాగిన్ అయి చూశా. అనుమానం లేదు. ట్రాన్స్ ఫర్ అయింది. నా ఖాతాలోనుంచి అమౌంటు కూడా తగ్గింది. కాల్ సెంటర్ కు ఫోన్ చేశా. అవతలి ఖాతాను బదిలీ అయిపోయినట్లు చెప్పారు. అంటే నేను డబ్బులు ఎవరికి పంపించినట్లు?

మళ్ళీ ఆన్ లైను అకౌంటులో స్టేట్మెంట్ చూశా. గత నెలలో ట్రాన్స్ ఫర్ చేసిన అకౌంటు నంబరు, ఈ నెలలో ట్రాన్స్ ఫర్ చేసిన అకౌంటు నంబరుతో పోల్చి చూశా. అనుమానం నిజమైంది. ఇది ఖచ్చితంగా వేరే అకౌంటు నంబరే. మరి ఈ అకౌంటు నంబరు ఎవరిది? ఎంత ఆలోచించినా సమాధానం తట్టలేదు. ఆ నంబరు ఫోన్ లోనుంచే కదా కాపీ చేశాను. ఫోను లో చూశా. ఎప్పుడూ అమౌంట్ పంపించే మా నాన్న నంబరు పక్కనే స్టోర్ అయింది నంబరు. మిగతా వివరాలేమీ లేవు. మరి ఈ నంబరు నా ఫోన్ లోకి ఎలా వచ్చింది? చాలా సేపు బుర్ర పనిచేయలేదు. ఒకవేళ ప్రతిసంవత్సరం ఎల్ ఐ సీ పాలసీ ప్రీమియం పంపించే ఏజెంటుది కానీ కాదు కదా? అది కూడా కాదు. మరి ఈ అకౌంటు నంబరు ఎవరిది? అకౌంటు నంబరిస్తే పేరు చెప్పగల ఆన్ లైను సర్వీసులున్నాయేమోనని చూశా. కేవలం బ్రాంచి వివరాలు మాత్రం దొరికాయి. మా నాన్న ఖాతా ఉన్నది. ఈ ఖాతా ఉన్నది ఒకటే బ్రాంచి. అది శ్రీకాళహస్తి ఎస్బీఐ మెయిన్ బ్రాంచీలోనే. ఆ అకౌంటు నంబరు చెప్పి ఖాతాదారు ఎవరో తెలుసుకోమని మా నాన్నకు చెప్పా. మరుసటి రోజు మా నాన్న వివరాలు కనుక్కోవడానికి ముందే మనసు కాస్త ప్రశాంతం చేసుకుని నెమ్మదిగా ఆలోచించా అప్పుడు గుర్తుకు వచ్చింది అసలు సంగతి! మర్నాడు మా నాన్న వెళ్ళి కనుక్కుంటే అదే తేలింది.

అంటే నేను మరిచిపోయినా కాళికాదేవి నా దగ్గర విరాళం తీసుకుంది. కానీ ఇప్పుడు అంత మొత్తం ఇచ్చుకునే పరిస్థితిలో లేనమ్మా అనుకున్నా మనసులో. నీ దయవల్ల మేం చల్లగా ఉంటే ఎప్పుడైనా అంత సమర్పించుకుంటాంలే అంది మా శ్రీమతి. తరువాత మా పెద్దబావ, ట్రస్టు బోర్డు సభ్యులు తెలిసిన ఇంకో ఆయన వెళ్ళి వాళ్ళకి జరిగిన సంగతి వివరించారు. ట్రస్టు బోర్డు సభ్యులంతా చర్చించుకుని సహృదయంతో డబ్బు తిరిగి ఇచ్చారు. అందులో కొంత విరాళంగా ఇచ్చి మిగతా డబ్బులు ఇంటికి తీసుకువచ్చాడు మా బావ. మిగతా ఋణం కూడా తొందరగా తీర్చుకోవాలి. లేకపోతే లావైపోతాం 🙂