నా చదువు సంగతులు – 4

నాకు మూడో తరగతి పూర్తయ్యేటప్పటికి మా అక్కవాళ్ళిద్దరూ హైస్కూలు చదువు కోసం ముచ్చివోలుకు వెళ్ళిపోయారు. అక్కడ అప్పుడు ఏడో తరగతి దాకా ఉండేది. పదో తరగతి దాకా చదవాలంటే పల్లం కానీ, అక్కుర్తి గానీ వెళ్ళేవాళ్ళు. అక్కవాళ్ళు వెళ్ళి పోవడంతో నేను కూడా నాలుగో తరగతికే ముచ్చివోలు వెళ్ళిపోయాను. చేమూరుతో పోలిస్తే ముచ్చివోలు పెద్ద ఊరు. బడి కూడా పెద్దదే. చిన్నబడి నుంచి పెద్దబడికి మారగానే ముచ్చివోలులో నా స్నేహితులు నన్ను బాగా హెచ్చరించారు.
ఒరే మీ ఊరు లాగా ఇది చిన్నబడి కాదు. ఇక్కడ చాలా మంది సార్లుంటారు. క్రమశిక్షణగా ఉంటుంది. బాగా కష్టపడాలి అన్నారు. చిన్నవయసులో ఆడుకునే వయసులో చదువంటేనే కష్టం కదా మరి. ఊరికి పడమరగా ఉన్న పాండురంగ స్వామి గుడి ఆవరణలోనే బడి ఉండేది. ఇప్పుడు ఊరికి తూర్పుగా ఉన్న మైదానంలోకి మార్చారు. ఆ ఊళ్ళో అప్పటికే బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు. మా బంధువులు ఒకరిద్దరు అమెరికాలో కూడా ఉండేవారు. మా అవ్వ ఎప్పుడూ అలా బాగా చదువుకుని పైకొచ్చిన వాళ్ళను గురించి నాతో చెబుతూ నన్ను కూడా వాళ్ళలాగా చదవమనేది. కుటుంబంలో ఓ ఏ ఒక్కరికైనా చదువు విలువ తెలిస్తే చాలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండడానికి.

ఆ బడిలో ఉపాధ్యాయులు కూడా దండిగా ఉండేవారు. గోపాల్ రెడ్డి సార్, అశ్వత్థరావు సార్, నారాయణ శెట్టి  సార్, మునికృష్ణారెడ్డి సార్ నాకు కొన్ని బాగా గుర్తున్న పేర్లు. వాళ్ళ పక్కనే ఉండే వేలవేడు, ఓబులాయ పల్లి, శ్రీకాళహస్తి లాంటి ఊర్ల నుంచి వచ్చేవారు. గోపాల్ రెడ్డి సార్ అంటే అందరికీ హడల్. ఓ సారి ఆయన కొట్టే దెబ్బలకి తట్టుకోలేక ఓ విద్యార్థి రోజూ ఆయన వేసుకొచ్చే స్కూటర్ సైలెన్సరులో అరటి తొక్క కూరేశాడు. ఆయన బండి స్టార్ట్ చేయడానికి నానా కష్టాలు పడ్డ తరువాత అసలు విషయం తెలిసింది. మరుసటి రోజు క్లాసులో అతనికి వీపు విమానం మోత మోగిపోయింది. ఆయన వేసే శిక్షలు మామాలువి కావు. కొన్ని విచిత్రంగా ఉండేవి. గోడ కుర్చీ వేయడం. కాళ్ళ మీద పెద్ద బండరాయి ఉంచడం. కాళ్ళు పైకి, తల కిందకి పట్టుకుని పిర్ర మీద ఎడా పెడా వాయించడం, ఇలాంటివి. నారాయణ శెట్టి సారేమో ఒంగోబెట్టి దబేల్మని ఒక్క బాదు బాదేవాడు. ఏదైనా అప్పజెప్పకపోతే ఎర్రటి ఎండలో మోకాళ్ళ మీద కూర్చుని చదవమనే వాడు. కింద ఇసక. పైన ఎండ. అంత జేసినా ఊర్లోవాళ్లెవ్వరూ వచ్చి గొడవ చేసే వాళ్ళు కాదు. ఏం చేసిన తమ పిల్లల భవిష్యత్తు కోసమే కదా అని వాళ్ళ నమ్మకం.

