లీడర్ విశేషాలు…

నవంబరు 23, 2009

హ్యాపీడేస్ సినిమా తర్వాత లీడర్ సినిమా కోసం శేఖర్ కమ్ముల చాలా సమయం తీసుకున్నాడు. ఈ సమయమంతా ఈ సినిమా కోసమే వెచ్చించానని నిన్న జరిగిన లీడర్ ఆడియో ఫంక్షన్ లో తానే స్వయంగా వెల్లడించాడు. సినిమా రూపకల్పన సమయంలో జరిగిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనల వల్ల సినిమా నిర్మాణం ఆలస్యమైందంటూ చెప్పుకొచ్చాడు. బహుశ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని గూర్చి ప్రస్తావించి ఉండవచ్చు. ఎలక్షన్ల సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని నిజజీవితంలో జరిగిన సంఘటనలు కూడా ఈ సినిమాల్లో చోటు చేసుకోబోతున్నాయనని శేఖర్ మాటల ద్వారా గ్రహించవచ్చు. సినిమా టైటిల్ ని బట్టి కథ ఎవరైనా ఊహించదగ్గదే. ఒక లీడర్ ఎలా ఉంటే దేశం బాగుపడుతుందనే కొన్ని ఆలోచనల సమాహారమే ఈ చిత్ర కథ.

మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలు శేఖర్ అభిరుచికి తగ్గట్టుగానే ఉన్నాయి.  ముందు సినిమాలకు ఏ మాత్రం తీసివేయలేనివి. సినిమాలో పాటలన్నీ వేటూరి గారిచే రాయించారు. భావ గర్భితమైన వేటూరి సాహిత్యాన్ని అణచివేయకుండా అందంగా స్వరపరచిన మిక్కీ జె మేయర్ సంగీతం తెలుగు భాషాభిమానులకు శుభవార్త. అయితే ఈ సారి ఒక ఐటమ్ సాంగ్ అదనం. అయితే మామూలు ఐటమ్ సాంగ్ లా కాకుండా అందరూ వినదగేలా ఉంది. సినిమాలో ఈ పాటకు ప్రముఖ యాంకర్ ఉదయభాను నర్తించినట్లు సమాచారం.

హీరో రాణా కూడా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వేదిక మీదకు వచ్చి మాట్లాడాల్సిన నాలుగు మాటలను క్లుప్తంగా స్పష్టంగా మాట్లాడి  ముగించాడు. కార్యక్రమానికి హాజరైన అతిథులందరిలో(పెద్దలందరితో సహ) స్పష్టంగా మాట్లాడిన అతి కొద్ది మందిలో వారిలో రాణా ఒకడు. ఒక దశలో రామానాయుడు కూడా తడబడ్డాడు. వెంకటేష్ ఏ మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియలేదు. సురేష్ బాబు వచ్చి తనకు తెలుగే తెలియదన్నట్లుగా మొత్తం ఇంగ్లీషులోనే మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అతిథులు ఇంగ్లీషు మాట్లాడుతున్నంత సేపు ఫ్యాన్స్ “తెలుగు తెలుగు… ” అని అరుస్తుండటం క(వి)నిపించింది. సంతోషం. :-)


ఎవర్నీ నమ్మొద్దు.. :-)

నవంబరు 23, 2009

ఒక దొంగ ఒక దుకాణంలోని సేఫ్ ని దోచుకోవాలనుకున్నాడు.
దగ్గరకు వెళ్ళేసరికి దాని తలుపుపైన
“దయచేసి తలుపును ఊడదీయడానికి డైనమైట్లు లాంటి వాటిని వాడే పనులు పెట్టుకోవద్దు. తలుపు తెరిచే ఉంది. హ్యాండిల్ ని తిప్పండి చాలు. తెరుచుకుంటుంది”.
దొంగ అలానే తిప్పాడు
అంతే!! వెంటనే ఒకె పెద్ద ఇసుక బస్తా వచ్చి నడ్డి మీద పడింది. ఆ ప్రదేశమంతా ఫ్లడ్‌లైట్ల వెలుగుతో నిండిపోయింది. కుయ్ కుయ్ మంటూ అలారం మోగసాగింది.
ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు దొంగకి.
పోలీసులు అతన్ని స్ట్రెచర్ పై తీసుకువెళుతుండగా అతను ఏదో సన్నగా మూలుగుతున్నాడు
“మనుషులపై నాకున్న నమ్మకం దారుణంగా దెబ్బతింది” :-)


