నా చదువు సంగతులు – 1

చేమూరు మా సొంతూరు. నేను మూడో తరగతి దాకా అక్కడే చదివాను. అక్కడ పేరుకైతే ఐదో తరగతి దాకా బడి కానీ చదివే పిల్లలు అంతంత మాత్రమే. బడికి కనీసం గుడిసె కూడా లేదు. మా ఇంటి పక్కనే పెద్ద చింతచెట్టు. అదే మా బడి. మా ఇద్దరు అక్కలు కూడా అక్కడే చదివేవాళ్ళు. ఆ చింతచెట్టు కింద ఓ బల్ల, ఓ కుర్చీ వేసుకుని మా *గురవయ్య అయ్యోరు* (పంతులు) కూర్చునేవాడు. ఇంకొక అయ్యోరు కూడా ఉండే వాడు. పేరు గుర్తు లేదు. ఎప్పుడూ ముక్కుపొడి పీలుస్తుండటంచో అంతా ఆయన్ను ముక్కుపొడి అయ్యోరు అనేవాళ్ళు. పిల్లలంతా నేల మీద కూర్చునే వారు.

నాకు మూడేళ్ళ వయసులో అనుకుంటా పొద్దున్నే చద్దన్నం తిని, పాడైపోయిన బ్యాటరీలలో ఉండే చక్రాలతో చేసిన బండికి తాడు గట్టి రయ్యిన లాక్కుంటా మా చింతచెట్టు బడి దగ్గరికి వెళ్ళాను. అప్పటికి అయ్యోరు ఇంకా రాలేదు. బెంచీ ఖాళీగా ఉందని మీదికెక్కి కూర్చుని ఆడుకుంటున్నా. కొద్ది సేపటి తర్వాత అయ్యోరొచ్చాడు. పిల్లలంతా లేచి నిలబడి గుడ్మాణింగ్ సా……ర్ అంటూ దీర్ఘం తీశారు. ఆ దీర్ఘం ఆ పక్కనే ఉన్న మా దిబ్బదాకా పాకింది. అటు వైపు తిరుక్కుని కూర్చున్న నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయ్యోరు నేరుగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.

ఆయన నా వైపే చూస్తుంటే నేనూ ఆయన వైపు చూస్తూ కూర్చున్నా.
“ఏమిరా పెద్దాయన (మా నాన్న ఇంట్లో పెద్దకొడుకు) కొడుకువా? ” అడిగాడాయన.
నేనేం జవాబు చెప్పలేదు.
పిల్లలో కూర్చున్న మా అక్కలు “అవును సా… మా తమ్ముడే” అన్నారు ముసి ముసి నవ్వులు నవ్వుతూ.
ఆయన నన్ను కిందకి దిగమన్నాడు. దిగాను.
ఐదు గుంజీలు తీయ్ అన్నాడు.
గబా గబా గుంజీలు తీసేసి బండి తీసుకుని ఇంటికి పరుగే పరుగు.
అమ్మ దగ్గరికి వెళ్ళి ఆగాను.
ఎందుకలా పరుగెడతున్నావని అడిగింది. జరిగింది చెప్పా. అమ్మ చిన్నగా నవ్వి మరి ఆయన చదువులు నేర్పే గురువు** కదా. ఆయనొచ్చిప్పుడు అలా కూర్చో కూడదు. లేచి నమస్కారం చేయాలి అని చెప్పింది. అది గురువుల పట్ల మా అమ్మ నేర్పిన మొట్టమొదటి సంస్కారం. నేనిప్పటికీ మరిచిపోలేదు.

**అప్పటికే నేను బట్టీ పట్టిన పాటల్లో కింది పాట ఒకటి. ఇందులో వాక్యమే అమ్మ ఉదహరించింది.
అమ్మకు జేజే
నాన్నకు జేజే
చదువులు నేర్పే గురువుకు జేజే

ఇంకా ఉంది….

ప్రకటనలు