నా చదువు సంగతులు – 3

నాకు రెండో తరగతి లో ఉండగానే మా స్కూలుకి ప్రసాద్ సారు కొత్తగా వచ్చాడు. ఈయన సొంతూరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరే (ముచ్చివోలు). మాకు దూరపు బంధువు కూడా. ఆయన స్కూల్లో చదివేటపుడు మా అమ్మకి జూనియర్. ఆ చనువుతో నన్ను బాగా చేరదీసేవాడు. ఖాళీగా ఉన్నపుడు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని మా అమ్మమ్మ ఊరు గురించి కబుర్లు చెబుతుండేవాడు. చేమూరు నుంచి ముచ్చివోలు రోడ్డు మార్గం దాదాపు ఇరవై కిలోమీటర్లపైనే ఉండేది. రోజూ ఆయన అడ్డదారిన ఆ ఊరి నుంచి ఈ ఊరికి సైకిల్ తొక్కుకుంటూ వచ్చేవాడు. ఎపుడైనా మా ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు.

మా ఇంటి పక్కనే తాటి చెట్లు దండిగా ఉండేవి. ఎండాకాలం వచ్చిందంటే అందులో తాటికల్లు దింపడానికి మా ఊళ్ళో గీత కార్మికులు ఉండేవాళ్ళు. ఎండాకాలం అప్పుడే దింపిన కల్లు తాగితే చలువ చేస్తుందని మా ఇంట్లో వాళ్ళు చెబితే రోజూ కల్లు దించే సమయానికి గ్లాసు తీసుకుని తయారయ్యే వాణ్ణి నేను. ఒకరోజు మా సార్లు మా ఇంటి నుంచి కల్లు తీసుకురమ్మన్నాడు. అలాగే అని రెండు చెంబులు తీసుకెళ్ళాం. ఆ డోసు ఎక్కువై మా సార్లు చేసిన అల్లరి నాకింకా గుర్తుంది. ప్రతి ఒకరూ సార్ ముందుకి వెళ్ళి నిలబడ్డం, వేళ్ళు చూపించి ఇవెన్ని అని అడగడం, వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు అడగటం, నవ్వుకోవడం.

రెండో తరగతి లో దసరా సెలవులిచ్చారు. సెలవులకి అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళటం అలవాటు. మా ప్రసాద్ సార్ నాతో పాటు సైకిల్ లో వస్తావా, సరదాగా ఉంటుంది అని అడిగాడు.  నేను ఎగిరి గంతేశాను. నేను ముచ్చట పడుతున్నానని అమ్మవాళ్ళు కూడా సరే అన్నారు. ఓ సంచీలో బట్టలు పెట్టి నన్ను సైకిల్ వెనుక సీట్లో కూర్చోబెట్టారు. మా ప్రసాద్ సార్ రోడ్డు బాగున్నంత సేపూ కబుర్లు చెబుతూ బాగానే తొక్కాడు. అడ్డదారిలో దిగేసరికి పాపం తొక్కడం బాగా కష్టమైంది. చిన్నపిల్లాడిని కదా ఏం నడిపిస్తాములే అని నన్ను సైకిల్ మీదనే ఉంచి సైకిల్ దిగేసి కొద్దిదూరం నెట్టుకుంటూ వచ్చాడు. కొద్ది దూరం వచ్చాక అది కూడా కష్టమైంది. ఇహ లాభం లేదనుకుని నన్ను కూడా దిగి నడుచుకుంటూ రమ్మన్నాడు. నేను దిగి నెమ్మదిగా నడక ప్రారంభించాను. కొద్ది దూరం వెళ్ళగానే నాకు కళ్ళు తిరిగి వాంతి అయింది. పాపం భయపడిపోయాడు. నేను ఎలాగోలా కొద్ది దూరం నడిచి మెయిన్ రోడ్డు చేరుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ సైకిలెక్కి తొక్కడం ప్రారంభించాడు. అవ్వ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేటప్పుడు మాత్రం, దారిలో జరిగిన సంగతి మాత్రం ఎవరికీ చెప్పకేం అన్నాడు. అన్నట్టుగానే నేను ఎవ్వరికీ చెప్పలేదు. అప్పటి నుంచీ ఆయన అలాంటి సాహసానికి ఎప్పుడూ పూనుకోలేదు.

