జన్మానికో శివరాత్రి!

స్వామి వారి తేరు
స్వామి వారి తేరు

మా ఊరు శ్రీకాళహస్తిలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నా గత రెండేళ్ళుగా నాకు దర్శన భాగ్యం కలుగలేదు. అయితే ఈ సారి ఎలాగైనా తప్పనిసరిగా చూడాలని రెండు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టేశా.ఈ ఏడు నాపై శివుని అనుగ్రహం మెండుగా ఉన్నట్లుంది. అనుకున్నట్టే మా అమ్మతో కలిసి వెళ్ళి ప్రాతఃకాలమే దర్శనం చేసుకున్నాను. అలాగే నాకు బాగా ఇష్టమైన ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మ గారిచే అనుగ్రహ భాషణం ప్రత్యక్షంగా వినే అదృష్టం కలిగింది. ఆయన శ్రీకాళహస్తీశ్వరుని గురించి, ఆలయాన్ని గురించి చెప్పిన విశేషాలు మరో టపాలో ప్రస్తావిస్తాను.

 

రాత్రి జాగరణ చేసి లింగోద్భవ మూర్తిని దర్శించుకునే భాగ్యం కలిగింది. ఇన్నేళ్ళుగా శ్రీకాళహస్తిలో ఉన్నానన్న పేరే గానీ లింగోద్భవ దర్శనం చేసుకున్నది లేదు. ఎందుకంటే లింగోద్భవ దర్శనం టిక్కెట్టు సంపాదించాలంటే పైరవీలైనా చేయాలి, లేదా ఎవరైనా ఆలయ అధికారులు, ఉద్యోగస్తులతో స్నేహమైనా కలుపుకోవాలి. తీరా టిక్కెట్టు సంపాదించాక ఆ సమయంలో గుడిలో ఎక్కడలేని తొక్కిసలాట ఉంటుంది. ఇలాంటివి మనకు గిట్టవాయే. అంత రద్దీలో దేవుడిమీద భక్తి నిలపాలంటే కష్టమైన పనే. మన పరిస్థితి చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్లు కాకూడదు కదా!

ఈసారి వాటి అవసరమేమీ లేకుండా ప్రశాంతంగా లింగోద్భవ దర్శనం కలిగేలా చేశాడా పరమేశ్వరుడు. ఎలా అంటారా? జాగరణలో భాగంగా ఆలయం పరిసరాల్లో తిరుగాడుతూ శివనామ స్మరణలో ఓలలాడుతూ, ముందుగా అత్యంత వైభవంగా జరిగే నందివాహన సేవలో కాసేపు పాల్గొన్నాను.

శివుడు కళాప్రియుడు కాబట్టి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధూర్జటి కళాప్రాంగణము అనే పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేస్తారు. ఈ వేదికపైన రాష్ట్రం నలుమూలలనుండీ, ఇతర రాష్ట్రాల నుండీ వచ్చిన అనేక మంది కళాకారులచే భక్తిరంజని, నృత్య, గాన, నాటక కళా రూపాలు ప్రదర్శింపబడుతూ ఉంటాయి. ఈసారి ప్రధాన ఆకర్షణ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో భక్తివిభావరి. ఇప్పటి దాకా ఇలాంటి భక్తి కార్యక్రమం చేయడం తమన్ కు ఇదే ప్రథమమట. అయితే కాసేపు విన్న తర్వాత ఆయన సినిమాల్లోపాటల్లో లాగా వాయిద్యాల హోరు ఎక్కువై గాత్రం సరిగా వినపడకపోవడంతో అక్కడ నుంచి వచ్చేశాను. ఆ కార్యక్రమం పది గంటలకు అయిపోయింది.

మరో నాటకం ప్రారంభమైంది. ఆ వేదిక వద్దకు వచ్చి కాసేపు ఉన్నాను. అక్కడ కొంచెం రద్దీ ఎక్కువ కావడంతో అలా ముందుకు వెళ్ళి ప్రధాన ఆలయానికి ఉత్తర దిక్కుగా శిథిలావస్థలో ఉన్న మణికంఠేశ్వర ఆలయ ప్రాంగణం లోపలికి వెళ్ళి కూర్చున్నాను. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది అనుకుంటూ ఉండగా కాసేపటి తర్వాత కొంచెం దూరంలో చిన్నగా మంత్రాలు వినిపించాయి. అటు వైపు వెళ్ళి చూస్తే ఒక చిన్న భక్త బృందం, పంతులుగారితో కలిసి ఆ శిథిలాలయల్లో పూజలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి రోజు ప్రతి శివలింగంలోనూ శివుడు ప్రవేశిస్తాడని ప్రతీతి. అందుకని పూజ అయిపోయే దాకా అక్కడే కూచున్నాను. సాధారణంగా శివలింగం ఉన్న గర్భగుడికి వెనుక వైపుగా లింగోద్భవ మూర్తి ఉంటుంది. అలా వెనక్కి వెళ్ళి చూస్తే కొంచెం చీకటిగా ఉంది. అక్కడ ఎవరూ లేరు. సెల్‌ఫోన్ వెలుతురులో పరికించి చూస్తే అది సాక్షాత్తూ లింగోద్భవ మూర్తే! ఇన్నాళ్ళూ గుడికి వెళ్ళి వస్తున్నా నేను ఎప్పుడూ అది గమనించింది లేదు. అక్కడ అలా దర్శనం చేసుకుని సంతృప్తిగా ఇంటిదారి పట్టాను.

ఈ శివరాత్రి నాకు మరపురాని అనుభూతిని మిగిల్చింది. నాకు తెలియకుండానే ఎవరో నడిపిస్తున్నట్లుగా ఆ గుడికి వెళ్ళడం, లింగోద్భవ సమయంలో సంతృప్తిగా స్వామి వారి అభిషేకాన్ని దగ్గరుండి దర్శించుకోవడం, జన్మానికో శివరాత్రి అంటే ఇదేనేమో అనిపించింది.