వావ్… మాంచి కిక్కిచ్చే గేమ్ షో

నవంబరు 21, 2009

ఈటీవీలో నిన్న ప్రారంభమైన ఈ గేమ్ షో కి వ్యాఖ్యాత, ప్రముఖ సినీనటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్. దాదాపు అన్ని ఎంటర్టైన్ మెంట్ చానళ్ళలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న రియాల్టీ షోల మధ్య ఈ షోను చూసిన తర్వాత మంచి సరదా కార్యక్రమం చూసిన అనుభూతి కలిగింది. వ్యాఖ్యాతల ఓవరాక్షన్లు, పాల్గొనేవారి ఏడుపులు పెడబొబ్బలు, లేకుండా ప్రశాంతంగా అనిపించింది. అయితే మొదటి ఎపిసోడ్ లో పాల్గొన్న వారు గాయని సునీత, యాంకర్లు ఝాన్సీ, అనితా చౌదరి, సుమ కాబట్టి కార్యక్రమాన్ని బాగా రక్తి కట్టించారు. సాధారణ పార్టిసిపెంట్లు వచ్చినపుడు ఎలా ఉంటుందో చూడాలి.


రింగ రింగా పాట వివాదం

నవంబరు 20, 2009

నిన్ననే గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైటులో చదివాను. లోక్ సత్తా వాళ్ళు ఈ పాట అసభ్యంగా ఉందని లీగల్ నోటీస్ ఇవ్వబోతున్నారని. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇంతకంటే భయంకరమైన బూతు పాటలు వచ్చినపుడు వీళ్ళంతా ఏంచేస్తున్నారా అని. అసలు విక్రమార్కుడు సినిమాలో జింతాతా పాట కంటే అసభ్యకరమైన పాట ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో రాలేదని నా అభిప్రాయం. (మీకు ఏవైనా పాటలు ఇంతకన్నా బూతు అనిపిస్తే అభిప్రాయాల్లో రాయండి) అయినా అది ప్రేక్షకులను చాలామందిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళిని ఒక విలేఖరి ఇంటర్వ్యూ చేస్తూ ఆయన సినిమాల్లో ద్వంద్వార్థపు పాటలు గురించి అడిగితే అవి తనకు ఇష్టమనీ అందుకే తన సినిమాల్లో పెట్టుకుంటున్నానీ బాహాటంగా సమాధానమిచ్చాడు.

దాంతో పోలిస్తే ఈ పాటలో మరీ డైరెక్టు బూతులేమీ లేవు. కానీ జనాలు ఈ పాటలో బీట్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాటలో సాహిత్యాన్ని అర్థం చేసుకుని అది రంజుగా ఉందని ఆనందించే స్థాయికి సగటు శ్రోతలు ఎదగలేదని నా అభిప్రాయం.


మీ చిరునవ్వును చెదరనీయకండి

నవంబరు 19, 2009

ఒక పాప రోజూ స్కూల్ కి నడిచి వెళ్ళి వస్తుండేది. ఒక రోజు వాతావరణం మేఘావృతమైనప్పటికీ స్కూల్ కి బయలుదేరింది. తిరిగి ఇంటికి వస్తుండగా గాలులు బలంగా వీచసాగాయి. ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి.  ఆ పాప తల్లికి ఆందోళన మొదలైంది. పాప భయపడుతుందేమోనని ఆమె భయం. ఆమె వెంటనే కారు తీసుకుని కూతుర్ని వెతుక్కుంటూ బయలు దేరింది.

అలా వెళుతుండగా దారి వెంబడే పాప నెమ్మదిగా భయం లేకుండా నడుస్తూ ఉండటం కనిపించింది. మెరుపు మెరిసినప్పుడల్లా పాప ఆగి నెమ్మదిగా చిరునవ్వు నవ్వుతోంది. కారు నెమ్మదిగా కూతురి దగ్గర ఆపి పాపని ఇలా అడిగింది.

“ఎందుకమ్మా అలా మెరుపు మెరిసినప్పుడల్లా ఆగి నవ్వుతున్నావు?” అని అడిగింది.

“పై నుంచి దేవుడు నన్ను ఫోటో తీస్తున్నాడమ్మా. అందుకనే అలా నవ్వుతూ ఫోజిస్తున్నా” అందా పాప.

అందుకే ఎంతటి కష్టంలోనైనా మీ మోము నుండి చిరునవ్వును చెదరనీయకండి.