నేను చేమూరు స్కూలు నుంచి మారిపోయిన తరువాత ప్రసాద్ సారు కుప్పం కి బదిలీ అయ్యాడు. ప్రస్తుతం అక్కడే నివాసం అనుకుంటా. అప్పుడప్పడూ ముచ్చివోలు వస్తుంటారు. చాలా సార్లు కలవాలని ప్రయత్నించాను కానీ కుదర్లేదు.

నా చదువు సంగతులు – 2

నేను రెండో తరగతికి వచ్చేటప్పటికి ప్రభుత్వం వారికి మా బడి మీద దయగలిగి ఊరు మొదట్లో ఒక భవనాన్ని నిర్మించింది. ఒక పొడుగాటి గది, ముందు వరండా. రెండింటిలో ఆ వైపు ఈ వైపు కలిపి నాలుగు తరగతులు కూర్చోవచ్చు. మనకి కొత్త బడి వచ్చిందోచ్ అంటూ పిల్లలందరికీ ఎంత సంతోషమో. బడి కడుతున్నప్పుడే వెళ్ళి ఎలా కడుతున్నారో చూసొచ్చేవాళ్ళం.

అవతలి వైపు ఉన్న పాత భవనం నేను చదివిన మొట్టమొదటి బడి.

అప్పటికి గురవయ్య సారు రిటైరైపోయి ఆయన స్థానంలో సుబ్రహ్మణ్యం సారు (రేణిగుంట దగ్గర కరకంబాడి వాస్తవ్యులు) వచ్చారు. ఆయనకి ఎప్పుడూ గడ్డం ఉండటంతో అంతా ఆయన్ను గడ్డాం అయ్యోరు అని పిలుచుకునే వాళ్ళు పిల్లలంతా. ఆయనంటే అందరికీ భయం. కోపం వస్తే గట్టిగా అరిచేవాడు. సులగ (సన్నటి బెత్తం, గాలిలే విదిలిస్తే జుయ్ మంటూ శబ్దం వచ్చేది. చర్మం తాకితే ఎర్రగా కందిపోయి వాత పడేది) తోగానీ ఫేము బెత్తంతోకానీ కొట్టేవాడు. కొంతమంది ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ బెత్తాలు పట్టుకుని విరిచేసే వాళ్ళు. లేదా కొంతమంది తోలుమందం వాళ్ళ ధాటికి ఆ బెత్తాలే విరిగిపోయేవి. విచిత్రమేమిటంటే ఈ బెత్తాలు కూడా పిల్లలే తెచ్చిచ్చేవారు.

రోజూ ఏడవకుండా బడికి వెళ్ళినా, ఆయన చేతిలో అరుదుగా ఎప్పుడో ఒకటీ రెండు సార్లు దెబ్బలు తిన్నా నాక్కూడా ఏ మూలో ఆయనంటే భయం ఉండేది. భయం కలగాలంటే దెబ్బలే తినక్కర్లేదు పక్కన వాళ్ళని కొడుతున్నప్పుడు చూసినా చాలు. ఆయన రోజూ నాచేత కొన్ని తెలుగు పదాలు (అ- అమ్మ, ఆ-ఆవు లాంటివి), ఎక్కాలు వల్లె వేయించి పిల్లలతో చెప్పించేవాడు. బడి అయిపోయాక గంట సౌండు వింటే ఆ ఆనందమే వేరు. ఆ రోజుకింక ఆటలే ఆటలు కదా మరి. బడికి ఉత్తరం దిక్కున చెరువు. దక్షిణం దిక్కున నేరేడు చెట్లు. పండ్లు కాసే కాలం వచ్చిందంటే పండగే.

నా చదువు సంగతులు – 1

చేమూరు మా సొంతూరు. నేను మూడో తరగతి దాకా అక్కడే చదివాను. అక్కడ పేరుకైతే ఐదో తరగతి దాకా బడి కానీ చదివే పిల్లలు అంతంత మాత్రమే. బడికి కనీసం గుడిసె కూడా లేదు. మా ఇంటి పక్కనే పెద్ద చింతచెట్టు. అదే మా బడి. మా ఇద్దరు అక్కలు కూడా అక్కడే చదివేవాళ్ళు. ఆ చింతచెట్టు కింద ఓ బల్ల, ఓ కుర్చీ వేసుకుని మా *గురవయ్య అయ్యోరు* (పంతులు) కూర్చునేవాడు. ఇంకొక అయ్యోరు కూడా ఉండే వాడు. పేరు గుర్తు లేదు. ఎప్పుడూ ముక్కుపొడి పీలుస్తుండటంచో అంతా ఆయన్ను ముక్కుపొడి అయ్యోరు అనేవాళ్ళు. పిల్లలంతా నేల మీద కూర్చునే వారు.

నాకు మూడేళ్ళ వయసులో అనుకుంటా పొద్దున్నే చద్దన్నం తిని, పాడైపోయిన బ్యాటరీలలో ఉండే చక్రాలతో చేసిన బండికి తాడు గట్టి రయ్యిన లాక్కుంటా మా చింతచెట్టు బడి దగ్గరికి వెళ్ళాను. అప్పటికి అయ్యోరు ఇంకా రాలేదు. బెంచీ ఖాళీగా ఉందని మీదికెక్కి కూర్చుని ఆడుకుంటున్నా. కొద్ది సేపటి తర్వాత అయ్యోరొచ్చాడు. పిల్లలంతా లేచి నిలబడి గుడ్మాణింగ్ సా……ర్ అంటూ దీర్ఘం తీశారు. ఆ దీర్ఘం ఆ పక్కనే ఉన్న మా దిబ్బదాకా పాకింది. అటు వైపు తిరుక్కుని కూర్చున్న నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయ్యోరు నేరుగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.

ఆయన నా వైపే చూస్తుంటే నేనూ ఆయన వైపు చూస్తూ కూర్చున్నా.
“ఏమిరా పెద్దాయన (మా నాన్న ఇంట్లో పెద్దకొడుకు) కొడుకువా? ” అడిగాడాయన.
నేనేం జవాబు చెప్పలేదు.
పిల్లలో కూర్చున్న మా అక్కలు “అవును సా… మా తమ్ముడే” అన్నారు ముసి ముసి నవ్వులు నవ్వుతూ.
ఆయన నన్ను కిందకి దిగమన్నాడు. దిగాను.
ఐదు గుంజీలు తీయ్ అన్నాడు.
గబా గబా గుంజీలు తీసేసి బండి తీసుకుని ఇంటికి పరుగే పరుగు.
అమ్మ దగ్గరికి వెళ్ళి ఆగాను.
ఎందుకలా పరుగెడతున్నావని అడిగింది. జరిగింది చెప్పా. అమ్మ చిన్నగా నవ్వి మరి ఆయన చదువులు నేర్పే గురువు** కదా. ఆయనొచ్చిప్పుడు అలా కూర్చో కూడదు. లేచి నమస్కారం చేయాలి అని చెప్పింది. అది గురువుల పట్ల మా అమ్మ నేర్పిన మొట్టమొదటి సంస్కారం. నేనిప్పటికీ మరిచిపోలేదు.

**అప్పటికే నేను బట్టీ పట్టిన పాటల్లో కింది పాట ఒకటి. ఇందులో వాక్యమే అమ్మ ఉదహరించింది.
అమ్మకు జేజే
నాన్నకు జేజే
చదువులు నేర్పే గురువుకు జేజే

ఇంకా ఉంది….

వేడాం కాళికా మాత లీల

2013-08-11 10.07.44ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన జరిగి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. శ్రీకాళహస్తికి దగ్గరలో వేడాం అనే ఊర్లో దక్షిణ కాళికా మాత ఆలయం ఉంది. ఊరికి వెళ్ళినప్పుడల్లా అప్పుడప్పుడూ ఈ ఆలయాన్ని సందర్శించి రావడం నా అలవాటు. శ్రీకాళహస్తి ఆలయానికి దక్షిణ దిశగా వెళితే ముందుగా నందనవనం (లోబావి, భరద్వాజ తీర్థం అని కూడా అంటారు), ఆ తరువాత శుకబ్రహ్మాశ్రమం, వేడాం, రామాపురం అనే ఊర్ల మీదుగా పాపానాయుడు పేట చేరుకోవచ్చు. ఈ దారి అంటే నాకు చాలా ఇష్టం. ప్రశాంతమైన వాతావరణం. రోడ్డుకు ఎడం వైపు కైలాసగిరి కొండలు, కుడి వైపున సువర్ణ ముఖి, రోడ్డుకిరువైపులా చెట్లు, పచ్చటి పొలాలు, పెద్దగా వాహన సంచారం లేని రోడ్డు. నాకు చాలా హాయినిచ్చే ప్రయాణం. వేడాం దాటుకుని వెళితే వచ్చేది వేయి లింగాల కోన. ఒక కొండ ఎక్కి దిగి, మళ్ళీ ఇంకో కొండ ఎక్కితే అక్కడ వేయిలింగేశ్వరుడు కొలువుంటాడు. దగ్గర్లోని ఓ చిన్న జలపాతం కూడా ఉంటుంది. ఇక్కడికి కూడా అప్పుడప్పుడూ వెళ్ళి రావడం మామూలే.

అలవాటు ప్రకారం ఓ సారి కాళికా దేవి దర్శనం కోసం వెళ్ళాం. దర్శనం చేసుకుని వస్తుంటే ఆలయ ప్రాంగణం లోపల ఓ బోర్డు కనిపించింది. వేడాం గ్రామస్తులంతా కలిసి ఆలయ నిర్వహణకు, అభివృద్ధి కోసం ఓ ట్రస్టుగా ఏర్పడ్డారని, విరాళాలు సమర్పించాలనుకునే భక్తుల కోసం బ్యాంకు అకౌంటు వివరాలు ఇవ్వబడ్డాయి. బెంగళూరుకు వచ్చాక మనకు తోచిన విరాళం ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేద్దామని నా ఫోనులో అకౌంటు నంబరు నోట్ చేసుకున్నా. ఇంటికి రాగానే దాని సంగతే మరిచిపోయాను. ఇంక బెంగళూరుకు రాగానే అస్సలు ఆ అకౌంటు నంబరు తీసుకున్నానన్న సంగతే మరిచిపోయాను.

నెలాఖరు వచ్చింది. నెలలో 25 వ తేదీకే జీతం ఇచ్చెయ్యడం అప్పటి మా కంపెనీ (McAfee) పాలసీ. ఇంటికి డబ్బులు పంపించాలి. నా HSBC బ్యాంకు ఖాతా నుంచి పేయీ యాడ్ చేసుకుని ట్రాన్స్ ఫర్ చేసే సౌకర్యం గురించి నాకంతగా తెలీదు. పంపించాల్సి వచ్చినప్పుడల్లా మొబైల్ నంబరులో మా నాన్న అకౌంటు నంబరు చూసుకుని ఎంటర్ చేయడం, పంపించేయడం. ఈ సారి కూడా డబ్బు పంపించి, అలవాటు ప్రకారం మరుసటి రోజు మా నాన్నకి ఫోన్ చేశాను డబ్బులు తీసుకున్నారా లేదా అని. డబ్బులు ఇంకా రాలేదే అన్నాడు మా నాన్న. నాకు చిన్నగా అనుమానం కలిగింది. మామూలుగా అయితే ఒక రోజుకు మించి సమయం తీసుకోదే అనుకుంటూ నా ఆన్ లైను అకౌంటులోకి లాగిన్ అయి చూశా. అనుమానం లేదు. ట్రాన్స్ ఫర్ అయింది. నా ఖాతాలోనుంచి అమౌంటు కూడా తగ్గింది. కాల్ సెంటర్ కు ఫోన్ చేశా. అవతలి ఖాతాను బదిలీ అయిపోయినట్లు చెప్పారు. అంటే నేను డబ్బులు ఎవరికి పంపించినట్లు?

మళ్ళీ ఆన్ లైను అకౌంటులో స్టేట్మెంట్ చూశా. గత నెలలో ట్రాన్స్ ఫర్ చేసిన అకౌంటు నంబరు, ఈ నెలలో ట్రాన్స్ ఫర్ చేసిన అకౌంటు నంబరుతో పోల్చి చూశా. అనుమానం నిజమైంది. ఇది ఖచ్చితంగా వేరే అకౌంటు నంబరే. మరి ఈ అకౌంటు నంబరు ఎవరిది? ఎంత ఆలోచించినా సమాధానం తట్టలేదు. ఆ నంబరు ఫోన్ లోనుంచే కదా కాపీ చేశాను. ఫోను లో చూశా. ఎప్పుడూ అమౌంట్ పంపించే మా నాన్న నంబరు పక్కనే స్టోర్ అయింది నంబరు. మిగతా వివరాలేమీ లేవు. మరి ఈ నంబరు నా ఫోన్ లోకి ఎలా వచ్చింది? చాలా సేపు బుర్ర పనిచేయలేదు. ఒకవేళ ప్రతిసంవత్సరం ఎల్ ఐ సీ పాలసీ ప్రీమియం పంపించే ఏజెంటుది కానీ కాదు కదా? అది కూడా కాదు. మరి ఈ అకౌంటు నంబరు ఎవరిది? అకౌంటు నంబరిస్తే పేరు చెప్పగల ఆన్ లైను సర్వీసులున్నాయేమోనని చూశా. కేవలం బ్రాంచి వివరాలు మాత్రం దొరికాయి. మా నాన్న ఖాతా ఉన్నది. ఈ ఖాతా ఉన్నది ఒకటే బ్రాంచి. అది శ్రీకాళహస్తి ఎస్బీఐ మెయిన్ బ్రాంచీలోనే. ఆ అకౌంటు నంబరు చెప్పి ఖాతాదారు ఎవరో తెలుసుకోమని మా నాన్నకు చెప్పా. మరుసటి రోజు మా నాన్న వివరాలు కనుక్కోవడానికి ముందే మనసు కాస్త ప్రశాంతం చేసుకుని నెమ్మదిగా ఆలోచించా అప్పుడు గుర్తుకు వచ్చింది అసలు సంగతి! మర్నాడు మా నాన్న వెళ్ళి కనుక్కుంటే అదే తేలింది.

అంటే నేను మరిచిపోయినా కాళికాదేవి నా దగ్గర విరాళం తీసుకుంది. కానీ ఇప్పుడు అంత మొత్తం ఇచ్చుకునే పరిస్థితిలో లేనమ్మా అనుకున్నా మనసులో. నీ దయవల్ల మేం చల్లగా ఉంటే ఎప్పుడైనా అంత సమర్పించుకుంటాంలే అంది మా శ్రీమతి. తరువాత మా పెద్దబావ, ట్రస్టు బోర్డు సభ్యులు తెలిసిన ఇంకో ఆయన వెళ్ళి వాళ్ళకి జరిగిన సంగతి వివరించారు. ట్రస్టు బోర్డు సభ్యులంతా చర్చించుకుని సహృదయంతో డబ్బు తిరిగి ఇచ్చారు. అందులో కొంత విరాళంగా ఇచ్చి మిగతా డబ్బులు ఇంటికి తీసుకువచ్చాడు మా బావ. మిగతా ఋణం కూడా తొందరగా తీర్చుకోవాలి. లేకపోతే లావైపోతాం 🙂

తెలివైన ఇంద్రజాలికుడు – పిల్లల కథ

ఒకానొక ఊర్లో ఎలుకలు బాగా ఎక్కువైపోయాయి. రైతులు కష్టపడి పండించి గోదాముల్లో దాచుకున్న ధాన్యం అంతా ఎలుకల పాలు అవసాగింది. అదే సమయంలో ఆ గ్రామానికి ఓ ఇంద్రజాలికుడు వచ్చాడు. ఆ గ్రామ పెద్ద వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పాడు. అప్పుడు ఆ ఇంద్రజాలికుడు తాను ఆ సమస్యను పరిష్కరిస్తాననీ దానికి పారితోషికం ఏదైనా కావాలని కోరాడు. గ్రామస్తులంతా ఇంటికో బస్తా చొప్పున ధాన్యం ఇస్తామని ఒప్పుకున్నారు.

దానికా ఇంద్రజాలికుడు సంతోషించి తన దగ్గరున్న వేణువుతో ఓ రాగం మొదలు పెట్టాడు. ఆ రాగం వినగానే ఎక్కడెక్కడో నక్కి ఉన్న ఎలుకలన్నీ అతని వెంట పడటం ప్రారంభించాయి. అతనలా వాయిస్తూ నెమ్మదిగా నడక సాగిస్తుంటే ఎలుకలు కూడా అతనిని వెంబడించడం ప్రారంభించాయి. అతనలా వాయించుకుంటూ నెమ్మదిగా దగ్గరున్న నదిలోకి ప్రవేశించాడు. ఆ ఎలుకలు కూడా ఆ నదిలోకి దూకడంతో అన్నీ ప్రవాహ వేగానికి కొట్టుకొని పోయాయి.

ఎలుకల పీడ విరగడైనందుకు గ్రామస్తులంతా ఎంతో సంతోషించారు. చివరికి అతనికి పారితోషికం ఇచ్చే సమయం ఆసన్నమైంది. అప్పుడే గ్రామస్తులకు దుర్బుద్ధి పుట్టింది. ఇతను కేవలం వేణువు వాయించినందుకే మనం ఎందుకంత పారితోషికం ఇవ్వాలి. ఏదో ఒకటో రెండో బస్తాలు ధాన్యం ఇచ్చి పంపేద్దాం అనుకున్నారంతా కలిసి. దానికి ఇంద్రజాలికుడు ససేమిరా ఒప్పుకోలేదు. అయితే నీకు అసలేమీ ఇవ్వం. ఏం చేసుకుంటావో చేసుకో అన్నారంతా కలిసి. అప్పుడతనికి కోపం వచ్చి తన దగ్గరున్న వేణువు తీసి మరో రాగం ఆలపించసాగాడు. దాంతో ఆ ఊర్లో ఉన్న పిల్లలంతా మంత్రించినట్టుగా అతని వెంటపడసాగారు. అతను నెమ్మదిగా వాళ్ళనందరినీ నది వైపు తీసుకువెళ్ళ సాగాడు. గ్రామస్తులు తమ పిల్లలందరినీ కూడా నదిలో ముంచేస్తాడేమోనన్న భయంతో అతన్ని ఆపి అతనికి రావలసిన పారితోషికాన్నిచ్చి పంపించేశారు.

దేవుడి ముందు అంతా బిచ్చగాళ్ళే

రజనీకాంత్ ఎన్నో కష్టాలనెదుర్కొని పైకి వచ్చాడు. చిన్నప్పటి నుండి దైవభక్తి మెండు.
బోలెడంత పేరు ప్రఖ్యాతులు, ధనం వచ్చి పడినా ముందున్న స్వేచ్ఛ కోల్పోయాననే బాధ మాత్రం ఉండేది. తరచు ఆలయాలకు వెళ్ళడం ఆయనకు ఇష్టం.
కానీ జనాలు చూసి గుర్తు పడితే మాత్రం ఇబ్బందే. అందుకని అప్పుడప్పుడు మారు వేషంలో గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొస్తుండేవాడు.
అలా ఒకసారి ముతక పంచ, చొక్కా వేసుకుని ఒక దేవాలయానికి వెళ్ళాడు. కొంచెం దూరంలో కారు ఆపి ఒక కాలు కుంటుతూ నడుస్తూ గుడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాడు. కానీ తిరిగి కారు దగ్గరకు వస్తుంటే మాత్రం ఒక గుజరాతీ మహిళ ఆయన అవతారం చూసి బిచ్చగాడనుకొని ఒక పది రూపాయలు ఇవ్వజూపింది. రజనీ మారు మాట్లాడకుండా అది తీసుకుని నెమ్మదిగా కారు దగ్గరకు వెళ్ళి ఎక్కబోతుండగా ఆ మహిళ వచ్చి మళ్ళీ పరీక్షగా చూసి ఆయన కళ్ళలో కాంతిని గమనించి


“క్షమించండి. మిమ్మల్ని బిచ్చగాడనుకొని పదిరూపాయలిచ్చాను. దయచేసి ఏమీ అనుకోకుండా అదిలా ఇచ్చెయ్యండి” అన్నదట.


అందుకు రజనీకాంత్

“నేను ఎంత ఎదిగినా భగవంతుడి ముందు బిచ్చగాడినేనని గుర్తు చేస్తూ నాకీ పది రూపాయలు ఇచ్చాడు. నువ్వు కేవలం నిమిత్త మాత్రురాలివే. కాబట్టి ఇది నాదగ్గరే ఉంచుకుంటా”నని చెప్పి వెళ్ళిపోయాడట.

ఇది రజనీకాంత్ గురించి ఆయన స్నేహితుడు బహద్దూర్ ఆయన జీవితచరిత్రలో ఉటంకించిన సంఘటన!